33వ ప్రకరణము
1830 అక్టోబరు, న్యూయార్క్‌లోని ఫేయెట్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఎజ్రా థైర్, నార్థ్రోప్ స్వీట్‌లకివ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటును పరిచయము చేయుటలో, “విశ్వాసముతో శ్రద్ధగా వెదకువారికి ఉపదేశించుటకు … ప్రభువు ఎల్లప్పుడు సిద్ధమని” జోసెఫ్ స్మిత్ చరిత్ర రూఢిపరచును.
1–4, పదకొండవ గడియలో సువార్తను ప్రకటించుటకు పనివారు పిలువబడిరి; 5–6, సంఘము స్థాపించబడెను మరియు ఎన్నికోబడినవారు సమకూర్చబడవలసియున్నది; 7–10, పశ్చాత్తాపపడుము, ఏలయనగా పరలోకరాజ్యము సమీపించియున్నది; 11–15, సువార్త బండపై సంఘము స్థాపించబడెను; 16–18, పెండ్లి కుమారుని రాకకు సిద్ధపడుము.
1 ఇదిగో, నా సేవకులైన ఎజ్రా మరియు నార్థ్రోప్, నేను మీతో చెప్పునదేమనగా, మీరు మీ చెవులను తెరచి ప్రభువైన మీ దేవుని స్వరమును వినుడి, ఆయన వాక్యము జీవము గలదియు, శక్తివంతమునై, కీళ్ళను, మూలుగును, ప్రాణమును, ఆత్మను వేరు చేయు రెండంచులు గల ఖడ్గము కన్నా పదునైనది; అది హృదయాలోచనలను, ఉద్దేశ్యములను తెలుసుకొనగలది.
2 వక్రమైన, చెడ్డ తరము వారికి బూర ఊదినట్లు మీ స్వరములను ఎలుగెత్తి, నా సువార్తను ప్రకటించుటకు మీరు పిలువబడిరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
3 ఏలయనగా ఇదిగో, పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నది; ఇది పదకొండవ గడియ మరియు చివరిసారిగా నేను నా ద్రాక్షతోటలోనికి పనివారిని పిలిచెదను.
4 నా ద్రాక్షతోట పూర్తిగా పాడైపోయెను; కొద్దిమంది తప్ప మంచి చేయువారెవరును లేరు; అందరు చెడిపోయిన మనస్సులను కలిగియుండి, యాజకవంచనల వలన అనేక సందర్భాలలో తప్పిపోయిరి.
5 ఈ సంఘమును నేను స్థాపించియున్నానని, అరణ్యములో నుండి పిలిచితినని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
6 అదే విధముగా భూమి నలుమూలల నుండి నేను ఎన్నుకొనిన వారిని, అనగా నా యందు నమ్మికయుంచి, నా స్వరమును వినువారందరిని సమకూర్చెదను.
7 అవును, పొలము ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; కాబట్టి, మీ కొడవళ్ళతో, మీ పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో కోతకోయుము.
8 మీ నోళ్ళను విప్పుము, అవి నింపబడును మరియు మీరు యెరూషలేము నుండి అరణ్యములో ప్రయాణించిన ప్రాచీన నీఫై వలే అగుదురు.
9 మీరు తాళక మీ నోళ్ళను విప్పుము మరియు మీ వీపులపై మీరు పనలను మోసుకొనిపోవుదురు, ఏలయనగా నేను మీతోనున్నాను.
10 ఇలా చెప్పుచూ మీ నోళ్ళను విప్పుము, అవి నింపబడును: పశ్చాత్తాపపడుము, పశ్చాత్తాపపడుము, ప్రభువు కొరకు మార్గమును సిద్ధపరచుము, ఆయన త్రోవలను సరాళము చేయుము; ఏలయనగా పరలోకరాజ్యము సమీపించుచున్నది;
11 మీలో ప్రతి ఒక్కరు మీ పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొందవలెను; నీటి మూలముగా బాప్తిస్మము పొందుము, అప్పుడు అగ్ని మూలముగా బాప్తిస్మము, పరిశుద్ధాత్మయు వచ్చును.
12 ఇదిగో, ఇది నా సువార్తయని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; వారు నా యందు విశ్వాసము కలిగియుండవలెను, లేనియెడల వారు ఎంతమాత్రము రక్షింపబడరని జ్ఞాపకముంచుకొనుము;
13 ఈ బండమీద నా సంఘమును కట్టుదును; అవును, ఈ బండమీద మీరు కట్టబడియున్నారు, మీరు కొనసాగిన యెడల, నరకపు ద్వారములు మీ యెదుట నిలువనేరవు.
14 సంఘ ప్రమాణములను, నిబంధనలను పాటించుటను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను.
15 విశ్వాసము గలవారిని మీరు హస్తనిక్షేపణము ద్వారా నిర్ధారించవలెను మరియు వారిపై నేను పరిశుద్ధాత్మ వరమును క్రుమ్మరించెదను.
16 మోర్మన్ గ్రంథము, పరిశుద్ధ లేఖనములు మీ శిక్షణ కొరకు నా వలన ఇవ్వబడినవి; నా ఆత్మ శక్తి అన్నిటిని జీవింపజేయును.
17 కాబట్టి, ఎల్లప్పుడు ప్రార్థించుచు విశ్వాసముగా నుండుము, మీ దివిటీలను సరిచేసి, మండించుచు మీతో నూనెను తీసుకొనిపొమ్ము, తద్వారా పెండ్లికుమారుని రాకడకు మీరు సిద్ధపడియుండవచ్చును—
18 ఏలయనగా ఇదిగో, నేను అకస్మాత్తుగా వచ్చెదనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే జరుగును గాక. ఆమేన్.