63వ ప్రకరణము
1831 ఆగష్టు 30న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ప్రవక్త, సిడ్నీ రిగ్డన్, ఆలీవర్ కౌడరీలు మిస్సోరిని దర్శించి, అక్కడి నుండి ఆగష్టు 27న కర్ట్‌లాండ్ చేరుకొనిరి. జోసెఫ్ స్మిత్ చరిత్ర ఈ బయల్పాటును ఇట్లు వివరించుచున్నది: “సంఘము ఏర్పడిన కొద్దికాలానికి, మన రక్షణతో సంబంధము కలిగియున్న ప్రతి అంశము మీద ప్రభువు వాక్యమును పొందుటకు గొప్ప ఆతృతయుండెను; ఇప్పుడు సీయోను ప్రదేశము అతి ముఖ్యమైన లౌకిక విషయము గనుక, పరిశుద్ధులను ఒకచోటకు చేర్చుట, భూముల కొనుగోలు మరియు ఇతర సంగతులను గూర్చి మరింత సమాచారము కొరకు నేను ప్రభువును విచారించితిని.”
1–6, దుష్టులమీదకు ఒక ఉగ్రత దినము వచ్చును; 7–12, విశ్వాసము వలన సూచకక్రియలు కలుగును; 13–19, హృదయమందు వ్యభిచారము చేయగోరువాడు విశ్వాసమును త్యజించి, అగ్ని గుండములో పడవేయబడును; 20, విశ్వాసులు రూపాంతరము చెందిన భూమిమీద ఒక స్వాస్థ్యమును పొందుదురు; 21, రూపాంతరపు కొండపై జరిగిన సంఘటనల పూర్తి వృత్తాంతము ఇంకా తెలియజేయబడలేదు; 22–23, విధేయులు పరలోకరాజ్య మర్మములను పొందుదురు; 24–31, సీయోనులో స్వాస్థ్యములు కొనవలసియున్నది; 32–35, ప్రభువు యుద్ధములను ప్రకటించును మరియు దుష్టులు దుష్టులను చంపుదురు; 36–48, పరిశుద్ధులు సీయోనుకు కూడివచ్చి, దానిని నిర్మించుటకు ధనమును సమకూర్చవలెను; 49–54, విశ్వాసులకు రెండవ రాకడ సమయములో, పునరుత్థానమునందు, వెయ్యేండ్ల పరిపాలనలో దీవెనలు వాగ్దానము చేయబడినవి; 55–58, ఇది ఒక హెచ్చరిక దినము; 59–66, అధికారము లేకుండా ఆయన నామమును ఉపయోగించుకొనువారి చేత ప్రభువు నామము వ్యర్థముగా ఉచ్ఛరించబడును.
1 ఓ నా జనులారా ఆలకించుడి, మీ హృదయములను తెరచి దూరము నుండి చెవియొగ్గుడి; ప్రభువు జనాంగముగా మిమ్ములను మీరు పిలుచుకొనుచున్నవారలారా ఆలకించుడి, ప్రభువు వాక్యమును, మీ యెడల ఆయన చిత్తమును వినుడి.
2 దుష్టులు, తిరుగుబాటుదారులకు విరోధముగా ఎవరి కోపమైతే రగులుకొనియున్నదో, ఆయన మాటను వినుడని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను;
3 ఆయనకు ఇష్టులైన వారిని తీసుకొనిపోవుటయు, ఆయన ఈ జీవితములో రక్షింపగోరువారిని రక్షించుటయు ఆయన చిత్తమైయున్నది;
4 తన చిత్తము, సంతోషము కొలది ఆయన కట్టును; ఆయనకు ఇష్టమైనప్పుడు నాశనము చేయును మరియు ఆత్మను నరకములో పడవేయగల సమర్థుడాయనే.
5 ఇదిగో, ప్రభువైన నేను మాటలాడుచున్నాను మరియు అది గైకొనబడవలెను.
6 కాబట్టి, నేను నిశ్చయముగా చెప్పునదేమనగా, దుష్టులు చెవియొగ్గవలెను, తిరుగుబాటు చేయువారు భయపడి, వణకవలెను; అవిశ్వాసులు వారి పెదవులను కాచుకొనవలెను, ఏలయనగా సుడిగాలి వలే ఉగ్రత దినము వారి మీదకు వచ్చును మరియు సర్వశరీరులు నేనే దేవుడనని తెలుసుకొందురు.
