46వ ప్రకరణము
1831 మార్చి 8న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా సంఘమునకు ఇవ్వబడిన బయల్పాటు. సంఘము యొక్క ఈ ఆరంభ సమయములో, సంఘ కూడికలను నడిపించుటకు ఒక ఉమ్మడి విధానము ఇంకా అభివృద్ధి చేయబడలేదు. అయినప్పటికీ, సంఘ సంస్కార కూడికలకు మరియు ఇతర సభలకు సభ్యులను, ఆసక్తిగల అన్వేషకులను మాత్రమే అనుమతించు ఆచారము కొంతవరకు సాధారణమయ్యెను. కూడికలను నిర్వర్తించుటకు, నడిపించుటకు మరియు ఆత్మ వరములను వెదకుటకు, వివేచించుటకు ఆయన నడిపింపునకు సంబంధించి ప్రభువు యొక్క చిత్తమును ఈ బయల్పాటు వ్యక్తము చేయును.
1–2, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి పెద్దలు కూడికలను నడిపించవలెను; 3–6, సత్యాన్వేషకులను సంస్కార కూడికలలో చేరకుండా చేయరాదు; 7–12, దేవుని అడిగి, ఆత్మ వరములను వెదకుడి; 13–26, ఈ వరములలో కొన్నింటి జాబితా ఇవ్వబడినది; 27–33, ఆత్మ వరములను వివేచించు శక్తి సంఘ నాయకులకు ఇవ్వబడెను.
1 ఓ నా సంఘ జనులారా, ఆలకించుడి; ఏలయనగా ఈ సంగతులు మీ మేలు కొరకు, మీకు బోధించుటకు చెప్పబడినవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
2 కానీ వ్రాయబడిన ఆ సంగతులు ఉన్నప్పటికీ, ఆరంభము నుండి ఎప్పటికీ వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, నిర్దేశించబడిన ప్రకారము అన్ని కూడికలను నడిపించుటకు ఎల్లప్పుడు నా సంఘ పెద్దలకు అధికారమివ్వబడెను.
3 అయినప్పటికీ లోకము యెదుట ఏర్పాటు చేయబడిన మీ బహిరంగ కూడికలలో నుండి ఏ ఒక్కరిని మీరు పంపివేయకూడదని మీరు ఆజ్ఞాపించబడిరి.
4 మీ సంస్కార కూడికల నుండి సంఘమునకు చెందిన ఏ ఒక్కరిని పంపివేయకూడదని కూడా మీరు ఆజ్ఞాపించబడిరి; అయినను, ఎవరైనా తప్పిదము చేసిన యెడల, అతడు సమాధానపరచబడు వరకు అతడిని సంస్కారములో పాలుపొందనియ్యకుడి.
5 నేను మరలా మీతో చెప్పునదేమనగా, రాజ్యమును ఆసక్తితో వెదకుచున్న వారిని మీరు మీ సంస్కార కూడికలలో నుండి పంపివేయకూడదు—సంఘమునకు చెందని వారిని గూర్చి నేను దీనిని చెప్పుచున్నాను.
6 మీ నిర్ధారణ కూడికలను గూర్చి మరలా నేను మీతో చెప్పునదేమనగా, రాజ్యమును ఆసక్తితో వెదకుచున్న సంఘమునకు చెందని వారు ఎవరైనా అక్కడ ఉన్నయెడల, వారిని మీరు పంపివేయకూడదు.
7 కానీ అన్ని విషయములలో ధారాళముగా ఇచ్చు దేవుడిని అడుగవలెనని మీరు ఆజ్ఞాపించబడిరి; నా యెదుట యథార్థముగా నడుచుకొనుచు, మీ రక్షణ యొక్క అంతమును పరిగణించుచు, సమస్తమును ప్రార్థన, కృతజ్ఞతలతో చేయుచు, మీరు సంపూర్ణ హృదయ పరిశుద్ధతతో ఆత్మ మీకు ఏమి సాక్ష్యమిచ్చునో ఆ ప్రకారము చేయవలెనని నేను కోరుచున్నాను, తద్వారా మీరు దురాత్మలచేత, దయ్యముల సిద్ధాంతములచేత లేదా మనుష్యుల ఆజ్ఞలచేత మోసగించబడరు; ఏలయనగా కొన్ని మనుష్యుల వలనను, మరికొన్ని దయ్యముల వలనను కలిగినవి.
8 కాబట్టి జాగ్రత్తగా ఉండుడి, లేనియెడల మీరు మోసగించబడుదురు; మీరు మోసగించబడకుండునట్లు శ్రేష్ఠమైన బహుమానములను ఆసక్తితో వెదకుడి మరియు అవి ఎందుకు అనుగ్రహింపబడినవో ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుడి;
9 ఏలయనగా నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలన్నింటిని గైకొనువారు మరియు ఆవిధముగా చేయుటకు కోరువారి మేలు కొరకు అవి అనుగ్రహింపబడినవని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను; తద్వారా వెదకువారు లేదా నన్నడుగువారు, వారి భోగముల నిమిత్తము వినియోగించుటకై ఒక సూచకక్రియ కొరకు అడుగని వారందరు మేలుపొందెదరు.
