లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 52


52వ ప్రకరణము

1831 జూన్ 6న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా సంఘ పెద్దలకివ్వబడిన బయల్పాటు. కర్ట్లాండ్‌లో ఒక సమావేశము జూన్ 3న ప్రారంభమై 6న ముగిసెను. ఈ సమావేశములో ప్రధాన యాజక స్థానమునకు మొట్టమొదటి నిర్దిష్ట నియామకములు జరిగినవి మరియు మోసపూరితమైన అబద్ధ ఆత్మల ప్రత్యక్షతలు కొన్ని వివేచింపబడి, గద్దించబడినవి.

1–2, మరుసటి సమావేశము మిస్సోరిలో జరుగుటకు ఏర్పాటు చేయబడినది; 3–8, కలిసి ప్రయాణించుటకు కొంతమంది పెద్దల నియామకములు చేయబడినవి; 9–11, అపొస్తలులు, ప్రవక్తలు వ్రాసియున్న వాటిని పెద్దలు బోధించవలెను; 12–21, ఆత్మచేత వెలిగించబడిన వారు స్తుతి, జ్ఞానఫలములను తెచ్చెదరు; 22–44, అనేకమంది పెద్దలు సమావేశము కొరకు మిస్సోరికి ప్రయాణించుచున్నప్పుడు, సువార్తను ప్రకటించుచూ ముందుకు సాగుటకు నియమించబడిరి.

1 ఇదిగో, ఈ చివరి దినములలో ఆయన తన ఆత్మ స్వరము ద్వారా పిలిచి, ఎన్నుకొనియున్న పెద్దలకు ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—

2 ఈ సమయము నుండి యాకోబు శేషమునకు మరియు నిబంధన ప్రకారము వారసులైన నా జనులకు, మిస్సోరిలో నేను ప్రతిష్ఠించు ప్రదేశములో జరుగు మరుసటి సమావేశము వరకు నా చిత్త ప్రకారము మీరు ఏమి చేయవలెనో ప్రభువైన నేను మీకు తెలియజేసెదను.

3 కాబట్టి, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నా సేవకులైన జోసెఫ్ స్మిత్ జూ., సిడ్నీ రిగ్డన్‌లు తమ గృహములను విడిచిపెట్టుటకు సిద్ధపాటులను చేసుకొనిన వెంటనే వారి ప్రయాణమును ప్రారంభించి, మిస్సోరి ప్రాంతమునకు ప్రయాణించవలెను.

4 వారు నా పట్ల విశ్వాసముగానుండిన యెడల, వారేమి చేయవలెనో అది వారికి తెలియజేయబడును;

5 వారు విశ్వాసముగానుండిన యెడల, మీరు స్వాస్థ్యముగా పొందు ప్రదేశము కూడా వారికి తెలియజేయబడును.

6 వారు విశ్వాసముగానుండని యెడల, నాకు మంచిగా కనబడు నా చిత్త ప్రకారము వారు కొట్టివేయబడుదురు.

7 నేను మరలా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన లైమన్ వైట్, నా సేవకుడు జాన్ కొరిల్ తమ ప్రయాణమును వేగముగా చేయవలెను.

8 నా సేవకుడు జాన్ మర్డాక్, నా సేవకుడు హైరం స్మిత్, డెట్రాయిట్ మార్గము గుండా ఆ స్థలమునకే ప్రయాణము చేయవలెను.

9 ప్రవక్తలు, అపొస్తలులు వ్రాసినవి మరియు విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా ఆదరణకర్త చేత వారికి బోధించబడినవి తప్ప, మరేమియు చెప్పక అక్కడ నుండి తమ మార్గము వెంబడి వాక్యమును ప్రకటించుచూ ప్రయాణము చేయవలెను.

10 వారు ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళవలెను, ఆవిధముగా మార్గము వెంబడి ప్రతి సమాజకూటమిలో వారు ప్రకటించుచు, నీటి ద్వారా బాప్తిస్మమిచ్చుచు, నీటి ప్రక్కన హస్తనిక్షేపణము చేయవలెను.

11 ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీతితో సమాప్తమగుటకు నేను నా కార్యమును క్లుప్తపరిచెదను, ఏలయనగా రాబోవు దినములలో విజయమొందుటకు నేను న్యాయవిధిని ప్రబలము చేయుదును.

