“అధ్యాయము 3: పాఠము 3—యేసు క్రీస్తు యొక్క సువార్త,” నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023)
“అధ్యాయము 3: పాఠము 3,” నా సువార్తను ప్రకటించండి
అధ్యాయము 3: పాఠము 3
యేసు క్రీస్తు యొక్క సువార్త
మనం క్రీస్తు వద్దకు ఎలా వస్తాము అనేదే యేసు క్రీస్తు యొక్క సువార్త. ఇది ఒక బిడ్డ అర్థం చేసుకోగలిగేంత సులభమైనది. ఈ పాఠం యేసు క్రీస్తుపై విశ్వాసం, పశ్చాత్తాపం, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ వరము మరియు అంతము వరకు సహించడంతో పాటు క్రీస్తు యొక్క సువార్త మరియు సిద్ధాంతంపై దృష్టి పెడుతుంది. దేవుని పిల్లలందరినీ సువార్త ఎలా దీవిస్తుందనే దానిపై కూడా ఇది దృష్టి పెడుతుంది.
సువార్త అను పదానికి అర్థము “శుభవార్త.” యేసు క్రీస్తు సువార్త ఒక శుభవార్త, ఎందుకంటే మనం ఆయన వద్దకు వచ్చి రక్షింపబడాలి అనే సిద్ధాంతాన్ని—నిత్య సత్యాన్ని—అది అందిస్తుంది (1 నీఫై 15:14 చూడండి). మంచి, అర్థవంతమైన జీవితాలను ఎలా జీవించాలో సువార్త మనకు బోధిస్తుంది. సువార్త యొక్క శుభవార్త మన పాపములు క్షమించబడుటకు, పవిత్రపరచబడుటకు మరియు దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళుటకు మనకు మార్గాన్ని అందిస్తుంది.
బోధించుటకు సూచనలు
బోధించడానికి సిద్ధపడేందుకు ఈ విభాగం మీకు నమూనా రూపురేఖలను అందిస్తుంది. ఇందులో మీరు ఉపయోగించగల ప్రశ్నలు మరియు ఆహ్వానాల ఉదాహరణలు కూడా ఉన్నాయి.
మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ప్రతి వ్యక్తి యొక్క పరిస్థితిని మరియు ఆధ్యాత్మిక అవసరాలను ప్రార్థనాపూర్వకంగా పరిగణించండి. ఏది బోధించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందో నిర్ణయించండి. జనులు అర్థం చేసుకోలేని పదాలను నిర్వచించడానికి సిద్ధపడండి. పాఠాలను క్లుప్తంగా ఉంచాలని గుర్తుంచుకొని, మీకు ఎంత సమయం ఉంటుందో దాని ప్రకారం ప్రణాళిక చేయండి.
మీరు బోధించేటప్పుడు ఉపయోగించడానికి లేఖనాలను ఎంపిక చేయండి. పాఠంలోని “సిద్ధాంతపు పునాది” విభాగంలో చాలా సహాయకరమైన లేఖనాలు ఉన్నాయి.
మీరు బోధించేటప్పుడు ఏ ప్రశ్నలు అడగాలో పరిగణించండి. ప్రతి వ్యక్తిని చర్య తీసుకునేలా ప్రోత్సహించే విధంగా ఆహ్వానాలివ్వడానికి ప్రణాళిక చేయండి.
దేవుడు వాగ్దానం చేసిన దీవెనలను నొక్కి చెప్పండి మరియు మీరు బోధించే దాని గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోండి.
15–25 నిమిషాలలో మీరు జనులకు ఏమి బోధించవచ్చు
బోధించడానికి క్రింది సూత్రాలలో ఒకటి లేదా ఎక్కువ ఎంపిక చేయండి. ప్రతి సూత్రానికి సిద్ధాంతపు పునాది ఈ నమూనా తర్వాత అందించబడుతుంది.
యేసు క్రీస్తు యొక్క దైవిక నియమితకార్యము
-
పాపం మరియు మరణం నుండి మనల్ని విమోచించడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును భూమిపైకి పంపారు.
-
యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము వలన, మనము పశ్చాత్తాపపడినప్పుడు మన పాపముల నుండి మనం శుద్ధిచేయబడగలము మరియు పవిత్రపరచబడగలము.
-
యేసు సిలువ వేయబడిన తర్వాత, ఆయన పునరుత్థానము చెందారు. ఆయన పునరుత్థానము కారణంగా, మనమందరం మరణించిన తర్వాత పునరుత్థానం చెందుతాము. దీని అర్థం ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమవుతాయి మరియు మనలో ప్రతీ ఒక్కరం పరిపూర్ణమైన, పునరుత్థానం చేయబడిన శరీరంలో శాశ్వతంగా జీవిస్తాము.
యేసు క్రీస్తు నందు విశ్వాసము
-
విశ్వాసము అనేది యేసు క్రీస్తు సువార్త యొక్క మొదటి సూత్రము.
-
యేసు క్రీస్తుపై విశ్వాసం అంటే ఆయన దేవుని కుమారుడని నమ్మకం కలిగి ఉండడం మరియు ఆయనను మన రక్షకునిగా మరియు విమోచకునిగా విశ్వసించడం.
-
యేసు క్రీస్తుపై విశ్వాసం అనేది చర్య మరియు శక్తి యొక్క సూత్రం.
-
ప్రార్థించడం, లేఖనాలను అధ్యయనం చేయడం మరియు ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారా మనం మన విశ్వాసాన్ని బలపరచుకుంటాము.
పశ్చాత్తాపము
-
యేసు క్రీస్తునందు విశ్వాసం పశ్చాత్తాపానికి దారితీస్తుంది. పశ్చాత్తాపం అనేది దేవుని వైపు తిరిగే మరియు పాపం నుండి దూరమయ్యే ప్రక్రియ. మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన చర్యలు, కోరికలు మరియు ఆలోచనలు దేవుని చిత్తానికి మరింత అనుగుణంగా మారతాయి.
-
మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు, దేవుడు మనల్ని క్షమిస్తారు. యేసు క్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసినందున క్షమాపణ సాధ్యమవుతుంది.
-
మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన అపరాధ భావన మరియు బాధ తొలగినట్లు మనం శాంతిని అనుభవిస్తాము.
-
పశ్చాత్తాపము అనేది జీవితకాల ప్రక్రియ. మనం పశ్చాత్తాపపడిన ప్రతిసారీ దేవుడు మనల్ని తిరిగి స్వాగతిస్తారు. ఆయన మనల్ని ఎప్పటికీ వదులుకోరు.
