2వ అధ్యాయము
కనాను వెళ్ళుటకు అబ్రాహాము ఊరు పట్టణమును వదిలిపెట్టును—హారాను యొద్ద యెహోవా అతనికి ప్రత్యక్షమగును—సువార్త దీవెనలన్నియు అతని సంతానమునకు, అతని సంతానము ద్వారా అందరికి వాగ్దానము చేయబడెను—అతడు కనానుకు అక్కడినుండి ఐగుప్తునకు వెళ్ళును.
1 ఇప్పుడు దేవుడైన ప్రభువు ఊరు పట్టణములో కరువును తీవ్రము చేసెను, గనుక నా సహోదరుడైన హారాను మృతిబొందెను; కానీ నా తండ్రి తెరహు కల్దీయుల ఊరు పట్టణములో ఇంకా బ్రతికియుండెను.
2 అప్పుడు అబ్రాహాము అను నేను శారయిని వివాహము చేసుకొంటిని, మరియు నా సహోదరుడు నాహోరు, హారాను కుమార్తె మిల్కాను వివాహము చేసుకొనెను.
3 ఇప్పుడు ప్రభువు నాతో ఇట్లనెను—అబ్రాహామా, నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటనుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
4 కాబట్టి నేను కనాను దేశమునకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణమును విడిచిపెట్టితిని; నేను నా భార్యయైన శారయిని, నా సహోదరుని కుమారుడైన లోతును, అతని భార్యను నాతో తీసుకొని వెళ్ళితిని; నా తండ్రి కూడా మేము హారాను అని పేరుపెట్టిన దేశమునకు నా వెంబడి వచ్చెను.
5 మరియు కరువు నిలిచిపోయెను; హారానులో పశువుల మందలు అనేకముండెను, గనుక నా తండ్రి హారానులో ఆగి అక్కడ నివాసముండెను; నా తండ్రి మరలా విగ్రహారాధన తట్టు తిరిగెను, కాబట్టి ఆయన హారానులో కొనసాగెను.
6 కానీ అబ్రాహాము అను నేను మరియు నా సహోదరుని కుమారుడైన లోతు ప్రభువునకు ప్రార్థన చేసితిమి, అప్పుడు ప్రభువు నాకు ప్రత్యక్షమై నాతో ఇట్లనెను: నీవు లేచి, లోతును నీతో తీసుకొని వెళ్ళుము; ఏలయనగా హారాను నుండి నిన్ను తీసుకొనివెళ్ళుటకు, నీకు మరియు నా మాట ఆలకించినప్పుడు నీ తరువాత నీ సంతానమునకు నేను అనుగ్రహించు ఒక క్రొత్త దేశములో నా నామమునకు సాక్ష్యమిచ్చుటకు నిన్ను పరిచారకునిగా చేయుటకై నేను ఉద్దేశించితిని.
7 ఏలయనగా నీ దేవుడైన ప్రభువును నేనే; నా నివాసము పరలోకమందున్నది; భూమి నా పాదపీఠము; సముద్రముమీద నా చేయిచాపగా అది నా మాటకు లోబడును; గాలిని, అగ్నిని నా రథముగా చేసుకొనియున్నాను; ఇక్కడనుండి పొమ్మని నేను పర్వతములకు సెలవియ్యగా—ఇదిగో అకస్మాత్తుగా సుడిగాలిచేత అవి వెంటనే కొనిపోబడును.
8 నా పేరు యెహోవా, ఆదినుండి అంతము వరకు నేనెరిగియున్నాను; కావున నా హస్తము నీపై ఉండును.
9 నిన్ను గొప్ప జనాంగముగా చేసి, అత్యధికముగా నిన్ను ఆశీర్వదించి, సమస్త జనముల మధ్య నీ నామమును ఘనపరిచెదను, నీ తరువాత నీ సంతానమునకు నీవు ఒక దీవెనగానుందువు, ఎందుకనగా సమస్త జనములకు తీసుకొనివెళ్ళుటకు ఈ పరిచర్యను, యాజకత్వమును వారు తమ చేతులలో కలిగియుందురు;
10 నీ నామము ద్వారా వారిని నేను ఆశీర్వదించెదను; ఈ సువార్తను అంగీకరించు వారందరు నీ నామముతో పిలువబడి, నీ సంతానముగా యెంచబడుదురు, వారు వృద్ధిచెంది, తమ తండ్రిగా నిన్ను ఘనపరిచెదరు;
11 నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను శపించు వారిని నేను శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీయందు (అనగా నీ యాజకత్వమందు), నీ సంతానమందు (అనగా నీ యాజకత్వము) సువార్త యొక్క దీవెనలు, అనగా రక్షణ యొక్క దీవెనలు, నిత్యజీవము యొక్క దీవెనలతో ఆశీర్వదించబడును, ఏలయనగా ఈ హక్కు నీతోను, నీ తరువాత నీ సంతానముతోను (అనగా అసలైన సంతానము లేదా యథార్థమైన సంతానముతో) కొనసాగునని నేను వాగ్దానము చేయుచున్నాను.
