2024 రండి, నన్ను అనుసరించండి
మార్చి 4–10: “మేము క్రీస్తు నందు ఆనందించుచున్నాము.” 2 నీఫై 20-25


“మార్చి 4-10: ‘మేము క్రీస్తు నందు ఆనందించుచున్నాము.’ 2 నీఫై 20-25,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“మార్చి 4-10. 2 నీఫై 20-25,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

చిత్రం
అధ్యయనం చేస్తున్న కుటుంబము

మార్చి 4–10: “మేము క్రీస్తు నందు ఆనందించుచున్నాము”

2 నీఫై 20-25

యెషయా రచనలు బలమైన హెచ్చరికలను కలిగియుంటాయి, కానీ అవి నిరీక్షణను, ఆనందాన్ని కూడా అందిస్తాయి. నీఫై వాటిని తన గ్రంథములో చేర్చడానికి ఇది ఒక కారణము: “ఈ మాటలను చూచువారు తమ హృదయములను పైకెత్తుకొని ఆనందించునట్లు … నేను యెషయా మాటలలో కొన్నింటిని వ్రాయుచున్నాను” (2 నీఫై 11:8) అని అతడు చెప్పాడు. ఒక రకంగా, యెషయా రచనలను చదవడానికి ఇవ్వబడిన ఆహ్వానం ఆనందించడానికి ఇవ్వబడిన ఆహ్వానము. ఇశ్రాయేలును సమకూర్చడం, మెస్సీయ రాక, నీతిమంతులకు వాగ్దానం చేయబడిన శాంతి గురించి యెషయా ప్రవచనాలలో నీఫై లాగానే మీరు ఆనందం పొందవచ్చు. ప్రభువు “జనములను పిలుచుటకు ఒక ధ్వజము నిలువబెట్టి, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును” (2 నీఫై 21:12) అని ప్రవచించబడిన దినమందు జీవించడానికి మీరు ఆనందించవచ్చు. మీరు నీతి కొరకు దప్పికగొనినప్పుడు, మీరు “ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్ళు చేదుకోవచ్చు” (2 నీఫై 22:3). మరో మాటలో చెప్పాలంటే, మీరు “క్రీస్తునందు ఆనందించవచ్చు” (2 నీఫై 25:26).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

2 నీఫై 21-22

నేను యేసు క్రీస్తు యందు శాంతిని కనుగొనగలను.

లీహై పిల్లలు వివాదమనే సమస్యను కలిగియున్నారు. భవిష్యత్ తరాలలో విభజన, చెర, బాధ మరియు నాశనానికి దారితీస్తూ ఈ సమస్య తీవ్రమైంది. నేడు కూడా వివాదం ఒక సమస్యగా కొనసాగుతోంది.

వాటన్నిటిని మనస్సులో ఉంచుకొని, 2 నీఫై 21–22 లోని ప్రవచనాలను ధ్యానించండి. రక్షకుడు ఈ ప్రవచనాలను ఎలా నెరవేరుస్తున్నారో పరిగణించండి. తోడేలు “గొఱ్ఱెపిల్లతో వాసము చేయును” అనే ప్రవచనము మీకు ఏ అర్థమును కలిగియున్నది? (2 నీఫై 21:6). సమాధానపరచువారిగా ఉండడానికి మీరేమి చేయగలరో ధ్యానించండి.

డేల్ జి. రెన్‌లండ్, “క్రీస్తు యొక్క శాంతి శత్రుత్వాన్ని నిర్మూలించును,” లియహోనా, నవ. 2021, 83–85 చూడండి.

2 నీఫై 21:9-12

ప్రభువు తన జనులను సమకూరుస్తున్నారు.

ఇశ్రాయేలీయులు చెదిరిపోవడానికి నీఫై మరియు అతని కుటుంబము సాక్షులుగా ఉన్నారు (2 నీఫై 25:10 చూడండి). ఇప్పుడు మీరు ఇశ్రాయేలును సమకూర్చడంలో పాల్గొనవచ్చు (2 నీఫై 21:12 చూడండి). మీరు 2 నీఫై 21:9–12 చదువుతున్నప్పుడు, ఈ వచనాలు వివరించే ప్రవచనాలను నెరవేర్చడంలో మీరెలా సహాయపడగలరో ఆలోచించండి.

ఉదాహరణకు, దేవుని జనులను సమకూర్చడానికి పైకెత్తబడే “ధ్వజము” (ప్రమాణము లేదా జెండా) గురించి మీరు చదువుతున్నప్పుడు, భౌతికంగా మరియు ఆత్మీయంగా దేవుడు తన జనులను సమకూర్చడాన్ని మీరెలా చూడగలిగారో ఆలోచించండి. ప్రభువునకు మరియు ఆయన సంఘానికి జనులను ఆకర్షించేది ఏది?

దేవుని జనులను సమకూర్చడంలో సహాయపడడానికి ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు మీరు భావించారు?

