59వ ప్రకరణము
1831 ఆగష్టు 7న, మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలోనున్న సీయోనులో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటుకు ముందు, ప్రభువు నిర్దేశించిన విధంగా ఆ ప్రదేశము సమర్పించబడెను మరియు భవిష్యత్తులో నిర్మించబోవు దేవాలయము కొరకు స్థలము అంకితమివ్వబడెను. ఈ బయల్పాటు పొందిన దినమున, జోసెఫ్ నైట్ సీనియర్ భార్య పోలీ నైట్ మరణించెను, ఆమె సీయోనులో మరణించిన మొదటి సంఘ సభ్యురాలు. “విశ్రాంతిదినమును ఆచరించి, ఉపవాసము మరియు ప్రార్థన చేయు విధానాన్ని పరిశుద్ధులకు సూచించేదిగా” ఆ బయల్పాటును ప్రారంభ సభ్యులు వర్ణించారు.
1–4, సీయోనులో విశ్వాసులైన పరిశుద్ధులు దీవించబడుదురు; 5–8, వారు ప్రభువును ప్రేమించి, సేవించి, ఆయన ఆజ్ఞలను పాటించవలెను; 9–19, ప్రభువు దినమును పరిశుద్ధముగా ఆచరించుట ద్వారా, పరిశుద్ధులు భౌతికముగా, ఆత్మీయముగా దీవించబడెదరు; 20–24, నీతిమంతులకు ఈ లోకములో శాంతి, రాబోవు లోకములో నిత్యజీవము వాగ్దానము చేయబడినవి.
1 ఇదిగో, నా ఆజ్ఞలననుసరించి, నా మహిమార్థమై ప్రత్యేకించబడి ఈ ప్రదేశమునకు వచ్చిన వారందరు ధన్యులని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
2 సజీవులందరు భూలోకమును వారసత్వముగా పొందెదరు, మరణించు వారందరు వారి పనులనుండి విశ్రాంతి పొందెదరు మరియు వారి క్రియలు వారిని వెంబడించును; నా తండ్రి నివాసములో వారి కొరకు నేను సిద్ధపరచిన ఒక కిరీటమును వారు పొందెదరు.
3 నా సువార్తకు విధేయులై, సీయోను పట్టణముపై వారి పాదములు మోపువారు ధన్యులు, వారు తమ ప్రతిఫలముగా భూమి యొక్క శ్రేష్ఠమైన వాటిని పొందెదరు మరియు అది తన సారమునిచ్చును.
4 నా యెదుట విశ్వాసముగా, శ్రద్ధగానుండువారు—పైనుండి ఇవ్వబడు దీవెనలతో దీవించబడెదరు, వారు మరిన్ని ఆజ్ఞలు మరియు తగిన సమయములో బయల్పాటులు పొందెదరు.
5 కాబట్టి, ఈవిధముగా చెప్పుచూ నేను వారికి ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాను: ప్రభువైన నీ దేవుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతోను ప్రేమించవలెను; యేసు క్రీస్తు నామములో నీవు ఆయనను సేవించవలెను.
6 నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించవలెను. నీవు దొంగిలించకూడదు; వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, లేదా అటువంటిదేదియు చేయకూడదు.
7 అన్ని విషయములలో నీవు నీ ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయవలెను.
8 నీవు నీతితో విరిగిన హృదయమును, నలిగిన మనస్సును ప్రభువైన నీ దేవునికి బలిగా అర్పించవలెను.
9 ఇహలోక మాలిన్యము అంటకుండా నిన్ను నీవు బహుమిక్కిలిగా కాపాడుకొనుటకు, నా పరిశుద్ధ దినమున నీవు నా ప్రార్థనా మందిరమునకు వెళ్ళి, నీ సంస్కారములను అర్పించవలెను.
10 నీ పనుల నుండి విశ్రాంతి పొంది, మహోన్నతునికి నీ భక్తిని చూపుటకు నిశ్చయముగా ఈ దినము నీ కొరకు నియమించబడినది.