బాప్తిస్మము: దేవునితో మన మొదటి నిబంధన
-
బాప్తిస్మము అంటే మనం మొదట దేవునితో నిబంధన సంబంధములో ఎలా ప్రవేశిస్తాము అనేది.
-
బాప్తిస్మములో రెండు భాగాలు ఉన్నాయి: నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా బాప్తిస్మము. మనం బాప్తిస్మము తీసుకున్నప్పుడు మరియు నిర్ధారించబడినప్పుడు, మన పాపాల నుండి మనం శుద్ధి చేయబడతాము, ఇది మనకు జీవితంలో క్రొత్త ప్రారంభాన్ని ఇస్తుంది.
-
యేసు మాదిరిని అనుసరిస్తూ, మనం ముంచడం ద్వారా బాప్తిస్మము పొందుతాము.
-
పిల్లలు ఎనిమిది సంవత్సరాల వయస్సు వరకు బాప్తిస్మము పొందరు. ఆ వయస్సు కంటే ముందు మరణించిన పిల్లలు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా విమోచించబడతారు.
-
యేసు త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, దేవునితో మన నిబంధనలను పునరుద్ధరించడానికి మనం ప్రతీవారం సంస్కారములో పాల్గొంటాము.
పరిశుద్ధాత్మ వరము
-
పరిశుద్ధాత్మ దైవసమూహములో మూడవ సభ్యుడు.
-
మనము బాప్తిస్మము పొందిన తరువాత, నిర్ధారణ అని పిలువబడిన విధి ద్వారా మనము పరిశుద్ధాత్మ వరమును పొందుతాము.
-
మనం పరిశుద్ధాత్మ వరమును పొందినప్పుడు, మనం విశ్వాసంగా ఉంటే మన జీవితమంతా ఆయన సహవాసాన్ని కలిగి ఉండగలం.
-
పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు, నడిపిస్తాడు, ఓదారుస్తాడు మరియు సత్యమును తెలుసుకోవడానికి మనకు సహాయపడతాడు.
అంతము వరకు సహించుట
-
సహించడంలో ప్రతిరోజూ క్రీస్తుపై విశ్వాసం సాధన చేయడాన్ని కొనసాగించడం కూడా ఉంటుంది. మనం దేవునితో మన నిబంధనలను పాటించడం, పశ్చాత్తాపపడడం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని వెదకడం మరియు సంస్కారములో పాల్గొనడాన్ని కొనసాగిస్తాము.
-
మనం విశ్వాసంతో యేసు క్రీస్తును అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు, మనం నిత్యజీవం కలిగియుంటామని దేవుడు వాగ్దానం చేస్తున్నారు.
యేసు క్రీస్తు యొక్క సువార్త దేవుని పిల్లలందరినీ దీవిస్తుంది
-
సువార్తను జీవించడం మన ఆనందాలను మరింతగా పెంచుతుంది, మన చర్యలను ప్రేరేపిస్తుంది మరియు మన సంబంధాలను సుసంపన్నం చేస్తుంది.
-
మనం యేసు క్రీస్తు బోధనల ప్రకారం జీవిస్తున్నప్పుడు—వ్యక్తులుగా మరియు కుటుంబాలుగా—మనం సంతోషంగా ఉండే అవకాశం ఉంది.
-
యేసు క్రీస్తు సువార్త ద్వారా, కుటుంబాలు ఈ జీవితంలో దీవించబడతాయి మరియు నిత్యత్వం కోసం ఏకమై, దేవుని సన్నిధిలో జీవించగలవు.
మీరు జనులను అడిగే ప్రశ్నలు
క్రింది ప్రశ్నలు మీరు జనులను అడిగే ప్రశ్నలకు ఉదాహరణలు. ఈ ప్రశ్నలు మీకు అర్థవంతమైన సంభాషణలు కలిగియుండడానికి మరియు వ్యక్తి యొక్క అవసరాలను, దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడగలవు.
-
యేసు క్రీస్తు గురించి మీకేమి తెలుసు?
-
యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగియుండడం అంటే మీకు గల అర్థమేమిటి?
-
మీరు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు?
-
పశ్చాత్తాపం గురించి మీ అవగాహన ఏమిటి?
-
బాప్తిస్మము గురించి మీ అవగాహన ఏమిటి? బాప్తిస్మము కోసం సిద్ధం కావడానికి మీరు ఇప్పుడు ఏమి చేయగలరు?
-
దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి మీ ప్రయాణంలో పరిశుద్ధాత్మ మీకు ఎలా సహాయం చేయగలడు?
-
మీరు లేదా మీ కుటుంబం ఎదుర్కొంటున్న సవాలు ఏమిటి? యేసు క్రీస్తు సువార్త సహాయం చేయగల కొన్ని మార్గాలను మేము పంచుకోవచ్చా?
మీరు ఇచ్చే ఆహ్వానాలు
-
మేము బోధించినది నిజమని మీకు తెలియజేసేందుకు మీరు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతారా? (1వ పాఠము యొక్క చివరి భాగంలో “బోధనా పరిజ్ఞానములు: ప్రార్థన” చూడండి.)
-
మేము బోధించిన దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఈ ఆదివారం సంఘానికి హాజరవుతారా?
-
మీరు మోర్మన్ గ్రంథాన్ని చదివి, అది దేవుని వాక్యమని తెలుసుకోవడానికి ప్రార్థిస్తారా? (మీరు నిర్దిష్టమైన అధ్యాయాలను లేదా వచనాలను సూచించవచ్చు.)
-
మీరు యేసు మాదిరిని అనుసరించి, బాప్తిస్మం తీసుకుంటారా? (“బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడానికి ఆహ్వానము,” చూడండి, ఇది 1వ పాఠానికి ముందు ఉంటుంది.)
-
మేము మా తదుపరి సందర్శన కోసం సమయాన్ని నిర్ణయించవచ్చా?
సిద్ధాంతపు పునాది
సువార్త గురించి మీ జ్ఞానాన్ని మరియు సాక్ష్యాన్ని బలోపేతం చేయడానికి మరియు బోధించడంలో మీకు సహాయం చేయడానికి ఈ విభాగం మీరు అధ్యయనం చేయడానికి సిద్ధాంతం మరియు లేఖనాలను అందిస్తుంది.
