2024 రండి, నన్ను అనుసరించండి
మార్చి 18–24: “ఇదియే మార్గము.” 2 నీఫై 31–33


“మార్చి 18-24: ‘ఇదియే మార్గము.’ 2 నీఫై 31-33,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“మార్చి 18-24. 2 నీఫై 31–33,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

చిత్రం
తన శిష్యులకు బోధిస్తున్న యేసు

Christ Teaching His Disciples [తన శిష్యులకు బోధిస్తున్న క్రీస్తు], జస్టిన్ కుంజ్ చేత

మార్చి 18–24: “ఇదియే మార్గము”

2 నీఫై 31–33

నీఫై చివరిగా నమోదు చేసిన పదాలలో, ఈ ప్రకటనను మనము కనుగొంటాము: “ప్రభువు నన్ను ఆజ్ఞాపించియున్నాడు మరియు నేను తప్పక లోబడవలెను” (2 నీఫై 33:15). ఇది నీఫై జీవితం యొక్క మంచి సారాంశం. అతడు ప్రభువు చిత్తాన్ని వెదికి, ధైర్యంగా దానిని నెరవేర్చడానికి ప్రయత్నించాడు—అది లేబన్ నుండి ఇత్తడి పలకలను పొందడానికి అతని ప్రాణాలకు తెగించడం, పడవను నిర్మించడం మరియు సముద్రాన్ని దాటడం లేదా క్రీస్తు సిద్ధాంతాన్ని సరళంగా మరియు శక్తితో నమ్మకంగా బోధించడం ఏదైనా కావచ్చు. “నిత్యజీవానికి నడిపించు తిన్నని, ఇరుకైన మార్గము”ను అనుసరించడం ద్వారా “క్రీస్తునందు స్థిరత్వంతో ముందుకు సాగవలసిన“ ఆవశ్యకత గురించి ఒప్పించేలా నీఫై మాట్లాడగలిగాడు (2 నీఫై 31:20, 18), ఎందుకంటే అతడు ఆ మార్గాన్నే అనుసరించాడు. ఈ మార్గం, కొన్నిసార్లు కష్టంగా ఉన్నప్పటికీ, అది చాలా సంతోషకరమైనదని మరియు “దేవుని రాజ్యమందు మనుష్యుడు రక్షింపబడుటకు పరలోకము క్రింద ఇయ్యబడిన మరే ఇతర మార్గము గాని నామముగానీ లేదు” అని అతడు అనుభవంతో గ్రహించాడు (2 నీఫై 31:21).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

2 నీఫై 31

యేసు క్రీస్తు మరియు ఆయన సిద్ధాంతం మాత్రమే నిత్యజీవానికి మార్గము.

మీరు నిత్యజీవ మార్గాన్ని కొన్ని మాటలలో సంగ్రహించి చెప్పాలంటే, మీరు ఏమి చెబుతారు? 2 నీఫై 31లో నీఫై దానిని ఎలా వివరించాడో గమనించండి. ఒక మార్గాన్ని గీసి, మీరు ఈ అధ్యాయాలలో కనుగొనే సూత్రాలు లేదా దశలలో కొన్నిటిని ఆ మార్గం వెంబడి వ్రాయండి. ప్రతీ సూత్రం గురించి నీఫై బోధించిన దానికి మీ స్వంత సమీక్షను వ్రాసి మీ చిత్రానికి జతచేయవచ్చు.

మీరు 2 నీఫై 31:18–20 చదువుతున్నప్పుడు, సువార్త మార్గంలో “ముందుకు సాగడానికి” మీ స్వంత ప్రయత్నాలను పరీక్షించుకోవచ్చు.

చిత్రం
కలిసి ప్రార్థిస్తున్న ఒక కుటుంబం

యేసు క్రీస్తు బోధనలను అనుసరించడం మనల్ని నిత్య జీవమునకు నడిపిస్తుంది.

2 నీఫై 31:4–13

యేసు క్రీస్తు బాప్తిస్మం తీసుకున్నప్పుడు విధేయతకు సరైన ఉదాహరణగా నిలిచారు.

మీ బాప్తిస్మం నిన్న జరిగినా లేదా 80 సంవత్సరాల క్రితం జరిగినా, అది ఒక కీలకమైన క్షణం. మీరు యేసు క్రీస్తును అనుసరించడానికి నిత్య నిబంధనలోనికి ప్రవేశించారు. మీరు 2 నీఫై 31:4–13లో రక్షకుని బాప్తిస్మము గురించి చదువుతున్నప్పుడు, మీ బాప్తిస్మము గురించి ఆలోచించండి. ఇటువంటి ప్రశ్నలకు జవాబివ్వడం సహాయపడవచ్చు:

  • క్రీస్తు ఎందుకు బాప్తిస్మము పొందారు? నేను బాప్తిస్మము పొందడానికి ఎందుకు ఎంచుకున్నాను?

