14వ ప్రకరణము
1829 జూన్, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా డేవిడ్ విట్మర్కివ్వబడిన బయల్పాటు. విట్మర్ కుటుంబము మోర్మన్ గ్రంథ అనువాదమందు గొప్ప ఆశక్తి గలవారైరి. పీటర్ విట్మర్ సీనియర్ ఇంటివద్ద ప్రవక్త తన నివాసస్థలాన్ని ఏర్పాటు చేసుకొనెను, అనువాద కార్యము పూర్తిచేయబడే వరకు, రాబోవు గ్రంథమునకు ప్రచురణ హక్కు భద్రపరచబడే వరకు అతడు అక్కడే నివసించెను. విట్మర్ కుమారులలో ముగ్గురు, ఒక్కొక్కరు ఆ కార్య స్వచ్ఛతను గూర్చి సాక్ష్యము పొంది, వారి వ్యక్తిగత ధర్మము విషయములో తీవ్రముగా కలత చెందిరి. ఈ బయల్పాటు మరియు తరువాతి రెండు బయల్పాటులు (ప్రకరణములు 15 మరియు 16) ఊరీము తుమ్మీము ద్వారా చేసిన విచారణకు జవాబుగా ఇవ్వబడినవి. తరువాత డేవిడ్ విట్మర్ మోర్మన్ గ్రంథము యొక్క ముగ్గురు సాక్షులలో ఒకరిగా మారెను.
1–6, ద్రాక్షతోటలో పనివారు రక్షణ పొందెదరు; 7–8, నిత్య జీవము దేవుని బహుమానములలోకెల్లా మహా ఘనమైనది; 9–11, క్రీస్తు పరలోకమును, భూలోకమును సృష్టించెను.
1 ఒక గొప్ప ఆశ్చర్యకార్యము నరుల సంతానము మధ్యకు రాబోవుచున్నది.
2 ఇదిగో, నేను దేవుడను; నా మాటకు చెవియొగ్గుము, అది జీవముగలది శక్తివంతమైనది, కీళ్ళను మూలుగును విడదీయు రెండంచులు గల ఖడ్గము కన్నా పదునైనది; కాబట్టి, నా మాటకు చెవియొగ్గుము.
3 ఇదిగో, పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నది; కాబట్టి, ఎవడైతే కోయుటకు ఇష్టపడునో, అతడు తన బలముతో తన కొడవలిని వాడి, దేవుని రాజ్యములో తన ప్రాణమునకు నిత్య రక్షణను దాచిపెట్టుకొనునట్లు దినము గడవక ముందే కోత కోయనిమ్ము.
4 అవును, ఎవడైతే తన కొడవలితో కోతకోయునో, అట్టివాడు దేవుని చేత పిలువబడెను.
5 కాబట్టి, నీవు నన్ను అడిగిన యెడల నీవు పొందెదవు; నీవు తట్టిన యెడల అది నీకు తెరువబడును.
6 నా సీయోనును ముందుకు తెచ్చి, స్థాపించుటకు ప్రయత్నించుము. అన్ని విషయములందు నా ఆజ్ఞలను పాటించుము.
7 నీవు నా ఆజ్ఞలను పాటించి, అంతము వరకు సహించిన యెడల నీవు నిత్యజీవమును పొందెదవు, ఆ బహుమానము దేవుని బహుమానములలోకెల్లా అత్యంత ఘనమైనది.
8 మాటలనిచ్చు పరిశుద్ధాత్మను నీవు పొందెదవని నమ్ముచు, తద్వారా నీవు చూచి, వినబోవు సంగతులకు సాక్షిగా నిలబడుటకు, ఈ తరమునకు పశ్చాత్తాపమును ప్రకటించుటకు నీవు నా నామమున తండ్రిని విశ్వాసముతో అడిగిన యెడల, అది జరుగును.
9 ఇదిగో నేను జీవముగల దేవుని కుమారుడైన యేసు క్రీస్తును, చీకటి యందు మరుగుపరచబడలేని ఒక వెలుగును, నేను పరలోకములను భూమిని సృష్టించియున్నాను;
10 కాబట్టి, అన్యజనుల నుండి ఇశ్రాయేలు వంశమునకు నా సువార్త సంపూర్ణతను నేను తప్పక ముందుకు తీసుకురావలెను.
11 ఇదిగో, డేవిడ్ అను నీవు సహాయపడుటకు పిలువబడితివి; దానిని నీవు చేసి, విశ్వాసముగా నుండిన యెడల, నీవు ఆత్మీయముగాను, ఐహికముగాను రెండింటిలోను దీవించబడెదవు, నీ ప్రతిఫలము గొప్పదగును. ఆమేన్.