యేసు క్రీస్తు యొక్క దైవిక నియమితకార్యము
మనమందరం ఈ లోకంలో ఆనందాన్ని మరియు రాబోయే లోకంలో నిత్యజీవాన్ని అనుభవించడాన్ని సాధ్యం చేయడానికి పరలోక తండ్రి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును భూమిపైకి పంపారు. “సంతోషకర వర్తమానములు, సువార్త ఇదియే, … అదేమనగా [యేసు క్రీస్తు] … లోక పాపములను మోసుకొనిపోవుటకు, లోకమును పవిత్రపరచుటకు, దానిని సమస్త అవినీతినుండి శుద్ధిచేయుటకు ఈ లోకమునకు వచ్చెను; అందరు ఆయన ద్వారా రక్షింపబడుదురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:40–42).
మర్త్యులుగా, మనమందరం పాపం చేస్తాము మరియు మనమందరం మరణిస్తాము. మనకు విమోచకుడు లేకపోతే పాపం మరియు మరణం దేవునితో నిత్యజీవం పొందకుండా మనల్ని అడ్డుకుంటాయి (2 నీఫై 9 చూడండి). లోకము సృష్టించబడక ముందు, మనల్ని విమోచించడానికి పరలోక తండ్రి యేసు క్రీస్తును ఎంచుకున్నారు. ప్రేమ యొక్క అత్యున్నత వ్యక్తీకరణలో, యేసు భూమిపైకి వచ్చి ఈ దైవిక నియమితకార్యమును నెరవేర్చారు. మన పాపాల నుండి విమోచించబడడాన్ని ఆయన సాధ్యం చేసారు మరియు మనం మరణించిన తర్వాత మనమందరం పునరుత్థానం చేయబడతామని ఆయన హామీ ఇచ్చారు.
యేసు పాపరహిత జీవితాన్ని గడిపారు. తన మర్త్య పరిచర్య ముగింపులో, ఆయన గెత్సేమనేలో మరియు సిలువ వేయబడినప్పుడు తన బాధల ద్వారా మన పాపాలను తనపైకి తీసుకున్నారు (1 నీఫై 11:33 చూడండి). యేసు బాధ ఎంత ఎక్కువగా ఉండెననగా, అది ఆయనను “బాధ వలన వణకి, ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారునట్లు చేసెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18). ఆయన సిలువ వేయబడిన తరువాత, యేసు మరణంపై విజయం సాధిస్తూ పునరుత్థానం చెందారు. కలిసి, ఈ సంఘటనలు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమని పిలువబడ్డాయి.
మన పాపములు మనల్ని ఆత్మీయంగా అపవిత్రులను చేస్తాయి మరియు “అపవిత్రమైన వస్తువేదియు దేవునితో నివసింపజాలదు” (1 నీఫై 10:21). అదనంగా, న్యాయం యొక్క చట్టం మన పాపాలకు పర్యవసానాన్ని కోరుతుంది.
యేసు యొక్క ప్రాయశ్చిత్త త్యాగం మనం పశ్చాత్తాపపడినప్పుడు పాపం నుండి శుద్ధి చేయబడి, పవిత్రంగా మారడానికి మార్గాన్ని అందిస్తుంది. ఇది న్యాయపు అక్కరలను సంతృప్తిపరచడానికి మార్గాన్ని కూడా అందిస్తుంది (ఆల్మా 42:15, 23–24 చూడండి). “ఏలయనగా ఇదిగో, వారు పశ్చాత్తాపపడిన యెడల వారు శ్రమపడకుండునట్లు … నేను అందరి కొరకు ఈ బాధలను భరించితిని; కానీ వారు పశ్చాత్తాపపడని యెడల, నా వలే వారును శ్రమపడుదురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:16–17) అని రక్షకుడు చెప్పారు. యేసు క్రీస్తు లేకపోతే, పాపము పరలోక తండ్రితో భవిష్యత్తు ఉనికికి సంబంధించిన అన్ని ఆశలను అంతం చేస్తుంది.
మన కొరకు తననుతాను బలిగా అర్పించుకోవడంలో, యేసు మన వ్యక్తిగత బాధ్యతను తొలగించలేదు. మనము ఆయనయందు విశ్వాసముంచి, పశ్చాత్తాపపడి, ఆజ్ఞలను పాటించుటకు ప్రయత్నించాలి. మనం పశ్చాత్తాపపడినప్పుడు, యేసు తన తండ్రి యొక్క కనికరపు హక్కులను మన తరఫున కోరతారు (మొరోనై 7:27–28 చూడండి). రక్షకుని మధ్యవర్తిత్వం కారణంగా, పరలోక తండ్రి మనలను క్షమించి, మన పాపాల భారం మరియు అపరాధం నుండి మనకు ఉపశమనం కలిగిస్తారు (మోషైయ 15:7–9 చూడండి). మనం ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాము మరియు చివరికి దేవుని సన్నిధిలోకి స్వాగతించబడగలము.
యేసు యొక్క దైవిక నియమితకార్యము కూడా మనలను మరణం నుండి రక్షించడమే. ఆయన పునరుత్థానం చెందినందువలన, మరణించిన తర్వాత మనమందరం పునరుత్థానం చెందుతాము. దీని అర్థం ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ మరియు శరీరం తిరిగి ఏకమవుతాయి మరియు మనలో ప్రతీ ఒక్కరం పరిపూర్ణమైన, పునరుత్థానం చేయబడిన శరీరంలో శాశ్వతంగా జీవిస్తాము. యేసు క్రీస్తు లేకపోతే, మరణం పరలోక తండ్రితో భవిష్యత్తు ఉనికికి సంబంధించిన అన్ని ఆశలను అంతం చేస్తుంది.
యేసు క్రీస్తు నందు విశ్వాసము
ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసము యేసు క్రీస్తు యొక్క సువార్తలో మొదటి నియమము. విశ్వాసం అన్ని ఇతర సువార్త సూత్రాలకు పునాది.
యేసు క్రీస్తునందు విశ్వాసం అంటే ఆయన దేవుని అద్వితీయ కుమారుడనే విశ్వాసాన్ని కలిగియుండడం. ఆయనను మన రక్షకునిగా మరియు విమోచకునిగా విశ్వసించడం కూడా అందులో ఉంది—దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి ఆయనే మనకు ఏకైక మార్గం (Acts 4:10–12; Mosiah 3:17; 4:6–8 చూడండి). “రక్షించుటకు శక్తిమంతుడైన వాని మంచితనముపై పూర్తిగా ఆధారపడుచూ, ఆయన యందు స్థిరమైన విశ్వాసమును” (2 నీఫై 31:19) సాధన చేయాలని మనం ఆహ్వానించబడ్డాము.
