లేఖనములు
2 నీఫై 15


15వ అధ్యాయము

ప్రభువు ద్రాక్షతోట (ఇశ్రాయేలు) నిర్జనమగును, ఆయన జనులు చెదరగొట్టబడుదురు—వారి విశ్వాస భ్రష్ఠత్వపు స్థితిలో మరియు చెదిరియున్న స్థితిలో వారికి శ్రమలు కలుగును—ప్రభువు ఒక ధ్వజమునెత్తి ఇశ్రాయేలును సమకూర్చును—యెషయా 5 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 అప్పుడు, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. అతని దాక్షతోటను బట్టి నాకిష్టుడైనవాని గూర్చి పాడెదను వినుడి. సారవంతమైన భూమిగల కొండమీద నా ప్రియునికొక దాక్షతోటయుండెను.

2 ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్షతొట్టిని తొలిపించెను; ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను.

3 కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.

4 నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు, అది కారుద్రాక్షలు కాచెను.

5 ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను—నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసెదను; నేను అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి,

6 దానిని పాడు చేసెదను; అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు; దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసియుండును, దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను.

7 ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు ప్రభువు యొక్క ద్రాక్షతోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము; ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

8 స్థలము మిగులకుండా వారు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొను వారికి శ్రమ!

9 నా చెవులారా వినునట్లు సైన్యములకధిపతియగు ప్రభువు స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను—నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు, పట్టణములు అనేకములు నివాసులులేక పాడైపోవును.

10 పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడు గింజల పంట ఒక పడియగును.

11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రివరకు పానము చేయువారికి శ్రమ!

12 వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని ప్రభువు పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.

13 కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు; వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పికచేత జ్వరపీడితులగుదురు.

14 అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.

15 అల్పులు అణగద్రొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల చూపు తగ్గును.

16 సైన్యములకధిపతియగు ప్రభువే తీర్పుతీర్చి మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును.

17 అది మేతబీడుగా నుండును గొఱ్ఱెపిల్లలు అచ్చట మేయును, గర్వించిన వారి బీడుభూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.

18 భక్తిహీనతయను త్రాళ్ళతో దోషమును లాగుకొను వారికి శ్రమ; బండిమోకుల చేత పాపమును లాగుకొను వారికి శ్రమ.

19 వారు ఇట్లనుకొనుచున్నారు—ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము.

20 కీడును మేలనియు మేలును కీడనియు చెప్పుచు, చీకటిని వెలుగనియు వెలుగును చీకటనియు, చేదును తీపి అనియు తీపిని చేదనియు ఎంచుకొను వారికి శ్రమ!

21 తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొను వారికి శ్రమ.

22 ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువ గలవారికిని శ్రమ;

23 వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పుతీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు.

24 సైన్యములకధిపతియగు ప్రభువు యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు; కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలే పైకి ఎగిరిపోవును.

25 దానినిబట్టి ప్రభువు కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది, ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి; వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలె పడియున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

26 ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమ్యంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును; అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు; వారిలో అలసిన వాడైనను తొట్రిల్లువాడైనను లేడు.

27 వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు. వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షలవారు తెగిపోదు;

28 వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నియు ఎక్కుపెట్టబడియున్నవి, వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకి రాళ్ళతో సమానములు, వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును, ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు.

29 కొదమసింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండా దానిని ఎత్తుకొనిపోవుదురు, విడిపింపగలవాడెవడును ఉండడు.

30 వారు ఆ దినమున సముద్రఘోషవలే జనము మీద గర్జన చేయుదురు; జనులు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును, ఆకాశమందలి వెలుగు కూడా అంధకారమగును.