లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 28


28వ ప్రకరణము

1830 సెప్టెంబరు, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఆలీవర్ కౌడరీకి ఇవ్వబడిన బయల్పాటు. సంఘ సభ్యుడైన హైరం పేజ్, ఒక రకమైన రాయిని కలిగియుండి, దాని సహాయముతో సీయోను నిర్మాణము, సంఘ క్రమమును గూర్చిన బయల్పాటులను పొందుచున్నట్లు ఆరోపించెను. ఈ ఆరోపణల చేత అనేకమంది సభ్యులు మోసగించబడిరి మరియు ఆలీవర్ కౌడరీ కూడా దీనిచేత తప్పుగా ప్రభావితము చేయబడెను. నిర్దేశించబడిన ఒక సమావేశమునకు మునుపు, ప్రవక్త ఈ విషయమును గూర్చి మనస్ఫూర్తిగా ప్రభువు యొద్ద విచారించగా, ఈ బయల్పాటు ఇవ్వబడెను.

1–7, జోసెఫ్ స్మిత్ మర్మముల తాళపుచెవులను కలిగియుండెను మరియు అతడు మాత్రమే సంఘము కొరకు బయల్పాటులను పొందును; 8–10, ఆలీవర్ కౌడరీ లేమనీయులకు ప్రకటించవలెను; 11–16, సాతాను హైరం పేజ్‌ను మోసగించి, అసత్య బయల్పాటులనిచ్చెను.

1 ఇదిగో ఆలీవర్, నేను నీకు సెలవిచ్చునదేమనగా, నేను ఇచ్చిన ఆజ్ఞలు, బయల్పాటులను గూర్చి ఆదరణకర్త ద్వారా నీవు వారికి బోధించు సంగతులన్నియు సంఘముచే ఆలకించబడుటకు నీకు శక్తి ఇవ్వబడును.

2 కానీ ఇదిగో, ఈ సంఘములో ఆజ్ఞలను, బయల్పాటులను పొందుటకు జోసెఫ్ స్మిత్ జూ. తప్ప మరెవ్వరూ నియమింపబడరని నేను నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, ఏలయనగా అతడు మోషేవలె వాటిని పొందును.

3 సంఘమునకు శక్తితోను, అధికారముతోను ఆజ్ఞలను, బయల్పాటులను నమ్మకముగా ప్రకటించుటకు నేనతనికిచ్చు సంగతులకు అహరోను వలే నీవును విధేయుడవైయుండవలెను.

4 ఏ సమయమందైనను లేదా అన్నివేళలా సంఘమునకు ఆజ్ఞాపూర్వకముగా మాట్లాడుటకు లేదా బోధించుటకు నీవు ఆదరణకర్త చేత నడిపించబడిన యెడల, నీవు ఆవిధముగా చేయవచ్చును.

5 కానీ నీవు జ్ఞానముచేతనే తప్ప, ఆజ్ఞాపూర్వకముగా వ్రాయకూడదు;

6 నీకును, సంఘమునకును నాయకునిగా నుండిన అతడిని నీవు ఆజ్ఞాపించకూడదు;

7 ఏలయనగా అతనికి మారుగా మరియొకనిని నేను నియమించు వరకు మర్మముల తాళపుచెవులను, ముద్రవేయబడియున్న బయల్పాటులను నేనతనికి ఇచ్చియున్నాను.

8 ఇదిగో, నేను నీకు సెలవిచ్చునదేమనగా, నీవు లేమనీయుల యొద్దకు వెళ్ళి వారికి నా సువార్తను ప్రకటించవలెను; వారు నీ బోధనలను స్వీకరించిన యెడల, నీవు వారి మధ్య నా సంఘము స్థాపించబడునట్లు చేయుదువు; నీవు బయల్పాటులను కలిగియుందువు, కానీ వాటిని నీవు ఆజ్ఞాపూర్వకముగా వ్రాయకూడదు.

9 ఇప్పుడు నేను నీకు సెలవిచ్చునదేమనగా, సీయోను పట్టణము ఎక్కడ నిర్మించబడవలెనో అనునది బయల్పరచబడలేదు మరియు ఏ మనుష్యుడు యెరుగడు, కానీ ఇకమీదట అది తెలియజేయబడును. ఇదిగో నేను నీకు సెలవిచ్చునదేమనగా, లేమనీయుల నివాస సరిహద్దులపై అది నిర్మించబడును.

10 సమావేశము ముగిసేవరకు ఈ ప్రదేశమును నీవు వదిలి వెళ్ళకూడదు; నా సేవకుడైన జోసెఫ్ ఆ సమావేశమునకు అధ్యక్షత వహించుటకు దాని యొక్క ఓటు చేత నియమించబడును మరియు అతడు నీకేమి సెలవిచ్చునో దానినే నీవు చెప్పవలెను.

11 అదియే కాక, నీ సహోదరుడైన హైరం పేజ్‌ను ఏకాంతముగా తీసుకొనివెళ్ళి, ఆ రాతి నుండి అతడు వ్రాసిన సంగతులు నా నుండి వచ్చినవి కావని, సాతాను అతడిని మోసము చేసెనని చెప్పవలెను;

12 ఏలయనగా ఇదిగో, ఈ సంగతులు అతనికి నియమించబడినవి కావు, అంతేకాక సంఘ నిబంధనలకు వ్యతిరేకముగా ఈ సంఘములో ఎవరికిని ఏదియు నియమించబడదు.

13 ఏలయనగా అన్నిసంగతులు సక్రమముగా, ఉమ్మడి అంగీకారముతో, విశ్వాస సహితమైన ప్రార్థనతో జరుగవలెను.

14 నీవు లేమనీయుల మధ్యకు వెళ్ళుటకు మునుపు సంఘ నిబంధనలననుసరించి ఈ సంగతులను పరిష్కరించుటలో నీవు సహకరించవలెను.

15 నీవు వెళ్ళు గడియనుండి, నీవు తిరిగి వచ్చే గడియ వరకు నీవేమి చేయవలెనో అది నీకు తెలియజేయబడును.

16 సంతోషకర ధ్వనితో నా సువార్తను ప్రకటించుచూ నీవు అన్నివేళలా నీ నోటిని విప్పవలెను. ఆమేన్.