యేసు క్రీస్తుయందు విశ్వాసంలో ఆయన తన ప్రాయశ్చిత్త త్యాగంలో మన పాపాల కోసం బాధపడ్డారని నమ్మడం కూడా ఉంది. ఆయన త్యాగం కారణంగా, మనం పశ్చాత్తాపపడినప్పుడు మనం శుద్ధిచేయబడతాము మరియు విమోచించబడతాము. ఈ ప్రక్షాళన ఈ జీవితంలో శాంతి మరియు నిరీక్షణను కనుగొనడంలో మనకు సహాయపడుతుంది. ఇది మనం మరణించిన తర్వాత సంపూర్ణ ఆనందాన్ని పొందేందుకు కూడా మనల్ని అనుమతిస్తుంది.
యేసు క్రీస్తుయందు విశ్వాసం, మనమందరం మరణించిన తర్వాత ఆయన ద్వారా పునరుత్థానం చెందుతామని విశ్వసించడాన్ని కలిపియుంది. ఈ విశ్వాసం నష్ట సమయాల్లో మనల్ని నిలబెట్టి ఓదార్పునివ్వగలదు. పునరుత్థానం యొక్క వాగ్దానం ద్వారా మరణం యొక్క దుఃఖం తొలగించబడగలదు.
యేసు క్రీస్తుయందు విశ్వాసం అంటే మన కష్టాలు మరియు బలహీనతలను ఆయన తనపైకి తీసుకున్నారని నమ్మడం మరియు విశ్వసించడం (యెషయా 53:3–5 చూడండి). జీవితంలో ఎదురయ్యే సవాళ్ళలో మనల్ని ఎలా దయతో ఆదుకోవాలో ఆయనకు తన అనుభవం ద్వారా తెలుసు (ఆల్మా 7:11–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 122:8 చూడండి). మనం విశ్వాసాన్ని సాధన చేసినప్పుడు, కష్టాలను అధిగమించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు.
ఆయనపై మన విశ్వాసం ద్వారా, యేసు మనలను భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా స్వస్థపరచగలరు. “ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36) అనే ఆయన ఆహ్వానాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడు మనకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు.
చర్య మరియు శక్తి యొక్క సూత్రం
యేసు క్రీస్తునందు విశ్వాసం చర్యకు దారితీస్తుంది. ఆజ్ఞలను పాటించడం ద్వారా మరియు ప్రతిరోజూ మంచి చేయడం ద్వారా మనం మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాము. మనం మన పాపాలకు పశ్చాత్తాపపడతాము. మనం ఆయనపట్ల విశ్వాసంగా ఉంటాము. మనం ఆయనలా మరింతగా మారడానికి ప్రయత్నిస్తాము.
మనం విశ్వాసాన్ని సాధన చేసినప్పుడు, మన దైనందిన జీవితంలో యేసు శక్తిని మనం అనుభవించగలము. ఆయన మన స్వంత ప్రయత్నాలను హెచ్చిస్తారు. ఎదగడానికి మరియు శోధనను నిరోధించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు.
మన విశ్వాసాన్ని బలపరచుకొనుట
విశ్వాసాన్ని పెంపొందించడం సాధారణంగా “నమ్మవలెనను కోరిక కలిగియుండుట”తో (ఆల్మా 32:27) ప్రారంభం కాగలదని ప్రవక్తయైన ఆల్మా బోధించాడు. అప్పుడు, యేసు క్రీస్తుపై మన విశ్వాసం పెరగాలంటే, ఆయన మాటలు నేర్చుకోవడం ద్వారా, ఆయన బోధనలను అన్వయించడం ద్వారా మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మనం దానిని పోషించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం సహనంతో, శ్రద్ధతో మన హృదయాలలో పోషించుకున్నప్పుడు, “అది వేరు పారి, నిత్య జీవమునకై అంకురించు వృక్షము [వలే మారును]”—ఆవిధంగా మన విశ్వాసాన్ని బలపరచును అని ఆల్మా బోధించాడు (ఆల్మా 32:41; 26–43 వచనాలు చూడండి).
పశ్చాత్తాపము
పశ్చాత్తాపము అంటే ఏమిటి?”
పశ్చాత్తాపం సువార్త యొక్క రెండవ సూత్రం. యేసు క్రీస్తుపై విశ్వాసం మరియు ఆయన పట్ల మనకున్న ప్రేమ మనల్ని పశ్చాత్తాపపడేలా చేస్తాయి (హీలమన్ 14:13 చూడండి). పశ్చాత్తాపం అనేది దేవుని వైపు తిరిగే మరియు పాపం నుండి దూరమయ్యే ప్రక్రియ. మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన చర్యలు, కోరికలు మరియు ఆలోచనలు దేవుని చిత్తానికి మరింత అనుగుణంగా మారతాయి. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా పాప క్షమాపణ సాధ్యం చేయబడింది.
పశ్చాత్తాపం అనేది ప్రవర్తనను మార్చడానికి లేదా బలహీనతను అధిగమించడానికి సంకల్ప శక్తిని ఉపయోగించడం కంటే చాలా ఎక్కువైనది. పశ్చాత్తాపం అంటే మన హృదయాలలో “బలమైన మార్పును” అనుభవించే శక్తిని ఇచ్చే క్రీస్తు వైపుకు హృదయపూర్వకంగా తిరగడం (ఆల్మా 5:12–14). మనము ఈ హృదయ మార్పును అనుభవిస్తున్నప్పుడు, మనం ఆధ్యాత్మికంగా మరలా జన్మిస్తాము (మోషైయ 27:24–26 చూడండి).
పశ్చాత్తాపం ద్వారా, మనం దేవుని గురించి, మన గురించి మరియు ప్రపంచం గురించి తాజా దృక్పథాన్ని అభివృద్ధి చేస్తాము. ఆయన పిల్లలుగా మన కొరకు దేవుని ప్రేమను—మరియు మన కొరకు మన రక్షకుని ప్రేమను మనం క్రొత్తగా అనుభవిస్తాము. పశ్చాత్తాపపడే అవకాశం దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఇచ్చిన గొప్ప దీవెనలలో ఒకటి.
