2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జులై 5–11. సిద్ధాంతము మరియు నిబంధనలు 76: “వారి బహుమానము గొప్పది, వారి మహిమ నిత్యము నిలుచును”


“జులై 5–11. సిద్ధాంతము మరియు నిబంధనలు 76: ‘వారి బహుమానము గొప్పది, వారి మహిమ నిత్యము నిలుచును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జులై 5–11. సిద్ధాంతము మరియు నిబంధనలు 76,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
అంతరిక్షంలో నక్షత్రమండలం

ఆశ్రయము, షేలిన్ ఏబెల్ చేత

జులై 5–11

సిద్ధాంతము మరియు నిబంధనలు 76

“వారి బహుమానము గొప్పది, వారి మహిమ నిత్యము నిలుచును”

76వ ప్రకరణములో, మనకు సత్యాన్ని బయల్పరచాలని ఆయన ఎంతగా కోరుకుంటున్నారో ప్రభువు వ్యక్తపరిచారు (7–10 వచనాలు చూడండి). మీరు తెలుసుకోవలసిన “దేవుని సంగతులను” (12వ వచనము) ఆయన మీకు బయల్పరచగలుగునట్లు మరియు బయల్పరచునట్లు లేఖనాలను విశ్వాసముతో చదవండి. “(మీరు) ఇంకను ఆత్మయందు ఉండగా” (28, 80, 113 వచనాలు) మీరు పొందు అంతరార్థములను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

“నేను మరణించిన తర్వాత నాకు ఏమి జరుగుతుంది?” దాదాపుగా లోకములోని ప్రతి మతము ఈ ప్రశ్నకు ఏదో ఒక విధంగా జవాబిస్తుంది. శతాబ్దాలుగా, బైబిలు బోధనలపై ఆధారపడి అనేక క్రైస్తవ సంప్రదాయాలు స్వర్గము, నరకముల గురించి మరియు నీతిమంతుల కొరకైన పరదైసు, దుష్టుల కొరకైన బాధ గురించి బోధించాయి. కానీ, మానవ కుటుంబమంతా నిజంగా మంచి చెడులలో ఖచ్చితంగా విభజించబడగలదా? నిజానికి పరలోకము అనే పదానికి అర్థమేమిటి? 1832 ఫిబ్రవరిలో, ఈ విషయము గురించి ఇంకా తెలుకోవలసినది ఏమీ లేదా అని జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లు ఆశ్చర్యపడ్డారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 76, ప్రకరణ శీర్షిక చూడండి).

తెలుసుకోవలసినది ఖచ్చితంగా ఉంది. ఈ విషయాలను ధ్యానించుచుండగా ప్రభువు “(వారి) మనోనేత్రములను తాకగా, అవి తెరువబడినవి” (19వ వచనము). జోసెఫ్ మరియు సిడ్నీలు ఎంత ఆశ్చర్యకరమైన, విస్తారమైన, ప్రకాశవంతమైన బయల్పాటు పొందిరనగా, పరిశుద్దులు నేరుగా దానిని “దర్శనము” అని పిలిచారు. అది పరలోకపు వాకిండ్లను తెరచి, దేవుని పిల్లలకు నిత్యత్వము యొక్క విస్తారమైన జ్ఞానమునిచ్చింది. చాలామంది ఇంతకు ముందు నమ్మిన దానికంటే పరలోకము చాలా ఘనమైనదని, విశాలమైనదని, అనేకమును కలిపియున్నదని ఆ దర్శనము బయల్పరిచింది. మనము గ్రహించగలిగిన దానికంటే దేవుడు ఎంతో దయామయుడు, న్యాయవంతుడు. మరియు దేవుని పిల్లలు మనము ఊహించగలిగిన దానికంటే ఎంతో మహిమకరమైన నిత్య గమ్యమును కలిగియున్నారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 76

దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ వస్తుంది.

76వ ప్రకరణములో వివరించబడిన దర్శనమును విల్ఫర్డ్ ఉడ్రఫ్ చదివినప్పుడు, “నా జీవితంలో మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ప్రభువును ప్రేమించాలని నేను భావించాను” అని ఆయన అన్నారు (ఈ సారాంశము చివరనున్న “పునఃస్థాపన స్వరములు” చూడండి). మీరు ఈ బయల్పాటును చదివినప్పుడు, మీకు ఇవే భావాలు కలిగియుండవచ్చు. ఏమైనప్పటికీ, 76వ ప్రకరణములో వివరించబడిన మహిమకరమైన దీవెనలలో ఏదీ రక్షకుడు లేకుండా సాధ్యపడదు. 76వ ప్రకరణములో ప్రభువైన యేసు క్రీస్తు గురించి చెప్పే ప్రతి వచనమును బహుశా మీరు గుర్తించవచ్చు. దేవుని ప్రణాళికలో ఆయన మరియు ఆయన పాత్ర గురించి ఈ వచనాలు మీకేమి బోధిస్తాయి? ఆయన గురించి మీరు భావించే విధానాన్ని అవి ఎలా ప్రభావితం చేస్తాయి? మీరు చదివి, ధ్యానిస్తున్నప్పుడు మీరు ఏవిధంగా “యేసును గూర్చి సాక్ష్యమును (పొందగలరు)” మరియు దానిలో మరింత “శూరులుగా” ఉండగలరు అనే దాని గురించి మీరు తలంపులు పొందవచ్చు (51, 79 వచనాలు).

