లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 12


12వ ప్రకరణము

1829 మే, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా జోసెఫ్ నైట్ సీనియర్‌కివ్వబడిన బయల్పాటు. మోర్మన్ గ్రంథ పలకలు తన ఆధీనములో ఉండుటను గూర్చి జోసెఫ్ స్మిత్ బహిరంగ ప్రకటనలను మరియు ఆ సమయములో అనువాద కార్య పురోగతిని జోసెఫ్ నైట్ నమ్మెను, అనేకమార్లు జోసెఫ్ స్మిత్, అతని లేఖకునికి వస్తురూపములో సహకారమును అందించెను, అది అనువాదమును కొనసాగించుటకు వారికి సహాయపడెను. జోసెఫ్ నైట్ విన్నపము మేరకు, ప్రవక్త ప్రభువును విచారించి, ఈ బయల్పాటును పొందెను.

1–6, ద్రాక్షతోటలో పనిచేయువారు రక్షణ పొందెదరు; 7–9, ఎవరైతే కోరిక కలిగియుండి, అర్హులగుదురో వారందరు ప్రభువు కార్యములో సహాయపడవచ్చును.

1 ఒక గొప్ప ఆశ్చర్యకార్యము నరుల సంతానము మధ్యకు రాబోవుచున్నది.

2 ఇదిగో, నేను దేవుడను; నా మాటకు చెవియొగ్గుము, అది జీవముగలది, శక్తివంతమైనది, కీళ్ళను మూలుగును విడదీయు రెండంచులు గల ఖడ్గము కన్నా పదునైనది; కాబట్టి, నా మాటకు చెవియొగ్గుము.

3 ఇదిగో, పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నది; కాబట్టి, ఎవడైతే కోయుటకు ఇష్టపడునో, అతడు తన బలముతో తన కొడవలిని వాడి, దేవుని రాజ్యములో తన ప్రాణమునకు నిత్య రక్షణను దాచిపెట్టుకొనునట్లు దినము గడవక ముందే కోత కోయనిమ్ము.

4 అవును ఎవడైతే తన కొడవలితో కోతకోయునో, అట్టివాడు దేవుని చేత పిలువబడెను.

5 కాబట్టి, నీవు నన్ను అడిగిన యెడల నీవు పొందెదవు; నీవు తట్టిన యెడల అది నీకు తెరువబడును.

6 ఇప్పుడు నీవు నన్ను అడిగితివి గనుక ఇదిగో, నేను నీకు సెలవిచ్చుచున్నాను, నా ఆజ్ఞలను పాటించుము, సీయోను హేతువును ముందుకు తెచ్చి, స్థాపించుటకు ప్రయత్నించుము.

7 ఇదిగో, నేను నీతోను, ఈ కార్యమును ముందుకు తీసుకొనివచ్చి, స్థాపించుటకు కోరికలుగల వారందరితో మాట్లాడుచున్నాను;

8 అతని సంరక్షణలో ఉంచబడిన ఏ విషయమందైనను వినయము కలిగి, ప్రేమాపూర్ణుడై, విశ్వాసము, నిరీక్షణ, దాతృత్వము కలిగియుండి, అన్ని విషయములందు నిగ్రహము కలిగియుంటే తప్ప ఎవడునూ ఈ కార్యమునందు సహకరించలేడు.

9 ఇదిగో, ఈ మాటలను పలుకుచున్నది లోకమునకు వెలుగును, జీవమునైయున్న నేనే, కనుక నీ శక్తితో ఆలకించుము, అప్పుడు నీవు పిలువబడుదవు. ఆమేన్.