పశ్చాత్తాప ప్రక్రియ
మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన పాపాలను గుర్తించి నిజమైన పశ్చాత్తాపాన్ని అనుభవిస్తాము. మనము మన పాపాలను దేవుని వద్ద ఒప్పుకుంటాము మరియు ఆయన క్షమాపణ కోసం అడుగుతాము. మనం చాలా తీవ్రమైన పాపాలను అధీకృత సంఘ నాయకుల వద్ద కూడా అంగీకరిస్తాము, మనం పశ్చాత్తాపపడుతున్నప్పుడు వారు మనకు మద్దతు ఇస్తారు. తిరిగి చెల్లించడానికి మనం చేయగలిగినదంతా చేస్తాము, అంటే మన చర్యలు కలిగించిన సమస్యలను సరిదిద్దడానికి ప్రయత్నించడం అని అర్థము. నిజమైన పశ్చాత్తాపం కొంతకాలం పాటు నీతియుక్తమైన చర్యల ద్వారా ఉత్తమంగా ప్రదర్శించబడుతుంది.
పశ్చాత్తాపం అనేది మన జీవితమంతా రోజువారీ ప్రక్రియ. “మనమందరము పాపము చేసి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నాము” (రోమా 3:23). మనల్ని “బలపరచు క్రీస్తునందే మనం సమస్తమును చేయగలం” (ఫిలిప్పీయులకు 4:13) అని గుర్తుంచుకుంటూ మనం నిరంతరం పశ్చాత్తాపపడాలి. “ఎంత తరచుగా నా జనులు పశ్చాత్తాపపడుదురో అంత తరచుగా వారు చేసిన అతిక్రమములను నేను క్షమించెదను” (మోషైయ 26:30) అని ప్రభువు మనకు అభయమిచ్చారు.
పశ్చాత్తాపము యొక్క దీవెనలు
పశ్చాత్తాపము ఆనందం మరియు శాంతిని కలిగించే సానుకూల సూత్రం. ఇది మనల్ని “[మన] ఆత్మల రక్షణకై విమోచకుని శక్తి యొద్దకు తెస్తుంది” (హీలమన్ 5:11).
మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన అపరాధం మరియు దుఃఖం కాలక్రమేణా నయమవుతాయి. మనము ఆత్మ యొక్క ప్రభావాన్ని ఎక్కువ సమృద్ధిగా అనుభవిస్తాము. దేవుణ్ణి అనుసరించాలనే మన కోరిక మరింత బలపడుతుంది.
“చాలామంది జనులు పశ్చాత్తాపము ఒక శిక్ష అని—దానికి దూరంగా ఉండాలని పరిగణిస్తారు. … కాని శిక్ష విధించబడినట్లు కలిగే ఈ భావము సాతాను ద్వారా కల్పించబడింది. మనల్ని స్వస్థపరచుటకు, క్షమించుటకు, శుద్ధిచేయుటకు, బలపరచుటకు, నిర్మలము చేయుటకు మరియు పవిత్రము చేయుటకు సమ్మతితో, ఆశతో తన బాహువులు తెరచి నిలబడియున్న యేసు క్రీస్తు వైపునకు మనం చూడకుండా అడ్డుపడుటకు అతను ప్రయత్నిస్తాడు” (రస్సెల్ ఎమ్. నెల్సన్ , “మనం ఉత్తమముగా చెయ్యగలము మరియు ఉత్తమముగా ఉండగలము,” లియహోనా, మే 2019, 67).
బాప్తిస్మము: దేవునితో మన మొదటి నిబంధన
యేసు క్రీస్తునందు విశ్వాసం మరియు పశ్చాత్తాపం మనల్ని బాప్తిస్మము మరియు నిర్ధారణ యొక్క విధుల కోసం సిద్ధం చేస్తాయి. బాప్తిస్మము అనేది యేసు క్రీస్తు సువార్త యొక్క మొదటి రక్షణ విధి. నిరీక్షణతో కూడిన ఈ ఆనందకరమైన విధిని మనం పొందినప్పుడు, మనము దేవునితో మన మొదటి నిబంధనను చేస్తాము.
విధి అనేది యాజకత్వ అధికారం ద్వారా నిర్వహించబడే ఒక పవిత్ర కార్యం లేదా వేడుక. బాప్తిస్మము వంటి కొన్ని విధులు మన రక్షణకు చాలా అవసరం.
విధుల ద్వారా, మనం దేవునితో నిబంధనలు చేస్తాము. ఈ నిబంధనలు మనకు మరియు దేవునికి మధ్య ఉన్న పవిత్రమైన వాగ్దానాలు. మనం ఆయనతో చేసిన మన వాగ్దానాలను నిలబెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని దీవిస్తానని వాగ్దానం చేసారు. దేవునితో మన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి మనకు బలమైన నిబద్ధత ఉండాలి.
ఆయన వద్దకు వచ్చి నిత్యజీవమును పొందుటకు మనకు సహాయం చేయడానికి దేవుడు విధులను మరియు నిబంధనలను అందించారు. మనం యాజకత్వ విధులను పొంది, సంబంధిత నిబంధనలను పాటించినప్పుడు, మన జీవితాల్లో “దైవత్వపు శక్తిని” మనం అనుభవించవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20).
బాప్తిస్మపు నిబంధన
మనము పరలోక రాజ్యములో ప్రవేశించడానికి బాప్తిస్మం అవసరమని రక్షకుడు బోధించారు (యోహాను 3:5 చూడండి). మనం యేసు క్రీస్తు సంఘములో సభ్యులుగా మారడం కూడా అవసరం. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన రక్షకుడు ఉదాహరణగా నిలిచారు (మత్తయి 3:13–17 చూడండి).
మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరియు మన నిబంధనను పాటించినప్పుడు, దేవుడు మన పాపాలను క్షమిస్తానని వాగ్దానం చేస్తారు (అపొస్తలుల కార్యములు 22:16; 3 నీఫై 12:1–2 చూడండి). ఈ గొప్ప దీవెన యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా సాధ్యం చేయబడింది, ఆయన “మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపములనుండి మనలను విడిపించెను” (ప్రకటన 1:5). పరిశుద్ధాత్మ సహవాసంతో మనలను దీవిస్తానని కూడా దేవుడు వాగ్దానం చేస్తారు, తద్వారా మనం పవిత్రపరచబడి, నడిపింపబడి, ఓదార్పు పొందగలము.
