“అధ్యాయము 3: పాఠము 1—యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సందేశము,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“అధ్యాయము 3: పాఠము 1,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 3: పాఠము 1
యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సందేశము
లోకం ప్రారంభమైనప్పటి నుండి, దేవుడు తన పిల్లలకు ప్రవక్తల ద్వారా సువార్తను బయలుపరిచారు. ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా దీనిని చేసారు. ప్రాచీన కాలంలో, యేసు ఆదాము, నోవహు, అబ్రాహాము మరియు మోషే వంటి ప్రవక్తలకు సువార్తను బయలుపరిచారు. కానీ అనేకమంది జనులు దానిని తిరస్కరించారు.
రెండువేల సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు తానే తన సువార్తను బోధించారు మరియు తన సంఘాన్ని స్థాపించారు. జనులు యేసును కూడా తిరస్కరించారు. ఆయన మరణం తరువాత, ప్రభువు యొక్క సత్యం మరియు సంఘం నుండి విస్తృతంగా దారి తప్పడం జరిగింది. సువార్త యొక్క సంపూర్ణత మరియు యాజకత్వ అధికారం ఇకపై భూమిపై లేవు.
శతాబ్దాల తర్వాత, దేవుడు జోసెఫ్ స్మిత్ అనే మరో ప్రవక్తను పిలిచారు. దేవుడు అతని ద్వారా సువార్త యొక్క సంపూర్ణతను పునఃస్థాపించారు మరియు యేసు క్రీస్తు యొక్క సంఘాన్ని మరలా ఏర్పాటు చేయడానికి అతనికి అధికారం ఇచ్చారు.
భూమిపై యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణతను కలిగి ఉండడం మన కాలపు గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి. జీవితంలోని అత్యంత శోధించే ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సువార్త మనకు సహాయం చేస్తుంది. జీవించియున్న ప్రవక్తలు మనకు సవాలు సమయాల్లో మార్గనిర్దేశం చేస్తారు. దేవుని యాజకత్వ అధికారం ఆయన పిల్లలను దీవించడానికి మరోసారి భూమిపైకి వచ్చింది.
బోధించుటకు సూచనలు
బోధించడానికి సిద్ధపడేందుకు ఈ విభాగం మీకు నమూనా రూపురేఖలను అందిస్తుంది. ఇందులో మీరు ఉపయోగించగల ప్రశ్నలు మరియు ఆహ్వానాల ఉదాహరణలు కూడా ఉన్నాయి.
మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ప్రతి వ్యక్తి యొక్క పరిస్థితిని మరియు ఆధ్యాత్మిక అవసరాలను ప్రార్థనాపూర్వకంగా పరిగణించండి. ఏది బోధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందో నిర్ణయించండి. జనులు అర్థం చేసుకోలేని పదాలను నిర్వచించడానికి సిద్ధపడండి. పాఠాలను క్లుప్తంగా ఉంచాలని గుర్తుంచుకొని, మీకు ఎంత సమయం ఉంటుందో దాని ప్రకారం ప్రణాళిక చేయండి.
మీరు బోధించేటప్పుడు ఉపయోగించడానికి లేఖనాలను ఎంపిక చేయండి. పాఠంలోని “సిద్ధాంతపు పునాది” విభాగంలో చాలా సహాయకరమైన లేఖనాలు ఉన్నాయి.
మీరు బోధించేటప్పుడు ఏ ప్రశ్నలు అడగాలో పరిగణించండి. ప్రతి వ్యక్తిని చర్య తీసుకునేలా ప్రోత్సహించే విధంగా ఆహ్వానాలివ్వడానికి ప్రణాళిక చేయండి.
దేవుడు వాగ్దానం చేసిన దీవెనలను నొక్కి చెప్పండి మరియు మీరు బోధించే దాని గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోండి.
15–25 నిమిషాలలో మీరు జనులకు ఏమి బోధించవచ్చు
బోధించడానికి క్రింది సూత్రాలలో ఒకటి లేదా ఎక్కువ ఎంపిక చేయండి. ప్రతి సూత్రానికి సిద్ధాంతపు పునాది ఈ నమూనా తర్వాత అందించబడుతుంది.
దేవుడు మన ప్రియమైన పరలోక తండ్రి.
-
దేవుడు మన పరలోక తండ్రి మరియు మనము ఆయన పిల్లలము. తన స్వరూపమందు ఆయన మనల్ని సృష్టించారు.
-
దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ఎరుగుదురు మరియు మనల్ని ప్రేమిస్తున్నారు.
-
దేవుడు మాంసము, ఎముకలు గల మహిమకరమైన, పరిపూర్ణమైన శరీరాన్ని కలిగియున్నారు.
-
దేవుడు మనల్ని శాంతి మరియు నిత్యత్వము వరకు ఉండే సంపూర్ణ ఆనందంతో దీవించాలని కోరుకుంటున్నారు.
-
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, పాపము మరియు మరణం నుండి మనల్ని విమోచించడానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును పంపారు.
ప్రతీ యుగములో ప్రవక్తల ద్వారా దేవుడు సువార్తను బయల్పరుస్తారు.
-
భూమిపై ఆయన ప్రతినిధులుగా ఉండేందుకు దేవుడు ప్రవక్తలను పిలుస్తారు.
-
ప్రాచీన కాలంలో, దేవుడు ఆదాము, నోవహు, అబ్రాహాము మరియు మోషే వంటి ప్రవక్తలను పిలిచారు.
-
నేడు మనకు బోధించడానికి మరియు దారిచూపడానికి జీవించియున్న ప్రవక్త దేవుని నుండి బయల్పాటు పొందుతారు.
యేసు క్రీస్తు యొక్క భూలోక పరిచర్య మరియు ప్రాయశ్చిత్తము
-
యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడు.
-
తన భూలోక పరిచర్యలో, యేసు తన సువార్తను బోధించారు మరియు తన సంఘమును స్థాపించారు.
-
యేసు పన్నెండుమంది అపొస్తలులను పిలిచారు మరియు తన సంఘాన్ని నడిపించడానికి వారికి అధికారమిచ్చారు.
