122వ ప్రకరణము
లిబర్టీ, మిస్సోరి చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌నకు ప్రభువు యొక్క వాక్కు. ఈ ప్రకరణము 1839, మార్చి 20న సంఘమునకు వ్రాసిన పత్రిక యొక్క సంగ్రహము (121వ ప్రకరణ శీర్షిక చూడుము).
1–4, భూదిగంతములు జోసెఫ్ స్మిత్ నామమును గూర్చి విచారణ చేయుదురు; 5–7, అతని ప్రమాదాలు మరియు బాధలన్నియు అతనికి అనుభవమునిచ్చును, అతని మేలు కొరకు పనిచేయును; 8–9, మనుష్య కుమారుడు వాటన్నిటికంటే హీనమైన వాటిని అనుభవించెను.
1 భూదిగంతములు నీ నామమును గూర్చి విచారణ చేయుదురు, మూర్ఖులు నిన్ను హేళన చేయజూతురు, నరకము నీకు విరోధముగా ప్రబలును;
2 హృదయశుద్ధి గలవారు, వివేకులు, ఘనులు, సుగుణము గలవారు నీ నుండి ఎడతెగక ఉపదేశములను, అధికారమును, దీవెనలను ఆపేక్షించెదరు.
3 తిరుగుబాటుదారుల సాక్ష్యము వలన నీ జనులు ఎన్నడు నీకు విరోధముగా తిరుగరు.
4 వారి ప్రభావము నిన్ను ఇబ్బందికి, కటకటాలకు, గోడలకు గురిచేసినప్పటికీ, అది కొద్దికాలము వరకు మాత్రమే ఉండును, నీవు సన్మానమును పొందెదవు, నీ శత్రువుల మధ్యనున్నప్పుడు నీ నీతివలన నీ స్వరము ఉక్రోషముతోనున్న సింహము కంటే భయంకరముగానుండును; నీ దేవుడు నీ ప్రక్కన ఎప్పటికీ నిలుచును.
5 నీవు శ్రమలగుండా ప్రవేశించుటకు పిలువబడినను; అసత్య సహోదరుల మధ్య నీవు ప్రమాదములలో ఉన్నను; దొంగల మధ్య నీవు ప్రమాదములలో ఉన్నను; నేల మీద లేదా సముద్రము పైన నీవు ప్రమాదములలో ఉన్నను;
6 నానావిధములైన అసత్య నిందలతో నీవు నిందించబడిన యెడల; నీ శత్రువులు నీపైన పడిన యెడల; వారు నిన్ను నీ తండ్రి, నీ తల్లి, నీ సహోదరులు, నీ సహోదరీలనుండి వేరుచేసిన యెడల; దూసిన ఖడ్గముతో నీ భార్య రొమ్మునుండి, నీ సంతానము నుండి, నీ శత్రువులు నిన్ను వేరుపరచిన యెడల, కేవలము ఆరేండ్ల ప్రాయముగల నీ జ్యేష్ఠకుమారుడు నీ వస్త్రములను పట్టుకొని నా తండ్రీ, నా తండ్రీ నీవెందుకు మాతో నిలిచియుండలేవు? అయ్యో తండ్రీ, మనుష్యులు నిన్ను ఏమిచేయుదురు? అని అడిగినను; తరువాత ఖడ్గముచేత అతడు నీ నుండి వేరుచేయబడి, నీవు చెరసాలకు ఈడ్చబడి, గొఱ్ఱెపిల్ల రక్తము కొరకు తోడేళ్ళు చేరినట్లు నీ శత్రువులు నిన్ను చుట్టిముట్టినను;
7 గోతిలో నీవు పడద్రోయబడినను, లేదా నరహత్య చేయువారి చేతులలోనికి అప్పగించబడి మరణదండన నీకు విధించబడినను; అగాధములోనికి నీవు పడద్రోయబడినను; ఎగిసిపడే అలలు నీకు విరోధముగా కుట్రపన్నినను; బలమైన గాలులు నీకు శత్రువుగా మారినను; ఆకాశము నల్లగా మారి, నీ మార్గమును అడ్డగించుటకు పంచభూతములు కలిసిపోయినను; అన్నిటికన్నా, నరకము నీ కొరకు నోటిని విశాలముగా తెరచినను, నా కుమారుడా, ఇవన్నియు నీకు అనుభవమునిచ్చుటకు నీ మేలుకొరకేనని తెలుసుకొనుము.
8 మనుష్య కుమారుడు వీటన్నిటికంటె హీనమైనవాటిని అనుభవించెను. అతని కంటే నీవు గొప్పవాడివా?
9 కాబట్టి నీ మార్గమున నిలువుము, యాజకత్వము నీతోనుండును; ఏలయనగా వారి హద్దులు నియమించబడియున్నవి, వాటిని వారు దాటలేరు. నీవు బ్రతుకు దినములు తెలియును, నీ ఆయుష్కాలము తక్కువగా లెక్కించబడదు; కాబట్టి, మనుష్యుడు ఏమిచేయునో అని భయపడకుము, ఏలయనగా దేవుడు నిరంతరము నీకు తోడైయుండును.