ఈ గ్రంథము ఎవరి దగ్గరకు వచ్చునో అట్టి సమస్త జనములకు, వంశములకు, భాషలకు మరియు ప్రజలకు ఇది తెలియును గాక: ఏమనగా, మేము తండ్రియైన దేవుడు మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపనుబట్టి నీఫై జనుల యొక్క, వారి సహోదరులైన లేమనీయుల యొక్క మరియు చెప్పబడిన గోపురము నుండి వచ్చిన జేరెడ్ జనుల యొక్క వృత్తాంతమును కూడా కలిగియున్న పలకలను చూచితిమి. ఆయన స్వరము మాకు ప్రకటించెను గనుక, అవి దేవుని బహుమానము మరియు శక్తి ద్వారా అనువదించబడెనని కూడా మేమెరుగుదుము. అందువలన ఈ గ్రంథము సత్యమని నిశ్చయముగా మాకు తెలియును. మరియు ఆ పలకల మీద ఉన్నట్టి చెక్కడములను మేము చూచితిమని, అవి మాకు దేవుని శక్తి చేత చూపబడెనని, మనుష్యుని వలన కాదని కూడా మేము సాక్ష్యమిచ్చుచున్నాము. ఒక దేవదూత పరలోకము నుండి క్రిందికి వచ్చెనని, అతడు తెచ్చి మా కన్నుల ముందుంచెనని మరియు మేము ఆ పలకలను, వాటి మీదనున్న చెక్కడములను చూచితిమని, గ్రహించితిమని గంభీరమైన వాక్యములతో ప్రకటించుచున్నాము; తండ్రియైన దేవుడు మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు కృప వలననే మేము వాటిని చూచితిమి మరియు ఈ సంగతులు నిజమని మేమెరుగుదుము. ఇది మా కన్నులకు ఆశ్చర్యకరముగానుండెను. మేము దీనికి సాక్ష్యమియ్యవలెనని ప్రభువు యొక్క స్వరము మమ్ములను ఆజ్ఞాపించెను; అందువలన, దేవుని ఆజ్ఞలకు విధేయులైయుండుటకు మేము ఈ విషయముల గురించి సాక్ష్యమిచ్చుచున్నాము. క్రీస్తునందు మేము విశ్వాసముగానుండిన యెడల, సకల మానవుల రక్తము నుండి మేము మా వస్త్రములను విడిపించుకొందుమని, క్రీస్తు యొక్క తీర్పు సింహాసనము యెదుట మచ్చలేనివారముగా కనబడుదుమని మరియు పరలోకములో శాశ్వతముగా ఆయనతో నివసించెదమని మేమెరుగుదుము. ఏక దేవుడైయున్న తండ్రికి, కుమారునికి మరియు పరిశుద్ధాత్మకును ఘనత చెల్లును గాక. ఆమేన్.