“27. జీవించియున్న వారి కొరకు దేవాలయ విధులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“27. జీవించియున్న వారి కొరకు దేవాలయ విధులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు
27.
జీవించియున్న వారి కొరకు దేవాలయ విధులు
27.0
పరిచయం
దేవాలయం ప్రభువు యొక్క మందిరము. అది మనకు మన రక్షకుడైన యేసు క్రీస్తు వైపు దారి చూపుతుంది. దేవాలయాలలో, మనం పవిత్రమైన విధులలో పాల్గొంటాము మరియు పరలోక తండ్రితో నిబంధనలు చేస్తాము, అవి మనలను ఆయనతో మరియు మన రక్షకునితో బంధిస్తాయి. ఈ నిబంధనలు మరియు విధులు మనలను పరలోక తండ్రి సన్నిధికి తిరిగి వెళ్ళడానికి మరియు నిత్యత్వము కొరకు కుటుంబాలుగా కలిసి ముద్ర వేయబడడానికి సిద్ధం చేస్తాయి.
దేవాలయ నిబంధనలు మరియు విధులయందు, “దైవత్వపు శక్తి ప్రత్యక్షపరచబడును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20 చూడండి).
దేవాలయ నిబంధనలు మరియు విధులు పవిత్రమైనవి. దేవాలయ నిబంధనలకు సంబంధించిన చిహ్నాలను దేవాలయం వెలుపల చర్చించకూడదు. అలాగే బహిర్గతం చేయము అని మనం దేవాలయంలో వాగ్దానం చేసిన పరిశుద్ధ సమాచారాన్ని చర్చించకూడదు. అయితే, దేవాలయ నిబంధనలు మరియు విధుల యొక్క ప్రాథమిక ఉద్దేశాలు, సిద్ధాంతం మరియు దేవాలయంలో మనకు కలిగిన ఆధ్యాత్మిక భావాలను మనం చర్చించవచ్చు.
వార్డు మరియు స్టేకు నాయకులు ఈ అధ్యాయంలోని సమాచారాన్ని వరము లేదా ముద్ర విధులను పొందడానికి సిద్ధమవుతున్న సభ్యులతో చర్చిస్తారు.
27.1
దేవాలయ విధులను పొందడం
27.1.1
దేవాలయ విధులను పొందడానికి సిద్ధపడుట
దేవాలయ విధులను పొందడానికి మరియు దేవాలయ నిబంధనలను చేయడానికి, గౌరవించడానికి సభ్యులు తమనుతాము ఆధ్యాత్మికంగా సిద్ధం చేసుకోవాలి.
దేవాలయ విధులను పొందడానికి తమ పిల్లలను సిద్ధం చేయడంలో తల్లిదండ్రులకు ప్రాథమిక బాధ్యత ఉంది. స్టేకు మరియు వార్డు నాయకులు, పరిచర్య చేసే సహోదర సహోదరీలు మరియు బంధువులు ఈ పాత్రలో తల్లిదండ్రులకు మద్దతు ఇస్తారు.
దేవాలయ విధులను పొందడానికి సిద్ధపడడంలో సభ్యులకు సహాయపడేందుకు వనరులు temples.ChurchofJesusChrist.org వద్ద అందుబాటులో ఉన్నాయి.
తమ స్వంత వరమును పొందడానికి లేదా జీవిత భాగస్వామితో ముద్ర వేయబడడానికి సిద్ధమవుతున్న సభ్యులు దేవాలయ సిద్ధపాటు పాఠ్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సహించబడ్డారు (25.2.8 చూడండి).
27.1.3
శారీరక వైకల్యాలు ఉన్న సభ్యులు
శారీరక వైకల్యాలు ఉన్న యోగ్యమైన సభ్యులు అన్ని దేవాలయ విధులను పొందవచ్చు. ఈ సభ్యులు వారికి సహాయం చేయగల వరము పొందిన బంధువులు లేదా స్వలింగానికి చెందిన స్నేహితులతో దేవాలయానికి హాజరయ్యేలా ప్రోత్సహించబడతారు. సభ్యులు కుటుంబ సభ్యుడు లేదా స్నేహితునితో హాజరు కాలేకపోతే, వారు ఏ ఏర్పాట్లు చేయవచ్చో చూడడానికి ముందుగానే దేవాలయాన్ని సంప్రదించవచ్చు.