11 అయినప్పటికీ, అన్ని దినములలోను, అన్ని సమయములలోను, నీతితో నీ మ్రొక్కుబడులను అర్పించవలెను;
12 కానీ ప్రభువు దినమైన ఈ దినమున నీ పాపములను నీ సహోదరుల యెదుట, నా యెదుట ఒప్పుకొనుచు నీ అర్పణలను, నీ సంస్కారములను మహోన్నతునికి అర్పించవలెనని గుర్తుంచుకొనుము.
13 ఈ దినమున మరి దేనిని నీవు చేయకూడదు, నీ ఉపవాసము పరిపూర్ణమగుటకు లేదా నీ సంతోషము సంపూర్ణమగుటకు ఏకమనస్సుతో నీ ఆహారమును సిద్ధపరచుకొనుము.
14 నిశ్చయముగా ఇదియే ఉపవాసము మరియు ప్రార్థన, లేదా మరియొకమాటలో, ఆనందము మరియు ప్రార్థన.
15 విరగబడి నవ్వకుము, ఏలయనగా అది పాపము—ఈ సంగతులన్నిటిని మీరు కృతజ్ఞతతోను, సంతోషకరమైన హృదయములు, ముఖములతోను చేయునంత వరకు అనగా సంతోషకరమైన హృదయము, సంతోషకరమైన ముఖముతో
16 మీరు దీనిని చేయునంత వరకు, భూమియు దాని సారమంతయు, భూజంతువులు, ఆకాశపక్షులు, వృక్షములపై ప్రాకెడు జీవులు, భూమిపై నడిచే జీవులన్నియు మీవగును.
17 ఔషధ మొక్కలు, భూమిలో నుండి పుట్టు మంచి వస్తువులు, అది ఆహారము కొరకైనను, వస్త్రముకొరకైనను, గృహముకొరకైనను, ధాన్యపు గాదెల కొరకైనను, పండ్ల తోటలు, లేదా పూల తోటలు, ద్రాక్షతోటల కొరకైనను;
18 సకాలములో భూమిపై నుండి వచ్చు సమస్తము కంటికి ఇంపుగా ఉండుటకు, హృదయమునకు ఆనందము కలుగజేయుటకు మనుష్యుని ప్రయోజనము, ఉపయోగము నిమిత్తము చేయబడినవి;
19 ఆహారము మరియు వస్త్రము కొరకు, రుచి మరియు వాసన కొరకు, శరీరమును బలపరచుటకు, ఆత్మను ఉత్తేజపరచుటకు చేయబడినవి.
20 ఇవన్నీ మనుష్యునికిచ్చుట దేవునికి ఆనందము కలిగించును; ఈ హేతువు చేతనే ఇవన్నీ వివేకముతో వినియోగించుకొనుటకు చేయబడెను, కానీ మితిమీరుటకు లేదా బలవంతముగా పొందుటకు కాదు.
21 అన్ని విషయములందు ఆయన హస్తమును అంగీకరించనప్పుడు మరియు ఆయన ఆజ్ఞలను పాటించనప్పుడు తప్ప, ఏ విషయములోను మనుష్యుడు దేవుని నొప్పించడు లేదా ఆయన ఉగ్రత ఎవని మీదకు రాదు.
22 ఇది ధర్మశాస్త్రమును, ప్రవక్తల ఉపదేశము ప్రకారమునైయున్నది; కాబట్టి, ఈ విషయమును గూర్చి ఇకపై నన్ను బాధించకుము.
23 కానీ ఎవడైతే నీతిగల కార్యములు చేయునో వాడు తన ప్రతిఫలమును, అనగా ఈ లోకములో శాంతిని, రాబోవు లోకములో నిత్యజీవమును పొందునని నేర్చుకొనుము.
24 ప్రభువైన నేను, దీనిని చెప్పితిని మరియు ఆత్మ సాక్ష్యమిచ్చును. ఆమేన్.