7 సూచక క్రియలు వెదకువాడు సూచక క్రియలను చూచును, కానీ దానివలన రక్షణ కలుగదు.
8 సూచక క్రియలను కోరువారు మీలోనున్నారు, ఆదినుండి కూడా అట్టివారు ఉన్నారు;
9 ఇదిగో, సూచక క్రియల వలన విశ్వాసము కలుగదు, కానీ విశ్వసించువారిని సూచక క్రియలు వెంబడించునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
10 అవును, విశ్వాసము వలన సూచక క్రియలు కలుగును, నరుని చిత్తము వలనైనను, వారి ఇష్టప్రకారమైనను కాదు, కానీ దేవుని చిత్తము వలన కలుగును.
11 మహత్కార్యములు చేయుటకు విశ్వాసము వలన సూచక క్రియలు కలుగును, ఏలయనగా విశ్వాసము లేకుండా ఏ మనుష్యుడును దేవుడిని సంతోషపరచలేడు; దేవుడు ఎవరి యెడల కోపము కలిగియుండునో, వానిపట్ల ఆయన సంతోషించడు; కాబట్టి, అట్టివానికి కేవలము ఉగ్రతతో వారి నాశనము కొరకు తప్ప ఎటువంటి సూచక క్రియలు చూపడు.
12 కాబట్టి, మీ మధ్యనున్న వారు ఎవరైతే నన్ను మహిమపరచునట్లు మనుష్యుల మేలు కొరకు కాక, విశ్వాసము పొందుటకు సూచకక్రియలను, ఆశ్చర్యకార్యములను పొందగోరిరో వారినిబట్టి ప్రభువైన నేను ఆనందించుట లేదు.
13 అయినప్పటికీ, నేను ఆజ్ఞలనిచ్చుచున్నాను మరియు అనేకులు నా ఆజ్ఞలనుండి తప్పిపోయి, వాటిని పాటించలేదు.
14 మీ మధ్య వ్యభిచారులు, వ్యభిచారిణిలు కలరు; వారిలో కొందరు మీ నుండి తొలగిపోయిరి మరియు మీతోనున్న ఇతరులు ఇకమీదట బయలుపరచబడెదరు.
15 అట్టివారు జాగ్రత్తగానుండి వెంటనే పశ్చాత్తాపపడవలెను, లేనియెడల ఉరివలె తీర్పు వారి మీదకు వచ్చును మరియు వారి అవివేకము ప్రత్యక్షపరచబడి, ప్రజల దృష్టిలో వారి క్రియలు వారిని వెంబడించును.
16 నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారము నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినా లేదా ఎవరైనా తమ హృదయములలో వ్యభిచారము చేసినా వారు ఆత్మను కలిగియుండరు, కానీ విశ్వాసమును త్యజించి, భయపడెదరు.
17 కాబట్టి, ప్రభువైన నేను సెలవిచ్చినదేమనగా భయస్తులు, నమ్మనివారు, అబద్ధికులందరు, అబద్ధమును ప్రేమించి, దానిని పుట్టించువారు, వేశ్యసాంగత్యమును కోరువారు, సోదెగాండ్రు అగ్నిగంధకములతో మండుచున్న గుండములో భాగస్థులగుదురు, అదియే రెండవ మరణము.
18 వారు మొదటి పునరుత్థానములో భాగస్థులు కారని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను.
19 ఇప్పుడు ఇదిగో, మీరు నీతిమంతులుగా తీర్పుతీర్చబడరని ప్రభువైన నేను మీకు సెలవిచ్చుచున్నాను, ఏలయనగా ఇవన్నియు మీ మధ్యనున్నవి.
20 అయినప్పటికీ, ఎవడైతే విశ్వాసముతో సహించి, నా చిత్తమును చేయునో, అట్టివాడు జయించును మరియు రూపాంతరము చెందు దినము వచ్చినప్పుడు భూమిమీద ఒక స్వాస్థ్యమును పొందును;
21 భూమి రూపాంతరము చెందునప్పుడు, కొండమీద నా అపొస్తలులకు చూపిన విధముగానే జరుగును; ఆ వృత్తాంతమును మీరు ఇంకా పూర్తిగా పొందలేదు.
