129వ ప్రకరణము
1843, ఫిబ్రవరి 9న నావూ, ఇల్లినాయ్‌లో పరిచర్యచేయు దూతలు మరియు ఆత్మల వాస్తవ స్వభావమును గుర్తించుటకు మూడు ముఖ్యాంశములను తెలుపుచూ ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత ఇవ్వబడిన సూచనలు.
1–3, పరలోకములో పునరుత్థానము చెందిన ఆత్మ శరీరములు కలవు; 4–9, తెరకు అవతల ఉన్న సందేశకులను గుర్తించుటకు ముఖ్యాంశములు ఇవ్వబడినవి.
1 పరలోకములో రెండు రకముల వ్యక్తులు కలరు, వారెవరనగా: శరీరము, ఎముకలు కలిగి పునరుత్థానము చెందిన దూతలు—
2 ఉదాహరణకు: నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును, మాంసమును భూతమునకుండవని యేసు క్రీస్తు చెప్పెను.
3 రెండు: పునరుత్థానము చెందలేదు, కానీ అట్టి మహిమనే వారసత్వముగా పొందిన నీతిమంతుల ఆత్మలు పరిపూర్ణముగా చేయబడెను.
4 దేవుని నుండి ఒక సందేశము కలదని ఒక సందేశకుడు వచ్చిన యెడల, మీ చేయి చాచి, మీతో కరచాలనము చేయుటకు విన్నపము చేయుడి.
5 అతడు దేవదూతయైన యెడల ఆవిధముగానే చేయును, అతని చేతిని మీరు అనుభూతి చెందుదురు.
6 పరిపూర్ణుడుగా చేయబడిన నీతిమంతుని ఆత్మయైన యెడల, అతడు తన మహిమతో వచ్చును; ఏలయనగా ఆ విధముగానే అతడు ప్రత్యక్షము కాగలడు—
7 కరచాలనము చేయమని అతడిని అడుగుడి, కానీ అతడు కదలడు, ఏలయనగా నీతిమంతుడు మోసము చేయుట పరలోకరాజ్య విధానమునకు విరుద్ధము; కానీ అతడు, అతని సందేశమును ఇచ్చుచునే ఉండును.
8 అది వెలుగుదూత వేషము వేసుకొనిన అపవాదియైతే, కరచాలనము చేయమని అతడిని మీరు అడిగినప్పుడు, అతను చేయి చాచును, కానీ మీరేమియు అనుభూతి చెందలేరు; కాబట్టి మీరు అతడిని కనిపెట్టవచ్చును.
9 ఈ మూడు గొప్ప ముఖ్యాంశముల ద్వారా ఏ నిర్వహణయైనను దేవుని నుండి కలిగెనా అని మీరు తెలుసుకొనవచ్చును.