27.1.4
అనువాదం లేదా భాషాంతర సహాయం
సభ్యులకు అనువాదం లేదా భాషాంతర సహాయం అవసరమైతే, అది అందుబాటులో ఉందో లేదో చూడడానికి వారు ముందుగానే దేవాలయాన్ని సంప్రదించాలి.
27.1.5
దేవాలయానికి ధరించే దుస్తులు
దేవాలయానికి వెళ్ళేటప్పుడు, సభ్యులు సాధారణంగా సంస్కార సమావేశానికి ధరించే దుస్తులను ధరించాలి.
దేవాలయ వివాహానికి లేదా ముద్రకు ధరించే దుస్తుల గురించి సమాచారం కోసం 27.3.2.6 చూడండి.
ఈ క్రింది వాటి గురించి సమాచారం కోసం 38.5 చూడండి:
-
వరము మరియు ముద్ర విధుల సమయంలో ధరించడానికి దుస్తులు.
-
ఆచారబద్ధమైన దేవాలయ దుస్తులు మరియు వస్త్రాలను పొందడం, ధరించడం మరియు సంరక్షణ.
27.1.6
పిల్లల సంరక్షణ
పిల్లలు దేవాలయ మైదానంలో ఉంటే పెద్దల పర్యవేక్షణ ఉండాలి. క్రింది పరిస్థితులలో మాత్రమే పిల్లలను పర్యవేక్షించడానికి దేవాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారు:
-
వారు తల్లిదండ్రులతో ముద్రించబడుతుంటే
-
వారు జీవించి ఉన్న వారి తోబుట్టువులు, సవతి తోబుట్టువులు లేదా వారి తల్లిదండ్రులకు సవతి తోబుట్టువుల ముద్రను గమనిస్తుంటే
27.1.7
దేవాలయ విధులను పొందిన తర్వాత సభ్యులతో కలుసుకోవడం
దేవాలయ విధులను పొందిన తర్వాత సభ్యులకు తరచుగా ప్రశ్నలు ఉంటాయి. వరము పొందిన కుటుంబ సభ్యులు, బిషప్పు, ఇతర వార్డు నాయకులు మరియు పరిచర్య చేసే సహోదర సహోదరీలు సభ్యుల దేవాలయ అనుభవాన్ని చర్చించడానికి వారిని కలుసుకోవచ్చు.
ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సహాయపడే వనరులు temples.ChurchofJesusChrist.org వద్ద అందుబాటులో ఉన్నాయి.
27.2
వరము
వరము అనే పదానికి “బహుమతి” అని అర్థం. దేవాలయ వరము అనేది దేవుని నుండి వచ్చిన బహుమానం, దీని ద్వారా ఆయన తన పిల్లలను దీవిస్తారు. దేవాలయ వరము ద్వారా సభ్యులు పొందే కొన్ని బహుమానాలు:
-
ప్రభువు యొక్క ఉద్దేశాలు మరియు బోధనల గురించి అధిక జ్ఞానం.
-
తన పిల్లలు చేయాలని పరలోక తండ్రి కోరుకున్నదంతా చేయడానికి శక్తి.
-
ప్రభువుకు, వారి కుటుంబాలకు మరియు ఇతరులకు సేవ చేసేటప్పుడు దైవిక దిశానిర్దేశం.
-
హెచ్చైన నిరీక్షణ, ఆదరణ మరియు శాంతి.
ఈ దీవెనల నెరవేర్పు యేసు క్రీస్తు సువార్తపట్ల విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది.
వరము రెండు భాగాలుగా పొందబడుతుంది. మొదటి భాగంలో, ఒక వ్యక్తి ఆరంభవిధి అని పిలువబడే ప్రాథమిక విధిని పొందుతాడు. ఆరంభవిధిని పరిశుద్ధము చేయుట మరియు అభిషేకం చేయుట అని కూడా అంటారు (నిర్గమకాండము 29:4–9 చూడండి). ఇది వ్యక్తి యొక్క దైవిక వారసత్వం మరియు సామర్థ్యానికి సంబంధించిన ప్రత్యేక దీవెనలను కలిగి ఉంటుంది.
