2024 రండి, నన్ను అనుసరించండి
ఫిబ్రవరి 26–మార్చి 3: “సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.” 2 నీఫై 11-19


“ఫిబ్రవరి 26–మార్చి 3: ‘సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.’ 2 నీఫై 11-19,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“ఫిబ్రవరి 26–మార్చి 3. 2 నీఫై 11-19,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

చిత్రం
కాగితపు పత్రాలపై వ్రాస్తున్న యెషయా

ఫిబ్రవరి 26–మార్చి 3: “సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును”

2 నీఫై 11-19

లోహపు పలకలపై చెక్కడం అంత సులభం కాదు మరియు నీఫై యొక్క చిన్న పలకలపై స్థలం పరిమితంగా ఉన్నది. కాబట్టి, యెషయా రచనలను పెద్ద మొత్తంలో తన గ్రంథంలోకి నకలు చేసే శ్రమతో కూడిన ప్రయత్నాన్ని నీఫై ఎందుకు చేసాడు? మనం యేసు క్రీస్తు నందు విశ్వసించాలని అతడు కోరుకున్నాడు కాబట్టి, అతడు అలా చేసాడు. “క్రీస్తు రాకడను గూర్చి నా జనులకు ఋజువు చేయుటలో నా ఆత్మ ఆనందించుచున్నది” అని అతడు వ్రాసాడు (2 నీఫై 11:4). భవిష్యత్ తరాలలో తన జనులకు ఏమి జరుగుతుందో నీఫై చూసాడు. వారు గొప్ప దీవెనలను కలిగియున్నప్పటికీ, వారు గర్విష్ఠులుగా, కలహించువారిగా మరియు లోకసంబంధులుగా మారిపోతారని అతడు చూసాడు (1 నీఫై 12; 15:4–6 చూడండి). మన కాలములో కూడా అటువంటి సమస్యలను అతడు చూసాడు (1 నీఫై 14 చూడండి). అటువంటి దుష్టత్వమునకు వ్యతిరేకంగా యెషయా రచనలు హెచ్చరించాయి. ఒక మహిమకరమైన భవిష్యత్తు కొరకు—దుష్టత్వము యొక్క అంతము, విశ్వాసుల సమకూడిక మరియు “చీకటిలో నడుచు” వారికి “గొప్ప వెలుగు” (2 నీఫై 19:2) కొరకు కూడా అవి నీఫైకి నిరీక్షణనిచ్చాయి. ఇదంతయు జరుగును, ఎందుకనగా “ఒక శిశువు పుట్టెను,” అతడు సమస్త కలహమును అంతమొందించువాడు—“సమాధానకర్తయగు అధిపతి” (2 నీఫై 19:6).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

యెషయా బోధనలను నేను బాగా ఎలా అర్థం చేసుకోగలను?

“యెషయా మాటలు సరళముగా ఉండవు” అని నీఫై అంగీకరించాడు (2 నీఫై 25:4). కానీ యెషయా రచనలలోని అర్థాన్ని కనుగొనడంలో మనకు సహాయపడడానికి నీఫై సలహా కూడా ఇచ్చాడు:

  • మీతో “అతని మాటలను పోల్చుకోండి” (2 నీఫై 11:2). యెషయా యొక్క అనేక బోధనలకు బహుళ అర్థాలు, ఆచరణ మార్గాలు కలవు. ఉదాహరణకు, 2 నీఫై 14:5–6లో నివాస స్థలాల గురించి మీరు చదువుతున్నప్పుడు, ఈ వచనాలు మీ ఇంటికి ఎలా వర్తిస్తాయో ఆలోచించండి. “నేను ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుతున్నారు?” అని మిమ్మల్ని మీరు అడగండి.

  • యేసు క్రీస్తు యొక్క చిహ్నాల కొరకు చూడండి (2 నీఫై 11:4 చూడండి). రక్షకుని గురించి యెషయా చేసిన బోధనలలో అనేకము చిహ్నాల ద్వారా చెప్పబడ్డాయి. ఉదాహరణకు, 2 నీఫై 19:2లో రక్షకుడు ఏవిధంగా సూచించబడ్డాడు? ఆయన గురించి ఈ చిహ్నము మీకేమి బోధిస్తుంది?

  • “ప్రవచనాత్మతో నింపబడి” ఉండాలని అపేక్షించండి” (2 నీఫై25:4). మీరు చదువుతున్నప్పుడు, ఆత్మీయ నడిపింపు కొరకు ప్రార్థించండి. మీరు అన్నింటినీ ఒకేసారి అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మీరు తెలుసుకోవలసినది నేర్చుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలడు.

