లేఖనములు
ఆల్మా 22


22వ అధ్యాయము

అహరోను, లమోనై యొక్క తండ్రికి సృష్టిని గూర్చి, ఆదాము యొక్క పతనము మరియు క్రీస్తు ద్వారా విమోచన ప్రణాళికను గూర్చి బోధించును—రాజు మరియు అతని ఇంటి వారందరు పరివర్తన చెందుదురు—నీఫైయులు మరియు లేమనీయుల మధ్య దేశ విభజన వివరించబడినది. సుమారు క్రీ. పూ. 90–77 సం.

1 ఆ విధముగా అమ్మోన్‌, లమోనై యొక్క జనులకు నిరంతరము బోధించుచుండగా, మనము అహరోను మరియు అతని సహోదరుల వృత్తాంతమునకు తిరిగి వచ్చెదము; ఏలయనగా అతడు మిద్దోనై దేశము నుండి వెడలిపోయిన తరువాత, అతడు ఆత్మ చేత నీఫై దేశమునకు, ఇష్మాయెల్ యొక్క దేశము తప్ప మిగిలిన దేశమంతటిపై రాజైన వాని ఇంటికి నడిపించబడెను; ఆ రాజు లమోనై యొక్క తండ్రియైయుండెను.

2 మరియు అతడు, అతని యొద్దకు రాజ భవనములోనికి తన సహోదరులతో వెళ్ళి, రాజు యెదుట వంగి నమస్కరించి, అతనితో ఇట్లనెను: ఓ రాజా, నీవు చెరసాల నుండి విడుదల చేసిన మేము అమ్మోన్‌ యొక్క సహోదరులము.

3 ఇప్పుడు ఓ రాజా, నీవు మా ప్రాణములను విడిచిపెట్టిన యెడల మేము నీ సేవకులుగా ఉండెదము. మరియు రాజు వారితో ఇట్లనెను: లెమ్ము, నేను మీ ప్రాణములను మీకనుగ్రహించుచున్నాను, మీరు నా సేవకులుగా ఉండుటకు నేను అనుమతించను; కానీ, మీరు నాకు పరిచర్య చేయవలెనని నేను నొక్కి చెప్పుచున్నాను; ఏలయనగా మీ సహోదరుడైన అమ్మోన్‌ మాటల యొక్క ఔదార్యము మరియు గొప్పతనమును బట్టి, నేను మనస్సునందు కొంత కలత చెందియున్నాను; అతడు మిద్దొనై నుండి మీతో రాకపోవడానికి కారణమును తెలుసుకోవాలని నేను కోరుచున్నాను.

4 అప్పుడు అహరోను, రాజుతో ఇట్లనెను: ప్రభువు యొక్క ఆత్మ అతడిని మరొక మార్గమున పిలిచెను; అతడు లమోనై యొక్క జనులకు బోధించుటకు ఇష్మాయెల్ దేశమునకు వెళ్ళెను.

5 అంతట రాజు వారితో—ప్రభువు యొక్క ఆత్మను గూర్చి మీరు చెప్పినదేమిటి? ఈ సంగతియే నన్ను కలవరపెట్టుచున్నది అనెను.

6 ఇంకను—మీరు పశ్చాత్తాపపడిన యెడల మీరు రక్షింపబడుదురు; మరియు మీరు పశ్చాత్తాపపడని యెడల, మీరు అంత్యదినమున కొట్టివేయబడుదురు—అని అమ్మోన్‌ చెప్పినదేమిటి? అనెను.

7 అహరోను అతనికి సమాధానమిచ్చి, దేవుడున్నాడని నీవు నమ్ముచున్నావా? అనెను. అంతట రాజు ఇట్లనెను: ఒక దేవుడున్నాడని అమలేకీయులు చెప్పుచున్నారని నేను ఎరుగుదును మరియు ఆయనను ఆరాధించుటకు వారు తమను సమకూడుకొనునట్లు పరిశుద్ధాలయములు నిర్మించవలెనని నేను వారికి అనుగ్రహించియున్నాను. ఇప్పుడు ఒక దేవుడున్నాడని నీవు చెప్పిన యెడల, నేను నమ్మెదను.

8 అహరోను దీనిని వినినప్పుడు, అతని హృదయము ఆనందించసాగెను మరియు అతడు—ఓ రాజా, నీవు జీవించుచున్నంత నిశ్చయముగా ఒక దేవుడున్నాడు అనెను.

9 యెరూషలేము దేశము నుండి మన పితరులను బయటకు తెచ్చిన ఆ గొప్ప ఆత్మయేనా దేవుడు? అని రాజు అడిగెను.

10 అహరోను అతనితో ఇట్లు చెప్పెను: అవును, ఆయనే ఆ గొప్ప ఆత్మ, ఆయన పరలోకమందును భూమియందును సమస్తము సృష్టించెను. దీనిని నీవు నమ్మెదవా?