ఆరంభవిధి సమయంలో, సభ్యునికి దేవాలయ వస్త్రాన్ని ధరించడానికి అధికారం ఉంటుంది. వస్త్రం దేవునితో అతని లేదా ఆమె వ్యక్తిగత సంబంధాన్ని మరియు దేవాలయంలో చేసిన నిబంధనలకు కట్టుబడి ఉండాలనే నిబద్ధతను సూచిస్తుంది. సభ్యులు తమ నిబంధనల పట్ల విశ్వాసంగా ఉండి, వస్త్రమును వారి జీవితమంతా సరిగ్గా ధరించినప్పుడు, అది రక్షణగా కూడా పనిచేస్తుంది. వస్త్రాన్ని ధరించడం మరియు సంరక్షణ గురించి సమాచారం కోసం, 38.5.5 చూడండి.
వరము యొక్క రెండవ భాగంలో, సృష్టి, ఆదాము హవ్వల పతనం, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం, విశ్వాసభ్రష్టత్వము మరియు పునఃస్థాపనతో సహా రక్షణ ప్రణాళిక బోధించబడింది. సభ్యులు ప్రభువు సన్నిధికి ఎలా తిరిగి రావాలో కూడా సూచనలను అందుకుంటారు.
వరములో, ఈ క్రింది విధంగా పవిత్రమైన నిబంధనలను చేయడానికి సభ్యులు ఆహ్వానించబడ్డారు:
-
విధేయత యొక్క చట్టాన్ని జీవించడం మరియు పరలోక తండ్రి ఆజ్ఞలను పాటించడానికి కృషి చేయడం.
-
బలి చట్టాన్ని పాటించడం, అనగా ప్రభువు పనికి మద్దతు ఇవ్వడానికి త్యాగం చేయడం మరియు విరిగిన హృదయంతో, నలిగిన ఆత్మతో పశ్చాత్తాపపడడం.
-
యేసు క్రీస్తు సువార్త యొక్క చట్టానికి విధేయులవడం, అది ఆయన భూమిపై ఉన్నప్పుడు బోధించిన ఉన్నతమైన చట్టము.
-
పవిత్రత యొక్క చట్టాన్ని పాటించడం, అనగా ఒక సభ్యుడు అతను లేదా ఆమె చట్టబద్ధంగా మరియు దేవుని చట్టం ప్రకారం వివాహం చేసుకున్న వ్యక్తితో మాత్రమే లైంగిక సంబంధాలు కలిగియుండడం.
-
సమర్పణ చట్టాన్ని పాటించడం, అనగా సభ్యులు తమ సమయాన్ని, ప్రతిభను మరియు ప్రభువు వారిని దీవించి ఇచ్చిన ప్రతిదాన్ని భూమిపై యేసు క్రీస్తు యొక్క సంఘమును నిర్మించడానికి సమర్పించడం.
బదులుగా, తమ దేవాలయ నిబంధనలపట్ల విశ్వాసంగా ఉండేవారు “ఉన్నతమైన దాని నుండి శక్తి చేత” వరమివ్వబడతారని పరలోక తండ్రి వాగ్దానం చేస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:32, 38; లూకా 24:49; సిద్ధాంతము మరియు నిబంధనలు 43:16 కూడా చూడండి).
27.2.1
ఎవరు వరమును పొందవచ్చు
సంఘము యొక్క జవాబుదారీగా ఉన్న వయోజన సభ్యులందరూ వారి స్వంత వరము కోసం సిద్ధపడడానికి మరియు దానిని పొందడానికి ఆహ్వానించబడ్డారు. సభ్యులు వరమును పొందడానికి ముందు అన్ని ముందస్తు విధులు తప్పనిసరిగా నిర్వహించబడాలి మరియు నమోదు చేయబడాలి (26.3.1 చూడండి).
27.2.1.1
క్రొత్తగా బాప్తిస్మము పొందిన సభ్యులు
యోగ్యమైన క్రొత్త వయోజన సభ్యులు వారి నిర్ధారణ తేదీ నుండి కనీసం ఒక పూర్తి సంవత్సరం తరువాత వారి వరమును పొందవచ్చు.
27.2.1.2
వరము పొందని జీవిత భాగస్వామిని కలిగియున్న సభ్యులు
ఈ క్రింది షరతులు నెరవేర్చబడినప్పుడు, యోగ్యులైయుండి వరము పొందని జీవిత భాగస్వామిని కలిగియున్న సభ్యుడు అతని లేదా ఆమె స్వంత వరమును పొందవచ్చు:
-
వరము పొందని జీవిత భాగస్వామి అతని లేదా ఆమె సమ్మతిని తెలియజేసినప్పుడు.
