14వ అధ్యాయము
ఆల్మా, అమ్యులెక్‌లు చెరసాలలో వేయబడి, కొట్టబడుదురు—విశ్వాసులు, వారి పరిశుద్ధ లేఖనములు అగ్ని చేత దహించబడును—ఈ హతసాక్షులు ప్రభువు చేత మహిమలో చేర్చుకొనబడుదురు—చెరసాల గోడలు విరిగి పడిపోవును—ఆల్మా, అమ్యులెక్‌లు విడిపించబడుదురు, వారిని హింసించిన వారు సంహరించబడుదురు. సుమారు క్రీ. పూ. 82–81 సం.
1 అతడు జనులతో మాట్లాడుట ముగించిన తరువాత, వారిలో అనేకులు అతని మాటలపై విశ్వసించి, పశ్చాత్తాపపడి, లేఖనములను వెదకనారంభించిరి.
2 కానీ వారిలో అధిక సంఖ్యాకులు ఆల్మా, అమ్యులెక్‌లను నాశనము చేయవలెనని కోరిరి; ఏలయనగా జీజ్రొమ్‌తో అతడు స్పష్టముగా మాట్లాడుటను బట్టి వారు ఆల్మాతో కోపముగానుండిరి; అమ్యులెక్ వారితో అబద్ధమాడెనని, వారి చట్టము, న్యాయవాదులు మరియు న్యాయాధిపతులకు వ్యతిరేకముగా అతడు దూషించెనని కూడా వారు చెప్పిరి.
3 వారు ఆల్మా, అమ్యులెక్‌లతో కోపముగానుండిరి; వారి దుష్టత్వమును గూర్చి అంత స్పష్టముగా సాక్ష్యమిచ్చినందున వారిని రహస్యముగా చంపుటకు కోరిరి.
4 కానీ, వారట్లు చేయలేదు; వారిని పట్టుకొని బలమైన త్రాళ్ళతో కట్టివేసి, దేశము యొక్క ప్రధాన న్యాయాధిపతి యెదుటికి తీసుకువెళ్ళిరి.
5 మరియు జనులు వెళ్ళి వారికి వ్యతిరేకముగా సాక్ష్యమిచ్చిరి—చట్టమునకు, దేశము యొక్క న్యాయవాదులకు, న్యాయాధిపతులకు మరియు దేశమందున్న జనులందరికి వ్యతిరేకముగా వారు దూషించిరని సాక్ష్యమిచ్చిరి; దేవుడు ఒక్కడేనని, ఆయన తన కుమారుడిని జనుల మధ్యకు పంపునని, కానీ ఆయన వారిని రక్షించడని కూడా సాక్ష్యమిచ్చిరి; జనులు ఆల్మా, అమ్యులెక్‌లకు వ్యతిరేకముగా అటువంటి అనేక విషయములను గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఇప్పుడిది దేశము యొక్క ప్రధాన న్యాయాధిపతి యెదుట చేయబడెను.
6 మరియు చెప్పబడిన మాటలకు జీజ్రొమ్ ఆశ్చర్యపడెను; తన అబద్ధపు మాటల చేత జనుల మనస్సులకు అతడు కలుగజేసిన అంధత్వమును గూర్చి అతడు ఎరిగియుండెను; అతని ఆత్మ అతని దోషము యొక్క జ్ఞానమును బట్టి వేదన చెందుట మొదలుపెట్టెను; అతడు నరకపు బాధల చేత చుట్టబడసాగెను.
7 అప్పుడతడు జనులకు కేక వేయుచు—ఇదిగో, నేను దోషినైయున్నాను, ఈ మనుష్యులు దేవుని యెదుట మచ్చలేకయున్నారని చెప్పనారంభించెను. ఆ సమయము నుండి అతడు వారి కొరకు బ్రతిమాలుట ప్రారంభించెను; కానీ వారతనిని దూషించి, నీవు కూడా దయ్యము పట్టియున్నావా? అనుచూ అతనిపై ఉమ్మివేసి, వారి మధ్య నుండి అతడిని మరియు ఆల్మా, అమ్యులెక్‌ల చేత చెప్పబడిన మాటలందు విశ్వసించిన వారందరినీ కూడా బయటకు త్రోసివేసిరి; వారిని బయటకు త్రోసివేసి, వారిపై రాళ్ళు విసురుటకు మనుష్యులను పంపిరి.
8 వారి భార్యా పిల్లలను మరియు దేవుని వాక్యమందు విశ్వసించిన లేదా విశ్వసించుటకు బోధింపబడిన వారందరిని తెచ్చి అగ్నిలో పడవేయునట్లు వారు చేసిరి; పరిశుద్ధ లేఖనములను కలిగియున్న వారి గ్రంథములు అగ్ని చేత దహించబడి నాశనము చేయబడవలెనని వాటిని కూడా తెచ్చి అగ్నిలో పడవేసిరి.
9 వారు ఆల్మా, అమ్యులెక్‌లను పట్టుకొని, అగ్ని చేత దహించివేయబడిన వారి నాశనమును చూచునట్లు ఆ హతసాక్షుల స్థలమునకు వారిని తీసుకొనిపోయిరి.