-
యేసు తన జీవితం చివరలో, గెత్సేమనే తోటలో మరియు సిలువ వేయబడిన సమయంలో తన శ్రమ ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశారు. యేసు మరణించిన తర్వాత, ఆయన పునరుత్థానము చెందారు.
-
యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము వలన, మనము పశ్చాత్తాపపడినప్పుడు క్షమించబడతాము మరియు మన పాపముల నుండి శుద్ధిచేయబడతాము. ఇది మనకు శాంతిని తెస్తుంది మరియు దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడాన్ని, సంపూర్ణ ఆనందాన్ని పొందడాన్ని సాధ్యం చేస్తుంది.
-
యేసు యొక్క పునరుత్థానము వలన, మనమందరము మరణించిన తరువాత పునరుత్థానము చెందుతాము. దీని అర్థం ప్రతీ వ్యక్తి యొక్క ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమై, శాశ్వతంగా జీవిస్తారు.
దారి తప్పుట
-
యేసు యొక్క అపొస్తలులు మరణించిన తర్వాత, యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు సంఘము నుండి అనేకమంది దారితప్పడం జరిగింది.
-
ఈ సమయంలో, జనులు అనేక సువార్త బోధనలను మార్చివేసారు. బాప్తిస్మము వంటి యాజకత్వ విధులను కూడా జనులు మార్చివేసారు. యాజకత్వ అధికారము మరియు యేసు స్థాపించిన సంఘము ఇకపై భూమి మీద లేకుండెను.
జోసెఫ్ స్మిత్ ద్వారా యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన
-
ఏ సంఘము దేవుని యొక్క నిజమైన సంఘమో తెలుసుకోవాలని జోసెఫ్ స్మిత్ ప్రయత్నించాడు, తద్వారా అతను దానిలో చేరగలడు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు 1820లో అతనికి కనిపించారు. ఈ సంఘటనను మొదటి దర్శనం అంటారు.
-
దేవుడు పూర్వకాలంలో ప్రవక్తలను పిలిచినట్లే, జోసెఫ్ స్మిత్‌ను ఒక ప్రవక్తగా పిలిచారు.
-
జోసెఫ్ స్మిత్ ద్వారా యేసు క్రీస్తు యొక్క సువార్త పునఃస్థాపించబడింది.
-
ఇతర పరలోక దూతలు యాజకత్వాన్ని పునరుద్ధరించారు మరియు యేసు క్రీస్తు యొక్క సంఘమును ఏర్పాటు చేయడానికి జోసెఫ్‌కు అధికారమివ్వబడింది.
-
నేడు జీవిస్తున్న ప్రవక్తలు మరియు అపొస్తలుల ద్వారా యేసు క్రీస్తు తన సంఘమును నడిపిస్తూ ఉన్నారు.
మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన
-
మోర్మన్ గ్రంథము అనేది పురాతన కాలంలో అమెరికాలోని ప్రవక్తలు వ్రాసిన లేఖనాల సంపుటి. జోసెఫ్ స్మిత్ దానిని దేవుని యొక్క వరము మరియు శక్తి చేత అనువదించాడు.
-
బైబిలుతో పాటు, మోర్మన్ గ్రంథము యేసు పరిచర్య, బోధనలు మరియు మన రక్షకునిగా చేసిన నియమితకార్యానికి సాక్ష్యమిస్తుంది.
-
మోర్మన్ గ్రంథాన్ని చదవడం ద్వారా మరియు దాని సూత్రాలకు కట్టుబడి ఉండడం ద్వారా మనం దేవునికి దగ్గర కాగలము.
-
మోర్మన్ గ్రంథమును చదవడం, ధ్యానించడం మరియు దాని గురించి ప్రార్థించడం ద్వారా అది దేవుని వాక్యమని మనం తెలుసుకోగలం. జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్త అని కూడా తెలుసుకోవడానికి ఈ ప్రక్రియ మనకు సహాయపడుతుంది.
పరిశుద్ధాత్మ ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రార్థించండి
-
ప్రార్థన అనేది దేవునికి, ఆయన పిల్లలకు మధ్య రెండు-వైపుల సంభాషణ.
-
మనఃపూర్వకమైన ప్రార్థన ద్వారా, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సందేశము నిజమైనదని మనం తెలుసుకోగలం.
-
మనం ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనకు సత్యాన్ని బోధిస్తాడు మరియు ధృవీకరిస్తాడు.
మీరు జనులను అడిగే ప్రశ్నలు
క్రింది ప్రశ్నలు మీరు జనులను అడిగే ప్రశ్నలకు ఉదాహరణలు. ఈ ప్రశ్నలు మీకు అర్థవంతమైన సంభాషణలు కలిగియుండడానికి మరియు వ్యక్తి యొక్క అవసరాలను, దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడగలవు.
-
దేవుని గురించి మీరేమి నమ్ముతారు?
-
దేవునికి దగ్గరగా భావించడం మీకెలా సహాయపడుతుంది?
-
యేసు క్రీస్తు గురించి మీకేమి తెలుసు? ఆయన జీవితం మరియు బోధనలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశాయి?
-
నేటి గందరగోళ ప్రపంచంలో మీరు నమ్మదగిన సమాధానాలను ఎలా కనుగొంటారు?
-
ఈ రోజు భూమిపైన సజీవ ప్రవక్త ఉన్నారని తెలుసుకోవడం మీకు ఎలా సహాయం చేస్తుంది?
-
మోర్మన్ గ్రంథము గురించి మీరు విన్నారా? అది ఎందుకు ముఖ్యమైనదో మేము పంచుకోవచ్చా?
-
మీరు ప్రార్థన గురించి మీ నమ్మకాలను పంచుకుంటారా? ప్రార్థన గురించి మా నమ్మకాలను పంచుకోవచ్చా?
మీరు ఇచ్చే ఆహ్వానాలు
-
మేము బోధించినది నిజమని మీకు తెలియజేసేందుకు మీరు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతారా? (ఈ పాఠము యొక్క చివరి భాగంలో “బోధనా పరిజ్ఞానములు: ప్రార్థన” చూడండి.)