12 ఇప్పుడు ప్రభువు నాతో మాట్లాడుటను ముగించి, నా నుండి తన సన్నిధిని వెనుకకు తీసుకొనిన తరువాత నా హృదయములో నేను ఇట్లనుకొంటిని: నీ సేవకుడు నిన్ను శ్రద్ధతో వెదికెను; ఇప్పుడు నిన్ను నేను కనుగొంటిని;
13 ఎల్కానా దేవతలనుండి నన్ను విడిపించుటకు నీవు నీ దూతను పంపియుంటివి మరియు నీ మాటను ఆలకించుటకు నేను ప్రయాసపడెదను, కావున సమాధానముతో నీ దాసుని వెళ్ళనిమ్ము.
14 అందువలన అబ్రాహాము అను నేను ప్రభువు సెలవియ్యగా బయలుదేరితిని మరియు లోతు నాతోనుండెను; అబ్రాహాము అను నేను హారాను నుండి వెళ్ళినప్పుడు నాకు అరువది రెండేండ్లు.
15 నేను కల్దీయుల ఊరను పట్టణములోనుండగా వివాహము చేసుకొనిన నా భార్యయైన శారయిని, నా సహోదరుని కుమారుడైన లోతును, మేము ఆర్జించిన యావదాస్తిని, హారానులో మేము సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు బయలుదేరితిమి మరియు అక్కడకు వెళ్ళిన తరువాత గుడారములలో నివాసముంటిమి;
16 కాబట్టి, యెర్షోను గుండా హారాను నుండి కనాను దేశమునకు మేము ప్రయాణము చేసినప్పుడు, నిత్యత్వము మా కవచముగాను మా ఆశ్రయదుర్గముగాను మరియు మా రక్షణగానుండెను.
17 ఇప్పుడు అబ్రాహాము అను నేను యెర్షోను దేశములో ఒక బలిపీఠమును కట్టి, ప్రభువుకు బలి అర్పించితిని, నా తండ్రి యింటి వారందరు నశింపకుండునట్లు వారినుండి కరువు తొలగిపోవలెనని ప్రార్థించితిని.
18 అప్పుడు మేము యెర్షోను నుండి దేశముగుండా సంచారము చేసి షెకెము నొద్దకు వచ్చితిమి; అది మోరే మైదానములో ఉన్నది, అప్పటికి మేము కనానీయుల దేశము యొక్క పొలిమేరల నొద్దకు వచ్చితిమి, అక్కడ మోరే మైదానములో బలి అర్పించి, భక్తితో ప్రభువును ప్రార్థించితిని, ఎందుకనగా ఈ విగ్రహారాధికుల యొక్క దేశములోనికి మేము వచ్చియుంటిమి.
19 ప్రభువు నాకు ప్రత్యక్షమై, నా ప్రార్థనలకు సమాధానమిచ్చి—నీ సంతానమునకు నేను ఈ దేశమిచ్చెదనని నాతో చెప్పెను.
20 అబ్రాహాము అను నేను ప్రభువుకు బలిపీఠము కట్టిన స్థలమునుండి బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి, పశ్చిమనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికి మధ్య నా గుడారము వేసితిని; మరియు అక్కడ నేను ప్రభువుకు మరొక బలిపీఠము కట్టి, ప్రభువు నామమున ప్రార్థన చేసితిని.
21 అబ్రాహాము అను నేను ఇంకా ప్రయాణము చేయుచూ దక్షిణ దిక్కుకు వెళ్ళితిని; ఆ దేశములో ఇంకా కరువు ఉండెను; కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము అను నేను ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడకు వెళ్ళవలెనని నిశ్చయించుకొంటిని.
22 అప్పుడు నేను ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు ప్రభువు నాతో ఈలాగు చెప్పెను: ఇదిగో నీ భార్యయైన శారయి చూపునకు మిక్కిలి సౌందర్యవతియైయున్నది;
23 కాబట్టి ఐగుప్తీయులు ఆమెను చూచి—ఈమె అతని భార్య అని చెప్పి, నిన్ను చంపి ఆమెను బ్రదుకనిచ్చెదరు; కాబట్టి నీవు ఈలాగు చేయవలెను:
24 నీవు బ్రతుకునట్లు ఆమె నీ సహోదరియని ఐగుప్తీయులతో ఆమె చెప్పవలెను.
25 అప్పుడు అబ్రాహాము అను నేను నా భార్యయైన శారయితో ప్రభువు నాతో చెప్పినదంతయు చెప్పితిని—కాబట్టి నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రదుకునట్లు నీవు నా సహోదరివని దయచేసి వారితో చెప్పమంటిని.