లేఖనములు
అధికారిక ప్రకటన 2


అధికారిక ప్రకటన 2

“నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా” అందరు దేవునికి ఒకేరీతిగా ఉన్నారని మోర్మన్ గ్రంథము బోధించుచున్నది (2 నీఫై 26:33). సంఘ చరిత్ర అంతటిలో, అనేక దేశాలలో ప్రతి జాతి మరియు స్వజాతీయతకు సంబంధించిన వారు బాప్తిస్మము పొంది, సంఘము యొక్క విశ్వాసులైన సభ్యులుగా జీవించారు. జోసెఫ్ స్మిత్ జీవితకాలములో, కొంతమంది నల్లజాతి పురుషులు యాజకత్వమునకు నియమించబడిరి. దాని చరిత్రలో, ఆఫ్రికా వారసత్వమునకు చెందిన నల్లజాతి పురుషులకు యాజకత్వము అనుగ్రహించుటను మానివేసిరి. ఈ ఆచారము యొక్క మూలములకు సంఘ చరిత్ర ఎటువంటి స్పష్టమైన పరిజ్ఞానమును ఇచ్చుటలేదు. ఈ ఆచారమును మార్చుటకు దేవునినుండి ఒక బయల్పాటు అవసరమని సంఘ నాయకులు నమ్మి, ప్రార్థనాపూర్వకముగా నడిపింపును కోరారు. ఆ బయల్పాటు సంఘ అధ్యక్షులైన స్పెన్సర్ డబ్ల్యూ. కింబల్‌కు వచ్చింది మరియు ఇతర సంఘ నాయకులకు 1978, జూన్ 1న సాల్ట్ లేక్ దేవాలయములో రూఢీపరచబడింది. జాతికి సంబంధించి ఒకప్పుడు విధించబడిన యాజకత్వపు నిర్భంధములన్నింటిని ఈ బయల్పాటు తొలగించింది.

సంబంధిత వ్యక్తులెవరికైనను:

1978, సెప్టెంబరు 30న యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క 148వ అర్థవార్షిక సర్వసభ్య సమావేశములో ఇది సంఘ ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారులైన అధ్యక్షులు ఎన్. ఎల్డన్ టేనర్ చేత ప్రవేశపెట్టబడినది:

ఈ సంవత్సరము యొక్క జూన్ ప్రారంభములో, సంఘము యొక్క యోగ్యులైన పురుషులందరికి యాజకత్వము, దేవాలయ దీవెనలు విస్తరింపజేయవలెనని అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్‌కు బయల్పాటు ఇవ్వబడెనని ప్రథమ అధ్యక్షత్వము చేత ప్రకటన చేయబడెను. ఈ బయల్పాటును పొందిన తరువాత సమావేశమునకు తెలియపరచమని అధ్యక్షులు కింబల్ నన్ను కోరెను, పరిశుద్ధ దేవాలయపు పవిత్ర గదులలో దీర్ఘకాలపు ధ్యానము, ప్రార్థన ద్వారా ఆయనకు ఈ బయల్పాటు వచ్చిన తరువాత, ఆయన దానిని తన సలహాదారులకు తెలిపెను, వారు దానిని అంగీకరించి, ఆమోదించిరి. తరువాత అది పన్నెండుమంది అపొస్తలుల సమూహము యెదుట ప్రవేశపెట్టబడెను, వారు ఏకగ్రీవముగా ఆమోదించిరి, అటు పిమ్మట అది ప్రధాన అధికారుల యెదుట ప్రవేశపెట్టబడినది, వారు కూడా ఆవిధముగానే ఏకగ్రీవముగా ఆమోదించిరి.

ఇప్పుడు ఈ పత్రికను చదువమని అధ్యక్షులు కింబల్ నన్ను కోరారు:

జూన్ 8, 1978

ప్రపంచమంతటానున్న యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రధాన మరియు స్థానిక యాజకత్వ అధికారులకు:

ప్రియమైన సహోదరులారా:

భూమియందంతటా ప్రభువు కార్యము విస్తరించుటను మనము చూచితిమి గనుక, అనేక దేశముల జనులు పునఃస్థాపిత సువార్త సందేశమునకు స్పందించి, ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో సంఘములో చేరినందుకు మేము కృతజ్ఞత కలిగియున్నాము. ఫలితముగా సువార్త అందించు దీవెనలు, విశేషాధికారములన్నీ యోగ్యులైన ప్రతి సంఘ సభ్యునికి విస్తరింపజేయవలెనను ఒక కోరికతో ఇది మమ్ములను ప్రేరేపించినది.

