2023 క్రొత్త నిబంధన
ఫిబ్రవరి 6-12. యోహాను 2–4: “మీరు క్రొత్తగా జన్మించవలెను”


“ఫిబ్రవరి 6-12. యోహాను 2–4: ‘మీరు క్రొత్తగా జన్మించవలెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“ఫిబ్రవరి 6-12. యోహాను 2-4,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
నీకొదేముతో మాట్లాడుతున్న యేసు

ఫిబ్రవరి 6-12

యోహాను 2–4

“మీరు క్రొత్తగా జన్మించవలెను”

మీరు యోహాను 2–4 చదువుతున్నప్పుడు, మీ స్వంత పరివర్తన గురించిన విషయాలను ఆత్మ మీకు బోధించును. ఆయన ప్రేరణలను వ్రాయండి. ఈ సారాంశములోని అధ్యయన ఉపాయాల నుండి మీరు అదనపు ఆత్మీయ అంతరార్థములను కనుగొనవచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

కానాలో జరిగిన వివాహ విందులో, క్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చెను—ఈ సంఘటనను యోహాను “మొదటి సూచకక్రియ” (యోహాను 2:11) అని పిలిచెను. ఒకటి కంటే ఎక్కువ విధాలుగా ఇది సత్యము. ఇది యేసు బహిరంగంగా చేసిన మొదటి అద్భుతం అయినప్పటికీ, ఇది మరొక అద్భుత ప్రారంభాన్ని—అనగా మనం మరింతగా మన రక్షకునివలె శాశ్వతంగా మారినప్పుడు మన హృదయాలు రూపాంతరం చెందుతున్న ప్రక్రియకు ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. జీవితకాలపు ఈ అద్భుతం యేసు క్రీస్తును అనుసరించి, ఆయన ద్వారా మార్పుచెంది, మంచి జీవితాన్ని జీవించాలనే నిర్ణయంతో ప్రారంభమవుతుంది. ఈ అద్భుతం ఎంతగా జీవితాన్ని మార్చగలదంటే, “క్రొత్తగా జన్మించడం” అనేది దానిని వివరించడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి (యోహాను3: 7). కానీ మరలా జన్మించడం అనేది శిష్యత్వ మార్గానికి ప్రారంభం మాత్రమే. మనం ఈ మార్గంలో కొనసాగితే, చివరికి సువార్త “నిత్యజీవమునకై” మనలో “ఊరెడి నీటి బుగ్గగా ఉండునని” (యోహాను 4:14) బావి వద్ద ఉన్న సమరయ స్త్రీకి క్రీస్తు చెప్పిన మాటలు మనకు గుర్తుచేస్తాయి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యోహాను 2:1–11

యేసు క్రీస్తు యొక్క అద్భుతాలు “ఆయన మహిమను ప్రత్యక్షపరిచాయి.”

యోహాను 2:1–11లో రక్షకుడు నీటిని ద్రాక్షారసముగా మార్చిన దానిని గూర్చి మీరు చదివినప్పుడు, అక్కడున్న మరియ, శిష్యులు మరియు ఇతరులతో పాటు వివిధ వ్యక్తుల దృక్పథాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీరు అదనపు అంతరార్థాలను పొందవచ్చు. ఇక్కడ వివరించబడిన సంఘటనలను మీరు చూసినట్లయితే, యేసు గురించి మీ మనోభావాలు ఏమైయుండవచ్చు? ఆయన గురించి ఈ అద్భుతం మీకేమి బోధిస్తుంది?

యోహాను 3:1-21

దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నేను క్రొత్తగా జన్మించాలి.

నీకొదేము రహస్యంగా యేసు వద్దకు వచ్చినప్పుడు, అతడు జాగ్రత్తగల పరిశీలకుడు. అయితే, తరువాత అతడు యేసును బహిరంగంగా సమర్థించాడు (యోహాను 7:45–52 చూడండి) మరియు రక్షకుని సమాధి వద్ద విశ్వాసులతో చేరాడు (యోహాను 19:38-40 చూడండి). యోహాను 3:1–21లో నీకొదేము యేసును అనుసరించి, క్రొత్తగా జన్మించడానికి ప్రేరేపించబడునట్లు ఏ బోధనలను మీరు కనుగొంటారు?

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఇలా బోధించారు, “క్రొత్తగా జన్మించడం అనేది దేవుని ఆత్మ చేత విధుల ద్వారా వస్తుంది” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 95). మీరు క్రొత్తగా జన్మించడంలో మీ బాప్తిస్మము మరియు నిర్ధారణ—“నీటి మూలముగా మరియు ఆత్మ మూలముగా జన్మించడం” (యోహాను 3:5)—ఏ పాత్రను పోషించాయి? ఈ మార్పు ప్రక్రియను కొనసాగించడానికి మీరు ఏమి చేస్తున్నారు? (అల్మా 5:11–14 చూడండి).

మోషైయ 5:7; 27:25–26 కూడా చూడండి;

యోహాను 3:16–17

పరలోక తండ్రి యేసు క్రీస్తు ద్వారా నాపై తన ప్రేమను చూపిస్తారు.

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలెండ్ ఇలా బోధించారు, “నిత్యత్వమంతటిలో మొదటి గొప్ప సత్యం ఏదనగా, దేవుడు మనల్ని ఆయన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో ప్రేమిస్తున్నారు” (“Tomorrow the Lord Will Do Wonders among You,” Liahona, May 2016, 127). తన కుమారుని యొక్క బహుమానము ద్వారా దేవుని ప్రేమను మీరు ఎలా అనుభవించారు?