బాప్తిస్మపు నిబంధనలో మన వంతుగా, యేసు క్రీస్తు యొక్క నామాన్ని మనపై తీసుకోవడానికి సమ్మతిస్తున్నామని మనం సాక్ష్యమిస్తాము. ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకముంచుకుంటామని, ఆయన ఆజ్ఞలను పాటిస్తామని కూడా మనం ప్రతిజ్ఞ చేస్తాము. మనము ఇతరులను ప్రేమించుటకు, సేవచేయుటకు, “దుఃఖించు వారితో దుఃఖపడుటకు, ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు మరియు అన్ని సమయములలో, అన్ని విషయములలో, అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు” వాగ్దానము చేస్తున్నాము (మోషైయ 18:9; 8–10, 13 వచనాలు చూడండి). మన జీవితాంతం యేసు క్రీస్తును సేవిస్తామనే దృఢ నిశ్చయాన్ని మనం తెలియజేస్తున్నాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37; మోషైయ 2:17 చూడండి).
బాప్తిస్మముతో ముడిపడి ఉన్న మన నిబంధన కట్టుబాట్లు గొప్ప బాధ్యత అయ్యున్నాయి. అవి స్ఫూర్తిదాయకమైనవి మరియు ఆనందకరమైనవి. అవి మనకు, పరలోక తండ్రికి మధ్య ఒక ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుస్తాయి, దాని ద్వారా ఆయన తన ప్రేమను నిరంతరం విస్తరింపజేస్తారు.
ముంచుట ద్వారా బాప్తిస్మము
మనం మన పాప క్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము పొందాలని యేసు బోధించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:72–74 చూడండి). ముంచుట ద్వారా బాప్తిస్మము యేసు క్రీస్తు యొక్క మరణము, సమాధి మరియు పునరుత్థానమునకు చిహ్నరూపకమైయున్నది (రోమా 6:3–6 చూడండి).
ముంచుట ద్వారా బాప్తిస్మము మనకు వ్యక్తిగతంగా శక్తివంతమైన చిహ్నాలను కూడా కలిగి ఉంది. ఇది మన పాత జీవితం యొక్క మరణం, ఆ జీవితం యొక్క సమాధి మరియు ఆధ్యాత్మిక పునర్జన్మలో మన ఆవిర్భావాన్ని సూచిస్తుంది. మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మనం మళ్ళీ జన్మించి, క్రీస్తు యొక్క ఆత్మీయ కుమారులు మరియు కుమార్తెలుగా మారే ప్రక్రియను ప్రారంభిస్తాము (మోషైయ 5:7–8; రోమా 8:14–17).
పిల్లలు
జవాబుదారిత్వపు వయస్సు వచ్చేవరకు, అనగా ఎనిమిదేళ్ళ వయస్సు వరకు పిల్లలు బాప్తిస్మము పొందరు (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:27 చూడండి). ఆ వయస్సుకు మునుపు మరణించు పిల్లలు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా విమోచించబడతారు (మొరోనై 8:4–24; సిద్ధాంతము మరియు నిబంధనలు 137:10 చూడండి). పిల్లలు బాప్తిస్మము పొందే ముందు వారికి సువార్త బోధించబడాలి, ఆవిధంగా వారు దేవునితో నిబంధన చేయడానికి వారి జీవితంలో ఈ ముఖ్యమైన దశకు సిద్ధంగా ఉంటారు.
సంస్కారము
మన పరలోక తండ్రి మనం ఆయనతో చేసే నిబంధనలపట్ల నమ్మకంగా ఉండాలని కోరుతున్నారు. దీన్ని చేయడంలో మనకు సహాయం చేయడానికి, సంస్కారములో పాల్గొనడానికి తరచుగా కలుసుకోవాలని ఆయన మనల్ని ఆజ్ఞాపించారు. సంస్కారము అనేది ఆయన ప్రాయశ్చిత్తానికి ముందు యేసు తన అపొస్తలులకు పరిచయం చేసిన యాజకత్వ విధి.
ప్రతీవారం సంస్కార సమావేశము యొక్క ప్రధాన ఉద్దేశ్యం సంస్కారములో పాల్గొనడం. రొట్టె మరియు నీరు దీవించబడి సమూహానికి అందించబడతాయి. రొట్టె మన కోసం రక్షకుడు తన శరీరాన్ని త్యాగం చేయడాన్ని సూచిస్తుంది. నీరు ఆయన రక్తాన్ని సూచిస్తుంది, దానిని ఆయన మన కోసం చిందించారు.
రక్షకుని త్యాగానికి గుర్తుగా మరియు దేవునితో మన నిబంధనలను నూతనపరచడానికి మనము ఈ చిహ్నాలలో పాలుపంచుకుంటాము. ఆత్మ మనతో ఉంటుందనే వాగ్దానాన్ని మనం మళ్ళీ పొందుతాము.
పరిశుద్ధాత్మ వరము
పరిశుద్ధాత్మ వరమును పొందడం
బాప్తిస్మము రెండు భాగాలను కలిగి ఉంటుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం “నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను జన్మించాలి” అని యేసు బోధించారు (యోహాను 3:5; వివరణ చేర్చబడింది). జోసెఫ్ స్మిత్ ఇలా బోధించారు, “నీటి ద్వారా బాప్తిస్మము సగం మాత్రమే మరియు మిగిలిన సగం—అంటే, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము లేకుండా అది ఎందుకూ పనికిరాదు” (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 95).
నీటి ద్వారా బాప్తిస్మము పూర్తి కావడానికి దాని తరువాత ఆత్మ యొక్క బాప్తిస్మము ఉండాలి. మనము రెండు బాప్తిస్మములను పొందినప్పుడు, మన పాపాల నుండి మనం శుద్ధి చేయబడతాము మరియు ఆధ్యాత్మికంగా తిరిగి జన్మిస్తాము. అప్పుడు మనం క్రీస్తు యొక్క శిష్యులుగా క్రొత్త ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిస్తాము.
నిర్ధారణ అనే విధి ద్వారా మనం ఆత్మ యొక్క బాప్తిస్మమును పొందుతాము. ఈ విధి మన తలపై చేతులు ఉంచిన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది యాజకత్వము కలిగియున్న వారిచే నిర్వహించబడుతుంది. మొదట వారు మనల్ని సంఘ సభ్యునిగా నిర్ధారిస్తారు, ఆపై వారు మనకు పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహిస్తారు. క్రొత్త నిబంధనలో మరియు మోర్మన్ గ్రంథములో ప్రస్తావించబడినది ఇదే విధి (అపొస్తలుల కార్యములు 8:14–17; 3 నీఫై 18:36–37 చూడండి).
