2023 క్రొత్త నిబంధన
జూన్ 5-11. యోహాను 14–17: ”నా ప్రేమ యందు నిలిచియుండుడి”


“జూన్ 5-11. యోహాను 14–17: ‘నా ప్రేమ యందు నిలిచియుండుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జూన్ 5-11. యోహాను 14–17,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
ప్రభురాత్రి భోజనం

ప్రభురాత్రి భోజనం, విలియం హెన్రీ మార్గె‌ట్‌సన్ చేత

జూన్ 5-11

యోహాను 14–17

”నా ప్రేమ యందు నిలిచియుండుడి”

యోహాను 14–17 లో రక్షకుని బోధనలను మీరు చదువుతున్నప్పుడు, మీ కొరకు గల సందేశాలను గుర్తించడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయపడును. మీరు పొందే మనోభావాలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

నేడు మనం దానిని “ప్రభురాత్రి భోజనము” అని పిలుస్తాము, కానీ వార్షిక పస్కా భోజనము కొరకు వారు సమకూడినప్పుడు, ఆయన మరణానికి ముందు తమ యజమానితో వారికిదే చివరి భోజనము కాగలదని యేసు యొక్క శిష్యులు పూర్తిగా గ్రహించారో లేదో మనకు తెలియదు. అయినప్పటికీ యేసు, “తాను వెళ్ళవలసిన గడియ వచ్చెనని యెరుగును” (యోహాను13:1). త్వరలోనే ఆయన గెత్సేమనేలో బాధను, తన సన్నిహిత స్నేహితుల మోసము మరియు నిరాకరణను, శిలువపైన వేదనాభరితమైన మరణాన్ని ఎదుర్కోబోతున్నారు. ఇవన్నీ ఆయన ముందుకు దూసుకువస్తున్నప్పటికీ, యేసు దృష్టి తన మీద కాకుండా తన శిష్యులపై నిలిచింది. రాబోయే రోజులు మరియు సంవత్సరాలలో వారు తెలుసుకోవలసినదేమిటి? యోహాను 14–17లో యేసు యొక్క సున్నితమైన బోధనలు అప్పుడు ఇప్పుడు తన శిష్యుల గురించి ఆయన ఎలా భావిస్తున్నారో అనేదానిని బయల్పరుస్తాయి. ఆయన పంచుకున్న ఓదార్పునిచ్చు అనేక సత్యాలలో, ఆయన మనల్ని ఎన్నడూ విడువరు అనునది ఒక విధంగా అభయమిస్తుంది. “మీరు నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచియుందురు” (యోహాను 15:10) అని ఆయన వాగ్దనమిచ్చారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

యోహాను 14-15

ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా నేను యేసు క్రీస్తు కొరకు నా ప్రేమను చూపుతాను.

యోహాను 14–15 మీరు చదువుతున్నప్పుడు, ప్రేమ అనే పదము ఉపయోగించబడిన ప్రతిసారీ మీరు దానిని గుర్తించవచ్చు. ఈ అధ్యాయాలలో ప్రేమ అనే పదంతో పాటు ఆజ్ఞలు అనే పదం తరచు చెప్పబడిందని మీరు గమనించవచ్చు. రక్షకుని బోధనల నుండి, ప్రేమ మరియు ఆజ్ఞల మధ్య గల సంబంధం గురించి మీరేమి నేర్చుకుంటారు? ఈ అధ్యాయాలలో ప్రేమ అనే పదంతో పాటు ఏ ఇతర పదాలు తరచు చెప్పబడినట్లు మీరు కనుగొన్నారు?

రక్షకుని ప్రేమ మిమ్మల్ని ఏవిధంగా ప్రభావితం చేసిందో ధ్యానించండి.

యోహాను 13:34–35 కూడా చూడండి.

చిత్రం
శిష్యులతో మాట్లాడుతున్న యేసు

ప్రభురాత్రి భోజనము, కార్క్ కెల్లీ ప్రైస్ చేత

యోహాను 14–16

యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా నా ఉద్దేశ్యమును నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ నాకు సహాయపడును.