సిద్ధాంతము మరియు నిబంధనలు 76:39–44, 50–112

“తన హస్తకృత్యములన్నింటిని” రక్షించాలని దేవుడు కోరుకొనును.

ప్రారంభ సంఘ సభ్యులతో కలిపి కొంతమంది 76వ ప్రకరణములోని దర్శనమును అడ్డుకున్నారు, ఎందుకనగా దాదాపు ప్రతిఒక్కరు రక్షించబడతారని మరియు ఏదో ఒక మహిమ క్రమమును పొందుతారని అది బోధించింది. కొంతవరకు వారి ఆక్షేపణలు, దేవుడు మరియు మనతో ఆయన సంబంధము గురించి తప్పుగా అర్థం చేసుకోవడం నుండి వచ్చియుండవచ్చు. మీరు ఈ బయల్పాటును చదివినప్పుడు, దేవుని స్వభావము మరియు తన పిల్లల కొరకు ఆయన ప్రణాళిక గురించి మీరేమి నేర్చుకుంటారు?

(భౌతిక మరియు ఆత్మీయ మరణము నుండి; 39, 43–44 వచనాలు చూడండి) రక్షింపబడడం మరియు ఉన్నతస్థానానికి చేరుకోవడం (దేవునితో జీవించడం మరియు ఆయన వలె కావడం; 50–70 వచనాలు చూడండి) మధ్య తేడాను పరిగణించండి.

యోహాను 3:16–17; సిద్ధాంతము మరియు నిబంధనలు 132:20–25 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 76:50–70, 92–95.

సిలెస్టియల్ రాజ్యములో నేను నిత్యజీవము పొందాలని నా పరలోక తండ్రి కోరుతున్నారు.

మీరు సిలెస్టియల్ రాజ్యము కొరకు అర్హులవుతారో లేదోనని మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా లేక ఆందోళన చెందారా? ఈ మహిమను పొందేవారి గురించిన వర్ణనను మీరు చదివినప్పుడు (50–70, 92–95 వచనాలు), మీరు చేయవలసిన విషయాల జాబితా కొరకు మాత్రమే చూడడానికి బదులుగా, ఆయన వలె కావడానికి మీకు సహాయపడేందుకు దేవుడు ఏమి చేసాడు మరియు ఏమి చేస్తున్నాడనే దాని కొరకు చూడండి. ఈ విధంగా దర్శనమును చదవడం, మీ వ్యక్తిగత ప్రయత్నాల గురించి మీ భావాలను ప్రభావితం చేస్తుందా?

సిలెస్టియల్ రాజ్యము గురించి ఈ వివరాలు తెలుసుకోవడమనే గొప్ప దీవెన గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. సిలెస్టియల్ మహిమ యొక్క ఈ దర్శనము, మీ అనుదిన జీవితాన్ని మీరు చూసే దృష్టిని మరియు మీరు జీవించాలని కోరే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

మోషే 1:39; జాయ్ డి. జోన్స్, “లెక్కకు మించిన విలువ,” ఎన్‌సైన్ లేక లియహోనా, నవ. 2017, 13–15.

చిత్రం
పంతొమ్మిదవ శతాబ్దపు ఇంటిలోని గది

జోసెఫ్ స్మిత్ ఈ గదిలోనే మహిమ క్రమముల దర్శనమును చూసారు.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 76:22–24, 50–52, 78–79, 81–82.మన సాక్ష్యముల ప్రాముఖ్యత గురించి ఈ వచనముల నుండి మనమేమి నేర్చుకుంటాము? మన నిత్య గమ్యములో మన సాక్ష్యములు ఏ పాత్ర పోషిస్తాయి? “యేసు సాక్ష్యమందు శూరులుగా ఎలా ఉండాలో” (79వ వచనము) చర్చించడానికి శూరుడు అనే పదానికి నిర్వచనాలను చూడడం సహాయకరంగా ఉండవచ్చు. యేసు క్రీస్తు గురించి సాక్ష్యము కలిగియుండడంపై మీరు ఒక పాట పాడవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 76:24.76వ ప్రకరణములోని సత్యాలు మరియు “I Am a Child of God” (Children’s Songbook, 2–3) లో బోధించబడిన వాటికి మధ్య సంబంధాలను మీ కుటుంబము గమనించవచ్చు; ఈ సత్యాలలో ఒకటి సిద్ధాంతము మరియు నిబంధనలు 76:24లో కనుగొనబడుతుంది. మనమందరము దేవుని పిల్లలము అని ప్రతిఒక్కరు గ్రహించినట్లయితే, ప్రపంచము భిన్నంగా ఎలా ఉండవచ్చు? మనము ఇతరులను ఆదరించే విధానాన్ని ఈ సత్యము ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ భూమిపై నున్న దేవుని యొక్క భిన్నమైన కుమారులు, కుమార్తెల చిత్రపటాలు చూడడం బహుశా ఈ ప్రశ్నను ధ్యానించడానికి మీ కుటుంబానికి సహాయపడగలదు.

