“మే 24–30. సిద్ధాంతము మరియు నిబంధనలు 58–59: ‘ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమైయుండవలెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“మే 24–30. సిద్ధాంతము మరియు నిబంధనలు 58–59,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
మే 24–30
సిద్ధాంతము మరియు నిబంధనలు 58–59
“ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమైయుండవలెను”
అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు, “లేఖనములు మన వ్యక్తిగత ప్రశ్నలన్నింటిని పరిష్కరిస్తాయి, ఎందుకనగా వాటిని చదవడం ద్వారా మనల్ని సత్యమంతటికి నడిపించు పరిశుద్ధాత్మను మనము ఆహ్వానించి, అతని ప్రేరేపణ కొరకు మనల్ని అర్హులుగా చేసుకుంటాము” (in David A. Edwards, “Are My Answers in There?” New Era, May 2016, 42).
మీ మనోభావాలను నమోదు చేయండి
సంఘ పెద్దలు మొదటిసారి సీయోను పట్టణము యొక్క స్థలము—మిస్సోరిలోని ఇండిపెండెన్స్ చూచినప్పుడు, అది వారు ఆశించినట్లు లేదు. పరిశుద్ధుల యొక్క బలమైన సమూహంతో వృద్ధిచెందుతున్న శ్రామిక సమాజాన్ని కనుగొంటామని కొందరు అనుకున్నారు. బదులుగా అత్యల్ప జనాభా గల దూరప్రాంతాన్ని, వారు అలవాటుపడ్డ నాగరికత లేకపోవడాన్ని మరియు పరిశుద్ధులకు బదులుగా సరిహద్దులలో క్రొత్తగా వచ్చిన మొరటు మనుషుల నివాసాలను వారు కనుగొన్నారు. సీయోనుకు రమ్మని మాత్రమే ప్రభువు వారిని అడగడం లేదని—దానిని నిర్మించమని ఆయన వారిని కోరుతున్నారని స్పష్టమైంది.
మనము ఆశించినదానికి, వాస్తవానికి సంబంధం లేనప్పుడు, 1831లో ప్రభువు పరిశుద్ధులకు చెప్పిన దానిని మనం జ్ఞాపకం చేసుకోగలము: “మీ దేవుని ప్రణాళికను, అనేక శ్రమల తరువాత కలుగు మహిమను మీ సహజ నేత్రాలతో ప్రస్తుతము మీరు చూడలేరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:3). అవును, జీవితం శ్రమలతోను, దుష్టత్వముతోను నిండియున్నది, కానీ మనము “అధికమైన నీతిని నెరవేర్చగలము; ఎందుకనగా శక్తి (మనలో) ఉన్నది” (27–28 వచనాలు).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 58:1–5, 26–33, 44; 59:23
దేవుని సమయము మరియు మన శ్రద్ధను బట్టి దీవెనలు వస్తాయి.
మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలో పరిశుద్ధులు సీయోనును స్థాపించడం ప్రారంభించారు, అక్కడ వారు అనేక శ్రమలను సహించారు. వారి జీవితకాలాల్లో పరిశుద్ధలందరూ సమకూడగల ప్రదేశంగా ఈ ప్రాంతము వికసిస్తుందని నిశ్చయంగా వారు ఆశించారు. అయినప్పటికీ, కొద్ది సంవత్సరాలలోనే పరిశుద్ధులు జాక్సన్ కౌంటీ నుండి తరిమివేయబడ్డారు మరియు తన జనులు “సీయోను విమోచన కొరకు కొద్దికాలము వేచియుండవలెనని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 105:9) ప్రభువు బయల్పరిచారు.
మీరు క్రింది వాక్యభాగాలను చదివినప్పుడు, దీవెనలు కొంతకాలం వరకు నిలిపివేయబడడానికి కారణాల కొరకు చూడండి. ధ్యానించడానికి క్రింది ప్రశ్నలు మీకు సహాయపడగలవు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 58:1–5; 59:23. మరింత సహనముతో శ్రమను సహించడానికి, ఈ వచనాలలోని ఏ సందేశాలు మీ సామర్థ్యాన్ని బలపరుస్తాయి? శ్రమ తరువాత మీరు పొందిన దీవెనలేవి? కొన్ని దీవెనలు శ్రమ తరువాత మాత్రమే వస్తాయని మీరెందుకు అనుకుంటున్నారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 58:26–33. “ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమైయుండడం” అనేది దేవుని వాగ్దానాలను నెరవేర్చడంలో ఏ పాత్ర పోషిస్తుంది? మీ విధేయత ఏ పాత్ర పోషిస్తుంది?
సిద్ధాంతము మరియు నిబంధనలు 58:44. “విశ్వాసపూరితమైన ప్రార్థన” మరియు మన కొరకు ప్రభువు చిత్తము మధ్యగల సంబంధమేమిటి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 59, ప్రకరణ శీర్షిక
పోలీ నైట్ ఎవరు?