పాదవివరణలు, అధ్యాయ శీర్షికలు, లేఖన దీపిక మొదలైన వాటితో సహా లేఖనాలలోని అధ్యయన సహాయాలను ఉపయోగించుట మీకు సహాయకరంగా కూడా ఉండవచ్చు. మోర్మన్ గ్రంథము మరియు పాత నిబంధన ఇన్‌స్టిట్యూట్ చేతిపుస్తకాలు అదనపు సమాచారాన్ని కలిగియున్నాయి, అది యెషయా బోధనలలోని చారిత్రక సందర్భం గురించి నేర్చుకోవడానికి మీకు సహాయపడగలదు.

2 నీఫై 11-19

యేసు క్రీస్తు గురించి యెషయా సాక్ష్యమిచ్చాడు.

యెషయా చిహ్నరూపకమైన భాషను ఉపయోగించినందువల్ల, యేసు క్రీస్తు గురించి అతని శక్తివంతమైన సాక్ష్యాన్ని పట్టించుకోకపోవడం చాలా సులువు కాగలదు. రక్షకుని కొరకు 2 నీఫై 13:13; 14:4–6; 15:1–7; 16:1–7; 17:14; 18:14–15; 22:2లో చూడండి. ఈ వచనాలు ఆయన గురించి మీకు ఏమి బోధిస్తాయి?

2 నీఫై 19:6లోని ప్రవచనము యేసు క్రీస్తు యొక్క అనేక బిరుదులను జాబితా చేస్తుంది. మీ జీవితంలో ఈ పాత్రలను ఆయన ఏ విధంగా నెరవేర్చాడు?

యులిసెస్ సోవారెస్, “యేసు క్రీస్తు: మన ఆత్మల యొక్క పోషకుడు,” లియహోనా, మే 2021, 82–84 కూడా చూడండి.

2 నీఫై 12-13; 15

గర్విష్ఠులు, లౌకికవాదులు వినయంగా అవుతారు.

గర్వము తన జనుల పతనానికి కారణమవుతుందని నీఫై ముందుగా చూసాడు (1 నీఫై 12:19 చూడండి). కాబట్టి గర్వానికి వ్యతిరేకంగా యెషయా పదేపదే చేసిన హెచ్చరికలను నీఫై తన జనులతో పంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. 12 మరియు 13 అధ్యాయాలలో, గర్వాన్ని వివరించడానికి యెషయా ఉపయోగించిన గర్వము మరియు అహంకారం లాంటి పదాల కోసం చూడండి. 2 నీఫై 15:1–24లో, గర్వము యొక్క ఫలితాలను వివరించే చిహ్నరూపకమైన భాష కొరకు చూడండి. తరువాత, మీరు చదివినదానిని మీ స్వంత మాటలలో వివరించడానికి మీరు ప్రయత్నించవచ్చు. వినయంగా ఉండడాన్ని మీరెలా ఎంచుకుంటారో ఆలోచించండి.

చిత్రం
సెమినరీ చిహ్నము

2 నీఫై 12:2-3

దేవాలయము ప్రభువు యొక్క మందిరము.

దేవాలయమును “ప్రభువు మందిర పర్వతము” (2 నీఫై 12:2) అని యెషయా పిలిచాడు. దేవాలయము కొరకు పర్వతము ఎందుకు మంచి చిహ్నము అవుతుంది?

దేవాలయాలు మనకు అవసరమని ఎవరికైనా మీరెలా వివరిస్తారు? 2 నీఫై 12:2–3లో మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశము “దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాది” ( లియహోనా, నవ. 2021, 93–96) లో సాధ్యమైన కొన్ని జవాబులను మీరు కనుగొనగలరు. మీరు చదివిన దానిపై ఆధారపడి, మీరు ఆయన పరిశుద్ధ మందిరంలో ఏమి నేర్చుకోవాలని మరియు అనుభవించాలని ప్రభువు మిమ్మల్ని కోరుతున్నారు? అక్కడ మీరు ఏ అనుభవాలను కలిగియున్నారు?

ప్రతీ ఒక్కదానిని చదివి, ప్రభువు యొక్క మార్గాల గురించి ఈ ప్రశ్న నాకు ఏమి బోధిస్తుంది?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించడాన్ని పరిగణించండి. “ఆయన మార్గములలో నడుచుకొనుటకు” అది నాకెలా సహాయపడుతుంది?