మాకు ముందు వచ్చిన ప్రవక్తలు, సంఘ అధ్యక్షులు దేవుని నిత్య ప్రణాళికలోని ఒక సమయములో యోగ్యులైన మన సహోదరులందరు యాజకత్వమును పొందెదరని చేసిన వాగ్దానములను యెరిగినవారమై, యాజకత్వము ఇవ్వబడకుండా ఉన్నవారి విశ్వాస్యతను మేము చూచినప్పుడు, విశ్వాసముగల మన సహోదరులైన వీరి తరఫున మేము బహుకాలము హృదయపూర్వకముగా వేడుకొనుచు, దైవిక నడిపింపు కొరకు ప్రభువుకు మొరపెట్టుచూ దేవాలయపు పైగదిలో అనేక గంటలు గడిపితిమి.

ఆయన మా ప్రార్థనను విని బయల్పాటు ద్వారా సంఘములోని విశ్వాసముగల, యోగ్యుడైన ప్రతి పురుషుడు పరిశుద్ధ యాజకత్వమును పొంది, దాని దైవిక అధికారమును శక్తితో సాధనచేయుటకు, దేవాలయపు దీవెనలతో కలిపి యాజకత్వము వలన కలుగు ప్రతి దీవెనను అతని ప్రియులైన వారితో ఆనందించుటకు బహుకాలముగా వాగ్దానము చేయబడిన ఆ దినము వచ్చెనని నిర్ధారించెను. కాబట్టి జాతి, రంగు అను బేధము లేకుండా సంఘము యొక్క యోగ్యులైన పురుషులందరు యాజకత్వమునకు నియమింపబడగలరు. నెలకొల్పబడిన యోగ్యతా ప్రమాణములను బట్టి అహరోను లేదా మెల్కీసెదెకు యాజకత్వమునకు నియమించబడవలసిన సభ్యులందరిని జాగ్రత్తగా మౌఖికపరీక్ష చేయు కార్యాచరణ విధానమును అనుసరించవలెనని యాజకత్వ నాయకులకు సూచించబడెను.

భూమియందంతటా ఉన్న తన పిల్లలందరు ఎవరైతే ఆయన అధికారమిచ్చిన సేవకుల స్వరమును విని, సువార్త యొక్క ప్రతి దీవెనను పొందుటకు సిద్ధపడుదురో, వారిని దీవించుటకు ప్రభువు ఇప్పుడు తన చిత్తమును తెలియపరచెనని గంభీరముగా మేము ప్రకటించుచున్నాము.

మీ భవదీయులు,

స్పెన్సర్ డబ్ల్యు. కింబల్

ఎన్. ఎల్డన్ టేనర్

మారియన్ జి. రామ్ని

ప్రథమ అధ్యక్షత్వము

స్పెన్సర్ డబ్ల్యు. కింబల్‌ను ప్రవక్త, దీర్ఘదర్శి, బయల్పాటుదారుడు, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షునిగా గుర్తిస్తూ, ఒక శాసనసభగా మనము ఈ బయల్పాటును ప్రభువు వాక్యము మరియు చిత్తముగా అంగీకరించవలెనని ప్రతిపాదించబడినది. దీనికి సమ్మతించు వారందరు మీ కుడిచేతిని పైకెత్తుట ద్వారా తెలియజేయవలెను. వ్యతిరేకించు వారెవరైనా అదే విధముగా తెలియజేయవలెను.

ముందుగా లిఖించబడిన ప్రతిపాదనను బలపరచు ఓటు అనుకూలముగాను ఏకగ్రీవముగాను ఉండెను.

సాల్ట్ లేక్ సిటీ, యూటా, సెప్టెంబరు 30, 1978.