లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 111


111వ ప్రకరణము

1836, ఆగష్టు 6న సాలెం, మస్సాచుసెట్స్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ సమయమందు సంఘ నాయకులు పరిచర్య కార్యముల వలన భారమైన అప్పులో ఉండిరి. సాలెం నందు అధికమొత్తములో ధనము లభించగలదని విని, ప్రవక్త, సిడ్నీ రిగ్డన్, హైరం స్మిత్, ఆలీవర్ కౌడరీ సువార్తను ప్రకటించుటతో పాటు ఈ ఆరోపణను పరిశోధించుటకు కర్ట్‌లాండ్, ఒహైయో నుండి అక్కడికి పయనమయ్యిరి. సహోదరులు సంఘ వ్యవహారములలో చాలా అంశములను పూర్తిచేసి, కొంతవరకు సువార్తను ప్రకటించిరి. ధనమేమియు రాబోదని స్పష్టమైనప్పుడు, వారు కర్ట్లాండ్‌కు తిరిగివచ్చిరి. ఈ బయల్పాటు వెనుక ప్రస్ఫుటమగు అనేక అంశములు ఈ బయల్పాటు పదకూర్పులో ప్రతిబింబించబడెను.

1–5, తన సేవకుల లౌకిక అవసరతలను ప్రభువు తీర్చును; 6–11, ఆయన సీయోను యెడల దయతో వ్యవహరించును, ఆయన సేవకుల మేలు కొరకు సమస్త సంగతులను సమకూర్చును.

1 మీ దేవుడును ప్రభువైన నేను, మీ అవివేక క్రియలకు అతీతముగా, మీరు ఈ ప్రయాణములో తిరిగి వచ్చుటను బట్టి మీ యెడల విచారముగా లేను.

2 మీ కొరకు, సీయోను ప్రయోజనము కొరకు ఈ పట్టణములో నేను విస్తారమైన నిధిని మరియు అనేకమంది జనులను కలిగియున్నాను, మీ ద్వారా వారిని సీయోను ప్రయోజనము కొరకు నా అనుకూల సమయములో నేను సమకూర్చుదును.

3 కాబట్టి మీకు బయలుపరచబడి, మీరు నడిపించబడిన విధముగా ఈ పట్టణములోని మనుష్యులతో పరిచయమును పెంచుకొనుట యుక్తము.

4 తగిన సమయములో ఈ పట్టణమును మీ చేతులకు అప్పగించుట జరుగును, తద్వారా మీ రహస్య ప్రణాళికలను కనుగొనలేనంతగా మీరు దానిపై శక్తిని కలిగియుందురు; బంగారము, వెండికి సంబంధించిన దాని ఐశ్వర్యము మీదగును.

5 మీ ఋణమును గూర్చి కలత చెందకుము, ఏలయనగా వాటిని తీర్చుటకు నేను మీకు శక్తినిచ్చెదను.

6 సీయోను గూర్చి కలత చెందకుము, ఏలయనగా ఆమె యెడల నేను దయతో వ్యవహరించెదను.

7 ఈ స్థలములోను, చుట్టూఉన్న ప్రాంతములలోను నిలిచియుండుము;

8 ముఖ్యముగా నా చిత్తప్రకారము మీరు ఏ స్థలములో నిలిచియుండాలో అది మీకు నా ఆత్మ శక్తి మరియు సమాధానము ద్వారా తెలియజేయబడును, అది మీలో ప్రవహించును.

9 ఈ ప్రదేశమును మీరు అద్దెకు తీసుకొనవచ్చును. ఈ పట్టణపు అతి పురాతన నివాసితులు, నిర్మాతలను గూర్చి మరింత శ్రద్ధతో విచారించుడి.

10 ఏలయనగా మీ కొరకు ఈ పట్టణములో ఒకటి కంటె ఎక్కువ నిధులు కలవు.

11 కాబట్టి, మీరు సర్పములవలె వివేకముగానుండుడి, కానీ పాపము చేయకుడి; మీరు పొందగలిగినంత వేగముగా సమస్త సంగతులను మీ మేలు కొరకు నేను సమకూర్చెదను. ఆమేన్.