-
మేము బోధించిన దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఈ ఆదివారం సంఘానికి హాజరవుతారా?
-
మీరు మోర్మన్ గ్రంథాన్ని చదివి, అది దేవుని వాక్యమని తెలుసుకోవడానికి ప్రార్థిస్తారా? (మీరు నిర్దిష్టమైన అధ్యాయాలను లేదా వచనాలను సూచించవచ్చు.)
-
మీరు యేసు మాదిరిని అనుసరించి, బాప్తిస్మం తీసుకుంటారా? (ఈ పాఠానికి ముందున్న “బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడానికి ఆహ్వానము,” చూడండి.)
-
మేము మా తదుపరి సందర్శన కోసం సమయాన్ని నిర్ణయించవచ్చా?
సిద్ధాంతపు పునాది
సువార్త గురించి మీ జ్ఞానాన్ని మరియు సాక్ష్యాన్ని బలోపేతం చేయడానికి మరియు బోధించడంలో మీకు సహాయం చేయడానికి ఈ విభాగం మీరు అధ్యయనం చేయడానికి సిద్ధాంతం మరియు లేఖనాలను అందిస్తుంది.
దేవుడు మన ప్రియమైన పరలోక తండ్రి.
దేవుడు మన పరలోక తండ్రి మరియు మనము ఆయన పిల్లలము. తన స్వరూపమందు ఆయన మనల్ని సృష్టించారు. ఆయన “స్పర్శించగలుగు మనుష్య శరీరమువలె మాంసము, ఎముకలు గల మహిమకరమైన, పరిపూర్ణమైన శరీరమును” కలిగియున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 130:22).
దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ఎరుగుదురు మరియు మనము గ్రహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తారు. ఆయన మన కష్టాలను, బాధలను, బలహీనతలను అర్థం చేసుకుంటారు మరియు వాటిలో ఆయన మనకు మద్దతునిస్తారు. ఆయన మన పురోగతిని చూసి సంతోషిస్తారు మరియు సరైన ఎంపికలు చేయడానికి మనకు సహాయం చేస్తారు. ఆయన మనతో సంభాషించాలని కోరుతున్నారు మరియు ప్రార్థన ద్వారా మనం ఆయనతో సంభాషించగలము.
దేవుడు మనకు భూమిపై ఈ అనుభవాన్ని ఇచ్చారు, కాబట్టి మనం నేర్చుకోగలము, ఎదగగలము మరియు మరింతగా ఆయనలా మారగలము. మనం మరణించిన తర్వాత ఆయన వద్దకు తిరిగి రావాలని పరిపూర్ణమైన ప్రేమతో ఆయన మనల్ని కోరుతున్నారు. అయినప్పటికీ, మనకై మనం దీనిని చేయలేము. దేవుడు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి, మనల్ని విమోచించడానికి ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తును పంపారు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు, … లోకము ఆయన ద్వారా రక్షణ పొందునట్లు ఆయనను అనుగ్రహించారు” (యోహాను 3:16–17).
దేవుడు మనల్ని శాంతి మరియు నిత్యత్వము వరకు ఉండే సంపూర్ణ ఆనందంతో దీవించాలని కోరుకుంటున్నారు. ఈ దీవెనలను పొందే అవకాశాన్ని మనకిచ్చే ఒక ప్రణాళికను ఆయన అందించారు. ఈ ప్రణాళికను రక్షణ ప్రణాళిక అంటారు (పాఠము 2 చూడండి).
ప్రతీ యుగములో ప్రవక్తల ద్వారా దేవుడు సువార్తను బయల్పరుస్తారు.
ప్రవక్తలు భూమిపై దేవుని ప్రతినిధులు
ప్రవక్తలను పిలవడం, వారికి యాజకత్వ అధికారాన్ని ఇవ్వడం మరియు ఆయన కోసం మాట్లాడేలా వారిని ప్రేరేపించడం అనేది దేవుడు మనపట్ల తనకున్న ప్రేమను చూపించే ఒక ముఖ్యమైన మార్గం. ప్రవక్తలు భూమిపై దేవుని ప్రతినిధులు. “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా యేమియు చేయడు” (ఆమోసు 3:7) అని పాత నిబంధన ప్రవక్త ఆమోసు వ్రాసాడు. జీవించియున్న ప్రవక్తల నుండి మనం పొందే కొన్ని దీవెనలు క్రింద ఇవ్వబడ్డాయి.
యేసు క్రీస్తు యొక్క సాక్షులు. ప్రవక్తలు యేసు క్రీస్తు యొక్క ప్రత్యేక సాక్షులు, ఆయనను మన రక్షకునిగా, విమోచకునిగా సాక్ష్యమిస్తారు.
బోధనలు. ఏది తప్పు, ఏది సత్యం అని గుర్తించడంలో మనకు సహాయం చేయడానికి ప్రవక్తలు దేవుని నుండి నిర్దేశాన్ని పొందుతారు. దేవుని ఆజ్ఞలను పాటించాలని మరియు మనలో లోపమున్నప్పుడు పశ్చాత్తాపపడాలని వారు మనకు బోధిస్తారు. వారు పాపాన్ని ఖండిస్తారు మరియు దాని పర్యవసానాల గురించి హెచ్చరిస్తారు.
ప్రవక్తల బోధనలు మనలను దేవుని వైపుకు తీసుకువెళతాయి మరియు ఆయన మన కోసం కోరుకునే దీవెనలను పొందడంలో మనకు సహాయపడతాయి. ప్రభువు తన ప్రవక్తల ద్వారా ఇచ్చిన మాటను అనుసరించడంలోనే మన గొప్ప భద్రత ఉంది.
యాజకత్వ అధికారము. ప్రస్తుత ప్రవక్త భూమిపై అధ్యక్షత్వం వహించు యాజకత్వం కలిగియున్నవారు. యాజకత్వము అనేది దేవుని శక్తి మరియు అధికారం. దేవుని పిల్లల రక్షణ కొరకు ఆయన నామములో మాట్లాడడానికి మరియు పని చేయడానికి ప్రవక్త అధికారం కలిగియున్నారు.
