2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
జూలై 19–25. సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83: ఎక్కడ “ఎక్కువగా ఇయ్యబడెనో, అక్కడ ఎక్కువగా కోరబడును”


“జూలై 19–25. సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83: ఎక్కడ ‘ఎక్కువగా ఇయ్యబడెనో, అక్కడ ఎక్కువగా కోరబడును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“జూలై 19–25. సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

క్రీస్తు మరియు ధనవంతుడైన యౌవన అధికారి

క్రీస్తు మరియు ధనవంతుడైన యౌవన అధికారి, హీన్రిచ్ హాఫ్‌మన్ చేత

జూలై 19–25

సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83

ఎక్కడ “ఎక్కువగా ఇయ్యబడెనో, అక్కడ ఎక్కువగా కోరబడును”

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 81–83 చదువుతున్నప్పుడు, మీ కుటుంబము, మీ స్నేహితులు మరియు ఇతరుల మధ్య మంచి చేయడానికి మీకు సహాయపడగల సూత్రాలను వ్రాసియుంచండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

1832 మార్చిలో, ఉన్నత యాజకత్వ ము యొక్క అధ్యక్షత్వములో (ఇప్పుడు ప్రథమ అధ్యక్షత్వము అని పిలువబడుతుంది) జోసెఫ్ స్మిత్‌కు సలహాదారునిగా ఉండేందుకు ప్రభువు జెస్సీ గాస్‌ను పిలిచారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 81 జెస్సీ గాస్‌కు అతని క్రొత్త పిలుపులో సూచనలిస్తూ, విశ్వాసంతో సేవచేసినందుకు అతనికి దీవెనలు వాగ్దానమిస్తూ ఇవ్వబడిన బయల్పాటు, కానీ, జెస్సీ గాస్ విశ్వాసంతో సేవ చేయలేదు. కావున అతని స్థానములో ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ పిలువబడ్డారు మరియు సహోదరుడు గాస్ పేరుకు బదులు బయల్పాటులో సహోదరుడు విలియమ్స్ పేరు చేర్చబడింది.

అది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ అది ప్రముఖ సత్యాన్ని సూచిస్తుంది: సిద్ధాంతము మరియు నిబంధనలులోని బయల్పాటులలో అధికము నిర్దిష్టమైన జనులకు ఉద్దేశించబడినవి, కానీ వాటిని మనకు అన్వయించుకోవడానికి మనము ఎల్లప్పుడూ మార్గాలను వెదకగలము (1 నీఫై 19:23 చూడండి). “సడలిన మోకాళ్ళను బలపరచుము” అని ప్రభువు ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్‌కు ఇచ్చిన ఉపదేశము, మనము బలపరచవలసిన జనుల వైపు మన మనస్సులను త్రిప్పగలదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5). సంఘము యొక్క ఐహిక అవసరాలను తీర్చడానికి “ఈ నిబంధన ద్వారా మిమ్మల్ని మీరు బద్ధులుగా చేసుకొనుము,” అని ప్రభువు ఐక్య సంస్థ యొక్క సభ్యులకు ఇచ్చిన ఉపదేశము మన మనస్సులను మన స్వంత నిబంధనల వైపు త్రిప్పగలదు. మరియు “నేను సెలవిచ్చునది మీరు చేసిన యెడల, నేను బద్ధుడనైయుందును” అని ప్రభువు చేసిన వాగ్దానము, మనము లోబడినప్పుడు ఆయన మనకిచ్చిన వాగ్దానాలను మనకు గుర్తు చేయగలదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 82:10, 15). అది ఆవిధముగానే ఉండవలెను, ఎందుకనగా “నేను ఒకనితో చెప్పునది, అందరితోను చెప్పుచున్నాను” అని కూడా ప్రభువు ప్రకటించారు (5వ వచనము).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 81

ప్రభువు నా నుండి కోరినదానిని చేయడంలో నేను విశ్వాసంగా ఉండగలను.