  • నేను బాప్తిస్మము పొందినప్పుడు, నేను ఏ వాగ్దానాలు చేసాను? బదులుగా ప్రభువు ఏమి వాగ్దానమిచ్చారు? (12–13 వచనాలు చూడండి; మోషైయ 18:10, 13 కూడా చూడండి).

  • నేను యేసు క్రీస్తును అనుసరించడానికి ఇంకా నిబద్ధుడనైయున్నాను అని నేను ఎలా చూపించగలను?

2 నీఫై 31:15-20

“అంతము వరకు స్థిరముగానుండు వాడు రక్షించబడును.”

మీరు 2 నీఫై 31:15–20 చదువుతున్నప్పుడు, “నేను అంతము వరకు సహిస్తున్నానని నాకెలా తెలుసు?” అని మిమ్మల్ని మీరు అడగండి. ఈ ప్రశ్నకు జవాబివ్వడానికి మీకు సహాయపడగలిగేలా నీఫై నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

ఎల్డర్ డేల్ జి. రెన్లండ్ ఇలా బోధించారు: “అంతము వరకు సహించడం అనేది క్రీస్తు సిద్ధాంతములో—మనం మొదటి నాలుగు దశలను పూర్తిచేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటూ, పళ్ళు నూరుతూ, చావు కోసం ఎదురుచూస్తున్నట్లుగా మరొక దశ కాదు. కాదు, అంతము వరకు సహించడమనేది చురుకుగా, ఉద్దేశ్యపూర్వకంగా ఆ దశలను పునరావృతం చేయడం” (“Lifelong Conversion” [Brigham Young University devotional, Sept. 14, 2021], 2, speeches.byu.edu). క్రీస్తు సిద్ధాంతములోని దశలను మీరెలా పునరావృతం చేయగలరు (విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మను పొందడం)?

చిత్రం
సెమినరీ చిహ్నము

2 నీఫై 32; 33:2

క్రీస్తు మాటలు మరియు పరిశుద్ధాత్మ ద్వారా, నేనేమి చేయాలో దేవుడు నాకు చూపిస్తారు.

మీ జీవితంలో తరువాతి దశల గురించి మీరెప్పుడైనా అనిశ్చితంగా భావించారా? నీఫై జనులు కూడా అటువంటి సమస్యలను కలిగియున్నారు (2 నీఫై 32:1 చూడండి). 2 నీఫై 32:2–9లో నీఫై జవాబు కొరకు చూడండి. నీఫై బోధించిన దానిని మీ స్వంత మాటలలో మీరెలా చెప్తారు? నీఫై మాటలు నిజమని మీకు బోధించిన అనుభవాలేవి?

(ఇప్పుడు మరియు భవిష్యత్తులో) మీకు దేవుని నడిపింపు అవసరమైన నిర్ణయాలు లేదా పరిస్థితుల జాబితా తయారుచేయడం గురించి ఆలోచించండి. ఆయన నుండి ప్రేరేపణ పొందడంలో సఫలమవ్వడానికి మీకు సహాయపడగలిగేలా 2 నీఫై 32 నుండి మీరు ఏమి నేర్చుకోగలరు? “పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా తమ హృదయాలను కఠినపరచుకోవడానికి” జనులను ఏది నడిపించవచ్చు? (2 నీఫై 33:2).

మీరు నీఫై ఉపదేశాన్ని ధ్యానిస్తున్నప్పుడు, మీరు రక్షకుని మాటలను ఎలా అధ్యయనం చేస్తారో ఆలోచించండి. మీరు దానిని అల్పాహారం తినడం, భుజించడం లేదా విందారగించడం అని వర్ణిస్తారా? మీ అభిప్రాయంలో, వాటిలో తేడా ఏమిటి? రక్షకుని మాటలతో మీ అనుభవాన్ని ఒక విందులా మీరెలా చేయగలరో ఆలోచించండి. ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుని నుండి బహుశా మీరు ఉపాయాలు పొందవచ్చు.

క్రీస్తు యొక్క మాటలను విందారగించండి. క్రీస్తు యొక్క మాటలను విందారగించడానికి అనేక మార్గాలున్నాయి, అందులో కొన్ని-- ప్రేరేపణ కోసం ప్రార్థించడం, చదవడానికి ముందు మరియు చదువుతున్నప్పుడు ప్రశ్నలు అడగడం, పదాలను నిర్వచించడం, ధ్యానించడం, పోల్చి చూడడం, వివరణలు వ్రాసుకోవడం, సువార్త సత్యాల కొరకు చూడడం మరియు లేఖనాలను మీ జీవితానికి అన్వయించుకోవడం (1 నీఫై 19:23 చూడండి).