-
దేవాలయ నిబంధనలతో వచ్చే బాధ్యతలు వివాహానికి అంతరాయం కలిగించవని సభ్యుడు, బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు నమ్మకంగా ఉన్నప్పుడు.
జీవిత భాగస్వామి సంఘములో సభ్యులైనా కాకపోయినా ఈ షరతులు వర్తిస్తాయి.
27.2.1.3
మేధోపరమైన వైకల్యాలు ఉన్న సభ్యులు
మేధోపరమైన వైకల్యాలు ఉన్న సభ్యులు వారి స్వంత వరమును ఈ క్రింది విధంగా పొందవచ్చు:
-
వారు అన్ని ముందస్తు విధులను స్వీకరించియుంటే (26.3.1 చూడండి).
-
సంబంధిత నిబంధనలను అర్థం చేసుకోవడానికి, చేయడానికి మరియు పాటించడానికి వారికి మేధో సామర్థ్యం ఉండాలి.
బిషప్పు సభ్యునితో మరియు వర్తించే చోట అతని లేదా ఆమె తల్లిదండ్రులతో చర్చిస్తారు. అతను ఆత్మ యొక్క నిర్దేశాన్ని కూడా కోరుకుంటాడు. అతను స్టేకు అధ్యక్షుడితో చర్చించవచ్చు.
27.2.2
వరమును ఎప్పుడు పొందాలో నిర్ణయించడం
వరమును పొందాలనే నిర్ణయం వ్యక్తిగతమైనది మరియు ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలి. వరము అనేది శక్తి యొక్క దీవెన మరియు దానిని పొందడానికి సిద్ధపడే వారందరికీ వచ్చే బయల్పాటు. సభ్యులు ఈ క్రింది షరతులన్నింటికీ తగినట్టుగా ఉన్నప్పుడు వారి స్వంత వరమును పొందడానికి ఎంచుకోవచ్చు:
-
వారి వయస్సు కనీసం 18 సంవత్సరాలు వుండాలి.
-
వారు ఉన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల లేదా తత్సమానమైన దాన్ని పూర్తి చేసియుండాలి లేదా ఇకపై వాటికి హాజరవుతూ ఉండరాదు.
-
వారి నిర్ధారణ నుండి ఒక పూర్తి సంవత్సరం గడిచియుండాలి.
-
వారు తమ జీవితాంతం పవిత్రమైన దేవాలయ నిబంధనలను పొందాలని మరియు గౌరవించాలని భావించాలి.
మిషను పిలుపు అందుకున్న లేదా దేవాలయంలో ముద్రించబడడానికి సిద్ధమవుతున్న సభ్యులు వరమును పొందాలి.
వరమును పొందడానికి సభ్యునికి దేవాలయ సిఫారసును జారీ చేసే ముందు, ఆ వ్యక్తి పవిత్ర దేవాలయ నిబంధనలను అర్థం చేసుకోవడానికి మరియు పాటించడానికి సిద్ధంగా ఉన్నాడని బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు భావించాలి. ఈ అర్హత ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా నిర్ణయించబడుతుంది.
27.2.3
వరమును ప్రణాళిక చేయడం మరియు షెడ్యూల్ చేయడం
27.2.3.1
జీవించియున్న వారి విధుల కోసం సిఫారసును పొందడం
ఒక సభ్యుడు దేవాలయంలోకి ప్రవేశించడానికి మరియు వరమును పొందడానికి జీవించియున్న వారి విధుల కోసం తప్పనిసరిగా సిఫారసును అందుకోవాలి. ఈ సిఫారసుల గురించి సమాచారం కోసం, 26.5.1 చూడండి.
27.2.3.2
దేవాలయాన్ని సంప్రదించుట
వరమును పొందాలనుకునే సభ్యులు విధులను షెడ్యూల్ చేయడానికి ముందుగానే దేవాలయాన్ని సంప్రదించాలి.
27.2.3.3
వరమును స్వీకరించే సభ్యుల కోసం తోడుండేవారు
వారి స్వంత వరమును స్వీకరించే సభ్యులు అదే లింగానికి చెందియుండి వరము పొందిన ఒక సభ్యుడిని తోడుండేవారిగా వ్యవహరించడానికి మరియు వరము సభలో వారికి సహాయం చేయడానికి ఆహ్వానించవచ్చు. తోడుండేవారు తప్పనిసరిగా ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగియుండాలి. అవసరమైతే దేవాలయం తోడుండేవారిని ఏర్పాటు చేస్తుంది.