మీ జీవితంలోని ముఖ్యమైన బాధ్యతలను మీరెలా నిర్వర్తించగలరని మీరు కొన్నిసార్లు ఆశ్చర్యపడతారా? ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు సలహాదారునిగా ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ నిశ్చయముగా అనేక ముఖ్యమైన బాధ్యతలను కలిగియున్నారు. వాటిని ఎలా నెరవేర్చాలనే దాని గురించి 81వ ప్రకరణములో ప్రభువు ఆయనకు ఉపదేశమిచ్చారు. ప్రభువు చేత మీకివ్వబడిన బాధ్యతలను నెరవేర్చడానికి మీకు సహాయపడేలా ఈ ప్రకరణములో మీరేమి కనుగొంటారు?

5వ వచనమును ధ్యానించడానికి మీకు సహాయపడేందుకు ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి:

  • ఒక వ్యక్తి “బలహీనుడు” కాగల కొన్ని విధానాలేవి? బలహీనులను “పోషించుము” అనగా అర్థమేమిటి?

  • ఉపమానరీతిలో ఒక వ్యక్తి చేతులు “వడలునట్లు” ఏది చేయగలదు? ఆ చేతులను మనమెలా “పైకెత్తగలము”?

  • “సడలిన మోకాళ్ళు” అనే వాక్యభాగానికి అర్థము ఏమైయుండవచ్చు? సడలిన మోకాళ్ళు గలవారిని మనమెలా “బలపరచగలము”?

ఈ వచనమును చదవడం బహుశా మీరు “పోషించగల,” “పైకెత్తగల” లేక “బలపరచగల” ఒకరిని మీకు గుర్తు చేసియుండవచ్చు. ఆ వ్యక్తికి పరిచర్య చేయడానికి మీరేమి చేస్తారు?

సిడ్నీ రిగ్డన్, జోసెఫ్ స్మిత్, ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్

ప్రథమ అధ్యక్షత్వము: సిడ్నీ రిగ్డన్, జోసెఫ్ స్మిత్, ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:1–7

పశ్చాత్తాపపడి, నా పాపములను విడిచిపెట్టమని ప్రభువు నన్ను ఆహ్వానిస్తారు.

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 82:1–7 చదివినప్పుడు, మీరు నేర్చుకొనే విషయాలను రెండు జాబితాలుగా తయారు చేయడం గురించి ఆలోచించండి: పాపము గురించి హెచ్చరికలు మరియు క్షమాపణ గురించి సత్యాలు. విరోధి యొక్క శోధనలను ఎదుర్కోవడానికి ఈ సత్యాలు మీకెలా సహాయపడగలవు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:8–10

ఆజ్ఞలు నా రక్షణ మరియు భద్రత కొరకైనవి.

ఎందుకు ప్రభువు ఇన్ని ఆజ్ఞలనిస్తారని మీరు లేక మీకు తెలిసిన వారెవరైనా ఎప్పుడైనా ఆశ్చర్యపడితే, సిద్ధాంతము మరియు నిబంధనలు 82:8–10 సహాయపడగలదు. మీరు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి ఎందుకు ఎంచుకున్నారని ఎవరికైనా వివరించడానికి ఈ వచనాలలోని ఏ అంతరార్థములు మీకు సహాయపడగలవు? ఆయన ఆజ్ఞలు మీ జీవితాన్ని ఎలా మార్చాయో అనేదానిని కూడా మీరు పరిగణించవచ్చు. మీరు 10వ వచనము చదివినప్పుడు, ప్రభువు గురించి మీరేమి నేర్చుకున్నారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 130:20–21 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 83

“విధవరాండ్రు, దిక్కులేని పిల్లలు ఆదరించబడవలెను.”

1832 ఏప్రిల్‌లో, మిస్సోరిలో సమకూడిన పరిశుద్ధులను దర్శించడానికి ప్రభువు చేత సూచించబడినట్లుగా జోసెఫ్ స్మిత్ దాదాపు 800 మైళ్ళు ప్రయాణించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:9 చూడండి). ఆయన దర్శించిన ఒక సమాజంలో ఒంటరిగా తమ పిల్లలను పెంచుతున్న విధవరాండ్రు ఉన్నారు. వారిలో ప్రవక్త వ్యక్తిగతంగా యెరిగియున్న ఫీబి పెక్ మరియు అన్నా రోగర్స్ ఉన్నారు. 1830లలో, మిస్సోరిలోని రాష్ట్ర చట్టాలు, మరణించిన తమ భర్త ఆస్తిపై విధవరాండ్రకు పరిమిత హక్కులను ఇచ్చాయి. విధవరాండ్రు, దిక్కులేని పిల్లల గురించి ప్రభువు ఎలా భావిస్తారనే దాని గురించి 83వ ప్రకరణము నుండి మీరేమి నేర్చుకుంటారు? ఈ పరిస్థితిలో మీ ప్రేమ లేక శ్రద్ధ మూలముగా లాభము పొందే వారెవరైనా మీకు తెలుసా?