సంఘ నిర్దేశము. యేసు క్రీస్తు యొక్క సంఘము ప్రవక్తలు మరియు అపొస్తలుల పునాదిపై నిర్మించబడింది (ఎఫెసీయులకు 2:19–20; 4:11–14 చూడండి).
ప్రాచీన కాలములో ప్రవక్తలు
ఆదాము భూమిపై మొదటి ప్రవక్త. దేవుడు అతనికి యేసు క్రీస్తు యొక్క సువార్తను బయల్పరిచారు మరియు అతనికి యాజకత్వ అధికారమునిచ్చారు. ఆదాము, హవ్వలు తమ పిల్లలకు ఈ సత్యాలను బోధించారు మరియు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, సువార్తను జీవించడానికి వారిని ప్రోత్సహించారు.
చివరికి ఆదాము, హవ్వల సంతానం తిరుగుబాటు చేసి సువార్త నుండి వైదొలిగింది. ఇది విశ్వాసభ్రష్టత్వం లేదా దారి తప్పడం అనే స్థితికి దారితీసింది. విస్తృతమైన విశ్వాసభ్రష్టత్వం సంభవించినప్పుడు, దేవుడు తన యాజకత్వ అధికారాన్ని ఉపసంహరించుకుంటారు, ఇది సువార్త యొక్క విధులను బోధించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైనది.
పాత నిబంధన విస్తృతమైన విశ్వాసభ్రష్టత్వానికి సంబంధించిన అనేక సందర్భాలను నమోదు చేస్తుంది. ఈ కాలాలను ముగించడానికి, దేవుడు మరొక ప్రవక్తను పిలవడం ద్వారా తన పిల్లలను చేరుకున్నారు. ఆయన ఈ ప్రవక్తలకు సువార్త సత్యాలను క్రొత్తగా బయల్పరిచారు మరియు వారికి యాజకత్వ అధికారాన్ని ఇచ్చారు. నోవహు, అబ్రాహాము మరియు మోషే ఈ ప్రవక్తలలో కొందరు. దురదృష్టవశాత్తూ, కాలక్రమేణా పునరావృతమయ్యే పద్ధతిలో, జనులు క్రమంగా ప్రవక్తలను తిరస్కరించారు మరియు దారి తప్పారు.
యేసు క్రీస్తు యొక్క భూలోక పరిచర్య మరియు ప్రాయశ్చిత్తము
యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడు. యేసు మరియు ఆయన ప్రాయశ్చిత్తము మన కొరకు దేవుని యొక్క ప్రణాళికకు కేంద్రమైయున్నాయి. ఆయన ప్రాయశ్చిత్తంలో గెత్సేమనే తోటలో ఆయన బాధ, సిలువపై ఆయన బాధ మరియు మరణం మరియు ఆయన పునరుత్థానం ఉన్నాయి.
ఆదాము హవ్వల కాలం నుండి, జనులు తమ రక్షకుడిగా మరియు విమోచకునిగా యేసు క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. పరలోక తండ్రి 2,000 సంవత్సరాల క్రితం యేసును భూమికి పంపారు.
యేసు పరిపూర్ణమైన, పాపరహితమైన జీవితాన్ని జీవించారు. ఆయన తన సువార్తను బోధించారు మరియు తన సంఘాన్ని స్థాపించారు. ఆయన పన్నెండుమంది అపొస్తలులను పిలిచి, బోధించడానికి మరియు బాప్తిస్మము వంటి పవిత్రమైన విధులను నిర్వహించడానికి వారికి యాజకత్వ అధికారమునిచ్చారు. తన సంఘమును నడిపించడానికి కూడా ఆయన వారికి అధికారమునిచ్చారు.
ఆయన జీవితము యొక్క అంతమున, గెత్సేమనేలో మరియు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన శ్రమ ద్వారా మన పాపాల కొరకు యేసు ప్రాయశ్చిత్తం చేసారు. యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము వలన, మనము పశ్చాత్తాపపడినప్పుడు మన పాపముల నుండి మనం శుద్ధిచేయబడతాము. ఇది మనం దేవుని సన్నిధికి తిరిగివెళ్ళి, సంతోషము యొక్క సంపూర్ణత్వమును పొందుటను మనకు సాధ్యం చేస్తుంది.
యేసు సిలువ వేయబడిన తరువాత ఆయన పునరుత్థానం చెందారు, పరలోక తండ్రి శక్తి ద్వారా మరణంపై విజయం సాధించారు. యేసు యొక్క పునరుత్థానము వలన, మనమందరం మరణించిన తర్వాత పునరుత్థానం చెందుతాము. దీని అర్థం ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమవుతాయి మరియు మనలో ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన, పునరుత్థానం చెందిన శరీరంలో శాశ్వతంగా జీవిస్తాము. (పాఠము 2 లో “యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము” చూడండి.)
ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా ప్రకటించారు, “మన మతం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏవనగా, యేసు క్రీస్తు మరణించారని, సమాధి చేయబడ్డారని, మూడవరోజు తిరిగి లేచారని మరియు పరలోకంలోకి ఆరోహణమయ్యారని ఆయనకు సంబంధించి అపొస్తలులు మరియు ప్రవక్తలు ఇచ్చిన సాక్ష్యము; మన మతానికి సంబంధించిన మిగతావన్నీ దానికి అనుబంధములు మాత్రమే” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 49).
దారి తప్పుట
యేసు క్రీస్తు మరణం తరువాత, ఆయన అపొస్తలులు క్రీస్తు సిద్ధాంతాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి మరియు సంఘములో క్రమాన్ని కొనసాగించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ, చాలామంది సంఘ సభ్యులు అపొస్తలుల నుండి మరియు యేసు బోధించిన సిద్ధాంతం నుండి దూరంగా ఉన్నారు.