2 నీఫై 23-24

బబులోను యొక్క ప్రాపంచికత పతనమవుతుంది.

బబులోను రాజ్యము ప్రాచీన ఇశ్రాయేలుకు రాజకీయంగా మరియు సైనికపరంగా గొప్ప అపాయమైయుండెను. కానీ నీఫై జనులకు—మరియు నేడు మనకు—గల పెద్ద అపాయము బబులోను ప్రాతినిధ్యం వహించే ప్రాపంచికత మరియు పాపము. బబులోను యొక్క సంపద మరియు శక్తిని చూచి భయపడిన లేదా ప్రశంసించిన లేదా నమ్మిన వారిని 2 నీఫై 23–24లో ఉన్న హెచ్చరికలు ఏవిధంగా ప్రభావితం చేసియుండవచ్చో ఆలోచించండి (ఉదాహరణకు, 23:6–9, 11, 19–22; 24:10–19 చూడండి). నేడు మనం భయపడే లేదా ప్రశంసించే లేదా నమ్మే అటువంటి విషయాలలో కొన్ని ఏవి? ఈ అధ్యాయాలలో మీకు ప్రభువు యొక్క సందేశం ఏమైయుండవచ్చని మీరు భావిస్తున్నారు? మీరు “[ప్రభువు యొక్క] ఉన్నతస్థితి యందు ఆనందిస్తున్నారని” (2 నీఫై 23:3) మీరెలా చూపగలరో ఆలోచించండి.

చిత్రం
సెమినరీ చిహ్నము

2 నీఫై 25:19-29

“మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము … మేము క్రీస్తు నందు ఆనందించుచున్నాము.”

నీఫై తన నమ్మకాలను—ప్రత్యేకించి యేసు క్రీస్తు గురించి తన సాక్ష్యాన్ని బహిరంగంగా ఇతరులతో పంచుకున్నాడు. మీరు 2 నీఫై 25 అధ్యయనం చేస్తున్నంతసేపు, “క్రీస్తు నందు విశ్వాసముంచమనియు దేవునితో సమాధానపడుడనియు [తన] సంతానమును ఒప్పించుటకు” నీఫై కోరికల గురించి ఆలోచించండి (23వ వచనము). రక్షకుని గురించి జనులు ఏమి తెలుసుకోవాలని నీఫై కోరుకున్నాడు? (12–13, 16 వచనాలు చూడండి). ఆయనలో నమ్మకముంచమని జనులను ఒప్పించడానికి నీఫై ఎలా ప్రయత్నించాడు? (19–29 వచనాలు చూడండి). ఈ అధ్యాయాలలో యేసు క్రీస్తును విశ్వసించడానికి, అనుసరించడానికి మిమ్మల్ని ఒప్పించు గద్యభాగాలను గుర్తించండి.

క్రీస్తును గూర్చి మాట్లాడడంలో మనలో కొందరు నీఫై ఉన్నంత ధైర్యంగా భావించకపోవచ్చు. కానీ, 2 నీఫై 25:23–26లో ఉన్న నీఫై బోధనలలో ఆయన గురించి ఇతరులతో మరింత బహిరంగంగా మాట్లాడడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా మీరు ఏదైనా కనుగొనవచ్చు. ఉదాహరణకు, “మేము క్రీస్తు నందు ఆనందించుచున్నాము” అనే నీఫై ప్రకటన రక్షకుడు మీకు ఎలా ఆనందాన్ని తేగలరు—మరియు మీరు ఆ ఆనందాన్ని ఇతరులతో ఎలా పంచుకోగలరు అనే వాటి గురించి ఆలోచించేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు.

మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము” (లియహోనా, నవ. 2020, 88–91) అనే తన సందేశములో, వివిధ సందర్భాలలో మనం క్రీస్తును గూర్చి బహిరంగంగా ఎలా మాట్లాడగలమని ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ సూచిస్తున్నారు. ఆయన సూచనలలో ఏవి మీకు ప్రత్యేకమైనవిగా కనబడుతున్నాయి? ఇతరులతో క్రీస్తును గూర్చి మాట్లాడడానికి మీకు గల అవకాశాలేవి?

యేసు క్రీస్తు గురించి ఇతరులకు ఏమి చెప్పడానికి మీరు ప్రేరేపించబడ్డారు? మీకు కొన్ని ఉపాయాలు కావాలంటే, మీరు “జీవముతోనున్న క్రీస్తు: అపొస్తలుల యొక్క సాక్ష్యము” (సువార్త గ్రంథాలయము) పరిశోధించవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

2 నీఫై 21:1-5

యేసు క్రీస్తు నీతియందు తీర్పుతీరుస్తారు.