పరిశుద్ధాత్మ దైవసమూహములో మూడవ సభ్యుడు. ఆయన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో ఐక్యంగా పనిచేస్తారు. మనం పరిశుద్ధాత్మ వరమును పొందినప్పుడు, మనము విశ్వాసంగా ఉంటే మన జీవితమంతా ఆయన సహవాసాన్ని కలిగి ఉండగలము.
పరిశుద్ధాత్మ మనల్ని ఎలా దీవిస్తారు
పరిశుద్ధాత్మ వరము పరలోక తండ్రి యొక్క గొప్ప బహుమానాలలో ఒకటి. పరిశుద్ధాత్మ మనలను శుద్ధిచేసి, పవిత్రపరుస్తారు, మనల్ని మరింత పరిశుద్ధంగా, మరింత సంపూర్ణంగా, దేవుని వలె చేస్తారు (3 నీఫై 27:20 చూడండి). మనం దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా మారడానికి మరియు ఎదగడానికి ఆయన మనకు సహాయం చేస్తారు.
పరిశుద్ధాత్మ మనకు సత్యాన్ని తెలుసుకోవడానికి మరియు గుర్తించడానికి సహాయపడతారు (మొరోనై 10:5 చూడండి). ఆయన మన హృదయాలకు మరియు మనస్సులకు సత్యాన్ని కూడా నిర్ధారిస్తారు. అదనంగా, పరిశుద్ధాత్మ మనకు సత్యాన్ని బోధించడానికి సహాయం చేస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:14 చూడండి). పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం సత్యాన్ని నేర్చుకుని, బోధించినప్పుడు, ఆయన దానిని మన హృదయాల్లోకి తీసుకువెళతారు (2 నీఫై 33:1 చూడండి).
మనం వినయంగా పరిశుద్ధాత్మ నుండి దిశానిర్దేశం కోరినప్పుడు, ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తారు (2 నీఫై 32:5 చూడండి). ఇతరులకు మనమెలా సేవ చేయగలమనే దానిలో మనల్ని ప్రేరేపించడాన్ని ఇది కలిపియుంది.
బలహీనతను అధిగమించడానికి మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తారు. శోధనను ఎదిరించడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రమాదాల గురించి ఆయన మనల్ని హెచ్చరించగలరు.
జీవితంలోని సవాళ్ళను అధిగమించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తారు. శ్రమ లేదా దుఃఖ సమయంలో ఆయన మనల్ని ఓదారుస్తారు, మనల్ని నిరీక్షణతో నింపుతారు (మొరోనై 8:26 చూడండి). పరిశుద్ధాత్మ ద్వారా, మనపట్ల దేవుని ప్రేమను మనం అనుభవించగలము.
అంతము వరకు సహించుట
మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరియు నిర్ధారించబడినప్పుడు, మనం దేవునితో ఒక నిబంధనలోకి ప్రవేశిస్తాము. ఇతర విషయాలతోపాటు, ఆయన ఆజ్ఞలను పాటిస్తామని మరియు మన జీవితాంతం ఆయనకు సేవ చేస్తామని మనం వాగ్దానం చేస్తాము (మోషైయ 18:8–10, 13; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37 చూడండి).
మనము బాప్తిస్మము మరియు నిర్ధారణ ద్వారా సువార్త మార్గంలోకి ప్రవేశించిన తర్వాత, దానిలో నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాము. మనము మార్గము నుండి కొంచెం దూరమైనప్పుడు, పశ్చాత్తాపపడడానికి క్రీస్తులో విశ్వాసాన్ని సాధన చేస్తాము. పశ్చాత్తాపం యొక్క దీవెన సువార్త మార్గానికి తిరిగి రావడానికి మరియు దేవునితో మన నిబంధనల దీవెనలను నిలుపుకోవడానికి అనుమతిస్తుంది. మనం మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు, దేవుడు మనల్ని క్షమించి తిరిగి స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
అంతము వరకు సహించడం అంటే మన జీవితాల చివరి వరకు—మంచి సమయాలు మరియు కష్ట సమయాలలో, వృద్ధి మరియు ప్రతికూలతలలో దేవునిపట్ల నమ్మకంగా ఉండడం. మనల్ని రూపుదిద్దడానికి మరియు మనల్ని మరింతగా ఆయనలాగా చేయడానికి మనము వినయంగా క్రీస్తును అనుమతిస్తాము. మన జీవితంలో ఏమి వచ్చినా మనం విశ్వాసం, నమ్మకం మరియు నిరీక్షణతో క్రీస్తు వైపు చూస్తాము.
అంతము వరకు సహించడం అంటే అర్థం మనం చనిపోయే వరకు నిలిచియుండడం కాదు. బదులుగా, యేసు క్రీస్తుపై మన జీవితాలను, ఆలోచనలను మరియు చర్యలను కేంద్రీకరించడం. ప్రతీరోజు క్రీస్తునందు విశ్వాసం సాధన చేయడాన్ని కొనసాగించడం కూడా ఇందులో ఉంది. మనము పశ్చాత్తాపపడడాన్ని, దేవునితో మన నిబంధనలను పాటించడాన్ని మరియు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వెదకడాన్ని కూడా కొనసాగిస్తాము.
అంతము వరకు సహించడం “పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్కయు మనుష్యులందరి యొక్కయు ప్రేమను కలిగియుండి శ్రద్ధగా ముందుకు సాగడాన్ని” కలిపియుంది. మనం అంతము వరకు సహించినప్పుడు, “మనం నిత్యజీవమును పొందుతాము”(2 నీఫై 31:20) అని పరలోక తండ్రి వాగ్దానమిస్తున్నారు.
యేసు క్రీస్తు యొక్క సువార్త దేవుని పిల్లలందరినీ దీవిస్తుంది
యేసు క్రీస్తు యొక్క సువార్త దేవుని పిల్లలందరి కొరకైనది. మన నేపథ్యం లేదా పరిస్థితితో సంబంధం లేకుండా “అందరూ దేవునికి ఒకేరీతిగా ఉన్నారు” అని లేఖనాలు బోధిస్తున్నాయి. “అందరిని తన వద్దకు రమ్మని, తన మంచితనము నందు పాలుపొందుమని ఆయన ఆహ్వానించుచున్నాడు మరియు తన యొద్దకు వచ్చువానిని ఎవ్వరిని ఆయన నిరాకరించడు” (2 నీఫై 26:33).