అపొస్తలులు చంపబడిన తర్వాత, సువార్త మరియు యేసు క్రీస్తు సంఘము నుండి విస్తృతంగా దారి తప్పడం జరిగింది. ఈ దారి తప్పడం కొన్నిసార్లు గొప్ప విశ్వాసభ్రష్టత్వమని పిలువబడింది. దీని మూలంగా దేవుడు యాజకత్వ అధికారమును భూమిపై నుండి ఉపసంహరించుకున్నారు. ఈ నష్టం సంఘమును నడిపించడానికి అవసరమైన అధికారాన్ని కలిపియుంది. ఫలితంగా, యేసు స్థాపించిన సంఘము భూమిపై ఇక లేకుండా పోయింది.
ఈ సమయంలో, జనులు అనేక సువార్త బోధనలను మార్చివేసారు. పరలోక తండ్రి, యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ యొక్క నిజమైన స్వభావాన్ని గురించిన అధిక జ్ఞానం వక్రీకరించబడింది లేదా కోల్పోబడింది. బాప్తిస్మము వంటి యాజకత్వ విధులను కూడా జనులు మార్చివేసారు.
శతాబ్దాల తర్వాత, సత్యాన్వేషణ చేసే స్త్రీ పురుషులు మార్చబడిన బోధనలు మరియు అభ్యాసాలను సంస్కరించడానికి ప్రయత్నించారు. వారు గొప్ప ఆధ్యాత్మిక వెలుగును కోరుకున్నారు మరియు వారిలో కొందరు సత్యాన్ని పునఃస్థాపించవలసిన అవసరాన్ని గురించి మాట్లాడారు. వారి ప్రయత్నాలు అనేక సంఘాల ఏర్పాటుకు దారితీసాయి.
ఈ కాలంలో మతపరమైన స్వేచ్ఛపై ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది, ఇది దేవుని నుండి సత్యం మరియు అధికారం యొక్క పునఃస్థాపనకు మార్గం తెరిచింది.
దారి తప్పడం గురించి ప్రవక్తలు మరియు అపొస్తలులు ముందుగానే చెప్పారు (2 థెస్సలొనీకయులకు 2:1–3 చూడండి). యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు సంఘము భూమిపైన పునఃస్థాపించబడతాయని కూడా వారు ముందే చెప్పారు (అపొస్తలుల కార్యములు 3:20–21 చూడండి). దారి తప్పకుండా ఉండి ఉంటే, పునఃస్థాపన అవసరం ఉండేది కాదు.
జోసెఫ్ స్మిత్ ద్వారా యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన
మొదటి దర్శనము మరియు ఒక ప్రవక్తగా జోసెఫ్ స్మిత్ యొక్క పిలుపు
యేసు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణత భూమిపై లేని శతాబ్దాలలో, పరలోక తండ్రి తన పిల్లలను చేరుకోవడం కొనసాగించారు. కాలక్రమేణా, వారు తన సువార్త యొక్క సంపూర్ణతతో మళ్ళీ దీవించబడేలా ఆయన మార్గాన్ని సిద్ధం చేసారు. పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పుడు, ఆయన జోసెఫ్ స్మిత్‌ను ప్రవక్తగా పిలిచారు, అతని ద్వారా యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు సంఘము పునఃస్థాపించబడతాయి.
జోసెఫ్ స్మిత్ తూర్పు సంయుక్త రాష్ట్రాలలో గొప్ప మతపరమైన ఉత్సాహం ఉన్న సమయంలో నివసించాడు. అతని కుటుంబ సభ్యులు దేవునికి అంకితమయ్యారు మరియు సత్యాన్ని అన్వేషించారు. చాలా సంఘాలు సత్యాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి మరియు జోసెఫ్ ఏది సరైనదో తెలుసుకోవాలనుకున్నాడు (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:18 చూడండి). “ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, బాప్తిస్మమొక్కటే” (ఎఫెసీయులకు 4:5) అని బైబిలు బోధిస్తుంది. జోసెఫ్ వివిధ సంఘాలకు హాజరైనప్పుడు, ఎందులో చేరాలనే దాని గురించి అతడు అయోమయంలో పడ్డాడు. తర్వాత అతడు ఇలా చెప్పాడు:
“కానీ వేర్వేరు తరగతుల మధ్య నెలకొనియున్న గందరగోళము, వివాదముల వలన, నా వలె యౌవనములో ఉండి, … ఎవరు తప్పో, ఎవరు ఒప్పో అని ఒక నిర్దిష్టమైన ముగింపుకు రావడం అసాధ్యమయ్యెను. …
“ఈ వాగ్వివాదము మరియు అభిప్రాయభేదముల నడుమ ఏమి చేయవలెను? ఈ పక్షములన్నిటిలో ఎవరు సరియైనవారు; లేదా అందరు సరియైనవారు కారా? వాటిలో ఏదో ఒకటి సరియైనదైతే, అది ఏది? దానిని నేను ఏవిధముగా తెలుసుకోగలను? అని తరచు నన్ను నేను ప్రశ్నించుకొంటిని” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:8, 10).
చాలామంది వ్యక్తుల మాదిరిగానే, జోసెఫ్ స్మిత్‌కు కూడా అతని ఆత్మ యొక్క రక్షణ గురించి ప్రశ్నలు ఉన్నాయి. తన పాపాలు క్షమించబడి, దేవుని ముందు శుద్ధిగా ఉండాలని అతడు కోరుకున్నాడు. వివిధ సంఘాల మధ్య సత్యాన్ని వెదుకుతున్నప్పుడు అతడు బైబిలులో ఇలా చదివాడు, “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయును” (యాకోబు 1:5).