  • ఈ వచనాలను మీ పిల్లలు ఊహించుకొనేలా సహాయపడేందుకు, నరికివేసిన ఒక చెట్టును లేదా చెట్టునుండి పెరుగుతున్న ఒక కొమ్మను మీరు కనుగొనగలరేమో చూడండి (లేదా క్రింది చిత్రాన్ని ఉపయోగించండి). 2 నీఫై 21:1లోని “కొమ్మ” యేసు క్రీస్తును సూచిస్తున్నట్లయితే, 2–5 వచనాలు ఆయన గురించి మనకు ఏమి బోధిస్తాయి?

చిత్రం
చెట్టు మొదలు నుండి పెరుగుతున్న చిన్న మొక్క

2 నీఫై 21:6-9

యేసు క్రీస్తు శాంతిని, ఆనందాన్ని ఇస్తారు.

  • ప్రతీఒక్కరు రక్షకుడిని అనుసరిస్తే ఏమి జరుగగలదనే దాని గురించి 2 నీఫై 21:6–9 ఏమి బోధిస్తుంది? (4 నీఫై 1:15–18 కూడా చూడండి). మన ఇంటిని ఎక్కువగా ఈ విధముగా మనమెలా చేసుకోగలము? 6–7 వచనాలలో పేర్కొనబడిన జంతువుల చిత్రాలను చూడడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు—సాధారణంగా శత్రువులైన జంతువులు, యేసు మరలా వచ్చినప్పుడు ఒకదానినొకటి గాయపరచవు (ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ చూడండి). వారు మరియు ఈ జంతువులు యేసుతో కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నట్లు కూడా మీ పిల్లలు బొమ్మలు గీయవచ్చు.

2 నీఫై 21:11-12; 22

ప్రభువు తన జనులను సమకూరుస్తున్నారు.

  • ఆయన యొద్దకు సమకూరుటలో జనులకు సహాయపడేందుకు ప్రభువు “జనములను పిలుచుటకు ఒక ధ్వజము” నిలువబెట్టునని యెషయా చెప్పాడు (2 నీఫై 21:11–12 చూడండి). ధ్వజము అనేది ఒక జెండా వంటిదని మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడండి. తమ స్వంత జెండాను గీయడాన్ని బహుశా వారు ఆనందించవచ్చు. వారు యేసు క్రీస్తు వద్దకు మరియు ఆయన సంఘానికి రావడానికి గల కారణాలను సూచించే బొమ్మలను లేదా పదాలను వారు చేర్చవచ్చు. వారి జెండాల గురించి వారిని మాట్లాడనివ్వండి మరియు యేసు క్రీస్తు వద్ద “సమకూడడానికి” వారు ఇతరులకు ఎలా సహాయపడగలరో ఆలోచించడానికి వారికి సహాయపడండి.

  • కలిసి 2 నీఫై 22:4–5 చదివిన తర్వాత, ప్రభువు చేసిన కొన్ని “అద్భుతమైన విషయాల” గురించి మీ పిల్లలతో మీరు మాట్లాడవచ్చు. మనం ప్రకటించగలిగేలా ప్రభువు “[మన] మధ్య నిర్వర్తించిన” కొన్ని కార్యాలు ఏవి? “నేను క్రీస్తునందు విశ్వసిస్తున్నాను; ఆయన ” వంటి వాక్యాన్ని పూరించడానికి మీరు వంతులు తీసుకోవచ్చు. మన కోసం రక్షకుడు చేసిన దాని గురించి తెలుసుకొనేలా ఇతరులకు మనమెలా సహాయపడగలము?

2 నీఫై 25:26

“మేము క్రీస్తు నందు ఆనందించుచున్నాము.”

  • మీ పిల్లలు “క్రీస్తునందు ఆనందించడానికి” మీరు ఎలా సహాయపడగలరు? యేసు క్రీస్తు ఇతరులకు ఆనందాన్నివ్వడం గురించి మీరు ఒక కథ చెప్పవచ్చు. ఆ కథలో ఆనందకరమైన క్షణాలను మీ పిల్లలు ఎత్తిచూపవచ్చు. తర్వాత, మీరు 2 నీఫై 25:26 కలిసి చదువుతున్నప్పుడు, వారు ఎందుకు “క్రీస్తు నందు ఆనందించుచున్నారు” అనే దాని గురించి వారు మాట్లాడవచ్చు.

క్రీస్తు గురించి సాక్ష్యమివ్వండి. రక్షకుని గురించి మీరు ఎలా భావిస్తున్నారో మీ కుటుంబానికి తెలుసని ఊహించకండి. వారికి చెప్పండి మరియు రక్షకుని గురించి మీ మనోభావాలు మీరు వారితో సంభాషించే విధానాన్ని ప్రభావితం చేయనివ్వండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
ఒక కుటుంబానికి బోధిస్తున్న సువార్తికులు

I’ll Go Where You Want Me to Go (నీవు నన్ను వెళ్ళమని కోరిన చోటుకు నేను వెళ్ళెదను), రామన్ ఎలి గార్సియా రివాస్ చేత

ముద్రించు