2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
ఏప్రిల్ 26–మే 2. సిద్ధాంతము మరియు నిబంధనలు 45: “వాగ్దానములన్నియు నెరవేరును”


“ఏప్రిల్ 26–మే 2. సిద్ధాంతము మరియు నిబంధనలు 45: ‘వాగ్దానములన్నియు నెరవేరును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“ఏప్రిల్ 26–మే 2. సిద్ధాంతము మరియు నిబంధనలు 45,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
దేవాలయము బయట యువత

ఏప్రిల్ 26–మే 2

సిద్ధాంతము మరియు నిబంధనలు 45

“వాగ్దానములన్నియు నెరవేరును”

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు: “మీ మనస్సులోకి వచ్చే ఆలోచనలను వ్రాయండి. మీ మనోభావాలను నమోదు చేయండి మరియు మీరు తీసుకోవాలని ప్రేరేపించబడిన చర్యలు తీసుకుంటూ వాటిని అవలంబించండి” (“సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2018, 95).

మీ మనోభావాలను నమోదు చేయండి

మనము అపాయకరమైన కాలంలో జీవిస్తున్నాము, అది కలవరపెట్టవచ్చు. మన కాలంలో సంభవించే విపత్తుల గురించి యేసు ప్రవచించగా విని, ఆయన శిష్యులు కూడా “కలవరపడిరి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 45:34). కర్ట్‌లాండ్, ఒహైయోలోని ప్రారంభ పరిశుద్ధులు కూడా వారు నివసించిన అపాయకరమైన కాలాల మూలంగా కలవరపడ్డారు. ఇతర విషయాలతో పాటు “అనేక అసత్య నివేదికలు … బుద్ధిహీనమైన కథలు” సువార్త సందేశాన్ని బలహీనపరచుచుండెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 45, ప్రకరణ శీర్షిక). కానీ, అప్పుడు మరియు ఇప్పుడు ప్రభువు జవాబు, “మీరు కలవరపడకుడి” (35వ వచనము). అవును, దుష్టత్వము ఉంది, కానీ దేవుడు తన పనిని త్వరపెడుతున్నాడనేందుకు సాక్ష్యం కూడా ఉంది. అవును, రెండవ రాకడకు ముందు అపాయాలు కలుగుతాయని చెప్పబడింది, మనము వాటిని ఎరిగియుండాలి. కానీ ఇవి ప్రమాదాల గురించి హెచ్ఛరికలు మాత్రమే కాదు; అవి దేవుని వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయి అనడానికి సూచనలు కూడా. బహుశా అందుకే సిద్ధాంతము మరియు నిబంధనలు 45—ఈ సూచనలలో అనేకమును వివరంగా వర్ణించే బయల్పాటు—ఇది “పరిశుద్ధుల ఆనందమునకై” పొందబడింది (ప్రకరణ శీర్షిక).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:1–5

యేసు క్రీస్తు తండ్రితో మన న్యాయవాది.

మీరెప్పుడైనా దేవుని యెదుట అనర్హులుగా లేక అయోగ్యులుగా భావించారా? సిద్ధాంతము మరియు నిబంధనలు 45:1–5లో మీరు అభయాన్ని కనుగొనవచ్చు. “న్యాయవాది” మరియు “బ్రతిమాలు” వంటి పదాలు మీకేమి సూచిస్తున్నాయి? రక్షకుడు ఎలా మీ న్యాయవాదిగా ఉన్నారు లేక మీ కొరకు బ్రతిమాలుచున్నారు? క్రీస్తు మీ న్యాయవాది అని తెలుసుకోవడం మీకెలా అనిపిస్తోంది?