10 నేను మరలా మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, సంఘమునకు అనుగ్రహింపబడిన ఆ బహుమానములు యెట్టివో మీరు ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొని, ఎల్లప్పుడు మీ మనస్సులందు నిలుపుకొనవలెనని నేను మిమ్ములను కోరుచున్నాను.
11 ఏలయనగా అందరికి అన్ని బహుమానములు అనుగ్రహింపబడుటలేదు; ఏలయనగా అనుగ్రహించుటకు అనేక బహుమానములు కలవు మరియు దేవుని ఆత్మ వలననే ప్రతి మనుష్యునికి ఒక వరము అనుగ్రహింపబడుచున్నది.
12 అందరి ప్రయోజనము కొరకు కొందరికి ఒకటి, మరికొందరికి ఇంకొకటి అనుగ్రహింపబడుచున్నది.
13 యేసు క్రీస్తు దేవుని కుమారుడని, ఆయన లోకపాపముల కొరకు సిలువ వేయబడెనని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొనుటకు కొందరికి అనుగ్రహింపబడినది.
14 వారి మాటలను నమ్ముటకు ఇతరులకు అనుగ్రహింపబడినది, తద్వారా వారు విశ్వాసముగా కొనసాగినయెడల వారు కూడా నిత్యజీవమును పొందుదురు.
15 మరలా, పరిచర్యలు నానావిధములుగా ఉన్నవని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొనుటకు కొందరికి అనుగ్రహింపబడినది, ప్రభువు చిత్త ప్రకారము నరుల సంతానము పరిస్థితులకు అనుకూలముగా తన కరుణాకటాక్షములు ఉండుట ప్రభువుకు సంతోషము కలిగించును.
16 మరలా, కొందరికి నానావిధములైన కార్యములు, అవి దేవుని వలన కలిగినవో లేదో తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహంపబడినది, తద్వారా అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది.
17 మరలా, కొందరికి దేవుని ఆత్మవలననే జ్ఞానవాక్యము అనుగ్రహింపబడినదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
18 అందరు జ్ఞానము కలిగి, తెలివిగానుండుడని బోధించుటకు మరియొకనికి జ్ఞానవాక్యము అనుగ్రహింపబడినది.
19 మరలా, కొందరికి స్వస్థపడుటకు తగిన విశ్వాసము అనుగ్రహింపబడినది;
20 మరికొందరికి స్వస్థపరచుటకు తగిన విశ్వాసము అనుగ్రహింపబడినది.
21 మరలా, కొందరికి అద్భుతములు చేయు శక్తి అనుగ్రహింపబడినది;
22 మరికొందరికి ప్రవచన వరము అనుగ్రహింపబడినది;
23 మరికొందరికి ఆత్మల వివేచన అనుగ్రహింపబడినది.
24 మరలా, కొందరికి భాషలతో మాట్లాడు శక్తి అనుగ్రహింపబడినది;
25 మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడినది.
26 దేవుని పిల్లల మేలుకొరకు ఈ బహుమానములన్నియు దేవుని యొద్దనుండి వచ్చుచున్నవి.
27 సంఘ బిషప్పునకు మరియు సంఘమునంతటిని కనిపెట్టి, సంఘమునకు పెద్దలుగానుండుటకు దేవుడు నిర్ణయించి, నియమించువారికి ఆ బహుమానములన్నిటిని వివేచించు శక్తి అనుగ్రహింపబడును, లేనియెడల మీలో ఎవరైనను దేవునిచేత ఆదేశింపబడకయే ఆరోపించెదరు.
28 ఆత్మతో అడుగువాడు అత్మవలననే పొందును;
29 ప్రతి సభ్యుడు ప్రయోజనము పొందుటకు ఒక అధికారి ఉండునట్లు, ఆ బహుమానములన్నియు పొందుటకు కొందరికి అనుగ్రహించబడును.
30 ఆత్మతో అడుగువాడు దేవుని చిత్తప్రకారము అడుగును; కాబట్టి అతడు అడిగినట్లే జరుగును.
31 ఆత్మయందు మీరేమి చేసినను, అన్ని సంగతులు క్రీస్తు నామములో చేయబడవలెను.
32 మీరు పొందియున్న ఏ దీవెన కొరకైనా మీరు ఆత్మయందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలెను.
33 మీరు నా యెదుట సద్గుణమును, పరిశుద్ధతను ఎడతెగక సాధన చేయవలెను. అలాగే జరుగును గాక. ఆమేన్.