ఈ గద్యభాగం కారణంగా, జోసెఫ్ తాను ఏమి చేయాలో దేవుణ్ణి అడగాలని నిర్ణయించుకున్నాడు. 1820 వసంతకాలంలో, అతను తన ఇంటికి సమీపంలోని చెట్ల వనము వద్దకు వెళ్ళి ప్రార్థనలో మోకరించాడు. ఆ తర్వాత కలిగిన దర్శనం గురించి జోసెఫ్ స్మిత్ లేదా అతని ఆధ్వర్యంలోని లేఖకులచేత నమోదు చేయబడిన నాలుగు వృత్తాంతాలు ఉన్నాయి (see Gospel Topics Essays, “First Vision Accounts [మొదటి దర్శన వృత్తాంతాలు]”). లేఖనముగా ఎంచబడిన వృత్తాంతంలో, అతను తన అనుభవాన్ని ఈ క్రింది విధంగా వివరించాడు:
“సరిగ్గా నా తలపై సూర్యకాంతిని మించిన ఒక కాంతి స్తంభమును చూచితిని, అది నా మీద పడువరకు క్రమముగా క్రిందకు దిగెను. … ఆ కాంతి నాపై నిలిచిన తరువాత గాలిలో నా పైన నిలువబడిన ఇద్దరు వ్యక్తులను నేను చూచితిని, వారి తేజస్సు, మహిమ వర్ణనాతీతముగా నుండెను. వారిలో ఒకరు నన్ను పేరుపెట్టి పిలిచి, మరొకరిని చూపించుచూ—ఈయన నా ప్రియకుమారుడు. ఈయన మాట వినుము!” అనిరి. (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:16-17).
ఈ దర్శనంలో, జోసెఫ్ స్మిత్‌కు తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు అగుపించారు. ఏ సంఘములోనూ చేరవద్దని రక్షకుడు అతనితో చెప్పారు.
ఈ దర్శనం యొక్క మరొక వృత్తాంతంలో, రక్షకుడు తనతో ఇలా కూడా చెప్పారని జోసెఫ్ పంచుకున్నాడు: “నీ పాపాలు క్షమించబడ్డాయి. … ఇదిగో, నేను మహిమ కలిగిన ప్రభువును. నా నామమున విశ్వసించు వారందరు నిత్యజీవం పొందునట్లు నేను లోకం కొరకు సిలువ వేయబడ్డాను.”
దర్శనం తర్వాత, జోసెఫ్ ఇలా ప్రతిబింబించాడు, “నా ఆత్మ ప్రేమతో నిండిపోయింది, చాలా రోజులు నేను చాలా ఆనందంతో సంతోషించగలను మరియు ప్రభువు నాతో ఉన్నారు” (Joseph Smith History, circa Summer 1832, 3, josephsmithpapers.org; అక్షరక్రమం మరియు విరామ చిహ్నాలు ఆధునీకరించబడ్డాయి).
ఈ దర్శనం ద్వారా, జోసెఫ్ స్మిత్ యేసు క్రీస్తు యొక్క సాక్షి అయ్యాడు మరియు దైవసమూహము గురించి ముఖ్యమైన సత్యాలను తెలుసుకున్నాడు. ఉదాహరణకు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వేర్వేరు వ్యక్తులని అతడు తెలుసుకున్నాడు. వారు అతన్ని పేరు పెట్టి పిలిచినప్పుడు, వారు అతన్ని వ్యక్తిగతంగా ఎరుగుదురని తెలుసుకున్నాడు. అతను క్షమించబడ్డాడని జోసెఫ్‌కు చెప్పబడినప్పుడు, దేవుడు దయగలవాడని అతడు తెలుసుకున్నాడు. ఈ అనుభవం అతడిని ఆనందంతో నింపింది.
దేవుడు చాలామంది మునుపటి ప్రవక్తలతో చేసినట్లుగా, ఆయన జోసెఫ్ స్మిత్‌ను ప్రవక్తగా పిలిచారు, అతని ద్వారా సువార్త యొక్క సంపూర్ణత భూమిపైన పునఃస్థాపించబడుతుంది. ఈ పునరుద్ధరణ దేవుని పిల్లలు ఈ లోకంలో ఆనందాన్ని పొందేందుకు మరియు రాబోయే లోకంలో నిత్యజీవాన్ని పొందేందుకు సహాయం చేస్తుంది—అన్నీ యేసు క్రీస్తు ద్వారా.
యాజకత్వము మరియు యాజకత్వ తాళపుచెవుల యొక్క పునఃస్థాపన
తండ్రి మరియు కుమారుడు అగుపించిన తర్వాత, జోసెఫ్ స్మిత్ మరియు అతని సహచరుడైన ఆలీవర్ కౌడరీ వద్దకు ఇతర పరలోక దూతలు పంపబడ్డారు. బాప్తిస్మమిచ్చు యోహాను పునరుత్థానము చెందిన వ్యక్తిగా అగుపించాడు మరియు వారికి అహరోను యాజకత్వమును, దాని తాళపుచెవులను అనుగ్రహించాడు. అహరోను యాజకత్వము బాప్తిస్మమిచ్చు అధికారాన్ని కలిపియుంది.
వెనువెంటనే పేతురు, యాకోబు మరియు యోహాను—క్రీస్తు యొక్క మొదటి అపొస్తలులలో ముగ్గురు—జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలకు పునరుత్థానము చెందిన వ్యక్తులుగా అగుపించారు మరియు వారికి మెల్కీసెదెకు యాజకత్వమును, దాని తాళపుచెవులను అనుగ్రహించారు. ఈ యాజకత్వము ప్రాచీనకాలములో క్రీస్తు తన అపొస్తలులకిచ్చిన అదే అధికారము.
కర్ట్‌లాండ్ దేవాలయంలో, మోషే, ఎలియాసు మరియు ఏలీయా జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవరి కౌడరీలకు అగుపించారు మరియు కడవరి దినాలలో దేవుని కార్యాన్ని సాధించడానికి అవసరమైన తదుపరి అధికారాన్ని మరియు యాజకత్వ తాళపుచెవులను వారికి అందించారు. ఇశ్రాయేలు సమకూర్పు యొక్క తాళపుచెవులను మోషే అందించాడు. అబ్రాహాము సువార్త యొక్క యుగమును ఎలియాసు అందించాడు. ముద్రించు శక్తి యొక్క తాళపుచెవులను ఏలీయా అందించాడు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11–16 చూడండి; ప్రధాన చేతిపుస్తకము, 3.1 కూడా చూడండి.)
