25వ ప్రకరణము
1830 జూలై, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు (24వ ప్రకరణ శీర్షిక చూడుము). ఈ బయల్పాటు ప్రవక్త భార్యయైన ఎమ్మా స్మిత్‌కు ప్రభువు చిత్తమును తెలియజేయును.
1–6, ఎమ్మా స్మిత్ ఎన్నుకోబడిన స్త్రీ, తన భర్తకు సహాయపడుటకు, ఓదార్చుటకు పిలువబడెను; 7–11, వ్రాయుటకు, లేఖనములు వివరించుటకు, కీర్తనలు ఎంపిక చేయుటకు కూడా ఆమె పిలువబడెను; 12–14, నీతిమంతుని కీర్తన ప్రభువు దృష్టిలో ప్రార్థన వంటిది; 15–16, ఈ బయల్పాటులోనున్న విధేయత సూత్రములు అందరికీ వర్తించును.
1 నా కుమారి ఎమ్మా స్మిత్, నేను నీతో మాట్లాడుచుండగా నీ దేవుడైన ప్రభువు స్వరమును ఆలకించుము; ఏలయనగా, నా సువార్తను స్వీకరించు వారందరు నా రాజ్యములో కుమారులు, కుమార్తెలని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
2 నా చిత్తమును గూర్చి నేను నీకొక బయల్పాటును ఇచ్చుచున్నాను; నీవు విశ్వాసముగానుండి, నా యెదుట సుగుణపు మార్గములలో నడిచిన యెడల, నీ ప్రాణమును నేను కాపాడెదను మరియు సీయోనులో నీవొక స్వాస్థ్యమును పొందెదవు.
3 ఇదిగో, నీ పాపములు క్షమించబడియున్నవి మరియు నేను పిలిచియున్న ఎన్నుకోబడిన స్త్రీవి నీవే.
4 నీవు చూడని సంగతులను గూర్చి నీవు సణగకుము, ఏలయనగా అవి నీ నుండి, లోకము నుండి మరుగుపరచబడియున్నవి, అవి ఏ సమయములో రావలెనో అది నా యందు వివేకమైయున్నది.
5 నీ భర్త, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. కు అతని శ్రమలలో ఓదార్పు మాటలతో, సాత్వీకపు ఆత్మలో ఆదరణగానుండట నీ పిలుపు యొక్క స్థానమైయున్నది.
6 అతడు వెళ్ళునప్పుడు నీవు కూడా అతనితో వెళ్ళవలెను, అతనికి లేఖకుడు ఎవరూ లేనప్పుడు, అతనికి లేఖకురాలిగా ఉండవలెను, తద్వారా నా సేవకుడైన ఆలీవర్ కౌడరీని నా చిత్తప్రకారము నేను ఎక్కడికైనను పంపవచ్చును.
7 నా ఆత్మ ద్వారా నీకివ్వబడినప్పుడు ఆ ప్రకారము లేఖనములను వివరించుటకు, సంఘమునకు ఉద్భోధించుటకు అతని చేతిక్రింద నీవు నియమించబడెదవు.
8 ఏలయనగా అతడు నీ పైన తన చేతులనుంచగా నీవు పరిశుద్ధాత్మను పొందెదవు; వ్రాయుటకును, అధిక అభ్యాసము కొరకును నీ సమయమును వినియోగించవలెను.
9 సంఘములో నీ భర్త నిన్ను బలపరచును గనుక, నీవు భయపడనవసరము లేదు; ఏలయనగా నేనేమి చేయదలచితినో ఆ సంగతులన్నియు వారి విశ్వాసమును బట్టి వారికి తెలియపరచబడునట్లు వారి కొరకు అతడు పిలువబడియున్నాడు.
10 నీవు ఈ లోకసంబంధమైన విషయములను ప్రక్కన పెట్టి, ఉత్తమమైన సంగతులను వెదకవలెనని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను.
11 నా సంఘము కొరకు ప్రభువు ఆత్మద్వారా నీకు ఇవ్వబడు విధముగా పవిత్ర కీర్తనలను ఎంపికచేయుట కూడా నీకు అప్పగించబడును, అది నాకు సంతోషకరముగానున్నది.
12 ఏలయనగా హృదయ కీర్తనయందు నా ఆత్మ ఆనందించును; అవును, నీతిమంతుల కీర్తన నాకు ప్రార్థన వంటిది మరియు అది వారి శిరస్సులపై ఒక దీవెనతో సమాధానమివ్వబడును.
13 కాబట్టి, నీ హృదయమును పైకెత్తుకొని సంతోషించుము, నీవు చేసిన నిబంధనలను హత్తుకొనియుండుము.
14 సాత్వీకమైన ఆత్మయందు కొనసాగుము, గర్వమును గూర్చి జాగ్రత్తపడుము. నీ భర్తయందును, అతనికి కలుగు మహిమయందును నీ ఆత్మను సంతోషించనిమ్ము.
15 నిరంతరము నా ఆజ్ఞలను పాటించుము మరియు ఒక నీతి కిరీటమును నీవు పొందెదవు. నీవు దీనిని చేయని యెడల, నేనెక్కడ ఉన్నానో అక్కడికి నీవు రాలేవు.
16 అందరికి ఇది నా స్వరమైయున్నదని నేను నీతో నిశ్చయముగా చెప్పచున్నాను. ఆమేన్.