కలిసి “I Am a Child of God” పాడడాన్ని మరియు 76వ ప్రకరణములో ఉన్న సూత్రాలకు ఇతర సంబంధాలను చూడడాన్ని పరిగణించండి (ఉదాహరణకు, 12, 62, 96 వచనాలు చూడండి).

సిద్ధాంతము మరియు నిబంధనలు 76:40–41.క్లుప్తమైన వార్తాపత్రిక ముఖ్యాంశముగా లేక ట్వీటుగా ఈ వచనాలలోని “సువర్తమానములు” (40వ వచనము) లేక మంచి వర్తమానములను మనము సంక్షిప్తపరచాలంటే, మనమేమి చెప్తాము? 76వ ప్రకరణములో మనము కనుగొను ఇతర సువర్తమానములేవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 76:50–70.సిలెస్టియల్ రాజ్యములో నిత్యజీవము కొరకు ఎదురు చూడడానికి మరియు సిద్ధపడడానికి మీ కుటుంబానికి మీరెలా సహాయపడతారు? సిద్ధాంతము మరియు నిబంధనలు 76:50–70లోని వాక్యభాగాలకు సంబంధించిన చిత్రాలు, లేఖనాలు మరియు ప్రవచనాత్మక బోధనలను కనుగొనడానికి మీరు కలిసి పనిచేయవచ్చు. తర్వాత, మీ నిత్య లక్ష్యాలను మీ కుటుంబానికి గుర్తుచేసేలా మీరు ఈ చిత్రాలు, లేఖనాలు మరియు బోధనలను ఒక పోస్టరుపై సమకూర్చవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “I Know That My Redeemer Lives,” Hymns, no. 136.

చిత్రం
పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

“దర్శనము” యొక్క సాక్ష్యములు

విల్ఫర్డ్ ఉడ్రఫ్

జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లు సిద్ధాంతము మరియు నిబంధనలు 76లో నమోదు చేయబడిన దర్శనమును పొందిన తర్వాత, దాదాపు రెండు సంవత్సరాలకు 1833 డిసెంబరులో విల్ఫర్డ్ ఉడ్రఫ్ సంఘములో చేరారు. ఆ సమయంలో ఆయన న్యూయార్క్‌లో నివసిస్తూ, ఆ ప్రాంతంలో సేవచేస్తున్న సువార్తికుల నుండి “దర్శనము” గురించి తెలుసుకున్నారు. చాలాకాలం తర్వాత ఈ బయల్పాటు గురించి ఆయన భావాలను ఆయనిలా చెప్పారు:

“నా చిన్నతనం నుండి ఒక స్వర్గము, ఒక నరకము ఉన్నదని నేను బోధించబడ్డాను మరియు దుష్టులందరికి ఒక శిక్ష, నీతిమంతులందరికి ఒక మహిమ ఉన్నదని చెప్పబడ్డాను. …

“… నేను దర్శనమును చదివినప్పుడు … , అది నా మనస్సును వెలిగించి, నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది, ఆ సూత్రాన్ని మనిషికి బయల్పరచిన దేవుడు వివేకవంతుడని, న్యాయవంతుడని, సత్యమని, మంచి సుగుణాలను, మంచి తెలివితేటలను మరియు జ్ఞానమును కలిగియున్నాడని నాకు అనిపించింది, ప్రేమ, కనికరము, న్యాయము మరియు తీర్పునందు ఆయన స్థిరముగా ఉన్నారని నేను భావించాను మరియు నా జీవితంలో మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ప్రభువును ప్రేమించాలని నేను భావించాను.”1