సంఘము యొక్క ఏర్పాటు
యేసు క్రీస్తు యొక్క సంఘమును భూమిపై మరలా ఏర్పాటు చేయడానికి జోసెఫ్ స్మిత్ నిర్దేశించబడ్డాడు. అతని ద్వారా, యేసు క్రీస్తు పన్నెండుమంది అపొస్తలులను పిలిచారు.
బైబిలు కాలాల్లోని ప్రవక్తలు మనం జీవించే సమయాన్ని అంత్య దినములు లేదా కడవరి దినములుగా సూచిస్తారు. ఇది యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు సమయం. అందుకే సంఘానికి యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము అని పేరు పెట్టబడింది (సిద్ధాంతము మరియు నిబంధనలు 115:3–4 చూడండి; 3 నీఫై 27:3–8 కూడా చూడండి).
నేడు జీవిస్తున్న ప్రవక్తలు మరియు అపొస్తలులు
యేసు తన మర్త్య పరిచర్య సమయంలో తన సంఘాన్ని నడిపించడానికి అపొస్తలులను పిలిచినట్లే, ఈ రోజు దానిని నడిపించడానికి అపొస్తలులను పిలిచారు. ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులైయున్నారు.
సీనియర్ అపొస్తలుడు మాత్రమే ప్రవక్త అని పిలువబడ్డారు, ఎందుకంటే ఆయన మొత్తం సంఘానికి అధ్యక్షత్వం వహిస్తారు మరియు ప్రభువు కొరకు మాట్లాడడానికి ప్రత్యేకంగా అధికారం కలిగి ఉన్నారు. ఆయన జోసెఫ్ స్మిత్‌కు అధీకృత వారసుడు. ఆయన మరియు ప్రస్తుత అపొస్తలులు జోసెఫ్ స్మిత్ పరలోక దూతల చేతుల్లో నియమించబడినప్పుడు ప్రారంభమైన అవిచ్ఛిన్న నియామకాల గొలుసులో యేసు క్రీస్తు వరకు తమ అధికారాన్ని గుర్తిస్తారు.
మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన
మోర్మన్ గ్రంథము అనేది బైబిలు వంటి పవిత్ర గ్రంథం యొక్క పురాతన సంపుటి. బైబిలు యేసు క్రీస్తుకు ఒక సాక్ష్యము మరియు మోర్మన్ గ్రంథం ఆయన పరిచర్యకు, ఆయన బోధనలకు మరియు మన రక్షకునిగా ఆయన నియమితకార్యానికి రెండవ సాక్ష్యము.
మొరోనై అనే పరలోక దూత శతాబ్దాలుగా పాతిపెట్టిన పురాతన గ్రంథం ఉన్న కొండకు జోసెఫ్ స్మిత్‌ను నడిపించాడు. బంగారు పలకలపై (పలుచని లోహపు పలకలు) చెక్కబడిన ఈ గ్రంథంలో, అమెరికాలోని కొంతమంది ప్రాచీన నివాసులతో దేవుని వ్యవహారాల గురించి ప్రవక్తల వ్రాతలు ఉన్నాయి. జోసెఫ్ స్మిత్ ఈ గ్రంథాన్ని దేవుని యొక్క వరము మరియు శక్తి చేత అనువదించాడు.
మోర్మన్ గ్రంథములోని ప్రవక్తలకు యేసు క్రీస్తు యొక్క నియమితకార్యము గురించి తెలుసు మరియు ఆయన సువార్తను బోధించారు. యేసు పునరుత్థానం చెందిన తర్వాత, ఆయన ఈ జనులకు అగుపించారు మరియు వారికి వ్యక్తిగతంగా పరిచర్య చేసారు. ఆయన వారికి బోధించారు మరియు తన సంఘాన్ని స్థాపించారు.
దాని బోధనలను నేర్చుకొని, అర్థం చేసుకుని, అన్వయించుకున్నప్పుడు దేవునికి దగ్గరవ్వడానికి మోర్మన్ గ్రంథం మనకు సహాయం చేస్తుంది. “ఒక మనుష్యుడు ఏ ఇతర గ్రంథము కన్నను దీని యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని” ప్రవక్త జోసెఫ్ స్మిత్ చెప్పారు (Teachings: Joseph Smith, 64).
మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమని తెలుసుకొనుటకు, మనము దానిని చదవాలి, దానిని ధ్యానించాలి మరియు దాని గురించి ప్రార్థించాలి. యథార్థ హృదయముతో, నిజమైన ఉద్దేశ్యముతో, క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి మనం ప్రార్థించినప్పుడు, దేవుడు మనకు ఆ గ్రంథం యొక్క సత్యాన్ని బయల్పరుస్తారని ఒక మోర్మన్ గ్రంథ ప్రవక్త వాగ్దానమిచ్చారు (మొరోనై 10:3–5 చూడండి). శాశ్వతమైన పరివర్తనకు మోర్మన్ గ్రంథమును అధ్యయనం చేయడం అవసరం.
మనం మోర్మన్ గ్రంథాన్ని చదివి, దాని గురించి ప్రార్థించినప్పుడు, యేసు క్రీస్తు గురించి మన జీవితాలను దీవించే సత్యాలను మనం నేర్చుకుంటాము. జోసెఫ్ స్మిత్ దేవుని యొక్క ప్రవక్తయని, యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు సంఘము ఆయన ద్వారా పునఃస్థాపించబడ్డాయని కూడా మనం తెలుసుకుంటాము.
“మీరు ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా మోర్మన్ గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడు, మీరు ప్రతిరోజు— మంచి నిర్ణయాలను తీసుకుంటారు. మీరు అధ్యయనం చేసినదానిని ధ్యానించినప్పుడు, ఆకాశపు వాకిండ్లు విప్పబడతాయి, మీ స్వంత ప్రశ్నలకు సమాధానాలను మరియు మీ స్వంత జీవితం కొరకు నడిపింపును మీరు అందుకుంటారని నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రతిరోజు మోర్మన్ గ్రంథములో మీరు నిమగ్నమైతే, నేటి చెడుకార్యములనుండి విముక్తి పొందగలుగుతారు అని నేను ప్రమాణం చేస్తున్నాను” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “మోర్మన్ గ్రంథము: అది లేకపోతే మీ జీవితం ఎలా ఉండేది?” లియహోనా, నవ. 2017, 62–63).