పోలీ నైట్ మరియు ఆమె భర్త జోసెఫ్ నైట్ సీ., జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచనాత్మక పిలుపును మొదట నమ్మిన వారిలో ఉన్నారు. పోలీ మరియు జోసెఫ్‌లు మోర్మన్ గ్రంథ అనువాద కార్యములో ప్రవక్తకు ముఖ్యమైన సహకారాన్ని అందించారు. ఒహైయోలోని పరిశుద్ధులతో సమకూడడానికి నైట్ కుటుంబము న్యూయార్క్‌లోని కొలిస్విల్‌ను విడిచివెళ్ళారు మరియు తరువాత, మిస్సోరిలోని జాక్సన్ కౌంటీకి వెళ్ళాలని ఆజ్ఞాపించబడ్డారు. వారు ప్రయాణిస్తున్నప్పుడు పోలీ ఆరోగ్యం క్షీణించసాగింది, కానీ ఆమె చనిపోకముందు సీయోనును చూడాలని ఆమె నిశ్చయించుకుంది. ఆమె మరణించడానికి ముందు కొద్దిరోజులే ఆమె మిస్సోరిలో ఉంది. ఆమె చనిపోయిన రోజు సిద్ధాంతము మరియు నిబంధనలు 59 పొందబడింది, 1 మరియు 2 వచనాలు ప్రత్యేకంగా ఆమె గురించి చెప్తున్నట్లు అనిపిస్తుంది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9–19
సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించడం భౌతిక మరియు ఆత్మీయ దీవెనలను తెస్తుంది.
సీయోనులోని పరిశుద్ధులను మరిన్ని ఆజ్ఞలతో దీవిస్తానని వాగ్దనం చేసిన తర్వాత, ప్రత్యేకించి ఒక ఆజ్ఞ: ఆయన “పరిశుద్ధ దినమును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:4, 9) గౌరవించాలనే ఆజ్ఞ గురించి ప్రభువు ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9–19 చదువుతున్నప్పుడు, ఈ పరిశుద్ధులు సీయోనును నిర్మించాలని కోరినప్పుడు సబ్బాతును గౌరవించడం వారికి ఎందుకంత ముఖ్యమైయుండవచ్చో ధ్యానించండి.
మీరు ఇటువంటి ప్రశ్నలను కూడా ధ్యానించవచ్చు: ప్రభువు ఉద్దేశించిన విధంగా నేను సబ్బాతుదినమును ఉపయోగిస్తున్నానా? “ఇహలోక మాలిన్యము అంటకుండా” (9వ వచనము) ఉండేందుకు సబ్బాతుదినమును పరిశుద్ధముగా ఆచరించడం నాకెలా సహాయపడుతుంది? “మహోన్నతునికి నా భక్తిని చూపుటకు” (10వ వచనము) నేనేమి చేయగలను?
క్రింది వచనాలను చదివిన తర్వాత, బహుపూర్తిగా సబ్బాతుదినమును పరిశుద్ధముగా ఆచరించడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు? ఆదికాండము 2:2–3; నిర్గమకాండము 20:8–11; 31:13, 16; ద్వితీయోపదేశకాండము 5:12–15; యెషయా 58:13–14; మార్కు 2:27; యోహాను 20:1–19; అపొస్తలుల కార్యములు 20:7.
sabbath.ChurchofJesusChrist.org వద్ద లభ్యమగు అనేక వీడియోలు లేక ఇతర వనరులలో ఒకదాని నుండి కూడా మీరు ప్రయోజనం పొందవచ్చు.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 58:26–29.బహుశా కుటుంబ సభ్యులు, వారు “ఆతృతగా నిమగ్నమైయున్న” కొన్ని కార్యముల జాబితా తయారు చేయవచ్చు. వాటిలో అన్నీ “మంచి కార్యములేనా”? “(మన) ఇష్టపూర్వకముగా అనేక కార్యములు” చేయాలని ప్రభువు మనల్ని ఎందుకు కోరుతున్నారు? “అధికమైన నీతిని నెరవేర్చడానికి” ఈ వారంలో వారేమి చేయగలరో ఆలోచించమని ప్రతి కుటుంబ సభ్యుడిని అడగండి. తరువాత వారు చేసిన దానిపై వారు నివేదికను ఇవ్వవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42–43.కుటుంబ సభ్యులు ఈ వచనాలను చదివినప్పుడు, వారేమి భావిస్తారు? పశ్చాత్తాపపడవలసిన వారికి ఈ వచనాలు ఎలా సహాయపడగలవు?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 59:3–19.“ఆజ్ఞలతో దీవించబడెదరు” (4వ వచనము) అనగా అర్థమేమైయుండవచ్చు. 5–19 వచనాలను మీరు చదువుతున్నప్పుడు, ఈ ఆజ్ఞలలో ప్రతి ఒక్కదానికి లోబడియుండడం ద్వారా మీరు పొందిన దీవెనలను చర్చించండి.
సబ్బాతుదినమును పరిశుద్ధముగా ఆచరించడమనే ఆజ్ఞను వివరించడానికి “సంతోషము,” “ఆనందము,” “సంతోషకరమైన” మరియు “సంతోషకరము” వంటి పదాలు ఎలా ఉపయోగించబడ్డాయో కూడా మీరు గమనించవచ్చు. సబ్బాతును మరింత ఆనందకరముగా మీరెలా చేయగలరు? సబ్బాతు దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు చేయగల విషయాలను చూపే అట్టముక్కలతో మీ కుటుంబము జతపరిచే ఆటను తయారు చేయవచ్చు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 59:18–21.“అన్ని విషయములందు … (దేవుని) హస్తమును అంగీకరించడానికి” మనమేమి చేయగలము? (21వ వచనము). విహారానికి వెళ్ళడం లేక చిత్రపటాలను చూడడం, “కంటికి ఇంపుగా ఉండి … హృదయమునకు ఆనందము కలుగజేసే” (18వ వచనము) విషయాలను గమనించడం గురించి ఆలోచించండి. మీరు కనుగొనే వాటి చిత్రాలను మీరు తీయవచ్చు లేక గీయవచ్చు, తర్వాత వాటి కొరకు మీ కృతజ్ఞతను మీరెలా చూపగలరో మాట్లాడవచ్చు. మన జీవితాల్లో దేవుని హస్తమును మనమెలా చూసాము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “Choose the Right,” Hymns, no. 239.