లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 127


127వ ప్రకరణము

1842, సెప్టెంబరు 1న, నావూ, ఇల్లినాయ్ నందున్న కడవరి దిన పరిశుద్ధులకు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ నుండి ఇవ్వబడిన పత్రిక, అది మృతుల కొరకు బాప్తిస్మమును గూర్చి నిర్దేశకములను కలిగియున్నది.

1–4, హింస మరియు శ్రమలయందు జోసెఫ్ స్మిత్ అతిశయపడును; 5–12, మృతుల కొరకు బాప్తిస్మమును గూర్చి గ్రంథములలో వ్రాయవలెను.

1 మిస్సోరినందును, ఈ రాష్ట్రమునందును నా శత్రువులు నన్ను తరుముచున్నారని ప్రభువు బయలుపరచెను గనుక; ఏ కారణము లేకుండా వారు నన్ను తరుముచున్నారు, నాకు విరోధముగా వారు చట్టపరమైన చర్యను తీసుకొనుటకు న్యాయము లేదా ధర్మము యొక్క ఏ నీడయైనను, ఛాయయైనను లేదు గనుక; వారి నేరారోపణలన్నియు నల్లరంగు పూసిన అసత్యముపై ఆధారపడియున్నవి గనుక, నా రక్షణ కొరకు, ఈ ప్రజల రక్షణ కొరకు ఈ ప్రదేశమును కొద్దికాలము విడిచిపెట్టుట యుక్తము మరియు జ్ఞానమని నేను తలంచితిని. నాతో వ్యాపార లావాదేవీలున్న వారందరితో నేను చెప్పునదేమనగా, ప్రతినిధులతోను, గుమాస్తాలతోను నా వ్యవహారములన్నిటిని వదిలి వెళ్ళుచున్నాను, వారు సమయానికి, సరైన రీతిలో అన్నిపనులను నిర్వహించెదరు, ఆస్థులను అమ్ముటద్వారా లేదా సందర్భమును బట్టి, లేదా పరిస్థితులు అనుకూలించుటను బట్టి నిర్ణీతకాలములో నా ఋణములన్నీ చెల్లించునట్లు చర్య తీసుకొందురు. తుఫాను పూర్తిగా తగ్గెనని తెలుసుకున్నప్పుడు, మీ యొద్దకు నేను తిరిగి వచ్చెదను.

2 నా జీవితపు దినములన్నింటిలో మనుష్యుని అసూయ, కోపములు సర్వసాధారణ సంఘటనలుగా ఉన్నందువలన, నేను దాటవలసిన ప్రమాదములు చూడగా, అవి నాకు అల్పమైనవిగా కనబడుచున్నవి; మీరు పిలుచుటకు ఎన్నుకొనినట్లుగా, లోకము పునాది వేయబడక మునుపు ఒక మంచి లేదా చెడు ఉద్దేశ్యము కొరకు అని నేను నియమించబడితేనే తప్ప ఇది ఒక మర్మముగా కనబడుచున్నది. మీకై మీరు తీర్పుతీర్చుడి. ఇది మంచికో లేదా చెడుకో గాని, ఈ సంగతులన్నియు దేవునికి తెలియును. అయినప్పటికీ, అగాధజలములలో ఈదుటకు నేను అలవాటుపడితిని. ఇదంతయు నాకు సాధారణమైన విషయముగా మారెను; శ్రమయందు అతిశయపడు పౌలు వలే నేను భావించుచుంటిని; ఏలయనగా నేటి వరకు నా పితరుల దేవుడు వాటన్నిటి నుండి నన్ను విడిపించియున్నాడు, ఇకమీదట విడిపించును; ఇదిగో, నా శత్రువులందరిని నేను జయించెదను, ఏలయనగా దేవుడైన ప్రభువు దీనిని సెలవిచ్చెను.

3 కాబట్టి పరిశుద్ధులందరు సంతోషించి, మిక్కిలి ఆనందించవలెను; ఏలయనగా ఇశ్రాయేలు దేవుడు వారి దేవుడు, వారిని బాధించు వారందరికి ఆయన న్యాయమైన ప్రతిఫలమును ఇచ్చును.

4 మరలా, నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నా దేవాలయపు పనిని, నేను మీకు అప్పగించిన పనులన్నింటిని ఆపక, కొనసాగించుడి; మీ శ్రద్ధ, మీ దీక్ష, ఓర్పు మీ పనులన్నియు రెట్టింపు కావలెను, మీరెంత మాత్రము మీ ప్రతిఫలమును కోల్పోరని సైన్యముల కధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. వారు మిమ్ములను హింసించిన యెడల సంతోషించుడి, ఏలయనగా వీటన్నింటికి పరలోకమందు ప్రతిఫలమున్నది. ఈలాగునే వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను, నీతిమంతులను కూడా హింసించిరి.

5 మరలా, మీ మృతుల కొరకు బాప్తిస్మమునకు సంబంధించి నేను మీకొక మాట చెప్పుచున్నాను.

6 మీ మృతులను గూర్చి నిశ్చయముగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: మీలో ఎవరైనను మీ మృతుల కొరకు బాప్తిస్మము పొందిన యెడల, ఒక గ్రంథకర్త అక్కడ ఉండవలెను, మీ బాప్తిస్మములకు అతడు ప్రత్యక్ష సాక్షిగా ఉండవలెను; అతడు తన చెవులతో వినవలెను, తద్వారా సత్యమును గూర్చి అతడు సాక్ష్యమిచ్చునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు;

7 తద్వారా మీరు లిఖించినవన్నీ పరలోకమందును లిఖించబడును; భూమిమీద మీరు దేనిని బంధింతురో, అది పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు దేనిని విప్పుదురో, అది పరలోకమందును విప్పబడును;

8 ఏలయనగా యాజకత్వమునకు సంబంధించి అనేక సంగతులను నేను భూమిపైన పునఃస్థాపించబోవుచున్నానని సైన్యముల కధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

9 మరలా, లిఖించినవన్నీ క్రమములో ఉండవలెను, తద్వారా అవి నా పరిశుద్ధ దేవాలయము యొక్క పత్రాలు భద్రపరచు స్థలములో ఉంచబడి, తరతరములకు అవి స్మరణలోనికి తేబడునని సైన్యముల కధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

10 పరిశుద్ధులందరికి నేను చెప్పునదేమనగా, మరుసటి విశ్రాంతిదినమున మృతుల కొరకు బాప్తిస్మము అను అంశముపై వారితో ప్రసంగించవలెనని నేను గొప్ప ఆపేక్షతో ఆశించితిని. కానీ అట్లు చేయుట నా శక్తికి మించినది, కావున ఆ విషయమును గూర్చి, అదేవిధముగా ఇతర విషయములను గూర్చి ప్రభువు వాక్యమును వివిధ సమయాలలో నేను వ్రాసి, తపాలా ద్వారా పంపెదను.

11 సమయాభావము వలన ఇప్పుడు నా లేఖను నేను ముగించుచున్నాను; ఏలయనగా నన్ను చెరపట్టుటకు శత్రువు వేచియున్నాడు, రక్షకుడు చెప్పిన విధముగా ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, కానీ నా యెడల అతడు ప్రభావమును కలిగియుండడు.

12 ఇదిగో, దేవునికి నా ప్రార్థన ఏమనగా, మీరందరు రక్షింపబడవలెను. ప్రభువునందు మీ సేవకుడు, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శియైన నేను నా సంతకము చేయుచున్నాను.

జోసెఫ్ స్మిత్