2 నీఫై 12-19

యేసు క్రీస్తు తన జనులను విమోచిస్తారు.

తాను దుష్టత్వమును గమనించినప్పటికీ, భవిష్యత్తు కొరకు నిరీక్షణను యెషయా చూసాడు. క్రింది గద్యభాగాలలో ప్రతీదానిని అధ్యయనం చేయడాన్ని పరిగణించండి. మన కాలం గురించి ప్రతీ గద్యభాగం బోధించే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సత్యాలను వ్రాయండి: 2 నీఫై 12:1–5; 14:2–6; 15:20–26; 19:2–8. ఈ గద్యభాగాలను అర్థం చేసుకోవడం మనకు ముఖ్యమని మీరెందుకు భావిస్తున్నారు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

నమూనాల కోసం చూడండి. ప్రభువు ఎలా పని చేస్తారో చూపించే నమూనాలను లేఖనాల్లో మనం కనుగొనవచ్చు. 2 నీఫై 11-19లో, ప్రభువు పాపము గురించి ఎలా హెచ్చరిస్తారో మరియు పశ్చాత్తాపపడిన వారిని ఎలా క్షమిస్తారో చూపించే నమూనాల కొరకు మీరు చూడవచ్చు.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

2 నీఫై 12:2-3

దేవాలయము ప్రభువు యొక్క మందిరము.

  • దేవాలయమును “ప్రభువు మందిర పర్వతము”గా యెషయా వర్ణించాడు. మీరు 2 నీఫై 12:2–3 చదువుతున్నప్పుడు, మీ పిల్లలు పర్వతాన్ని ఎక్కుతున్నట్లుగా నటించడాన్ని ఆనందించవచ్చు. మనం దేవాలయాలను ఎందుకు కలిగియున్నామో వివరించే వాక్యభాగాలను ఈ వచనాలలో కనుగొనడానికి వారికి సహాయపడండి.

  • 2 నీఫై 12:3 నుండి “మనము ఆయన త్రోవలలో నడుతము” అనే వాక్యభాగాన్ని వివరించడానికి, మీరు దేవాలయ చిత్రానికి దారితీసేలా నేలపై ఒక మార్గాన్ని తయారు చేయవచ్చు. మీ పిల్లలు ఆ మార్గంపై నడుస్తున్నప్పుడు, ప్రభువు మార్గాలలో నడవడానికి వారు చేయగల విషయాలను వారు చెప్పవచ్చు.

  • బహుశా మీ పిల్లలు వారు దేవాలయానికి వెళ్తున్నట్లు చిత్రాన్ని గీయవచ్చు.

2 నీఫై 11:4-7; 17:14; 19:6

యేసు క్రీస్తు నా రక్షకుడు.

  • 2 నీఫై 11:4–7; 17:14; 19:6లో యేసు క్రీస్తుకు చాలా పేర్లున్నాయి. వాటిని కనుగొని, వాటి అర్థం గురించి మాట్లాడడానికి మీ పిల్లలకు సహాయపడండి. ఉదాహరణకు, “క్రీస్తు” అనగా “అభిషిక్తుడు” మరియు “ఇమ్మానుయేలు” అనగా “దేవుడు మనకు తోడైయున్నాడు” అని అర్థము. యేసు గురించి ఈ పేర్లు మనకేమి బోధిస్తాయి?

2 నీఫై 15:20

మంచి చెడుల గురించి నన్ను కలవరపెట్టడానికి సాతాను ప్రయత్నిస్తాడు.

  • ఏదైనా చేదైనది లేదా పుల్లనిది, అనగా నిమ్మకాయ ముక్క వంటిదానిని చాక్లెట్ కాగితంలో చుట్టి మీ పిల్లలకు చూపించండి. కలిసి 2 నీఫై 15:20 చదవండి. చెడ్డ వాటిని మంచివిగా కనిపించేలా చేయడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తాడు? చేపలు పట్టేవారు తమ గాలం కనిపించకుండా దానికి ఏదైనా ఎందుకు తగిలిస్తారు? సాతాను పాపానికి ఎందుకు మారువేషం వేస్తాడు? సాతాను చేత మోసపోకుండా తప్పించుకోవడానికి యేసు క్రీస్తు మనకెలా సహాయపడతారు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
పనామా సిటీ పనామా దేవాలయము

పనామా సిటీ పనామా దేవాలయము. “ప్రభువు మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి, … ప్రవాహము వచ్చినట్లు సమస్త జనములు దానిలోనికి వచ్చెదరు” (2 నీఫై 12:2).

ముద్రించు