లేఖనములు
2 నీఫై 20


20వ అధ్యాయము

అష్షూరు నాశనము రెండవ రాకడ సమయమున దుర్మార్గుల నాశనమునకు గుర్తుగా ఉన్నది—ప్రభువు మరలా వచ్చిన తరువాత కొద్దిమంది జనులు విడిచిపెట్టబడుదురు—ఆ దినమున యాకోబు శేషము తిరిగివచ్చును—యెషయా 10 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 విధవరాండ్రు తమకు దోపుడుసొమ్ముగా ఉండవలెననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్లగొట్టవలెననియు కోరి న్యాయవిమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకు, నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకు,

2 అన్యాయపు విధులను విధించు వారికి, బాధాకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ!

3 దర్శన దిన మున, దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయమునొందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు?

4 వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైన వారి క్రింద కూలుచున్నారు; ఈలాగు జరిగినను ప్రభువు కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

5 ఓ అష్షూరీయుడా, నా ఉగ్రత దండమా, నీ చేతిలోని కర్రయే నీ ఆగ్రహమైయున్నది.

6 వేషధారులగు జనముల మీదికి నేను నిన్ను పంపెదను, దోపుడుసొమ్ము దోచుకొనుటకు, కొల్లగొట్టుటకు, వీధులపైనున్న బురద వలే వారిని త్రొక్కించుటకు నా ఉగ్రతకు పాత్రులగు జనులను గూర్చి నీకాజ్ఞాపించెదను.

7 అయితే అతడు ఆలాగున అనుకొనడు, అది అతని ఆలోచన కాదు; నాశనము చేయవలెననియు చాలా జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన.

8 అతడు ఇట్లనుకొనుచున్నాడు: నా అధిపతులందరు మహారాజులు కారా?

9 కల్నో, కర్కెమీషు వలె నుండలేదా? హమాతు, అర్పాదు వలె నుండలేదా? సమరయ, దమస్కు వలె నుండలేదా?

10 విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము, సమరయల విగ్రహముల కంటె ఎక్కువైనవి గదా?

11 సమరయకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను.

12 కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయగర్వమువలన కలిగిన ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతడిని శిక్షింతును.

13 అతడు—నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను ఆలాగు చేసితిని; నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని, మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని;

14 పక్షిగూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను; ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును.

15 గొడ్డలి తనతో నరుకు వాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయు వాని మీద పొగడుకొనునా? దండము దానిని ఎత్తు వానికి వ్యతిరేకముగా ఆడునా, దుడ్డుకర్ర దానికదే ఎత్తబడునా?

16 కావున ప్రభువును సైన్యములకధిపతియునగు ప్రభువు బలిసిన అష్షూరీయుల మీదికి రోగమును పంపును; వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరవికట్టెను రాజును.

17 ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును, అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చపొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మ్రింగివేయును.

18 ఒకడు వ్యాధిగ్రస్థుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతోకూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును.

19 అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును.

20 ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమను హతము చేసిన వానిని ఇక ఆశ్రయింపక, సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన ప్రభువును నిజముగా ఆశ్రయించెదరు.

21 శేషము తిరిగి వచ్చును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును.

22 నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలే ఉండినను దానిలో శేషమే తిరిగి వచ్చును; ప్రభువు నిర్ణయించిన సమూలనాశనము కారణముగా ప్రవాహము వలె నీతి వచ్చును.

23 ఏలయనగా, ప్రభువును సైన్యములకధిపతియునగు దేవుడు సర్వలోకమున సమూలనాశనము కలుగజేయును.

24 ప్రభువును సైన్యములకధిపతియునగు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—సీయోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్లు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి, నీమీద తన దండమును ఎత్తినను వానికి భయపడకుము.

25 ఇకను కొద్దికాలమైన తర్వాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును.

26 ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకధిపతియగు ప్రభువు తన కొరడాలను వాని మీద ఆడించును; ఐగుప్తీయుల కొరకు ఆయన సముద్రముపై దండమెత్తినట్లుగా ఆయన తన దండమునెత్తును.

27 ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, అభిషేకము వలన ఆ కాడి విరుగగొట్టబడును.

28 అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు, మిగ్రోను మార్గముగా పోవుచున్నారు; మిక్మషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు.

29 వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు; రామా వణుకుచున్నది; గెబలో బసచేతము రండని అనుచున్నారు; సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు.

30 గల్లీములారా బిగ్గరగా కేకలువేయుడి; లాయిషా ఆలకింపుము, అయ్యయ్యో అనాతోతు.

31 మద్మేనా జనులు పారిపోవుదురు; గిబానివాసులు పారిపోవుటకు సమకూడుదురు.

32 ఈ దినమే దండు నోబులో దిగును; ఈ దినమే సీయోను కుమారి పర్వతమను యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు.

33 చూడుడి, ప్రభువును సైన్యములకధిపతియునగు ప్రభువు భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును; ఉన్నతమైనవి పడిపోవును.

34 ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును.

ముద్రించు