27.3
భార్యా భర్తలు ముద్రించబడుట
దేవాలయ ముద్ర భార్యా భర్తలను కాలము మరియు నిత్యత్వమంతటి కోసం జతచేస్తుంది. వారు దేవాలయంలో చేసే నిబంధనలపట్ల విశ్వాసంగా ఉంటే వారు ఈ దీవెనలను పొందుతారు. ఈ విధి ద్వారా, వారి పిల్లలు కూడా వారి నిత్య కుటుంబంలో భాగం కావచ్చు.
వివాహం చేసుకోవడానికి మరియు దేవాలయంలో ముద్రించబడడానికి సిద్ధపడమని సంఘ నాయకులు సభ్యులను ప్రోత్సహిస్తారు. దేవాలయ వివాహాలు చట్టబద్ధంగా గుర్తించబడని చోట, అధికారంగల సంఘ నాయకులు లేదా ఇతరులు పౌర వివాహాలను నిర్వహించవచ్చు, ఆ తర్వాత దేవాలయంలో ముద్ర వేయబడవచ్చు (38.3 చూడండి). దేవాలయ వివాహం తల్లిదండ్రులు లేదా సమీప కుటుంబ సభ్యులు దేవాలయ వేడుకకు హాజరు కాలేనందున వారు మినహాయించబడినట్లు భావించేలా చేసినప్పుడు కూడా ఈ పద్ధతిని అనుసరించవచ్చు.
27.3.1
దేవాలయంలో ఎవరు ముద్ర వేయబడవచ్చు
సంఘము యొక్క జవాబుదారీగా ఉన్న అవివాహిత సభ్యులందరూ దేవాలయ ముద్ర కోసం సిద్ధపడవలసిందిగా ఆహ్వానించబడ్డారు. పౌర వివాహం చేసుకున్న వారు సిద్ధమైన వెంటనే దేవాలయంలో కాలము మరియు నిత్యత్వమంతటి కోసం ముద్ర వేయబడాలని ప్రోత్సహించబడ్డారు. సభ్యులు ముద్ర వేయబడటానికి ముందు వారు తప్పనిసరిగా వరమును పొందియుండాలి (27.2 చూడండి).
దేవాలయంలో ముద్ర వేయబడుతున్న జంటలు తప్పనిసరిగా (1) ముద్ర వేయబడటానికి ముందు పౌర వివాహం చేసుకోవాలి లేదా (2) వివాహమాడి, అదే దేవాలయ వేడుకలో ముద్ర వేయబడాలి. 27.3.2 చూడండి.
27.3.1.2
మేధోపరమైన వైకల్యాలు ఉన్న సభ్యులు
మేధోపరమైన వైకల్యాలు ఉన్న సభ్యులు వారి జీవిత భాగస్వామి, కాబోయే భర్త లేదా కాబోయే భార్యతో ముద్ర వేయబడవచ్చు, అయితే:
-
వారు వరముతో సహా అన్ని ముందస్తు విధులను పొందియుండాలి (27.2.1.3 చూడండి).
-
సంబంధిత నిబంధనలను అర్థం చేసుకోవడానికి, చేయడానికి మరియు పాటించడానికి వారికి మేధో సామర్థ్యం ఉండాలి.
సభ్యునితో మరియు అతని లేదా ఆమె జీవిత భాగస్వామి, కాబోయే భర్త లేదా కాబోయే భార్యతో బిషప్పు చర్చిస్తారు. అతను ఆత్మ యొక్క నిర్దేశాన్ని కూడా కోరుకుంటాడు. అతను స్టేకు అధ్యక్షుడితో చర్చించవచ్చు.
27.3.2
దేవాలయ వివాహం లేదా ముద్రని ప్రణాళిక చేయడం మరియు షెడ్యూల్ చేయడం
27.3.2.1
జీవించియున్న వారి విధుల కోసం సిఫారసును పొందడం
ఒక సభ్యుడు అతని లేదా ఆమె జీవిత భాగస్వామితో ముద్ర వేయబడడానికి తప్పనిసరిగా జీవించియున్న వారి విధుల కోసం సిఫారసును పొందియుండాలి. ఈ సిఫారసుల గురించి సమాచారం కోసం, 26.3 చూడండి.
