5వ అధ్యాయము
దేవుళ్ళు సమస్త సృష్టిని చేయు తమ ప్రణాళికను పూర్తిచేసిరి—వారి ప్రణాళికల ప్రకారము వారు సృష్టిని చేసిరి—జీవముగల ప్రతిదానికి ఆదాము పేరుపెట్టెను.
1 ఈ విధముగా మనము ఆకాశమును, భూమిని, వాటి మీదనుండు జీవరాశులన్నింటిని పూర్తి చేయుదుము.
2 దేవుళ్ళు—మనము ఆలోచన చేసిన మన పనిని ఏడవ పర్యాయములోగా పూర్తి చేయుదుము; మరియు ఏడవ పర్యాయములో మనము ఆలోచన చేసిన పనియంతటి నుండి విశ్రమించెదమని తమలోతాము అనుకొనిరి.
3 ఏడవ పర్యాయములోగా పూర్తిచేసిరి, కాబట్టి ఏడవ పర్యాయములో వారు (దేవుళ్ళు) ఆలోచన చేసిన తమ పనియంతటి నుండి విశ్రమించిరి; మరియు దానిని పరిశుద్ధపరచిరి. కాబట్టి ఆకాశమును, భూమిని సృజించుటకు వారు ఆలోచన చేసిన సమయములో వారు ఈవిధముగా నిర్ణయించిరి.
4 దేవుళ్ళు క్రిందకు వచ్చి భూమిని, ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు ఆకాశము యొక్కయు, భూమి యొక్కయు ఉత్పత్తిక్రమము ఇదే,
5 అవి మొలుచుటకు ముందు పొలమందలి ప్రతి చెట్టు, పొలమందలి ప్రతి పొదను గూర్చి వారు చెప్పిన ప్రకారము భూమి మీద ఉండలేదు; ఏలయనగా దేవుళ్ళు వాటిని చేయుటకు ఆలోచన చేసినప్పుడు భూమి మీద వాన కురిపించ లేదు, నేలను సేద్యపరచుటకు నరుని సృజించలేదు.
6 అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.
7 దేవుళ్ళు నేలమంటితో నరుని నిర్మించి, వాని ఆత్మను (అనగా నరుని ఆత్మను) తీసుకొని వానిలో ఉంచెను; వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా, నరుడు జీవాత్మ ఆయెను.
8 దేవుళ్ళు తూర్పున ఏదేనులో ఒక తోటవేసి, నరుని దానిలో ఉంచిరి, అతని ఆత్మను వారు నిర్మించిన శరీరములో ఉంచిరి.
9 దేవుళ్ళు చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యన జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించిరి.
10 ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.
11 దేవుళ్ళు నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు, దానిని కాచుటకు దానిలో ఉంచిరి.
12 మరియు దేవుళ్ళు ఇట్లు చెప్పుచూ నరుని ఆజ్ఞాపించిరి: ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును,
13 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఇప్పుడు అబ్రాహామను నేను, ఇది కోలబ్ కాలము ప్రకారమున్న ప్రభువు యొక్క కాలము ప్రకారము ఉండుటను చూచితిని; ఏలయనగా కాలము లెక్కించుటకు దేవుళ్ళు అప్పటికి ఇంకా ఆదామును నియమించలేదు.
14 మరియు దేవుళ్ళు ఇట్లనిరి: నరునికి సాటియైన సహాయమును చేయుదుము, ఏలయనగా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, కాబట్టి నరునికి సాటియైన సహాయమును మనము వానికొరకు చేయుదుము.
15 అప్పుడు దేవుళ్ళు ఆదాముకు గాఢనిద్ర కలుగజేసిరి; అతడు నిద్రించినప్పుడు వారు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసిరి;
16 దేవుళ్ళు నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను నరుని యొద్దకు తీసుకొనివచ్చిరి.
17 అప్పుడు ఆదాము ఇట్లనెను—నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో ఒక మాంసము; ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును;
18 కావున పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైయుందురు.
19 అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి.
20 దేవుళ్ళు ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించిరి; జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.
21 అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను; మరియు ఆదాముకు సాటియైన సహాయము దొరికెను.