లేఖనములు
ఆల్మా 63


63వ అధ్యాయము

షిబ్లోన్‌, ఆ తరువాత హీలమన్‌ పవిత్ర గ్రంథములను స్వాధీనపరచుకొందురు—అనేకమంది నీఫైయులు ఉత్తరము వైపు దేశమునకు ప్రయాణము చేయుదురు—హాగోతు ఓడలను నిర్మించును, అవి పడమటి సముద్రములో ప్రయాణించును—మొరోనైహా యుద్ధమందు లేమనీయులను ఓడించును. సుమారు క్రీ. పూ. 56–52 సం.

1 నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పది ఆరవ సంవత్సరము యొక్క ప్రారంభమందు, ఆల్మా చేత హీలమన్‌కు అప్పగించబడిన ఆ పవిత్ర వస్తువుల యొక్క స్వాధీనమును షిబ్లోన్‌ తీసుకొనెను.

2 అతడు న్యాయవంతుడైయుండి, దేవుని యెదుట యథార్థముగా నడిచెను; అతడు నిరంతరము మేలు చేయుచూ ప్రభువైన అతని దేవుని ఆజ్ఞలను నెరవేర్చెను; అతని సహోదరుడు కూడా నెరవేర్చెను.

3 మరియు మొరోనై మరణించెను. ఆ విధముగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పది ఆరవ సంవత్సరము ముగిసెను.

4 న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పది ఏడవ సంవత్సరమందు, సుమారు అయిదు వేల నాలుగు వందలమంది పురుషులు, వారి భార్యలు మరియు పిల్లలతో కూడిన పెద్ద సమూహమొకటి జరహేమ్ల దేశమునుండి ఉత్తరము వైపునున్న దేశములోనికి వెడలిపోయెను.

5 మరియు హాగోతు అను మిక్కిలి జిజ్ఞాసగల మనుష్యుడొకడు వెళ్ళి, నిర్జనదేశము ప్రక్కన సమృద్ధిదేశము యొక్క సరిహద్దులపైన అతిపెద్ద ఓడ నొకదానిని నిర్మించెను మరియు ఉత్తరము వైపు దేశములోనికి నడిపించు సన్నని కంఠభూమి ద్వారా పడమటి సముద్రములోనికి దానిని జలప్రవేశము చేయించెను.

6 నీఫైయులనేకులు దానియందు ప్రవేశించి, అధికమైన ఆహారసామాగ్రులు మరియు అనేకమంది స్త్రీలు పిల్లలతో నీటి మీద ఉత్తరమువైపు ప్రయాణము చేసిరి; ఆ విధముగా ముప్పది ఏడవ సంవత్సరము ముగిసెను.

7 ముప్పది ఎనిమిదవ సంవత్సరమందు ఈ మనుష్యుడు ఇతర ఓడలను నిర్మించెను మరియు మొదటి ఓడ కూడా తిరిగి వచ్చెను, ఇంకను అనేకమంది జనులు దానియందు ప్రవేశించిరి; వారు కూడా అధికమైన ఆహారసామాగ్రులు తీసుకొని ఉత్తరము వైపు దేశమునకు తిరిగి ప్రయాణము సాగించిరి.

8 మరియు వారిని గూర్చి ఎన్నడూ వినబడలేదు. వారు సముద్రపు లోతులలో మునిగిపోయిరని మేము తలంచితిమి. మరియొక ఓడ కూడా నీటి మీద ప్రయాణము చేసెను; అది ఎక్కడకు వెళ్ళెనో మేమెరుగము.

9 ఈ సంవత్సరమందు ఉత్తరము వైపు దేశములోనికి వెళ్ళియుండిన వారు అనేకులుండిరి. ఆ విధముగా ముప్పది ఎనిమిదవ సంవత్సరము ముగిసెను.

10 న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు షిబ్లోన్‌ కూడా మరణించెను మరియు ఉత్తరము వైపు దేశములోనికి వెళ్ళియుండిన జనులకు ఆహారసామాగ్రులను తీసుకొనిపోవుటకు ఒక ఓడ యందు కోరియాంటన్‌ ఆ దేశమునకు వెళ్ళెను.

11 కావున ఆ పవిత్రమైన వస్తువులను అతని మరణమునకు ముందు, అతని తండ్రి యొక్క పేరును బట్టి హీలమన్‌ అని పిలువబడిన హీలమన్‌ యొక్క కుమారునికి ఇచ్చుట షిబ్లోన్‌కు అవసరమాయెను.

12 ఇప్పుడు, వెళ్ళకూడదని ఆల్మా చేత ఆజ్ఞాపించబడిన ఆ భాగములు తప్ప, హీలమన్‌ యొక్క స్వాధీనమందున్న ఆ చెక్కడములన్నియు వ్రాయబడి సమస్త దేశమంతటా నరుల సంతానము మధ్యకు పంపబడెను.

13 అయినప్పటికీ ఈ వస్తువులు పవిత్రముగా ఉంచబడి, తరతరములకు అందించబడవలెను; కావున ఈ సంవత్సరమందు షిబ్లోన్‌ మరణించుటకు ముందు అవి హీలమన్‌కు ఇవ్వబడెను.

14 మరియు ఈ సంవత్సరమందు లేమనీయుల యొద్దకు వెళ్ళియుండిన అసమ్మతీయులు కొందరు అక్కడ ఉండిరి; వారు మరలా నీఫైయులకు వ్యతిరేకముగా పురిగొల్పబడిరి.

15 అదే సంవత్సరములో వారు ఒక బహు సంఖ్యాకమైన సైన్యముతో మొరోనైహా జనులకు లేదా మొరోనైహా యొక్క సైన్యమునకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వచ్చిరి, దాని యందు వారు ఓడించబడి, తీవ్ర నష్టమును పొంది వారి స్వదేశములకు తిరిగి తరుమబడిరి.

16 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పది తొమ్మిదవ సంవత్సరము ముగిసెను.

17 ఆ విధముగా ఆల్మా, అతని కుమారుడైన హీలమన్‌ మరియు అతని కుమారుడైన షిబ్లోన్‌ యొక్క వృత్తాంతము ముగిసెను.

ముద్రించు