రక్షకునితో వారి సమయం దాదాపుగా పూర్తయ్యిందని వినడం శిష్యులను చాలా బాధకు గురిచేసియుండవచ్చు. ఆయన లేకుండా వారు ఎలా ఉంటారనే దాని గురించి కూడా వారు కలతచెందియుండవచ్చు. మీరు యోహాను 14–16 చదువుతున్నప్పుడు, వారికి అభయమివ్వడానికి రక్షకుడు చెప్పిన దాని కొరకు చూడండి. ప్రత్యేకించి, పరిశుద్ధాత్మ గురించి ఆయన వారికి బోధించిన దానిని గమనించండి. క్రింది వచనాలలో రక్షకుని మాటల నుండి పరిశుద్ధాత్మ గురించి మీరేమి నేర్చుకుంటారు?

పరిశుద్ధాత్మ నుండి ఈ విధమైన సహాయం శిష్యులకు ఎందుకు అవసరం? మీ కొరకు ఈ పాత్రలను పరిశుద్ధాత్మ ఏ విధంగా నెరవేర్చాడు? మీ జీవితంలో ఆయన ప్రభావం బలంగా ఉండడానికి మీరు చేయగల దానిని పరిగణించండి.

3 నీఫై 19:9; 27:20; సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–14; మోషే 6:61; మిచెల్లి డి. క్రెయిగ్, “ఆత్మీయ సామర్థ్యము,” లియహోనా, నవ. 2019, 19–21 కూడా చూడండి.

యోహాను 15:1–8

నేను క్రీస్తులో నిలిచియున్నప్పుడు, నేను మంచి ఫలమును ఫలిస్తాను.

“(క్రీస్తు) లో నిలిచియుండుట” అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (యోహాను 15:4). యేసు క్రీస్తును సూచించే ద్రాక్షతీగకు మీరు జతచేయబడి ఉన్నారని ఏ “ఫలము” చూపుతుంది?

యోహాను 17

తన శిష్యుల కొరకు యేసు క్రీస్తు అర్థిస్తారు.

యోహాను 17 లో నమోదు చేయబడిన యేసు మాటలు అభ్యర్థనాపూర్వక ప్రార్థనగా చెప్పబడ్డాయి. ఈ ప్రార్థనలో, యేసు తన అపొస్తలుల కొరకు మరియు “వారి వాక్యము వలన (ఆయన) యందు విశ్వాసముంచు వారందరి” కొరకు ప్రార్థించారు (యోహాను 17:20). దానర్థము ఆయన మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీ తరఫున మరియు విశ్వాసులందరి తరఫున యేసు తన తండ్రిని ఏమని అర్థించారు? మీ కొరకు ఆయన మనోభావాల గురించి అది మీకేమి బోధిస్తుంది?

పరిపూర్ణమైన, నిత్య సత్యాల గురించి కూడా ఈ ప్రార్థన బోధిస్తుంది. ఏ సత్యాలను మీరు కనుగొంటారు? మీరు ఈ అధ్యాయమును చదువుతున్నప్పుడు, క్రింది వాటి గురించి మీరు నేర్చుకొనే దానిని నమోదు చేయడాన్ని పరిగణించండి:

  • ప్రార్థన

  • తన తండ్రితో రక్షకుని సంబంధము

  • తన శిష్యులతో రక్షకుని సంబంధము

  • శిష్యులు లోకము నుండి భిన్నంగా ఎలా ఉండాలి

  • మీకు ప్రత్యేకమైనవిగా అనిపించే ఇతర సత్యాలు

యోహాను 17:11, 21–23

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు పరిపూర్ణంగా ఏకమైయున్నారు.