సువార్త మన మర్త్య జీవితాలంతటా మరియు నిత్యత్వం అంతటా మనల్ని దీవిస్తుంది. మనం యేసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించినప్పుడు—వ్యక్తులుగా మరియు కుటుంబాలుగా—మనం సంతోషంగా ఉండే అవకాశం ఉంది (మోషైయ 2:41 చూడండి; “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org). సువార్తను జీవించడం మన ఆనందాలను మరింతగా పెంచుతుంది, మన చర్యలను ప్రేరేపిస్తుంది మరియు మన సంబంధాలను సుసంపన్నం చేస్తుంది.
యేసు క్రీస్తు సువార్తను జీవించడం భౌతికంగా లేదా ఆధ్యాత్మికంగా మనకు హాని కలిగించే ఎంపికలు చేయకుండా కూడా మనల్ని కాపాడగలదు. శ్రమ మరియు దుఃఖ సమయాల్లో బలం మరియు ఓదార్పును కనుగొనడంలో ఇది మనకు సహాయపడుతుంది. ఇది ఆనందకరమైన నిత్య జీవానికి మార్గాన్ని అందిస్తుంది.
పునఃస్థాపించబడిన సువార్త యొక్క గొప్ప సందేశాలలో ఒకటి మనమందరం దేవుని కుటుంబంలో భాగం. మనము ఆయన ప్రియమైన కుమారులు మరియు కుమార్తెలం. భూమిపై మన కుటుంబ పరిస్థితితో సంబంధం లేకుండా, మనలో ప్రతీ ఒక్కరం దేవుని కుటుంబంలో సభ్యులమే.
మా సందేశంలోని మరొక గొప్ప భాగం ఏమిటంటే కుటుంబాలు నిత్యత్వం కొరకు ఐక్యంగా ఉండగలవు. కుటుంబం దేవునిచే నియమించబడింది. పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళిక కుటుంబ సంబంధాలను సమాధి దాటి కొనసాగేలా చేస్తుంది. పవిత్ర దేవాలయ విధులు మరియు నిబంధనలు కుటుంబాలు ఎప్పటికీ కలిసి ఉండడాన్ని సాధ్యం చేస్తాయి.
సువార్త యొక్క వెలుగు ద్వారా కుటుంబాలు అపార్థాలు, వివాదాలు మరియు సవాళ్ళను పరిష్కరించుకోగలవు. అసమ్మతితో నలిగిపోయిన కుటుంబాలు పశ్చాత్తాపం, క్షమాపణ మరియు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క శక్తిపై విశ్వాసం ద్వారా స్వస్థపరచబడగలవు.
యేసు క్రీస్తు సువార్త మనకు బలమైన కుటుంబ సంబంధాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. సువార్త సూత్రాలను బోధించడానికి మరియు నేర్చుకోవడానికి గృహము ఉత్తమమైన ప్రదేశం. సువార్త సూత్రాలపై స్థాపించబడిన గృహము ఆశ్రయ స్థలముగా మరియు సురక్షితమైన ప్రదేశంగా ఉంటుంది. అది ప్రభువు యొక్క ఆత్మ నివసించే స్థలముగా ఉంటుంది.
చిన్న నుండి మధ్యస్థ పాఠ్య నమూనా
క్రింది రూపురేఖలు మీకు క్లుప్త సమయం ఉంటే మీరు ఎవరికైనా ఏమి బోధించవచ్చు అనే దాని నమూనా. ఈ నమూనాలను ఉపయోగిస్తున్నప్పుడు, బోధించడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూత్రాలను ఎంచుకోండి. ప్రతి సూత్రానికి సిద్ధాంతపు పునాది పాఠంలో ముందుగా అందించబడింది.
మీరు బోధిస్తున్నప్పుడు, ప్రశ్నలు అడగండి మరియు వినండి. దేవునికి ఎలా దగ్గరవ్వాలో తెలుసుకోవడానికి జనులకు సహాయపడే ఆహ్వానాలను ఇవ్వండి. ఒక వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ కలవడానికి ఒక ముఖ్యమైన ఆహ్వానం ఇవ్వండి. పాఠం యొక్క నిడివి మీరు అడిగే ప్రశ్నలు మరియు మీరు వినడంపై ఆధారపడి ఉంటుంది.
మీరు 3-10 నిమిషాల్లో జనులకు ఏమి బోధించవచ్చు
-
పాపం మరియు మరణం నుండి మనల్ని విమోచించడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును భూమిపైకి పంపారు.
-
యేసు క్రీస్తుపై విశ్వాసం అనేది చర్య మరియు శక్తి యొక్క సూత్రం. మన జీవితాలలో రక్షకుని యొక్క బలపరిచే శక్తిని అనుభవించడానికి విశ్వాసం మనకు సహాయం చేస్తుంది.
-
యేసు క్రీస్తునందు విశ్వాసం పశ్చాత్తాపానికి దారితీస్తుంది. పశ్చాత్తాపం అనేది దేవుని వైపు తిరిగే మరియు పాపం నుండి దూరమయ్యే ప్రక్రియ. మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన చర్యలు, కోరికలు మరియు ఆలోచనలు దేవుని చిత్తానికి మరింత అనుగుణంగా మారతాయి.
-
మనము పశ్చాత్తాపపడినప్పుడు, దేవుడు మనల్ని క్షమిస్తారు. యేసు క్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసినందున క్షమాపణ సాధ్యమవుతుంది.
-
బాప్తిస్మములో రెండు భాగాలు ఉన్నాయి: నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా బాప్తిస్మము. మనం బాప్తిస్మము తీసుకున్నప్పుడు మరియు నిర్ధారించబడినప్పుడు, మన పాపాల నుండి మనం శుద్ధి చేయబడతాము, ఇది మనకు జీవితంలో క్రొత్త ప్రారంభాన్ని ఇస్తుంది.
-
మనం నీటి ద్వారా బాప్తిస్మము పొందిన తర్వాత, నిర్ధారణ విధి ద్వారా మనం పరిశుద్ధాత్మ వరమును పొందుతాము.
-
మన జీవితాల ముగింపు వరకు మనం సువార్త మార్గాన్ని విశ్వాసంతో అనుసరిస్తున్నప్పుడు, మనము నిత్యజీవం కలిగియుంటామని దేవుడు వాగ్దానమిస్తున్నారు.