“‘దర్శనము‘ అనేది ఒక బయల్పాటు, అది మేము ఇంతకుముందు చదివిన పుస్తకాలన్నిటిలో ఉన్న బయల్పాటు కంటే అధిక జ్ఞానాన్ని, అధిక సత్యాన్ని మరియు అధిక సూత్రాన్ని ఇస్తుంది. అది మన ప్రస్తుత పరిస్థితిని, మనము ఎక్కడ నుండి వచ్చాము, మనము ఇక్కడ ఎందుకు ఉన్నాము మరియు మనము ఎక్కడికి వెళ్తున్నాము అని స్పష్టంగా గ్రహించడానికి మనకు సహాయపడుతుంది. ఆ బయల్పాటు ద్వారా ఏ వ్యక్తి అయినా తన పాత్ర ఏమిటో మరియు తన పరిస్థితి ఏమవుతుందో తెలుసుకోవచ్చు.”2

“జోసెఫ్‌ను చూడడానికి ముందు నేను ఇలా చెప్పాను, ఆయన ఎంత పెద్దవాడు లేక ఎంత చిన్నవాడు అనేది నాకు అనవసరము; ఆయన చూడడానికి ఎలా ఉంటాడు—ఆయన జుట్టు పొడవుగా ఉంటుందా లేక పొట్టిగా ఉంటుందా అనేది నాకు అనవసరము; ఆ బయల్పాటును ముందుకు తెచ్చిన మనిషి దేవుని యొక్క ప్రవక్త. అది నాకై నేను ఎరుగుదును.”3

ఫీబి క్రాస్బి పెక్

“దర్శనము” గురించి జోసెఫ్ మరియు సిడ్నీలు బోధించడం వినినప్పుడు ఫీబి పెక్ మిస్సోరిలో నివసిస్తోంది మరియు ఒంటరి తల్లిగా ఐదుగురు పిల్లలను పెంచుతోంది. దర్శనము ఎంతగా ఆమె మనస్సులో నాటుకొని ప్రేరేపించినదనగా, ఆమె నేర్చుకున్న దానిని తన కుటుంబంతో పంచుకోవడానికి ఆమె క్రింది విధంగా వ్రాసింది:

“ప్రభువు పరలోక రాజ్యపు మర్మములను తన పిల్లలకు బయల్పరుస్తున్నాడు. … గత వసంతకాలంలో జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లు మమ్మల్ని దర్శించారు, వారు ఇక్కడ ఉన్నప్పుడు మేము అనేక ఆనందకరమైన సమావేశాలు కలిగియున్నాము మరియు మా దృష్టి యందు దేవుని మర్మములు విశదము చేయబడ్డాయి, అది నాకు గొప్ప ఓదార్పునిచ్చింది. ఆయన పిల్లల కొరకు శాంతి నివాసాలను సిద్ధం చేయడంలో దేవుని నమ్రతను మేము చూడగలిగాము. ఎవరైతే సువార్త యొక్క సంపూర్ణతను పొందక, క్రీస్తు యొక్క హేతువులో శూరులైన సైనికులుగా నిలబడకయుందురో, వారు తండ్రి మరియు కుమారుని సన్నిధిలో నివసించలేరు. దానిని పొందని వారందరి కొరకు ఒక స్థలము సిద్ధపరచబడినది, కానీ సిలెస్టియల్ రాజ్యములో నివసించడం కంటే చాలా తక్కువ మహిమ గల ప్రదేశమది. ఈ విషయాల గురించి ఇంకా చెప్పడానికి నేను ప్రయత్నించకూడదు, ఎందుకంటే అవి ఇప్పుడు ముద్రించబడి, లోకంలోకి వెళ్ళబోతున్నాయి. బహుశా మీకై మీరు చదివే అవకాశాన్ని మీరు కలిగియుంటారు మరియు ఒకవేళ మీరు చదివినట్లయితే, శ్రద్ధగల ప్రార్థనాపూర్వక హృదయంతో మీరు చదువుతారని నేనాశిస్తున్నాను, ఎందుకంటే ఈ విషయాలు గమనించ యోగ్యమైనవి. వాటిని మీరు చదివి, ధ్యానించాలని నేను కోరుతున్నాను, ఎందుకంటే ఈ లోకంలో మరియు రాబోయే లోకంలో మన సంతోషానికి దారితీసేవి అవే.”4

వివరణలు

  1. Remarks,” Deseret News, May 27, 1857, 91.

  2. Deseret News, Aug. 3, 1881, 481; see also Teachings of Presidents of the Church: Wilford Woodruff (2004), 120–21.

  3. “Remarks,” Deseret Weekly, Sept. 5, 1891, 322.

  4. అన్నా జోన్స్ ప్రాట్‌కు ఫీబి క్రాస్బి పెక్ ఉత్తరం, ఆగష్టు 10, 1832, సంఘ చరిత్ర గ్రంథాలయము, సాల్ట్ లేక్ సిటీ; అక్షరక్రమము మరియు విరామచిహ్నాలు ఆధునికీకరించబడ్డాయి.

చిత్రం
మూడు మహిమ రాజ్యముల వర్ణన

మహిమ క్రమములు, ఆన్నీ హెన్రీ నాడెర్ చేత

ముద్రించు