2023 క్రొత్త నిబంధన
సెప్టెంబరు 11-17. 2 కొరింథీయులకు 1–7: “దేవునితో సమాధానపడుడి”


“సెప్టెంబరు 11-17. 2 కొరింథీయులకు 1–7: ‘దేవునితో సమాధానపడుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“సెప్టెంబరు 11-17. 2 కొరింథీయులకు 1-7,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
యేసు క్రీస్తు

సెప్టెంబరు 11-17

2 కొరింథీయులకు 1–7

“దేవునితో సమాధానపడుడి”

కొరింథీయులకు పౌలు యొక్క లేఖలను మీరు అధ్యయనము చేసినప్పుడు, మీరు కనుగొనే సువార్త సూత్రములలో కొన్నిటిని వ్రాయండి మరియు మీ జీవితంలో వాటిని ఎలా అన్వయించుకోగలరో ధ్యానించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

కొన్నిసార్లు ఒక సంఘ నాయకునిగా ఉండడమంటే కొన్ని కష్టమైన విషయాలను చెప్పడమని అర్థము. ఈరోజు ఉన్నట్లుగానే పౌలు కాలములో కూడా ఇది నిజము. స్పష్టంగా ఇంతకుముందు కొరింథీయ పరిశుద్ధులకు పౌలు వ్రాసిన లేఖ గద్దింపును కలిగియున్నది మరియు బాధ కలిగించింది. 2 కొరింథీయులుగా పిలువబడిన లేఖలో, తన కఠినమైన మాటలను ఏది ప్రేరేపించిందో వివరించడానికి అతడు ప్రయత్నించాడు: “మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీ యెడల నేను కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని” (2 కొరింథీయులకు 2:4). ఒక నాయకుని నుండి మీరు దిద్దుబాటును పొందినప్పుడు, అది క్రీస్తు వంటి ప్రేమ చేత ప్రేరేపించబడిందని తెలుసుకోవడం ఖచ్చితంగా సహాయపడుతుంది. అలా కాని పరిస్థితులలో కూడా, పౌలు అనుభవించినటువంటి ప్రేమతో ఇతరులను చూడడానికి మనము సమ్మతించినట్లైతే, ఎటువంటి అపరాధములకైనా తగిన విధంగా స్పందించడం సులభమవుతుంది. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ సలహా ఇచ్చినట్లుగా, “మానవ దోషాలు—మీ స్వంతది, అదేవిధంగా స్వచ్ఛందంగా మర్త్యులైన స్త్రీ, పురుషుల చేత నడిపించిబడే సంఘములో మీతోపాటు సేవ చేస్తున్న వారి దోషముల పట్ల దయ కలిగియుండండి. ఆయన యొక్క పరిపూర్ణుడైన అద్వితీయ కుమారుని విషయములో తప్ప, దేవుడు ఎప్పటికీ పనిచేయవలసినది అపరిపూర్ణులైన ప్రజలతోనే” (“Lord, I Believe,” Liahona, May 2013, 94).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

2 కొరింథీయులకు 1:3–7; 4:6–10, 17–18; 7:4–7

నా శ్రమలు దీవెన కాగలవు.

పౌలు తన పరిచర్యలో ఎదుర్కొన్న శ్రమను చూస్తే, శ్రమ యొక్క ఉద్దేశములు మరియు దీవెనలను గూర్చి అతడు అధికంగా వ్రాయడంలో ఆశ్చర్యము లేదు. మీరు 2 కొరింథీయులకు 1:3–7; 4:6–10, 17–18; 7:4–7 చదువుతున్నప్పుడు, మీ శ్రమలు దీవెన కాగల విధానాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, దేవుడు ఎలా “[మీ] శ్రమ అంతటిలో [మిమ్మల్ని] ఆదరిస్తున్నాడు” మరియు దానికి బదులుగా మీరు, “ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఎలా ఆదరించగలరోనని” (2 కొరింథీయులకు 1:4) మీరు ధ్యానించవచ్చు. లేదా మీరు “శ్రమపడినప్పుడు” మరియు “కలవరపడినప్పుడు” (2 కొరింథీయులకు 4:6, 8) కూడా యేసు క్రీస్తు యొక్క వెలుగు “మీ హృదయాలలో ఎలా ప్రకాశించింది” అనే దానిపై మీరు దృష్టిసారించవచ్చు.