అధ్యక్షులు జోసెఫ్ ఫీల్డింగ్ స్మిత్ చెప్పిన క్రింది మాటలు మీరు ఈ వచనాలను ధ్యానించడానికి సహాయపడగలవు: “యేసు మన న్యాయవాది, మనల్ని సమ్మతింపజేయడానికి, దేవునితో ఒక ఒప్పందంలోకి తీసుకురావడానికి తన పరిచర్య మరియు శ్రమల ద్వారా మన మధ్యవర్తిగా మన కొరకు బ్రతిమాలుచున్నారు” (సమావేశ నివేదిక, అక్టో. 1953, 58లో).

2 నీఫై 2:8–9; మోషైయ 15:7–9; మొరోనై 7:27–28; సిద్ధాంతము మరియు నిబంధనలు 29:5; 62:1 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:9–10

సువార్త అనేది దేశాలకు ప్రమాణము వంటిది.

పూర్వకాలంలో, ధ్వజము అనేది యుద్ధములోనికి తీసుకువెళ్ళే పతాకము లేక జెండా. అది సైనికులను మరల కూడదీసి, ఐక్యపరచింది మరియు ఎక్కడ సమకూడాలి, ఏమి చేయాలి అని వారు తెలుసుకోవడానికి సహాయపడింది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 45:9–10 చదువుతున్నప్పుడు, సువార్త నిబంధనలు ఏవిధంగా మీకు ఒక ప్రమాణం వంటివో ధ్యానించండి. మీరు ఈ నిబంధనలను కలిగియుండకపోతే, మీ జీవితం ఎలా భిన్నంగా ఉండేది?

యెషయా 5:26; 11:10–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 115:5–6 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:11–75

ప్రభువు యొక్క వాగ్దానములు నెరవేరును.

రక్షకుని రెండవ రాకడకు ముందు యుద్ధము, అసమానత మరియు వినాశనం సంభవిస్తాయి. కానీ, “మీరు కలవరపడకుడి, ఏలయనగా ఈ సంగతులన్నియు జరుగునప్పుడు, మీకు చేయబడిన వాగ్దానములన్నియు నెరవేరునని మీరు తెలుసుకొందురు” అని ప్రభువు చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 45:35).

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 45:11–75 చదువుతున్నప్పుడు, ప్రవచించబడినట్టి కలవరపెట్టే సంఘటనలపై మాత్రమే కేంద్రీకరించకుండా, ప్రభువు వాగ్దానం చేసిన దీవెనలపై కూడా దృష్టిపెట్టండి (ఉదాహరణకు, రక్షకుని వెయ్యేళ్ళ పరిపాలన గురించి 54–59 వచనాలలోని వాగ్దానాలు). జాబితాలు తయారుచేయడం లేక పేర్లు పెట్టడం లేక ఈ వచనాలను గుర్తించడం ద్వారా మీరు దీనిని చేయవచ్చు. అంత్యదినాల గురించి “కలవరపడకుండా” మీకు సహాయపడేలా మీరేమి కనుగొంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:31–32, 56–57

“పరిశుద్ధ స్థలములలో నిలిచియుందురు” మరియు కదలకయుందురు.

రెండవ రాకడ యొక్క సూచనల గురించి రక్షకుడు మరియు ఆయన ప్రవక్తలు మనకు బోధించడానికి గల కారణాలలో ఒకటి, మనం సిద్ధపడి ఉండేందుకు సహాయపడడం. ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడడం గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 45:31–32, 56–57లో మీరేమి నేర్చుకుంటారు? మత్తయి 25:1–13లో కనుగొనబడు పదిమంది కన్యకల ఉపమానమును పునర్వీక్షించడం సహాయకరంగా ఉండవచ్చు. ఈ ఉపమానములో నూనెను రక్షకుడు సత్యముతో, పరిశుద్ధాత్మతో పోల్చారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 45:57 చూడుము). ఈ విధంగా ఉపమానమును మీరు చదివినప్పుడు, మీరు ఏ అంతరార్థములను పొందుతారు?

చిత్రం
పదిమంది కన్యకలు

పదిమంది కన్యకల ఉపమానము, డాన్ బర్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:11–15, 66–71

సీయోను దేవుని పరిశుద్ధుల కొరకు రక్షిత ప్రదేశము.