యెషయా 1:17; యాకోబు 1:27 కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 81:3.మీరు మీ కుటుంబ సభ్యులకు కాగితపు హృదయాలను ఇచ్చి, వారు ప్రార్థించదలచినది ఏదైనా గీయమని లేక వ్రాయమని వారిని ఆహ్వానించవచ్చు. “ఎల్లప్పుడూ కంఠధ్వనితో మరియు నీ హృదయములో” ప్రార్థించడమనగా అర్థమేమిటనే దాని గురించి మాట్లాడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 81:5.ఈ వచనములోని సూత్రముల గురించి నేర్చుకోవడానికి, వారు “బలహీనంగా” లేక “సడలినట్లు” భావించినప్పటివి మరియు ఎవరైనా వారిని పోషించిన లేక బలపరచినప్పటి ఉదాహరణలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. సులువైన విధానాలలో మీ కుటుంబము క్రమముగా ఒకరికొకరు ఎలా సేవ చేయగలరో చర్చించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:8–10.బహుశా ఒక సులువైన ఆట, దేవుని ఆజ్ఞల కొరకు మీ కుటుంబము కృతజ్ఞతను భావించేలా సహాయపడుతుంది. కళ్ళకు గంతలు కట్టుకున్న కుటుంబ సభ్యునికి శాండ్‌విచ్ తయారు చేయడానిక లేక అడ్డంకులు గల మార్గం గుండా వెళ్ళడానికి ఒక కుటుంబ సభ్యుడు సూచనలివ్వవచ్చు. ఆహ్లాదకరమైనది మరియు సృజనాత్మకమైనది ఏదైనా ఆలోచించండి. తర్వాత, దేవుని ఆజ్ఞలు ఈ ఆటలోని సూచనల వలె ఎట్లున్నాయో చర్చించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 82:18–19.“అతని (లేక ఆమె) ప్రతిభను వృద్ధి చేసుకోవడానికి” మరియు “ఇతర ప్రతిభలను ఆర్జించడానికి” ప్రతి కుటుంబ సభ్యుడు ఏమి చేయగలడు? కుటుంబ ప్రతిభల ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆహ్లాదకరంగా ఉండవచ్చు. సులువుగా ప్రదర్శించబడని ప్రతిభలను (ఆత్మీయ బహుమానముల వంటివి; సిద్ధాంతము మరియు నిబంధనలు 46:11–26 చూడండి) చేర్చు విధానాల గురించి ఆలోచించండి. మన కుటుంబమును మరియు పొరుగువారిని దీవించడానికి ఎలా మనము మన ప్రతిభలను ఉపయోగించి, మనకున్న వాటిని పంచుకోగలము? “దేవుని మహిమయే లక్ష్యముగా ఉండుటతో పాటు” మన ప్రతిభలను ఉపయోగించడమనగా అర్థమేమిటి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “Have I Done Any Good?Hymns, no. 223; “మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు” కూడా చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

చర్యకు దారితీసే ప్రశ్నలు అడగండి. సువార్తను మరింత సంపూర్ణంగా వారెలా జీవించగలరనే దానిపై ప్రతిబింబించేందుకు మీ కుటుంబ సభ్యులను ప్రేరేపించే ప్రశ్నల గురించి ఆలోచించండి. “సాధారణంగా ఇవి చర్చించే ప్రశ్నలు కావు; అవి వ్యక్తిగతంగా ఆలోచించవలసినవి” (Teaching in the Savior’s Way, 31).

ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్న యేసు

ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్న యేసు యొక్క వివరణ, డాన్ బర్ చేత