యోహాను 17 లో తన ప్రార్థనయందు, యేసు తండ్రితో తన ఐక్యత గురించి నొక్కిచెప్పారు. ఏ విధాలుగా తండ్రి మరియు కుమారుడు “ఏకమైయున్నారు”? (యోహాను 17:11, 21-23). ఆయన మరియు ఆయన తండ్రి ఏకమై “యున్నట్లు“—లేదా అదేవిధంగా—తన శిష్యులు ఏకమైయుండవలెనని రక్షకుడు ప్రార్థించారని గమనించండి (యోహాను 17:22). మీ ఉద్దేశ్యంలో దాని అర్థమేమిటి? ఉదాహరణకు, మీ భర్త లేదా భార్య లేదా ఇతర కుటుంబ సభ్యులతో, వార్డు సభ్యులతో మరియు సహ క్రైస్తవులతో—సంబంధాల గురించి ఆలోచించండి. యేసు తన తండ్రితో కలిగియున్నటువంటి ఐక్యత కొరకు మీరెలా పనిచేయగలరు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

యోహాను 14:5-6.ఒక మార్గము గుండా మీ కుటుంబాన్ని వంతులవారీగా నడిపించడాన్ని మీ కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు. యేసే ఆ “మార్గము” ఎలా అయ్యున్నారు? ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నారు?

యోహాను 14:26–27.యేసు అనుగ్రహించు శాంతి ఏ విధంగా “లోకమిచ్చు” దాని నుండి భిన్నంగా ఉంది? పరిశుద్ధాత్మ ద్వారా వారు శాంతిని, ఓదార్పును పొందిన విధానాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.

యోహాను 15:1-8.ఈ వచనాలను వెలుపల ఒక ద్రాక్షతీగ, ఒక చెట్టు లేదా మరొక మొక్క ప్రక్కన చదవడం సరదాగా ఉండవచ్చు. మొక్క నుండి తొలగించినప్పుడు ఒక కొమ్మకు ఏమి జరుగుతుంది? మనము కొమ్మల వలె ఎట్లున్నాము మరియు రక్షకుని యుందు “నిలిచియుండుట” మరియు “ఫలము ఫలించుట” అనగా అర్థమేమిటని మీరు మాట్లాడవచ్చు (మోషైయ 5:7 చూడండి).

యోహాను 15:17–27; 16:1–7.హింస గురించి యేసు క్రీస్తు తన శిష్యులను ఎందుకు హెచ్చరించారని మీరనుకుంటున్నారు? నేడు క్రీస్తు యొక్క శిష్యులు ఏవిధంగా హింసించబడుతున్నారు? మనం హింసను ఎదుర్కొన్నప్పుడు, ఈ వచనాలలో ఉన్న రక్షకుని సలహా మనకెలా సహాయపడగలదు?

యోహాను 16:33.యేసు క్రీస్తు లోకాన్ని ఎలా జయించారు? ఆయన ప్రాయశ్చిత్తము ఏవిధంగా మనకు శాంతిని, సంతోషాన్ని తెచ్చింది? (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:6 కూడా చూడండి).

యోహాను 17:21-23.యేసు క్రీస్తు మరియు పరలోక తండ్రివలె మరింతగా ఏకమైయుండుటను మీ కుటుంబం నేర్చుకోవడానికి ఏది సహాయపడుతుంది? ఒక అభిమాన క్రీడా జట్టు గురించి మరియు ఒక ఉమ్మడి లక్ష్యం కొరకు వారు ఎలా కలిసి పనిచేస్తారనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. లేదా మీరు ఒక గాయకబృందాన్ని లేదా వాద్య బృందాన్ని వినవచ్చు మరియు అందమైన సంగీతాన్ని సృష్టించడానికి సంగీతకారులు ఎలా ఏకమవుతారో చర్చించవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఆడియో రికార్డింగులను ఉపయోగించండి. మీరు మీ కుటుంబానికి లేఖనాలను బోధిస్తున్నప్పుడు, బిగ్గరగా వాక్యభాగాలను చదవడం లేఖన వృత్తాంతాలను మరింత వాస్తవంగా చేయగలదు. యోహాను 14–17 వంటి అధ్యాయాల కొరకు ఇది ప్రత్యేకంగా శక్తివంతం కాగలదు, ఎందుకంటే ఈ అధ్యాయాలలో రక్షకుని మాటలు అనేకం ఉన్నాయి.

చిత్రం
ద్రాక్షతీగపై ద్రాక్షపళ్ళు

“ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు,” అని యేసు బోధించారు (యోహాను 15:5).

ముద్రించు