2023 క్రొత్త నిబంధన
మార్చి 6-12. మత్తయి 9-10; మార్కు 5; లూకా 9: “యేసు ఆ పండ్రెండుమందిని పంపెను”


“మార్చి 6-12. మత్తయి 9-10; మార్కు 5; లూకా 9: ‘యేసు ఆ పండ్రెండుమందిని పంపెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మార్చి 6-12. మత్తయి 9-10; మార్కు 5; లూకా 9,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
పేతురును నియమించుచున్న యేసు

మార్చి 6-12

మత్తయి 9-10; మార్కు 5; లూకా 9

“యేసు ఆ పండ్రెండుమందిని పంపెను”

ఈ సారాంశములోని అధ్యయన ఉపాయములు లేఖనములలో వ్యక్తిగత అర్థాన్ని కనుగొనడానికి మీకు సహాయపడగలవు. అయితే, ఏ వాక్యభాగాలను చదవాలి లేదా వాటిని ఎలా అధ్యయనం చేయాలి అనే దాని గురించి మీరు పొందే వ్యక్తిగత బయల్పాటుకు బదులుగా అవి ఉంచబడరాదు.

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు స్వస్థపరిచే అద్భుతాల సమాచారం త్వరగా వ్యాపిస్తోంది. వారి అనారోగ్యాల నుండి ఉపశమనం పొందాలనే ఆశతో చాలా మంది ఆయనను అనుసరించారు. కానీ రక్షకుడు జనసమూహాన్ని చూసినప్పుడు, వారి శారీరక రుగ్మతల కంటే ఎక్కువ చూసారు. వారు “కాపరిలేని గొఱ్ఱెల వలె” ఉన్నందున కనికరపడ్డారు(మత్తయి 9:36). “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు,” అని ఆయన గమనించారు (మత్తయి 9:37). అందువల్ల ఆయన పన్నెండు మంది అపొస్తలులను పిలిచి, “వారికి అధికారమిచ్చారు” మరియు “ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకు” బోధించడానికి, సేవ చేయడానికి వారిని పంపారు (మత్తయి 10: 1, 6). నేడు పరలోక తండ్రి యొక్క పిల్లలకు సేవ చేయడానికి ఎక్కువ మంది పనివారు కావలసిన అవసరం అంతే గొప్పది. ఇప్పుడు కూడా పన్నెండుమంది అపొస్తలులే ఉన్నారు, కానీ గతంలో కంటే ఎక్కువమంది యేసు క్రీస్తు శిష్యులు—“పరలోకరాజ్యము సమీపించి యున్నది” ( మత్తయి 10: 7 ) అని ప్రపంచమంతా ప్రకటించగల జనులు ఉన్నారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 9:18-26; మార్కు 5:22-43

“భయపడకుము, నమ్మిక మాత్రముంచుము.”

“చావనై యున్న” తన కుమార్తెను బాగుచేయమని మొదటిసారి యాయీరు యేసును అడిగినప్పుడు, యాయీరు కంగారుగానే, కానీ ఆశావహంగా మాట్లాడాడు: “అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచుము” (మార్కు5:23). అయితే వారు వెళ్ళినప్పుడు, చాలా ఆలస్యమైనదని ఒక సందేశకుడు యాయీరుతో చెప్పాడు: “నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు?” (35వ వచనము). అదేవిధంగా, మార్కు 5:25–34లో వర్ణించబడిన ఒక స్త్రీకి కూడా చాలా ఆలస్యమైనట్లు అనిపించియుండవచ్చు, ఆమె పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగముతో బాధపడుచుండెను.

మీరు ఈ వృత్తాంతాలను చదువుతున్నప్పుడు, “చావనైయున్నట్లు” లేదా బాగుపడేందుకు చాలా ఆలస్యమైనట్లు అనిపించిన విషయాలతో కలిపి—మీ జీవితంలో లేదా మీ కుటుంబంలో స్వస్థత అవసరమైన విషయాల గురించి మీరు ఆలోచించవచ్చు. ఈ వృత్తాంతాలలో విశ్వాసపు వ్యక్తీకరణల గూర్చి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేది ఏమిటి? ఆ స్త్రీతో మరియు యాయీరుతో యేసు చెప్పినదానిని కూడా గమనించండి. ఆయన మీకేమి చెప్తున్నట్లుగా మీరు భావించారు?

