55వ ప్రకరణము
1831 జూన్ 14న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా విలియమ్ డబ్ల్యు. ఫెల్ప్స్‌కివ్వబడిన బయల్పాటు. విలియమ్ డబ్ల్యు. ఫెల్ప్స్ ఒక ముద్రణకర్త, అతని కుటుంబము అప్పుడే కర్ట్‌లాండ్ చేరుకొనెను మరియు అతని గూర్చి సమాచారము కొరకు ప్రవక్త ప్రభువును విచారించెను.
1–3, విలియమ్ డబ్ల్యు. ఫెల్ప్స్ బాప్తిస్మము పొందుటకు, పెద్దగా నియమించబడుటకు, సువార్తను ప్రకటించుటకు పిలువబడి, ఏర్పరచబడెను; 4, అతడు సంఘ పాఠశాలలలో పిల్లల కొరకు పుస్తకములను వ్రాయవలెను; 5–6, అతడు మిస్సోరికి ప్రయాణము చేయవలెను, అది అతడు పనిచేయు స్థలముగానుండును.
1 ఇదిగో, నా సేవకుడవైన విలియం, ప్రభువు అనగా భూమియంతటికిని ప్రభువు నీకు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు పిలువబడి, ఏర్పరచబడితివి; నీవు నీటి ద్వారా బాప్తిస్మము పొందిన తరువాత, నా మహిమయే లక్ష్యముగా నీవు దానిని చేసిన యెడల నీవు పాపక్షమాపణను కలిగియుందువు మరియు హస్తనిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మ వరమును పొందుదువు;
2 అప్పుడు పశ్చాత్తాపమును, సజీవుడగు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మమను మార్గము ద్వారా పాప క్షమాపణను ప్రకటించుటకు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. చేత ఈ సంఘమునకు ఒక పెద్దగా నీవు నియమించబడుదువు.
3 నీవు ఎవరిమీద నీ చేతులనుంచెదవో, వారు నా యెదుట నలిగినవారైతే, వారికి పరిశుద్ధాత్మను ఇచ్చుటకు నీవు శక్తిని కలిగియుందువు.
4 మరలా, నా సేవకుడైన ఆలీవర్ కౌడరీకి ముద్రించు పనిలో సహాయపడుటకు, నాకు ఆనందము కలిగించు విధముగా చిన్న పిల్లలు నా యెదుట ఉపదేశమును పొందునట్లు సంఘములోని పాఠశాలల కొరకు పుస్తకములు ఎంపిక చేయుటకు, వ్రాయుటకు నీవు నియమించబడుదువు.
5 ఈ హేతువు చేత ఈ కార్యమును చేయుటకు నీ స్వాస్థ్యపు ప్రదేశములో నీవు స్థిరపడుటకు నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ., సిడ్నీ రిగ్డన్‌లతో పాటు నీవు ప్రయాణము చేయవలెను.
6 నా సేవకుడైన జోసెఫ్ కో కూడా వారితో ప్రయాణము చేయవలెను. నా చిత్త ప్రకారము మిగిలినది ఇకముందు తెలియజేయబడును. ఆమేన్.