12 నా సేవకుడు లైమన్ వైట్ జాగ్రత్తపడవలెను, ఏలయనగా సాతాను అతడిని పొట్టువలె జల్లించుటకు కోరుచున్నాడు.

13 విశ్వాసముగా నుండువాడు అనేకమైన వాటిమీద అధికారిగా చేయబడును.

14 మరలా, మీరు మోసపోకుండునట్లు అన్ని విషయములలో ఒక మాదిరిని నేను మీకు ఇచ్చెదను; ఏలయనగా సాతాను భూమియందంతట సంచరించుచూ జనములను మోసగించుటకు వెళ్ళుచున్నాడు—

15 కాబట్టి ఎవడైతే నలిగిన ఆత్మకలిగి ప్రార్థించునో, అతడు నా విధులను గైకొనిన యెడల అట్టివాడు నా చేత అంగీకరించబడును.

16 ఎవడైతే నలిగిన ఆత్మకలిగి, సాత్వికముతో, ఆత్మీయాభివృద్ధిని కలుగజేయు భాషతో మాట్లాడునో, అతడు నా విధులను గైకొనిన యెడల అట్టివాడు దేవుని సంబంధియైయున్నాడు.

17 మరలా, నా శక్తివలన భయముతో వణకువాడు బలపరచబడును మరియు నేను మీకు అనుగ్రహించిన సత్యములు, బయల్పాటులను బట్టి స్తుతి, జ్ఞానఫలములను తెచ్చును.

18 మరలా ఎవడైతే సాతాను చేత జయించబడి ఫలములను తేకుండునో, వాడు ఈ విధానము ప్రకారము నా వాడు కాడు.

19 కాబట్టి, ఈ విధానము ద్వారా అన్ని సందర్భములలోను పరలోకములన్నింటి క్రిందనున్న ఆత్మలను మీరు తెలుసుకొందురు.

20 మరియు సమయము ఆసన్నమైనది; మనుష్యుల విశ్వాసమును బట్టి వారికది జరుగును.

21 ఇదిగో, నేను ఎన్నుకొనిన పెద్దలందరికి ఈ ఆజ్ఞ ఇవ్వబడెను.

22 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా సేవకుడైన థామస్ బి. మార్ష్, నా సేవకుడైన ఎజ్రా థైర్ మార్గము వెంబడి వాక్యమును ప్రకటించుచూ ఆ ప్రదేశమునకే ప్రయాణము చేయవలెను.

23 మరలా, నా సేవకుడైన ఐజాక్ మోర్లీ, నా సేవకుడైన ఎజ్రా బూత్ మార్గము వెంబడి వాక్యమును ప్రకటించుచూ ఆ ప్రదేశమునకే ప్రయాణము చేయవలెను.

24 మరలా, నా సేవకులైన ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌, మార్టిన్ హారిస్‌లు నా సేవకులైన సిడ్నీ రిగ్డన్, జోసెఫ్ స్మిత్ జూ. లతో కలిసి తమ ప్రయాణమును చేయవలెను.

25 నా సేవకులైన డేవిడ్ విట్మర్, హార్వే విట్లాక్‌లు కూడా మార్గము వెంబడి వాక్యమును ప్రకటించుచూ ఆ ప్రదేశమునకే ప్రయాణము చేయవలెను.

26 నా సేవకులైన పార్లీ పి. ప్రాట్, ఓర్సన్ ప్రాట్‌లు కూడా మార్గము వెంబడి వాక్యమును ప్రకటించుచూ ఆ ప్రదేశమునకే ప్రయాణము చేయవలెను.

27 నా సేవకులైన సాల్మన్ హేన్కాక్, సిమ్యోన్ కార్టర్‌లు కూడా మార్గము వెంబడి వాక్యమును ప్రకటించుచూ ఆ ప్రదేశమునకే ప్రయాణము చేయవలెను.

28 నా సేవకులైన ఎడ్సన్ ఫుల్లర్, జేకబ్ స్కాట్‌లు కూడా ప్రయాణము చేయవలెను.

29 నా సేవకులైన లీవై డబ్ల్యు. హేన్కాక్, జెబెదీ కోల్ట్రిన్‌లు కూడా ప్రయాణము చేయవలెను.