మీ జీవితంలో అప్పుడప్పుడు వచ్చే బంధువులా కాకుండా, నిరంతర సహవాసిగా పరిశుద్ధాత్మను మీరెలా ఆహ్వానిస్తారు?

2 నీఫై 33

మోర్మన్ గ్రంథము క్రీస్తును విశ్వసించమని మనందరిని ఒప్పిస్తుంది.

2 నీఫై 33లో, నీఫై తన రచనలను ముగించినప్పుడు, అసలు తాను వాటిని వ్రాయడానికి గల కారణాలను వివరించాడు. ఈ అధ్యాయంలో మీరు ఏ కారణాలను కనుగొంటారు? 1 నీఫై మరియు 2 నీఫైలో ఇంతవరకు మీరు చదివిన కథలు మరియు బోధనలపై ప్రతిబింబించండి. వాటిలో ఏవి మిమ్మల్ని మరియు క్రీస్తు యందు మీ విశ్వాసాన్ని ప్రభావితం చేసాయి?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

2 నీఫై 31:4–13

నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు, నేను యేసు క్రీస్తును అనుసరిస్తున్నాను.

  • ఈ సారాంశం చివరన యేసు బాప్తిస్మం పొందుతున్న చిత్రం ఉంది. ఈ సంఘటన గురించి వారికి తెలిసిన దానిని మీకు చెప్పడానికి బహుశా మీ పిల్లలు దానిని ఉపయోగించవచ్చు (మత్తయి 3:13–17 కూడా చూడండి). ఆయనలా మనము బాప్తిస్మం తీసుకోవాలని యేసు ఎందుకు కోరుతున్నారు? మీరు 2 నీఫై 31:4–13 యొక్క భాగాలను కలిసి చదువుతున్నప్పుడు, మీ పిల్లలు కారణాల కొరకు వినవచ్చు. ఇటీవల బాప్తిస్మం తీసుకున్న వారెవరైనా తమ అనుభవాన్ని పంచుకోవడం సహాయకరంగా ఉండవచ్చు.

2 నీఫై 31

పరలోక తండ్రి వద్దకు ఎలా తిరిగి వెళ్ళాలో యేసు క్రీస్తు నాకు బోధించారు.

  • 2 నీఫై 31లోని బోధనలను మీ పిల్లలు ఊహించుకొనేలా సహాయపడేందుకు, వారు ఒక మార్గమును, దాని చివరన క్రీస్తు చిత్రాన్ని గీయవచ్చు. ఆ మార్గంలో క్రీస్తునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరము మరియు అంతము వరకు సహించడం వంటి దశలను సూచించే చిత్రాలను కనుగొనడానికి లేదా గీయడానికి మీరు వారికి సహాయపడవచ్చు. మీరు 2 నీఫై 31:17–20 కలిసి చదువుతున్నప్పుడు, వారు ఆ చిత్రాలను చూపించవచ్చు.

2 నీఫై 32:3-5

నేను క్రీస్తు యొక్క మాటలను విందారగించగలను.

  • క్రీస్తు యొక్క మాటలను “విందారగించడం” గురించి బోధించడానికి, వారికిష్టమైన ఆహారాన్ని వారు ఎలా విందారగిస్తారో నటించి చూపమని మీరు మీ పిల్లలను అడగవచ్చు. 2 నీఫై 32:3లో, మనం దేనిని విందారగించాలని నీఫై చెప్పాడు? దేవుని మాటలను కేవలం చదవడం మరియు విందారగించడం మధ్య తేడా ఏమిటి? తేడాలను మీ పిల్లలు నటించి చూపవచ్చు. మీరు లేఖనాలను విందారగించినప్పుడు మీరు పొందిన దీవెనలను వారితో పంచుకోండి.

2 నీఫై 32:8–9

ఎల్లప్పుడూ ప్రార్థించాలని పరలోక తండ్రి నన్ను కోరుతున్నారు.

  • 2 నీఫై 32:8–9 చదివిన తర్వాత, మనం ప్రార్థించకూడదని సాతాను ఎందుకు కోరుతున్నాడనే దాని గురించి మీ పిల్లలతో మాట్లాడండి. “ఎల్లప్పుడూ ప్రార్థించాలని” దేవుడు మనల్ని ఎందుకు కోరుతున్నారు? మీ పిల్లలు వారు ప్రార్థించగల సందర్భాలను జాబితా చేయవచ్చు లేదా బొమ్మలు గీయవచ్చు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూవుంటే ప్రభువు మనల్ని ఏవిధంగా దీవిస్తారు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
యేసుకు బాప్తిస్మమిస్తున్న బాప్తిస్మమిచ్చు యోహాను

To Fulfill All Righteousness [సమస్త నీతిని నెరవేర్చుటకు], లిజ్ లెమన్ స్విండిల్ చేత

ముద్రించు