లూకా 8:41–56; రస్సెల్ ఎమ్. నెల్సన్, “మన జీవితాలలోనికి యేసు క్రీస్తు యొక్క శక్తిని పొందుట,” లియహోనా, మే 2017, 39–42 కూడా చూడండి.

చిత్రం
యేసు అంగీని తాకుటకు సమీపిస్తున్న స్త్రీ

ప్రభువు నందు నమ్మకముంచుము, లిజ్ లెమన్ స్విండిల్ చేత

మత్తయి 10; లూకా 9:1-6

ప్రభువు తన కార్యాన్ని చేయడానికి తన సేవకులకు శక్తిని ఇస్తారు.

మత్తయి 10 లో యేసు తన అపొస్తలులకు ఇచ్చిన సూచనలు మనకు కూడా వర్తిస్తాయి, ఎందుకంటే ప్రభువు కార్యములో మనందరికి భాగముంది. తమ నియమిత కార్యాన్ని నెరవేర్చడానికి వారికి సహాయపడేందుకు క్రీస్తు తన అపొస్తలులకు ఏ శక్తిని ఇచ్చారు? మీరు చేయాలని పిలువబడిన పనిలో మీరు ఆయన శక్తిని ఎలా పొందగలరు? (2 కొరింథీయులు 6:1–10 ; సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–46 చూడండి).

క్రీస్తు తన అపొస్తలులకు ఇచ్చిన ఆజ్ఞను మీరు చదువుతున్నప్పుడు, మీరు చేయాలని ప్రభువు కోరిన పని గురించి మీరు ప్రేరణలు పొందవచ్చు. క్రింది వంటి పట్టిక మీ ఆలోచనలను క్రమములో పెట్టుటకు మీకు సహాయపడుతుంది:

మత్తయి 10

నేను పొందు మనోభావాలు

రక్షకుడు తన శిష్యులకు శక్తినిచ్చారు.

నా పని చేయడానికి నాకు అవసరమైన శక్తిని దేవుడు నాకిస్తారు.

మార్కు 6:7–13; విశ్వాస ప్రమాణాలు 1:6; లేఖన దీపిక, “అపొస్తలుడు” కూడా చూడండి.

మత్తయి 10:17–20

నేను ప్రభువు సేవలో ఉన్నప్పుడు, ఏమి చెప్పాలనే దాని గురించి ఆయన నన్ను ప్రేరేపిస్తారు.

నేడు శిష్యులు అనుభవించే విధంగా—తన శిష్యులు హింసించబడతారని మరియు వారి విశ్వాసం గురించి ప్రశ్నించబడతారని ప్రభువు ముందే చూసారు. కానీ వారు ఏమి చెప్పాలో ఆత్మ ద్వారా తెలుసుకుంటారని ఆయన శిష్యులకు వాగ్దానం చేసారు. బహుశా మీరు మీ సాక్ష్యం చెప్పినప్పుడు, దీవెన ఇచ్చినప్పుడు లేదా ఒకరితో సంభాషించినప్పుడు మీ జీవితంలో ఈ దైవిక వాగ్దానం నెరవేరిన అనుభవాలు మీకు ఉన్నాయా? మీ అనుభవాలను ప్రియమైనవారితో పంచుకోవడం లేదా వాటిని దినచర్య పుస్తకంలో నమోదు చేయడాన్ని పరిగణించండి. మరింత తరచుగా అటువంటి అనుభవాలను కలిగియుండేందుకు మీరేమి చేయాలని ప్రేరేపించబడినట్లు మీరు భావిస్తున్నారు?

లూకా 12:11–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:85 కూడా చూడండి.

మత్తయి 10:34–39

“ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు” అన్న యేసు మాటకు అర్థం ఏమిటి?

ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ ఇలా బోధించారు: “మీరు యేసు క్రీస్తు సువార్తను అంగీకరించి, ఆయన నిబంధనలో ప్రవేశించినప్పుడు మీలో చాలామంది తండ్రి మరియు తల్లి, సహోదరులు మరియు సహోదరీల చేత తిరస్కరించబడ్డారు మరియు బహిష్కరించబడ్డారని నేను నమ్మకంగా చెప్పగలను. ఒక విధంగా లేదా మరొక విధంగా, క్రీస్తు పట్ల మీ ఉన్నతమైన ప్రేమ కొరకు మీకు ప్రియమైన సంబంధాలను మీరు త్యాగం చేయవలసి వచ్చింది మరియు మీరు చాలా కన్నీరు కార్చారు. అయినప్పటికీ మీ స్వంత ప్రేమ తగ్గకుండా, మీరు ఈ శిలువ క్రింద స్థిరంగా ఉండి, దేవుని కుమారుని గురించి సిగ్గుపడకుండా ఉన్నారని చూపుతారు” (“Finding Your Life,” Ensign, Mar. 2016, 28).

రక్షకుడిని అనుసరించడానికి ప్రతిష్టాత్మకమైన సంబంధాలను కోల్పోవడానికి చూపించే ఈ సుముఖత “నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును” అనే వాగ్దానముతో వస్తుంది( మత్తయి 10:39 ).

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మార్కు 5:22-43.ఈ కథను మీ కుటుంబము కలిసి చదివినప్పుడు, వారు యాయీరు, స్త్రీ లేదా కథలోని ఇతర జనులైతే వారెలా భావిస్తారని కుటుంబ సభ్యులను అడగడానికి మీరు విరామం తీసుకోవచ్చు. ఈ సారాంశములో ఉన్నటువంటివి, కథలోని చిత్రములను మీరు చూపించవచ్చు. కథలలోని జనుల విశ్వాసాన్ని ఈ చిత్రాలు ఎలా వర్ణిస్తాయి? మీ కుటుంబము ఎదుర్కొనే కొన్ని సవాళ్ళను కూడా మీరు పరిగణించవచ్చు. “భయపడకుము, నమ్మిక మాత్రముంచుము” అనే ఆయన మాటలను మనమెలా అన్వయించగలము? (మార్కు 5:36).

మత్తయి 10:39; లూకా 9:23-26.మన ప్రాణము “పోగొట్టుకొనుట” మరియు దాని “దక్కించుకొనుట” అనగా అర్థము ఏమైయుండవచ్చు? (మత్తయి 10:39). ఈ వచనాలలో యేసు బోధనలను వివరించే అనుభవాలను బహుశా కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.

మత్తయి 10:40.ఆధునిక అపొస్తలుల సలహాను పొందడానికి మరియు అనుసరించడానికి మీరు, మీ కుటుంబము ఏమి చేస్తున్నారు? వారి సలహాల యెడల మన విధేయత మనలను యేసు క్రీస్తుకు ఎలా దగ్గర చేస్తుంది?

లూకా 9:61-62.నాగలిపై మన చేతిని వేసిన తరువాత వెనక్కి తిరిగి చూచుట అనగా అర్థమేమిటి? ఈ స్వభావము మనము దేవుని రాజ్యములో సరిపోకుండునట్లు ఎందుకు చేయును?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ఆత్మను వినండి. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు చదువుతున్న వాటితో సంబంధం లేదని అనిపించినప్పటికీ, మీ ఆలోచనలు మరియు భావాలపట్ల శ్రద్ధ వహించండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 8: 2–3 చూడండి). ఆ మనోభావాలు మీరు తెలుసుకోవాలని మరియు చేయాలని దేవుడు కోరుకునే విషయాలు కావచ్చు.

చిత్రం
మంచంపై నుండి బాలికను లేపుతున్న యేసు

తలితా కుమీ, ఇవా కొలేవా టిమోతి చేత

ముద్రించు