22 ఇప్పుడు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా చిత్తమును మీకు తెలియజేయుదునని నేను చెప్పితిని గనుక, ఇదిగో దీనిని మీకు తెలియజేయుచున్నాను, అయితే ఆజ్ఞాపూర్వకముగా కాదు, ఏలయనగా అనేకులు నా ఆజ్ఞలను పాటించుటకు ప్రయత్నించుట లేదు.
23 కానీ నా ఆజ్ఞలు పాటించువానికి పరలోకరాజ్య మర్మములను తెలియజేయుదును, అవి వానిలో నిత్యజీవమునకై ఊరెడు జీవజలపు బావిగా ఉండును.
24 ఇదిగో, ఇప్పుడు ఆయన పరిశుద్ధుల విషయమై ప్రభువు చిత్తము ఇదియే—త్వరపడకుండా వారందరు కలిసి సీయోను ప్రదేశములో సమావేశము కావలెను, లేనియెడల అక్కడ గందరగోళముగానుండి, వ్యాధులు ప్రబలును.
25 సీయోను ప్రదేశమును చూడుము—ప్రభువైన నేను నా హస్తములలో దానిని పట్టుకొనియున్నాను;
26 అయినప్పటికీ, ప్రభువైన నేను, కైసరువి కైసరునకు చెల్లించితిని.
27 కాబట్టి, లోక ప్రయోజనమును కలిగియుండునట్లు మీరు భూములను కొనుగోలు చేయుట ప్రభువైన నా చిత్తమైయున్నది, తద్వారా మీరు లోకముపై హక్కు కలిగియుండి, లోకులు మీపై కోపమునకు పురిగొల్పబడకుండవచ్చు.
28 ఏలయనగా మీకు విరోధముగా కోపపడుటకు, రక్తము చిందించుటకు సాతాను వారి హృదయాలలో ఆలోచన పుట్టించును.
29 కాబట్టి, కొనుట ద్వారా లేదా రక్తము చిందించుట ద్వారా తప్ప సీయోను ప్రదేశమును పొందలేరు, అట్లు కానియెడల మీకు ఏ స్వాస్థ్యము ఉండదు.
30 కొనుట ద్వారానైతే, మీరు ధన్యులు;
31 రక్తము వలననైతే, మీరు రక్తము చిందించుట నిషేధించబడినది, ఇదిగో, మీ శత్రువులు మీ మీదకు వచ్చుచున్నారు, మీరు ఒక పట్టణము నుండి మరియొక పట్టణమునకు, ఒక సమాజమందిరము నుండి మరియొక సమాజమందిరమునకు తరిమివేయబడి, హింసించబడుదురు మరియు కొద్దిమంది మాత్రమే స్వాస్థ్యమును పొందుటకు నిలిచెదరు.
32 ప్రభువైన నేను దుష్టుల యెడల కోపముతోనున్నాను; భూలోక నివాసుల నుండి నా ఆత్మను వెనుకకు తీసుకొనుచున్నాను.
33 నా ఉగ్రతయందు నేను ప్రమాణము చేసి, భూమిమీద యుద్ధములను ప్రకటించియున్నాను, దుష్టులు దుష్టులను సంహరించెదరు మరియు ప్రతి మనుష్యునిలోను భయము పుట్టును;
34 పరిశుద్ధులు కూడా తృటిలో తప్పించుకొందురు; అయినప్పటికీ, ప్రభువైన నేను వారితోనున్నాను మరియు పరలోకములో నా తండ్రి సన్నిధినుండి దిగివచ్చి, దుష్టులను ఆరని అగ్నితో కాల్చివేయుదును.
35 ఇదిగో, ఇది ఇంకా సంభవించలేదు, కానీ త్వరలో జరుగును.