11 మరియు అతడు ఇట్లు చెప్పెను: అవును, గొప్ప ఆత్మ సమస్తమును సృష్టించెనని నేను నమ్ముచున్నాను, ఈ సంగతులన్నిటి గూర్చి మీరు నాకు చెప్పవలెనని నేను కోరుచున్నాను, నేను మీ మాటలను నమ్మెదను.

12 రాజు అతని మాటలను నమ్మునని అహరోను చూచినప్పుడు, అతడు—దేవుడు మనుష్యుని తన స్వరూపమందు సృష్టించెనని, దేవుడు అతనికి ఆజ్ఞలు ఇచ్చెనని మరియు అతిక్రమమును బట్టి మనుష్యుడు పతనమయ్యెనని రాజు కొరకు లేఖనములు చదువుచూ ఆదాము యొక్క సృష్టి నుండి చెప్పనారంభించెను.

13 మనుష్యుని పతనమును, వారి శరీర సంబంధమైన స్థితిని, మరియు ఆయన నామమందు విశ్వసించు వారందరికి క్రీస్తు ద్వారా లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధపరచబడిన విమోచన ప్రణాళికను కూడా అతని ముందుంచుచూ అహరోను ఆదాము యొక్క సృష్టి నుండి లేఖనములను అతనికి వివరించెను.

14 మనుష్యుడు పతనమైనందున అతడు తనకుతానుగా ఏ యోగ్యతను సంపాదించుకొనలేడు; కానీ విశ్వాసము, పశ్చాత్తాపము ద్వారా క్రీస్తు యొక్క శ్రమలు మరియు మరణము వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుట మొదలయినవి; ఆయన మరణ బంధకములను త్రెంచునని, సమాధి ఇక ఏ విజయమును కలిగిలేదని మరియు మహిమ యొక్క నిరీక్షణలలో మరణపుముల్లు హరించివేయబడవలెనని ఈ సంగతులన్నిటినీ అహరోను రాజుకు వివరించెను.

15 అహరోను ఈ సంగతులను అతనికి వివరించిన తరువాత రాజు అతనితో—నీవు చెప్పిన ఈ నిత్యజీవమును పొందుటకు నేనేమి చేయవలెను? నేను దేవుని ద్వారా జన్మించుటకు, ఈ దుష్టాత్మ నా రొమ్ము నుండి పెకిలించబడి ఆనందముతో నింపబడునట్లు ఆయన ఆత్మను స్వీకరించుటకు, అంత్యదినమున నేను కొట్టివేయబడకుండుటకు నేనేమి చేయవలెను? అనెను. ఇదిగో, నేను కలిగియున్న దానంతటినీ ఇచ్చివేసెదను, అంతేకాక ఈ గొప్ప సంతోషమును పొందుటకు నేను నా రాజ్యమును వదిలివేసెదనని అతడు చెప్పెను.

16 కానీ అహరోను అతనితో ఇట్లనెను: నీవు ఈ విషయమును కోరి దేవుని యెదుట వంగి నమస్కరించిన యెడల, నీ పాపములన్నిటి విషయమై నీవు పశ్చాత్తాపపడి దేవుని యెదుట వంగి నమస్కరించి, నీవు పొందుదువని నమ్ముచూ విశ్వాసముతో ఆయన నామమున ప్రార్థన చేసిన యెడల, అప్పుడు నీవు కోరిన నిరీక్షణను నీవు పొందెదవు.

17 అహరోను ఈ మాటలను చెప్పినప్పుడు రాజు, ప్రభువు యెదుట తన మోకాళ్ళపై వంగి నమస్కరించెను; అంతేకాక అతడు నేలపై సాష్టాంగపడి, బిగ్గరగా ఇట్లనెను:

18 ఓ దేవా, ఒక దేవుడున్నాడని అహరోను నాతో చెప్పియున్నాడు; ఒక దేవుడున్న యెడల మరియు నీవే దేవుడవైన యెడల, నిన్ను నీవు నాకు తెలియపరచుకొనవా? నేను మృతుల నుండి లేపబడునట్లు మరియు అంత్యదినమున రక్షింపబడునట్లు నిన్ను తెలుసుకొనుటకు నా పాపములన్నిటినీ నేను వదిలివేసెదను. ఇప్పుడు రాజు ఈ మాటలను పలికినప్పుడు అతడు మరణించిన వానివలే పడిపోయెను.

19 అతని సేవకులు పరుగెత్తి, రాజుకు జరిగినదంతయు రాణికి చెప్పిరి. ఆమె రాజు వద్దకు లోనికి వచ్చి, అతడు చనిపోయినట్లు పడియుండుటను మరియు అతడు పడిపోవుటకు కారణమైనట్లుగా అహరోను, అతని సహోదరులు నిలబడియుండుటను చూచినప్పుడు ఆమె వారిపై ఆగ్రహించి, వారిని పట్టుకొని సంహరించవలెనని తన సేవకులు లేదా రాజు యొక్క సేవకులను ఆజ్ఞాపించెను.

