86వ ప్రకరణము
1832, డిసెంబరు 6న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ప్రవక్త బైబిలు అనువాదపు చేతివ్రాతలను పునర్వీక్షించుచు, సవరించుచుండగా ఈ బయల్పాటు పొందబడినది.
1–7, గోధుమలు, గురుగుల ఉపమానము యొక్క అర్థమును ప్రభువు ఇచ్చును; 8–11, శరీరమును బట్టి చట్టపరముగా వారసులైనవారికి కలుగు యాజకత్వపు దీవెనలను ఆయన వివరించును.
1 నా సేవకులైన మీతో గోధుమలు, గురుగుల ఉపమానమును గూర్చి ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు:
2 ఇదిగో, నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, పొలము లోకమైయున్నది, అపొస్తలులు విత్తనములను విత్తువారైయున్నారు;
3 వారు నిద్రించిన తరువాత, సంఘమును బహుగా హింసించు, భ్రష్టత్వముచెందిన బబులోను అను వేశ్య, సమస్త జనములు తన పాత్రలోనిది త్రాగునట్లు చేయును, ఆమె హృదయములో శత్రువు అనగా సాతాను పరిపాలించుటకు కూర్చొనియున్నాడు—ఇదిగో అతడు గురుగులను విత్తుచున్నాడు; కాబట్టి గురుగులు, గోధుమల సారమును తీసుకొని సంఘమును అరణ్యములోనికి నెట్టివేసెను.
4 కానీ ఇదిగో, అంత్యదినములందు అనగా ఇప్పుడు, వాక్యమును ముందుకు తెచ్చుటకు ప్రభువు మొదలుపెట్టగా, కంకి పైకెదుగుచు ఇంకను లేతగానుండగా—
5 ఇదిగో, దేవదూతలు రాత్రింబవళ్ళు ప్రభువుకు మొరపెట్టుచున్నారని, వారు పొలములు కోయుట కొరకై పంపబడుటకు వేచియున్నారని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను;
6 కానీ ప్రభువు వారితో చెప్పుచుండెను, కంకి ఇంకను లేతగానుండగా (ఏలయనగా మీ విశ్వాసము బలహీనముగానున్నది), మీరు గోధుమలను కూడా నాశనము చేయకుండునట్లు గురుగులను పెరికివేయవద్దు.
7 కాబట్టి, పంట కోతకు వచ్చువరకు గోధుమలను, గురుగులను కలసి ఎదగనీయుడి; అప్పుడు మీరు గోధుమలను గురుగుల నుండి వేరుపరచి, గోధుమలను సమకూర్చిన తరువాత, గురుగులు కట్టలుగా కట్టబడును, పొలము కాల్చబడుటకు వదిలివేయబడును.
8 కాబట్టి, మీ పితరుల వంశక్రమము ద్వారా కొనసాగిన యాజకత్వము గల మీతో ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—
9 మీరు శరీరానుసారముగా, న్యాయపరమైన వారసులు, మీరు క్రీస్తుతో కూడా దేవునియందు లోకమునుండి దాచబడియున్నారు—
10 కాబట్టి మీ జీవితము మరియు యాజకత్వము నిలిచెను, అవి లోకారంభము నుండి పరిశుద్ధ ప్రవక్తలందరి నోటిద్వారా చెప్పబడిన సమస్త విషయముల పునఃస్థాపన జరుగువరకు మీ ద్వారా, మీ వంశక్రమము ద్వారా నిలిచియుండవలెను.
11 నా మంచితనమందు అన్యజనులకు వెలుగుగా, ఈ యాజకత్వము ద్వారా నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు రక్షకునిగా మీరు కొనసాగిన యెడల మీరు ధన్యులు. ప్రభువు దీనిని సెలవిచ్చెను. ఆమేన్.