సంస్కారము దేవుని ప్రేమపై మరియు ఆయన కుమారుని యొక్క బహుమానముపై ప్రతిబింబించే సమయాన్ని అందిస్తుంది. సంస్కారమును మరింత అర్థవంతముగా చేయడానికి మీరు ఏమి చేయగలరు?

రక్షకుని బోధనలను మరియు పరిచర్యను మీరు చదువుట కొనసాగించినప్పుడు, మీరు చదివే విషయాలు దేవుని ప్రేమను అర్థం చేసుకొని, అనుభవించడానికి మీకెలా సహాయపడతాయని మిమ్మల్ని మీరు అడగండి.

యోహాను 4:24

దేవుడు ఒక ఆత్మయా?

దేవుడు ఒక ఆత్మయని యేసు చేసిన ప్రకటనతో కొందరు అయోమయంలో పడవచ్చు. ఈ వచనం యొక్క జోసెఫ్ స్మిత్ అనువాదం ఒక ముఖ్యమైన వివరణను ఇస్తుంది: “అలాంటివారికి దేవుడు తన ఆత్మను వాగ్దానం చేసెను” (యోహాను 4:24, పాదవివరణ లో). దేవుడు మాంసం మరియు ఎముకలు గల శరీరాన్ని కలిగియున్నారని ఆధునిక బయల్పాటు బోధిస్తుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22–23 చూడండి; ఆదికాండము 5:1–3 ; హెబ్రీయులకు 1:1–3 కూడా చూడండి).

యోహాను 4:5-26

క్రీస్తు తన జీవజలాన్ని నాకు అందిస్తారు.

తానిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు అని సమరయ స్త్రీకి చెప్పినప్పుడు యేసు ఉద్దేశ్యం ఏమిటి? సువార్త ఏవిధంగా జీవజలము వంటిది?

చిత్రం
నీటి ప్రవాహం

క్రీస్తు సువార్త మన ఆత్మలను పోషించే జీవజలము.

సమరయ స్త్రీకి రక్షకుడు ఇచ్చిన సందేశాలలో ఒకటి ఏదనగా, మనం ఎక్కడ ఆరాధిస్తాము అనేదానికంటే ఎలా ఆరాధిస్తాము అన్నదే ముఖ్యము (యోహాను 4:21–24 చూడండి). “తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి” మీరు ఏమి చేస్తున్నారు? (యోహాను 4:23).

లేఖన దీపిక, “ఆరాధన,” scriptures.ChurchofJesusChrist.org కూడా చూడండి;

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యోహాను 2–4.మీ కుటుంబం ఈ వారం ఈ అధ్యాయాలను చదువుతున్నప్పుడు, రక్షకుడు రోజువారీ విషయాలను—పుట్టుక, గాలి, నీరు మరియు ఆహారం—ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి ఎలా ఉపయోగించారనే దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి మీరు మీ ఇంటిలోని ఏ వస్తువులను ఉపయోగించగలరు?

యోహాను 2:13-17.మీ గృహము—దేవాలయం వలె పవిత్రమైన ప్రదేశం కావాలంటే మీ కుటుంబం వేటిని దాని నుండి దూరంగా ఉంచడం అవసరం? ఆ విషయాలను బయట ఉంచడానికి మీరు ఏమి చేస్తారు?

యోహాను 3:1-6.గర్భం మరియు పుట్టుక—జీవముగల, తెలివైన జీవిని సృష్టించే ప్రక్రియ యొక్క అద్భుతం గురించి మీ కుటుంబంతో మాట్లాడండి. దేవుని రాజ్యంలోకి ప్రవేశించే ముందు మనం తిరిగి జన్మించాలని యేసు బోధించారు. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించకముందు మనకు అవసరమైన మార్పుకు తిరిగి జన్మించడం మంచి రూపకం ఎలా అవుతుంది? ఆత్మీయంగా తిరిగి జన్మించే ప్రక్రియను మనం ఎలా అనుభవించగలము?

యోహాను 3:16-17.ఈ వచనాలను వారి మాటల్లో ఒక స్నేహితుడికి వివరించినట్లుగా తిరిగి చెప్పమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. దేవుని ప్రేమను అనుభవించడానికి యేసు క్రీస్తు మనకెలా సహాయం చేసారు?

యోహాను 4:5-15.తన సువార్తను జీవజలముతో పోల్చినప్పుడు రక్షకుడు మనకు ఏమి బోధిస్తున్నారు? బహుశా మీ కుటుంబము ప్రవహిస్తున్న నీటిని చూసి, నీటి లక్షణాలను వర్ణించవచ్చు. ప్రతిరోజూ మనం ఎందుకు నీరు త్రాగాలి? యేసు క్రీస్తు యొక్క సువార్త ఏ విధాలుగా “నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గ” వలె ఉన్నది? (యోహాను 4:14).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

చిహ్నాల కోసం చూడండి. ఆధ్యాత్మిక సత్యాలను సూచించడానికి లేఖనాలు తరచుగా వస్తువులు, సంఘటనలు లేదా చర్యలను ఉపయోగిస్తాయి. ఈ చిహ్నాలు బోధించబడుతున్న సిద్ధాంతంపై మీ అవగాహనను మెరుగుపరచగలవు. ఉదాహరణకు, రక్షకుడు పరివర్తనను తిరిగి జన్మించడంతో పోల్చారు.

చిత్రం
బావి వద్ద యేసు మరియు సమరయ స్త్రీ

జీవ జలము, సైమన్ డ్యూయీ చేత

ముద్రించు