10 అగ్ని చేత దహించబడుచున్న స్త్రీలు, పిల్లల యొక్క వేదనలను అమ్యులెక్ చూచినప్పుడు అతడు కూడా వేదన చెంది, ఆల్మాతో ఇట్లనెను: ఈ భయంకరమైన దృశ్యమును మనమెట్లు చూడగలము? మన చేతులను చాపి, మనలో ఉన్న దేవుని శక్తిని ఉపయోగించి వారిని జ్వాలల నుండి రక్షించెదము.
11 కానీ ఆల్మా అతనితో ఇట్లు చెప్పెను: నా చేతిని చాపరాదని ఆత్మ నన్ను ఆపుచున్నది; ఏలయనగా ప్రభువు వారిని మహిమలో తన యొద్దకు చేర్చుకొనును; ఆయన తన ఉగ్రత యందు వారిపై చేయు తీర్పులు న్యాయమైనవై యుండునట్లు వారి హృదయ కాఠిన్యమును బట్టి, వారీ కార్యము చేయునట్లు లేదా జనులు వారికి ఈ కార్యమును చేయునట్లు ఆయన అనుమతించును; అంత్యదినమున నిర్దోషుల రక్తము వారికి వ్యతిరేకముగా ఒక సాక్ష్యముగా నిలిచి, బలముగా మొరపెట్టును.
12 ఇప్పుడు అమ్యులెక్, ఆల్మాతో—బహుశా వారు మనలను కూడా కాల్చివేయుదురేమో అనెను.
13 మరియు ఆల్మా—ప్రభువు యొక్క చిత్తమును బట్టి జరుగనిమ్ము. కానీ, మన పని ముగియలేదు; కావున వారు మనలను కాల్చరని చెప్పెను.
14 ఇప్పుడు, అగ్నిలో వేయబడిన వారి శరీరములు మరియు వారితో వేయబడినట్టి గ్రంథములు దహించబడిన తరువాత దేశము యొక్క ప్రధాన న్యాయాధిపతి వచ్చి బంధించబడియున్న ఆల్మా, అమ్యులెక్‌ల ముందు నిలబడెను; అతడు తన చేతితో వారి చెంపలపై కొట్టి, వారితో ఇట్లనెను: జరిగిన దానిని చూచిన తర్వాత కూడా, ఈ జనులు అగ్ని గంధకములు గల గుండములో వేయబడునట్లు మీరు వారికి మరలా బోధించెదరా?
15 అగ్నిలో వేయబడిన వారిని రక్షించుటకు మీకు శక్తిలేదని మీరు చూచుచున్నారు; వారు మీ విశ్వాసమునకు చెందిన వారైనందున దేవుడు కూడా వారిని రక్షించియుండలేదు. ఇప్పుడు మిమ్ములను గూర్చి మీరేమందురు? అని అడుగుచూ న్యాయాధిపతి మరలా వారి చెంపల మీద కొట్టెను.
16 ఇప్పుడు ఈ న్యాయాధిపతి గిడియన్‌ను సంహరించిన నీహోర్ యొక్క క్రమమునకు విశ్వాసమునకు చెందినవాడైయుండెను.
17 ఆల్మా, అమ్యులెక్‌లు అతనికేమియు బదులు చెప్పలేదు; అతడు వారిని మరలా కొట్టి, చెరసాలలో వేయమని అధికారులకు అప్పగించెను.
18 వారు మూడు దినములపాటు చెరసాలలో ఉంచబడినప్పుడు నీహోర్ యొక్క విశ్వాసమునుకు చెందినవారైన న్యాయవాదులు, న్యాయాధిపతులు, యాజకులు మరియు బోధకులనేకులు వచ్చిరి; వారిని చూచుటకు వారు చెరసాలలోకి వచ్చి, పలురకాలుగా వారిని ప్రశ్నించిరి; కానీ, వారు ఏమియు బదులు చెప్పలేదు.
19 న్యాయాధిపతి వారి యెదుట నిలిచి—ఈ జనుల మాటలకు మీరెందుకు బదులు చెప్పుటలేదు? మిమ్ములను జ్వాలలకు అప్పగించుటకు నేను శక్తి కలిగియున్నానని మీరెరుగరా? అనెను. మరియు వారు మాట్లాడవలెనని అతడు ఆజ్ఞాపించెను; కానీ, వారు ఏమియు బదులు చెప్పలేదు.
20 వారు బయలుదేరి తమ త్రోవలలో వెళ్ళిపోయిరి, కాని మరసటి దినమున తిరిగి వచ్చిరి; న్యాయాధిపతి కూడా మరలా వారి చెంపల మీద కొట్టెను. అనేకులు వచ్చి, మీరు మరలా ఈ జనులకు తీర్పు తీర్చుటకు నిలిచెదరా? మా చట్టమును నిందించెదరా? మీకంత గొప్ప శక్తి ఉన్న యెడల మిమ్ములను మీరెందుకు విడిపించుకొనలేదు? అని అనుచూ వారిని కొట్టిరి.