27.3.2.2
దేవాలయాన్ని సంప్రదించుట
వివాహం చేసుకోవాలని లేదా జీవిత భాగస్వామితో ముద్ర వేయబడాలని అనుకుంటున్న సభ్యులు విధులను షెడ్యూల్ చేయడానికి ముందుగానే దేవాలయాన్ని సంప్రదించాలి.
27.3.2.3
వివాహ అనుమతి పొందడం
వివాహం చేసుకునే ముందు, ఒక జంట తప్పనిసరిగా చట్టబద్ధమైన వివాహ అనుమతిని పొందాలి, అది వివాహం జరిగే చోట చెల్లుతుంది. ఒకే వేడుకలో ఒక జంట వివాహమాడాలని మరియు ముద్ర వేయబడాలని ప్రణాళిక చేస్తే, వారు చెల్లుబాటు అయ్యే వివాహ అనుమతిని దేవాలయానికి తీసుకురావాలి.
పౌర వివాహం తర్వాత ముద్ర వేయబడిన జంటలు దేవాలయానికి వివాహ అనుమతిని తీసుకురావాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు రికార్డు ధృవీకరణ ప్రక్రియలో భాగంగా వారి పౌర వివాహం యొక్క తేదీ మరియు స్థానాన్ని అందిస్తారు.
27.3.2.4
వధువు మరియు వరుడి కోసం తోడుండేవారు
వధువు అలంకారమందిరములో ఆమెకు సహాయం చేయడానికి వరము పొందిన సోదరి ఆమెతో పాటు రావచ్చు. వరుడి కోసం వరము పొందిన సోదరుడు అదే చేయవచ్చు. తోడుండేవారు తప్పనిసరిగా ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగియుండాలి. అవసరమైతే దేవాలయం తోడుండేవారిని ఏర్పాటు చేస్తుంది.
27.3.2.5
దేవాలయ వివాహం లేదా ముద్రను ఎవరు నిర్వహిస్తారు
దేవాలయ వివాహం లేదా ముద్ర సాధారణంగా ఒక ముద్రవేయువ్యక్తి చేత నిర్వహించబడుతుంది, అతను ఆ జంట వివాహమాడే లేదా ముద్ర వేయబడే దేవాలయానికి నియమించబడియుంటాడు. కుటుంబ సభ్యుడు లేదా పరిచయస్తులు ముద్రవేయు అధికారాన్ని కలిగియుంటే మరియు ఆ జంట వివాహమాడే లేదా ముద్ర వేయబడే దేవాలయానికి నియమించబడియుంటే, వివాహం చేయడానికి లేదా ముద్ర వేయడానికి వారు అతన్ని ఆహ్వానించవచ్చు.
27.3.2.6
దేవాలయ వివాహం లేదా ముద్ర కోసం తగిన దుస్తులు
వధువు దుస్తులు. దేవాలయంలో ధరించే వధువు దుస్తులు తెల్లగా ఉండాలి, అల్లిక మరియు నేతలో నిరాడంబరంగా ఉండాలి మరియు విస్తృతమైన ఆభరణాలు లేకుండా ఉండాలి. అది దేవాలయ వస్త్రాన్ని కూడా కప్పి ఉంచాలి. పల్చని వస్త్రం అస్తరు వేయబడియుండాలి.
దేవాలయంలో ధరించే ఇతర దుస్తులకు అనుగుణంగా ఉండటానికి, వధువు దుస్తులు పొడవాటి లేదా మూడొంతుల చేతులను కలిగి ఉండాలి. ముద్ర వేడుక కోసం దుస్తులు పిన్ను పెట్టుకొనేలా లేదా తీసివేయబడేలా ఉండాలి తప్ప వాటి వెనుక వ్రేలాడే వస్త్రము ఉండకూడదు.
అవసరమైతే లేదా కావాలంటే దేవాలయం దుస్తులు సమకూర్చగలదు.
వరుడి దుస్తులు. వివాహం లేదా ముద్ర వేడుకలో వరుడు సాధారణ దేవాలయ దుస్తులను ధరిస్తాడు (38.5.1 మరియు 38.5.2 చూడండి).
అతిథుల దుస్తులు. వివాహం లేదా ముద్ర వేడుకకు హాజరయ్యే వారు సంస్కార సమావేశానికి ధరించే దుస్తులను ధరించాలి. వరము సభ నుండి నేరుగా ముద్రకు వచ్చే సభ్యులు దేవాలయ వేడుక దుస్తులను ధరించవచ్చు.