36 కాబట్టి, ప్రభువైన నేను ఈ సంగతులను భూమిమీద ప్రకటించియున్నాను గనుక, నా పరిశుద్ధులు సీయోను ప్రదేశములో సమావేశమగుట నా చిత్తమైయున్నది;
37 ప్రతి మనుష్యుడు తన చేతులలో నీతిని, నడుముకు విశ్వాస్యతను ధరించి, భూలోక వాసులకు హెచ్చరిక స్వరమును ఎలుగెత్తవలెను; దుష్టుల మీదకు నాశనము వచ్చునని వాక్యము ద్వారా, పారిపోవుట ద్వారా ప్రకటించవలెను.
38 కాబట్టి, ఈ పొలములో నివసించుచూ కర్ట్లాండ్‌లో ఉన్న నా శిష్యులు వారి లౌకిక అంశములను నిర్దిష్ట స్థితికి తీసుకొనిరావలెను.
39 దాని బాధ్యతను కలిగియున్న నా సేవకుడైన టైటస్ బిల్లింగ్స్, అక్కడ నివశించువారితో కలిసి రాబోవు వసంతకాలములో సీయోను ప్రదేశమునకు వెళ్ళుటకు సిద్ధపడునట్లు ఆ పొలమును విక్రయించవలెను, అయితే వారిలో నేను నా కొరకు ప్రత్యేకపరచుకొనబోవు వారు మాత్రము నేను ఆజ్ఞాపించువరకు వెళ్ళరాదు.
40 దాచగలిగిన ధనమంతా సీయోను ప్రదేశమునకు, దానిని పొందుటకు నేను నియమించిన వారికి పంపబడవలెను, అది కొంచెమైనను అధికమైనను నాకు ముఖ్యము కాదు.
41 ఇదిగో, ప్రభువైన నేను, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్‌కు శక్తినిచ్చుచున్నాను, తద్వారా అతడు సీయోను ప్రదేశమునకు ఎవరు వెళ్ళవలెనో, నా శిష్యులలో ఎవరు ఇక్కడే ఉండవలెనో ఆత్మవలన తెలుసుకొనగలుగును.
42 నా సేవకుడైన న్యూయెల్ నైట్ కొద్దికాలము పాటు అతని అంగడిని లేదా మరియొక మాటలో, ఆ అంగడిని అతడు నిలుపుకొనవలెను.
43 అయినప్పటికీ, సీయోను ప్రదేశమునకు పంపబడుటకు అతడు ఇవ్వగలిగినంత ధనమును అతడు ఇవ్వవలెను.
44 ఇదిగో, ఈ సంగతులు అతని చేతులలో ఉన్నందున, జ్ఞానముననుసరించి అతడు చేయవలెను.
45 ఇక్కడే ఉండు శిష్యులకు ప్రతినిధిగా అతడు నియమించబడవలెను మరియు ఈ అధికారమునకు అతడు నియమించబడవలెనని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను;
46 ఇప్పుడు ఈ సంగతులను వారికి వివరించుచు, నా సేవకుడైన ఆలీవర్ కౌడరీతో వెంటనే సంఘములను దర్శించుము. ఇదిగో, నేను నిర్దేశించిన ప్రకారము ధనమును సంపాదించుటయే నా చిత్తము.
47 ఎవడైతే విశ్వాసముగానుండి సహించునో, వాడు లోకమును జయించును.
48 సీయోను ప్రదేశమునకు నిధులను పంపువాడు ఈ లోకములో స్వాస్థ్యమును పొంది, అతని కార్యములు అతడిని వెంబడించి, రాబోవు లోకములో కూడా ఒక బహుమానమును పొందును.
49 ఇకమీదట ప్రభువునందు నిద్రించువారు ధన్యులు, ప్రభువు వచ్చునప్పుడు పాతవి గతించి సమస్తమును క్రొత్తవగును; వారు మృతులలోనుండి లేచి ఇకపై మరణించరు మరియు ఆ పరిశుద్ధ పట్టణములో ప్రభువు యెదుట ఒక స్వాస్థ్యమును పొందుదురు.
50 ప్రభువు వచ్చునప్పుడు జీవించుచు, విశ్వాసమును కాపాడుకొనినవాడు ధన్యుడు; అయినప్పటికీ, నరుని జీవితకాలము ముగిసిన తరువాత అతడు మరణమునకు నియమించబడియున్నాడు.