మోషైయ 24:13–17; హెన్రీ బి. ఐరింగ్, “పరీక్షించబడెను, నిరూపించబడెను మరియు మెరుగుపెట్టబడెను,” లియహోనా, నవ. 2020, 96–99; సువార్త అంశములు, “ప్రతికూలత,” topics.ChurchofJesusChrist.org. కూడా చూడండి.

2 కొరింథీయులకు 2:5–11

క్షమాపణ అనేది ఒక దీవెన, దానిని నేను ఇవ్వగలను మరియు పొందగలను కూడా.

2 కొరింథీయులకు 2:5–11లో పౌలు సూచించిన వ్యక్తి గురించి మనకు ఎక్కువగా తెలియదు—అతడు పాపము చేసాడని మాత్రమే తెలుసు (5–6 వచనాలు చూడండి) మరియు పరిశుద్ధులు అతడిని క్షమించాలని పౌలు కోరాడు (7–8 వచనాలు చూడండి). కొన్నిసార్లు మనకు కోపము తెప్పించిన వారి “పట్ల [మన] ప్రేమను నిశ్చయపరచడానికి” మనము ఎందుకు విఫలమవుతాము? (8వ వచనము). క్షమాపణను నిలిపివేయడం ఇతరులకు మరియు మనకు ఎలా హాని చేస్తుంది? (7, 10–11 వచనాలు చూడండి). క్షమాపణను నిలిపివేయడం “మనల్ని మోసపరచడానికి సాతానుకు” ఎలా అవకాశమిస్తుంది? (11వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:9–11 కూడా చూడండి.

2 కొరింథీయులకు 5:14–21

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా, నేను దేవునితో సమాధానపడతాను.

అందరివలెనే, “ఒక నూతన సృష్టి” అగుట ఎలా ఉంటుందో పౌలు కూడా ఎరుగును (2 కొరింథీయులకు 5:17). అతడు క్రైస్తవులను హింసించు వానిగా ఉండుట నుండి నిర్భయంగా క్రీస్తును కాపాడువానిగా మారాడు. మీరు 2 కొరింథీయులు 5:14–21 చదివినప్పుడు, ఇటువంటి ప్రశ్నల గురించి ఆలోచించండి: సమాధానపడడం అంటే అర్థమేమిటి? “దేవునితో సమాధానపడడం” అంటే అర్థమేమిటి? దేవుని నుండి మిమ్మల్ని వేరు చేసేదాని గురించి ధ్యానించండి. ఆయనతో ఎక్కువ సంపూర్ణంగా సమాధానపడడానికి మీరు చేయాల్సినదేమిటి? రక్షకుడు దానిని ఎలా సాధ్యం చేస్తారు?

“సమాధానపరచు పరిచర్య”లో “క్రీస్తుకు రాయబారులము” (18, 20 వచనాలు) కావడం అంటే అర్థమేమిటని కూడా మీరు ధ్యానించవచ్చు. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ సందేశము, “సమాధానపరచు పరిచర్య” నుండి ఏ అంతరార్థములను మీరు పొందుతారు? (లియహోనా, నవ. 2018, 77-79).

2 నీఫై 10:23–25 కూడా చూడండి.

2 కొరింథీయులకు 7:8–11

దైవచిత్తానుసారమైన దుఃఖము పశ్చాత్తాపమునకు నడిపించును.

సాధారణంగా మనము విచారమును మంచి విషయముగా అనుకోము, కానీ పశ్చాత్తాపములో ముఖ్యభాగముగా “దైవచిత్తానుసారమైన దుఃఖము” (2 కొరింథీయులకు 7:10) గురించి పౌలు మాట్లాడాడు. క్రింది వాటి నుండి దైవచిత్తానుసారమైన దుఃఖము గురించి మీరేమి నేర్చుకున్నారో పరిగణించండి: 2 కొరింథీయులకు 7:8–11; ఆల్మా 36:16–21; మోర్మన్ 2:11–15; మరియు సహోదరి మిఛెల్ డి. క్రెయిగ్ సందేశము “దైవిక అసంతృప్తి” (లియహోనా, నవ. 2018, 52–55). మీరు ఎప్పుడు దైవచిత్తానుసారమైన దుఃఖమును అనుభవించారు మరియు మీ జీవితంలో అది ఏ ప్రభావాన్ని కలిగియున్నది?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