పువ్వులు. వివాహం లేదా ముద్ర వేడుక సమయంలో జంట మరియు వారి అతిథులు పువ్వులు ధరించకూడదు.
27.3.2.7
దేవాలయ వివాహం లేదా ముద్ర తర్వాత ఉంగరాలు మార్చుకోవడం
ఉంగరాలు మార్చుకోవడం దేవాలయ ముద్ర వేడుకలో భాగం కాదు. అయితే, ముద్రవేయు గదిలో వేడుక తర్వాత జంటలు ఉంగరాలు మార్చుకోవచ్చు. జంటలు దేవాలయంలో మరే ఇతర సమయంలో లేదా ప్రదేశంలో లేదా దేవాలయ మైదానంలో ఉంగరాలు మార్చుకోకూడదు.
ఒకే వేడుకలో వివాహం చేసుకొని, ముద్ర వేయబడిన జంటలు దేవాలయ వివాహానికి హాజరుకాలేని కుటుంబ సభ్యులకు వసతి కల్పించడానికి తరువాత సమయంలో ఉంగరాలు మార్చుకోవచ్చు. మార్పిడి దేవాలయ వివాహం లేదా ముద్ర వేడుకలో ఏదైనా భాగాన్ని పునరావృతం చేయకూడదు. దేవాలయంలో వివాహం చేసుకున్న తర్వాత లేదా ముద్ర వేయబడిన తర్వాత జంట ప్రమాణాలు మార్చుకోకూడదు.
దేవాలయంలో ముద్రకు ముందు పౌర వివాహం చేసుకున్న జంటలు వారి పౌర వేడుకలో, వారి దేవాలయ ముద్రలో లేదా రెండు వేడుకలలో ఉంగరాలను మార్చుకోవచ్చు.
27.3.4
దేవాలయ వివాహం లేదా ముద్రకు ఎవరు హాజరు కావచ్చు
జంటలు దేవాలయ వివాహం లేదా ముద్రకు సన్నిహిత కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను మాత్రమే ఆహ్వానించాలి. జవాబుదారీగా ఉన్న సభ్యులందరూ తప్పక వరము పొంది వుండాలి మరియు హాజరు కావడానికి ప్రస్తుత దేవాలయ సిఫారసు కలిగియుండాలి.
మేధోపరమైన వైకల్యాల కారణంగా బాప్తిస్మము తీసుకోని లేదా వరము పొందని వ్యక్తికి అతని లేదా ఆమె యొక్క జీవించి ఉన్న తోబుట్టువుల దేవాలయ వివాహాన్ని లేదా ముద్రను పరిశీలించడానికి స్టేకు అధ్యక్షుడు అధికారం ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి తప్పనిసరిగా:
-
కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగియుండాలి.
-
వేడుకలో భక్తిపూర్వకంగా ఉండగలగాలి.
ముద్రను పరిశీలించడానికి వ్యక్తికి అధికారం ఉందని స్టేకు అధ్యక్షుడు లేఖ రాస్తారు. ఈ లేఖను దేవాలయంలో సమర్పిస్తారు.
27.4
జీవించి ఉన్న పిల్లలను తల్లిదండ్రులతో ముద్రవేయుట
దేవాలయంలో తమ తల్లి భర్తతో ముద్ర వేయబడిన తర్వాత జన్మించిన పిల్లలు ఆ ముద్ర యొక్క నిబంధనలో పుడతారు. వారు తల్లిదండ్రులతో ముద్ర విధి పొందవలసిన అవసరం లేదు.
నిబంధనలో జన్మించని పిల్లలు వారికి జన్మనిచ్చిన లేదా పెంచిన తల్లిదండ్రులతో ముద్రవేయబడడం ద్వారా నిత్య కుటుంబంలో భాగం కావచ్చు. ఈ పిల్లలు నిబంధనలో జన్మించిన వారితో సమానమైన దీవెనలకు అర్హులు.
27.4.2
దేవాలయాన్ని సంప్రదించుట
తమ పిల్లలు తమతో ముద్ర వేయబడాలనుకునే దంపతులు లేదా మరణించిన వారి తల్లిదండ్రులతో ముద్ర వేయబడాలనుకునే పిల్లలు విధిని షెడ్యూల్ చేయడానికి ముందుగానే దేవాలయాన్ని సంప్రదించాలి.