51 కాబట్టి, పిల్లలు వృద్ధులగువరకు పెరుగుదురు; వృద్ధులు చనిపోవుదురు; వారు ధూళిలో నిద్రించరు, కానీ వారు రెప్పపాటులో మార్పునొందుదురు.
52 ఈ హేతువు వలన అపొస్తలులు లోకమునకు మృతుల పునరుత్థానమును గూర్చి ప్రకటించిరి.
53 మీరు వేచి చూడవలసిన సంగతులు ఇవియే; అవి ప్రభువు విధానములో చెప్పబడి, సమీపములో ఉండి, సకాలములో మనుష్య కుమారుని రాకడ దినమందు వచ్చును.
54 ఆ గడియవరకు బుద్ధిగల వారి మధ్య బుద్ధిలేని కన్యకలు ఉందురు; ఆ గడియలో నీతిమంతులు, దుష్టులు పూర్తిగా వేరు చేయబడుదురు; ఆ దినమందు దుష్టులను పెరికివేసి, వారిని ఆరని అగ్నిలో వేయుటకు నేను నా దూతలను పంపుదును.
55 ఇదిగో నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ప్రభువైన నేను, నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్ యెడల ఆనందించుట లేదు; అతడు తన హృదయమందు తననుతాను హెచ్చించుకొని, ఉపదేశమును పొందక, ఆత్మను దుఃఖపరచెను;
56 కాబట్టి అతని వ్రాత ప్రభువుకు అంగీకారము కాదు మరియు అతడు మరియొకటి తయారుచేయవలెను; ప్రభువు దానిని స్వీకరించని యెడల, నేను నియమించియున్న స్థానములో అతడు ఇక ఎంతమాత్రము నిలిచియుండడు.
57 మరలా, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, సాత్వికముతో పాపులను పశ్చాత్తాపపడమని హెచ్చరించుటకు తమ హృదయాలలో కోరిక గలవారు, ఈ శక్తికి నియమించబడవలెను.
58 ఏలయనగా ఇది హెచ్చరించు దినమే గాని, విస్తరించి మాటలాడు దినము కాదు. ప్రభువైన నేను, అంత్యదినములలో వెక్కిరించబడను.
59 నేను పైనుండువాడను, నా శక్తి క్రింద ఉండును. నేను అందరికి పైగా ఉన్నవాడనై, అందరిలోను వ్యాపించి, అందరిలో ఉండి, అన్నింటిని పరిశోధించుచున్నాను మరియు అన్ని సంగతులు నా ఆధీనములోనికి వచ్చు దినము వచ్చుచున్నది.
60 ఇదిగో, అల్ఫాయు ఓమెగయు, యేసు క్రీస్తును నేనే.
61 కాబట్టి, నరులందరు వారి పెదవులతో నా నామమును ఏవిధముగా ఉచ్ఛరించెదరో దానియందు జాగ్రత్తపడవలెను—
62 ఏలయనగా నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, ఈ నిందమోపబడిన వారు అనేకులు కలరు, వారు అధికారము లేకుండా ప్రభువు నామమును వ్యర్థముగా ఉపయోగించుదురు.
63 కాబట్టి సంఘము తన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడవలెను మరియు ప్రభువైన నేను వారిని నా వారిగా ఒప్పుకొందును; లేనియెడల వారు కొట్టివేయబడుదురు.
64 పైనుండి వచ్చునది పవిత్రమైనది, అది ఆత్మ నిర్భంధము చేతను, జాగ్రత్తగాను మాట్లాడబడవలెనని జ్ఞాపకముంచుకొనుడి; దీనియందు ఏ శిక్షయు లేదు మరియు ప్రార్థన వలన మీరు ఆత్మను పొందుదురు; కాబట్టి, దీనిని చేయని యెడల శిక్షింపబడుదురు.
65 వారు ప్రార్థనద్వారా ఆత్మ వలన బోధించబడిరి గనుక, నా సేవకులైన జోసెఫ్ స్మిత్ జూ., సిడ్నీ రిగ్డన్‌లు తమ కొరకు ఒక గృహమును వెదకవలెను.
66 ఈ సంగతులను ఓర్పుతో జయించువారు నిత్యమైన మహిమ భారమును, జయించనివారు గొప్ప శిక్షను పొందుదురు. ఆమేన్.