లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 44


44వ ప్రకరణము

1831 ఫిబ్రవరి, చివరి భాగములో ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్ లకివ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటులో చేయమని తెలియజేసిన దానిని పాటించుటకు మరుసటి జూన్ నెల ఆరంభములో సంఘము ఒక సమావేశమును ఏర్పాటు చేసెను.

1–3, పెద్దలు సమావేశములో కూడుకొనవలెను; 4–6, వారు దేశ పౌర చట్టముల ప్రకారము తమను ఏర్పాటు చేసుకొనవలెను మరియు బీదలను సంరక్షించవలెను.

1 ఇదిగో, నా సేవకులైన మీకు ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సంఘ పెద్దలు తూర్పు నుండి, పశ్చిమము నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి కూడివచ్చుటకు లేఖ ద్వారా లేదా మరే ఇతర మార్గము ద్వారానైనా పిలువబడుట నా యందు యుక్తమైయున్నది.

2 వారు నమ్మకముగా ఉండి, నా యందు విశ్వాసమును సాధన చేసిన యెడల, వారు కూడివచ్చిన దినమందు వారిపై నేను నా ఆత్మను క్రుమ్మరించెదను.

3 వారు చుట్టుప్రక్కలనున్న ప్రాంతములలోనికి వెళ్ళి, ప్రజలకు పశ్చాత్తాపమును ప్రకటించవలెను.

4 పౌర చట్టముల ప్రకారము మిమ్ములను మీరు ఏర్పాటు చేసుకొనుటకు శక్తిని పొందునంతగా అనేకులు పరివర్తన చెందెదరు;

5 తద్వారా మీ శత్రువులు మీపై శక్తిని కలిగియుండరు; మీరు సమస్త విషయములలో కాపాడబడుదురు; నా నియమములను పాటించుటకు మీరు బలపరచబడుదురు; తద్వారా వేటితోనైతే అపవాది నా ప్రజలను నాశనము చేయాలని వెదకుచుండెనో, ఆ ప్రతి పాశము తెంచివేయబడును.

6 ఇదిగో నేను మీతో చెప్పునదేమనగా, మీరు బీదలను మరియు అవసరతలో ఉన్నవారిని దర్శించి, వారి ఉపశమనము కొరకు తగిన సహాయము చేయవలెను, తద్వారా మీరు పొందియున్న నా ధర్మశాస్త్రము ప్రకారము సమస్తము చేయబడువరకు వారు సంరక్షించబడుదురు. ఆమేన్.