మోర్మన్ గ్రంథములో (ఈథర్ 13:2–9 చూడండి) మరియు బైబిలు యొక్క జోసెఫ్ స్మిత్ ప్రేరేపిత సవరణలో (మోషే 7:62–64 చూడండి) వివరించబడినట్లుగా సీయోనును, నూతన యెరూషలేమును నిర్మించడానికి జోసెఫ్ స్మిత్ కాలంలోని పరిశుద్ధులు ఆతృతగా ఉన్నారు సిద్ధాంతము మరియు నిబంధనలు 45:11–15, 66–71 నుండి సీయోను—హనోకు కాలం నాటి ప్రాచీన పట్టణము మరియు కడవరి-దిన పట్టణము రెండింటి గురించి మీరేమి నేర్చుకుంటారు?

నేడు సీయోనును స్థాపించమనే ఆజ్ఞ మనము నివసించే చోట—ఆయన “నిత్య నిబంధన” (9వ వచనము) యొక్క రక్షణకు దేవుని పిల్లలు సమకూడే చోట దేవుని రాజ్యాన్ని స్థాపించడాన్ని సూచిస్తుంది. మీరున్నచోట సీయోనును నిర్మించడానికి సహాయపడేందుకు మీరేమి చేయగలరు?

సువార్త విషయములు, “Zion,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:3–5.ఒక న్యాయవాది మన కొరకు ఏమి చేస్తాడు? రక్షకుడు మన న్యాయవాది అని ఎందుకు పిలువబడతారనే దాని గురించి మాట్లాడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:9–10.సువార్త పట్ల మీ నిబద్ధతను చూపడానికి మీ కుటుంబము ఒక “ధ్వజము,” లేక జెండాను కలిగియున్నట్లయితే, అది ఎలా ఉంటుంది? కలిసి ఒక కుటుంబ జెండాను తయారు చేసి, ఇతరులు సువార్త నియమాలను అనుసరించడానికి మీరెలా సహాయపడగలరో చర్చించడం సరదాగా ఉండవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:32.ఏవి మన “పరిశుద్ధ స్థలములు”? “కదలక నిలిచియుండుట” అనగా అర్థమేమిటి? మన ఇంటిని ఒక పరిశుద్ధ స్థలముగా మనమెలా చేసుకోగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:39–44.రక్షకుని రెండవ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండడమంటే ఏమిటో కుటుంబ సభ్యులు గ్రహించేలా మీరెలా సహాయపడగలరు? మీరు ఊహిస్తున్న ఒక సంఘటన గురించి మీరు ఆలోచించి, ఆ సంఘటన కొరకు మీరు “కనిపెట్టుకొనియున్న” విధానాలను పంచుకోవచ్చు. లేదా మీరు కలిసి ఒక వంటకాన్ని వండవచ్చు మరియు అది తినడానికి సిద్ధమవుతున్నప్పుడు సూచనల కొరకు కనిపెట్టుకొనియుండవచ్చు. రక్షకుని రెండవ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండడానికి మనమేమి చేస్తున్నాము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 45:55.వెయ్యేళ్ళ పరిపాలన సమయంలో సాతాను ఏవిధంగా “బంధించబడతాడో” అర్థం చేసుకోవడానికి 1 నీఫై 22:26 మరియు ప్రకటన 20:1–3 చదవడం మీ కుటుంబానికి సహాయపడగలదు. మన జీవితాల్లో మనం సాతానును ఏవిధంగా బంధించగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “When He Comes Again,” Children’s Songbook, 82–83; “మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు” కూడా చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

అధ్యయన సహాయాలను ఉపయోగించండి.

చిత్రం
అవరోహణమగుచున్న క్రీస్తు

క్రీస్తు యొక్క రాకడ, జుబల్ అవిలెస్ సాయెంజ్ చేత

ముద్రించు