21 వారి మీద తమ పండ్లు కొరుకుచూ, ఉమ్మి వేయుచు—మేము ఖండించబడినప్పుడు ఎట్లు కనబడుదుము? అనుచూ అనేక మాటలను వారితో పలికిరి.
22 అటువంటి అనేక మాటలను, అనగా అన్ని రకముల మాటలను వారితో పలికిరి; ఆవిధముగా వారు అనేక దినములు వారిని ఎగతాళి చేసిరి. వారు ఆకలిగొనునట్లు వారికి ఆహారమును, వారు దప్పికగొనునట్లు వారికి నీటిని ఇవ్వకయుండిరి; వారు దిగంబరులుగా ఉండునట్లు వారి నుండి వారి వస్త్రములను కూడా తీసుకొనిరి; ఆ విధముగా వారు బలమైన త్రాళ్ళతో కట్టబడి, చెరసాలలో బంధింపబడిరి.
23 వారు అనేక దినములు ఆ విధముగా బాధపడిన తరువాత (అది నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదియవ సంవత్సరము యొక్క పదియవ నెలలోని పండ్రెండవ దినమైయుండెను), అమ్మోనైహా దేశము యొక్క ప్రధాన న్యాయాధిపతి మరియు వారి బోధకులు, న్యాయవాదులనేకులు ఆల్మా, అమ్యులెక్‌లు త్రాళ్ళతో బంధింపబడియున్న ఆ చెరసాల లోనికి వెళ్ళిరి.
24 ప్రధాన న్యాయాధిపతి వారి ముందు నిలిచి మరలా వారిని కొట్టి, వారితో ఇట్లనెను: మీరు దేవుని శక్తిని కలిగియున్న యెడల ఈ బంధకముల నుండి మిమ్ములను మీరు విడిపించుకొనుడి, అప్పుడు మీ మాటల ప్రకారము ప్రభువు ఈ జనులను నాశనము చేయునని మేము విశ్వసించెదము.
25 మరియు వారందరు వెళ్ళి, చివరివాని వరకు అవే మాటలను చెప్పుచూ వారిని కొట్టిరి; చివరివాడు వారితో మాట్లాడినప్పుడు దేవుని శక్తి ఆల్మా, అమ్యులెక్‌లపై నిలువగా వారు లేచి, తమ కాళ్ళపై నిలబడిరి.
26 అప్పుడు ఆల్మా ఎలుగెత్తి—ఓ ప్రభువా, ఎంత కాలము మేము ఈ గొప్ప శ్రమలను అనుభవించవలెను? ఓ ప్రభువా, క్రీస్తునందున్న మా విశ్వాసమును బట్టి మేము విడుదలగునంతగా మాకు శక్తి నిమ్మనెను. అంతట బంధింపబడిన ఆ త్రాళ్ళను వారు తెంచుకొనిరి; జనులు దీనిని చూచినపుడు పారిపోవుట మొదలుపెట్టిరి, ఏలయనగా నాశనమును గూర్చిన భయము వారి మీదికి వచ్చియుండెను.
27 వారి భయము ఎంత గొప్పదనగా వారు నేలపై పడి, చెరసాల యొక్క వెలుపలి ద్వారమును కూడా చేరలేకపోయిరి; భూమి బలముగా కంపించి, చెరసాల గోడలు రెండుగా చీలిపోయెను, కావున వారు నేలపై పడిరి; గోడలు కూలుటను బట్టి ఆల్మా, అమ్యులెక్‌లను కొట్టిన ప్రధాన న్యాయాధిపతి, న్యాయవాదులు, యాజకులు మరియు బోధకులు సంహరింపబడిరి.
28 ఆల్మా, అమ్యులెక్‌లు గాయపడకుండా చెరసాలలో నుండి బయటకు వచ్చిరి; ఏలయనగా క్రీస్తునందున్న వారి విశ్వాసమును బట్టి, ప్రభువు వారికి శక్తిననుగ్రహించెను. వారు చెరసాల నుండి తిన్నగా బయటకు వచ్చిరి; వారి బంధకముల నుండి విడిపించబడిరి; చెరసాల నేల కూలి, ఆల్మా అమ్యులెక్‌లు తప్ప, గోడల లోపలనున్న ప్రతి ఒక్కరు సంహరింపబడిరి; మరియు వారు తిన్నగా పట్టణములోకి వచ్చిరి.
29 ఇప్పుడు జనులు గొప్ప శబ్దము వినియుండి, దానికి కారణము తెలుసుకొనుటకు సమూహములుగా కలిసి పరుగెత్తుకు వచ్చిరి; ఆల్మా, అమ్యులెక్‌లు చెరసాలలో నుండి బయటకు వచ్చుటను, దాని గోడలు నేల కూలియుండుటను చూచినపుడు వారు మిక్కిలి భయభ్రాంతులై, రెండు సింహముల యెదుట నుండి ఒక మేక తన పిల్లలతో పారిపోవునట్లుగా ఆల్మా, అమ్యులెక్‌ల యెదుట నుండి పారిపోయిరి; ఆ విధముగా వారు ఆల్మా, అమ్యులెక్‌ల సముఖము నుండి పారిపోయిరి.