2 కొరింథీయులకు 3:1–3.ఒక ఉద్యోగము లేదా పాఠశాల దరఖాస్తు వంటి వాటి కొరకు సిఫారసు లేఖను వారి కొరకు వ్రాయమని ఎవరినైనా ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులు అడిగారా? ఈ అనుభవము గురించి మాట్లాడమని వారిని అడగండి. పరిశుద్ధుల జీవితాలు యేసు క్రీస్తు సువార్త కొరకు సిఫారసు పత్రికల వలే “సిరాతో వ్రాయబడక, జీవముగల దేవుని ఆత్మతో వ్రాయబడినవి” అని పౌలు బోధించాడు. 2 కొరింథీయులకు 3:1–3 మీరు కలిసి చదివినప్పుడు, మన మాదిరులు సువార్త యొక్క సత్యాన్ని మరియు విలువను నిరూపిస్తూ, “మనుష్యులందరు తెలిసికొనుచు, చదువుకొనుచున్న” పత్రికల వలే ఎలా ఉన్నాయో చర్చించండి. బహుశా ఒక కుటుంబ సభ్యుడు యేసు క్రీస్తు యొక్క శిష్యునికి మంచి మాదిరిగా ఎలా ఉన్నారో వివరిస్తూ ప్రతీ కుటుంబ సభ్యుడు ఒక లేఖ లేదా “పత్రిక” వ్రాయవచ్చు. వారు తమ లేఖలను కుటుంబానికి చదివి వినిపించవచ్చు మరియు వారు ఎవరి గురించి వ్రాసారో ఆ కుటుంబ సభ్యునికి దానిని ఇవ్వవచ్చు. మన జీవితాలు “క్రీస్తు యొక్క పత్రిక(లు)” అని గ్రహించుట ఎందుకు ముఖ్యము?

2 కొరింథీయులకు 5:6–7.“చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుట” అనగా అర్థమేమిటి? మనము ఆయనను చూడలేనప్పటికీ రక్షకుడిని మనము నమ్ముతున్నామని చూపడానికి మనము ఏమి చేస్తున్నాము?

2 కొరింథీయులకు 5:17.సృష్టిలో విశేషమైన మార్పులకు లోనై, నూతన సృష్టిగా మారే వాటి మాదిరులను గూర్చి మీ కుటుంబము ఆలోచించగలదా లేదా కనుగొనగలదా? (ఈ సారాంశము చివర ఉన్న చిత్రాన్ని చూడండి). యేసు క్రీస్తు యొక్క సువార్త మనల్ని ఎలా మార్చగలదు?

2 కొరింథీయులకు 6:1–10.2 కొరింథీయులకు 6:1–10 ప్రకారము, “దేవుని పరిచారకులుగా” ఉండుట అనగా అర్థమేమిటి? (4వ వచనము). దేవుని పరిచారకుడు ఎటువంటి లక్షణాలను కలిగియుంటాడు?

2 కొరింథీయులు 6:14-18.మన చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తూనే, “[అవిశ్వాసులతో] జోడుగా ఉండకుడి, ప్రత్యేకింపబడియుండుడి,” అనే పౌలు సలహాను మనము ఎలా అనుసరించగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

వస్తుపాఠాలను పంచుకోండి. ప్రాయశ్చిత్తము వంటి కొన్ని సువార్త భావనలు గ్రహించుటకు కష్టమైనవి కావచ్చు. లేఖనాలలో మీరు కనుగొన్న సూత్రాలను మీ కుటుంబము గ్రహించుటకు సహాయపడునట్లు చిత్రములు లేదా వస్తువులు ఉపయోగించడం గురించి ఆలోచించండి.

చిత్రం
గొంగళిపురుగు, గుడ్లతిత్తి మరియు సీతాకోకచిలుక

మనము క్రీస్తు యొక్క సువార్తకు మార్పు చెందినప్పుడు, మన మార్పు ఎంత లోతైనది అనగా దానిని పౌలు “నూతన సృష్టి” (2 కొరింథీయులకు 5:17) గా వివరించాడు.

ముద్రించు