30 నా సేవకులైన రేనాల్డ్స్ కహూన్, సామ్యుల్ హెచ్. స్మిత్‌లు కూడా ప్రయాణము చేయవలెను.

31 నా సేవకులైన వీలర్ బాల్డ్విన్, విలియం కార్టర్‌లు కూడా ప్రయాణము చేయవలెను.

32 నా సేవకులైన న్యూయెల్ నైట్, సెలా జె. గ్రిఫ్ఫిన్‌లు ఇరువురు నియమించబడి, వారు కూడా ప్రయాణము చేయవలెను.

33 అవును, నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, వీరందరు వేర్వేరు మార్గములలో ఒకే ప్రదేశమునకు ప్రయాణించవలెను మరియు ఒక మనుష్యుడు మరియొకని పునాదిమీద కట్టబడకూడదు, వేరొకని బాటలో ప్రయాణము చేయకూడదు.

34 ఎవడైతే విశ్వాసముగా నుండునో, అట్టివాడు కాపాడబడి అధిక ఫలములతో దీవించబడును.

35 మరలా నేను మీతో చెప్పునదేమనగా, నా సేవకులైన జోసెఫ్ వేక్‌ఫీల్డ్, సాల్మన్ హంఫ్రీలు తూర్పు ప్రదేశములకు ప్రయాణము చేయవలెను;

36 ప్రవచనములు నెరవేరునట్లు, తాము కన్నవాటిని, విన్నవాటిని మిక్కిలి నిశ్చయముగా నమ్మువాటిని మరియు ప్రవక్తలు, అపొస్తలులు చెప్పినవాటిని తప్ప మరే ఇతర సంగతులను ప్రకటింపక, తమ కుటుంబములతో వారు శ్రమించవలెను.

37 అతిక్రమమునకు పరిణామముగా హీమన్ బాసెట్‌కు అనుగ్రహించబడిన దానిని అతని నుండి తీసుకొని, సైమన్డ్స్ రైడర్‌కు అనుగ్రహించవలెను.

38 మరలా, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, జేరెడ్ కార్టర్ యాజకునిగా నియమించబడవలెను మరియు జార్జ్ జేమ్స్ కూడా యాజకునిగా నియమించబడవలెను.

39 మిగిలిన పెద్దలు సంఘములను కనిపెట్టుకొనియుండి, వాటి చుట్టుప్రక్కలనున్న ప్రాంతములలో వాక్యమును ప్రకటించవలెను; విగ్రహారాధన లేదా దుష్టత్వము సాధన చేయబడకుండునట్లు వారు తమ స్వహస్తములతో పని చేయవలెను.

40 అన్ని విషయములలో బీదలను, అవసరతలో నున్నవారిని, రోగులను, బాధలలో నున్నవారిని జ్ఞాపకముంచుకొనుము, ఏలయనగా ఈ సంగతులను చేయనివాడు నా శిష్యుడు కాడు.

41 మరలా, నా సేవకులైన జోసెఫ్ స్మిత్ జూ., సిడ్నీ రిగ్డన్, ఎడ్వర్డ్ పాట్రిడ్జ్‌లు సంఘము నుండి ఒక సిఫారసును తమతో తీసుకొని వెళ్ళవలెను. నా సేవకుడైన ఆలీవర్ కౌడరీ కొరకు కూడా ఒకటి తీసుకొనవలెను.

42 కాబట్టి, నేను చెప్పిన విధముగా, మీరు విశ్వాసముగా ఉన్నయెడల మిస్సోరి ప్రాంతములో సంతోషించుటకు మీరు సమావేశము కావలెను, అది మీరు స్వాస్థ్యముగా పొందు ప్రదేశము, ఇప్పుడది మీ శత్రువుల స్వాస్థ్యమైయున్నది.

43 కానీ ఇదిగో, ప్రభువైన నేను, యుక్తకాలమందు పట్టణ నిర్మాణమును త్వరపెట్టి, విశ్వాసముగా నుండిన వారికి ఆనందము మరియు సంతోషము యొక్క కిరీటమును ధరింపజేయుదును.

44 ఇదిగో, దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేను మరియు చివరి దినమున వారిని నేను లేపుదును. అలాగే జరుగును గాక. ఆమేన్.