పరిశుద్ధాత్మ ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రార్థించండి
దేవుడు మన తండ్రి కాబట్టి, సత్యాన్ని గుర్తించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సందేశము నిజమని మనం మోర్మన్ గ్రంథాన్ని చదివి దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు తెలుసుకోవచ్చు. మనం విశ్వాసంతో మరియు నిజమైన ఉద్దేశ్యంతో ప్రార్థించినప్పుడు, ఆయన మన ప్రశ్నలకు సమాధానమిచ్చి, మన జీవితాలను నడిపిస్తారు.
దేవుడు సాధారణంగా పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రార్థనలకు జవాబిస్తారు. మనం ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ సత్యాన్ని బోధిస్తాడు మరియు ధృవీకరిస్తాడు. పరిశుద్ధాత్మ నుండి వచ్చే సంభాషణలు శక్తివంతమైనవి. అవి సాధారణంగా మన భావాలు, ఆలోచనలు మరియు మనోభావనల ద్వారా నిశ్శబ్ద హామీగా వస్తాయి (1 రాజులు 19:11–12; హీలమన్ 5:30; సిద్ధాంతము మరియు నిబంధనలు 8:2 చూడండి).
లేఖనాల స్థిరమైన అధ్యయనం (ముఖ్యంగా మోర్మన్ గ్రంథం), ప్రతీవారం సంస్కార సమావేశానికి హాజరవడం మరియు హృదయపూర్వక ప్రార్థన మనకు పరిశుద్ధాత్మ శక్తిని అనుభూతి చెందడానికి మరియు సత్యాన్ని కనుగొనడానికి సహాయపడతాయి.
చిన్న నుండి మధ్యస్థ పాఠ్య నమూనా
క్రింది రూపురేఖలు మీకు క్లుప్త సమయం ఉంటే మీరు ఎవరికైనా ఏమి బోధించవచ్చు అనే దాని నమూనా. ఈ నమూనాలను ఉపయోగిస్తున్నప్పుడు, బోధించడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూత్రాలను ఎంచుకోండి. ప్రతి సూత్రానికి సిద్ధాంతపు పునాది పాఠంలో ముందుగా అందించబడింది.
మీరు బోధిస్తున్నప్పుడు, ప్రశ్నలు అడగండి మరియు వినండి. దేవునికి ఎలా దగ్గరవ్వాలో తెలుసుకోవడానికి జనులకు సహాయపడే ఆహ్వానాలను ఇవ్వండి. ఒక వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ కలవడానికి ఒక ముఖ్యమైన ఆహ్వానం ఇవ్వండి. పాఠం యొక్క నిడివి మీరు అడిగే ప్రశ్నలు మరియు మీరు వినడంపై ఆధారపడి ఉంటుంది.
మీరు 3-10 నిమిషాల్లో జనులకు ఏమి బోధించవచ్చు
-
దేవుడు మన పరలోక తండ్రి మరియు ఆయన తన స్వరూపంలో మనల్ని సృష్టించారు. ఆయన మనల్ని వ్యక్తిగతంగా ఎరుగుదురు మరియు మనల్ని ప్రేమిస్తారు. ఆయన మనల్ని శాంతి మరియు నిత్యత్వము వరకు నిలిచియుండే సంపూర్ణ ఆనందంతో దీవించాలని కోరుకుంటున్నారు.
-
యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడు. మన పాపాల నుండి శుద్ధి చేయబడడం, మరణాన్ని అధిగమించడం మరియు నిత్యజీవాన్ని పొందడాన్ని మనకు సాధ్యపరచడమే ఆయన నియమితకార్యము.
-
భూమిపై ఆయన ప్రతినిధులుగా ఉండేందుకు దేవుడు ప్రవక్తలను పిలుస్తారు. ప్రాచీనకాలంలో ఆయన ఆదాము, నోవహు, అబ్రాహాము మరియు మోషే వంటి ప్రవక్తలను పిలిచారు. నేడు మనకు బోధించడానికి మరియు దారిచూపడానికి జీవించియున్న ప్రవక్త దేవుని నుండి బయల్పాటు పొందుతారు.
-
యేసు యొక్క మర్త్య పరిచర్య సమయంలో, ఆయన తన సంఘమును స్థాపించారు. యేసు యొక్క అపొస్తలులు మరణించిన తర్వాత, యేసు క్రీస్తు యొక్క సువార్త మరియు సంఘము నుండి అనేకమంది దారితప్పడం జరిగింది. జనులు బాప్తిస్మం వంటి అనేక సువార్త బోధనలను మరియు యాజకత్వ విధులను మార్చివేసారు.
-
దేవుడు పూర్వకాలంలో ప్రవక్తలను పిలిచినట్లే, జోసెఫ్ స్మిత్‌ను ఒక ప్రవక్తగా పిలిచారు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు అతనికి అగుపించారు. అతని ద్వారా యేసు క్రీస్తు యొక్క సువార్త పునఃస్థాపించబడింది.
-
మోర్మన్ గ్రంథము ఒక లేఖన సంపుటి. బైబిలు వలె, ఇది యేసు క్రీస్తు యొక్క నిబంధన మరియు మనం దానిని చదివేటప్పుడు మరియు దాని సూత్రాలను అన్వయించేటప్పుడు దేవునికి దగ్గరవ్వడానికి మనకు సహాయపడుతుంది. జోసెఫ్ స్మిత్ దానిని దేవుని యొక్క వరము మరియు శక్తి చేత అనువదించాడు.
-
హృదయపూర్వక ప్రార్థన ద్వారా, మనం దేవునితో సంభాషించవచ్చు. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త యొక్క సందేశము నిజమని మనం తెలుసుకోవచ్చు.