20 ఇప్పుడు రాజు పడిపోవుటకు గల కారణమును సేవకులు చూచియుండినందున, వారు అహరోను మరియు అతని సహోదరులను పట్టుకొనుటకు ధైర్యము చేయలేదు; వారు ఇట్లనుచూ రాణిని అర్థించిరి: ఇదిగో వారిలో ఒకడు మా అందరికంటే బలవంతుడైయుండగా, ఈ మనుష్యులను మేము సంహరించవలెనని నీవెందుకు ఆజ్ఞాపించుచున్నావు? మేము వారి యెదుట కూలెదము.

21 ఇప్పుడు సేవకుల యొక్క భయమును చూచినప్పుడు, రాణి కూడా తనపై కీడు వచ్చునేమోయని మిక్కిలి భయపడసాగెను. వారు వెళ్ళి అహరోను, అతని సహోదరులను సంహరించుటకు జనులను పిలువవలెనని ఆమె తన సేవకులను ఆజ్ఞాపించెను.

22 అహరోను, రాణి యొక్క పట్టుదలను గ్రహించినప్పుడు, జనుల యొక్క హృదయ కాఠిన్యమును ఎరిగినవాడై, అక్కడ ఒక సమూహము సమకూడి వారి మధ్య గొప్ప వివాదము, గందరగోళము ఉండునేమోనని భయపడెను; కావున అతడు తన చేయి చాపి రాజును నేలపై నుండి లేపి, అతనితో నిలబడమని చెప్పగా అతడు తన శక్తిని పొంది లేచి నిలబడెను.

23 ఇప్పుడిది రాణి మరియు అనేకమంది సేవకుల సమక్షమున చేయబడెను. వారు దానిని చూచినప్పుడు మిక్కిలి ఆశ్చర్యముతో భయపడనారంభించిరి. రాజు లేచి నిలబడి, వారికి పరిచర్య చేయుట మొదలుపెట్టెను. తన ఇంటి వారందరు ప్రభువుకు పరివర్తన చెందునంతగా అతడు వారికి పరిచర్య చేసెను.

24 ఇప్పుడు రాణి ఆజ్ఞను బట్టి అక్కడ ఒక సమూహము సమకూడియుండెను, అహరోను మరియు అతని సహోదరులను బట్టి వారి మధ్య అధికముగా సణుగుడు మొదలాయెను.

25 కానీ రాజు వారి మధ్య నిలిచి వారికి పరిచర్య చేయగా, వారు అహరోను మరియు అతనితోనుండిన వారితో సమాధానపడిరి.

26 జనులు సమాధానపరచబడిరని చూచినప్పుడు రాజు, అహరోను మరియు అతని సహోదరులు సమూహము మధ్య నిలబడి వారికి వాక్యమును బోధించునట్లు చేసెను.

27 దేశమంతటా, అతని దేశమంతటా మరియు చుట్టూ ఉన్న ప్రాంతములన్నిటిలో నున్న అతని జనులందరి మధ్య రాజు ఒక ప్రకటన పంపెను, ఆ ప్రాంతము తూర్పున మరియు పశ్చిమము వైపునున్న సముద్రము వరకు సరిహద్దును కలిగియుండెను, అది జరహేమ్ల దేశము నుండి అరణ్యము యొక్క ఇరుకైన భాగము ద్వారా విడదీయబడెను, అది సముద్రమునకు తూర్పువైపు నుండి సముద్రమునకు పశ్చిమము వరకు మరియు సముద్రపు ఒడ్డు యొక్క సరిహద్దులపై మరియు జరహేమ్ల దేశము ప్రక్కగా ఉత్తరమునున్న అరణ్యము యొక్క సరిహద్దుల చుట్టూ మాంటై యొక్క సరిహద్దుల గుండా తూర్పు నుండి పడమటికి పారుచున్న సీదోను నది యొక్క శిరస్సు ప్రక్కగా సాగెను—మరియు ఆ విధముగా లేమనీయులు మరియు నీఫైయులు విభజింపబడిరి.

28 ఇప్పుడు లేమనీయులలో సోమరులైన అధికభాగము అరణ్యమందు జీవించుచూ గుడారములలో నివసించిరి; వారు పశ్చిమమునున్న అరణ్యముగుండా నీఫై దేశమందు, జరహేమ్ల దేశము యొక్క పశ్చిమము వైపున, సముద్రపు ఒడ్డు ప్రక్క సరిహద్దులయందు మరియు నీఫై దేశమందు పశ్చిమము వైపున, తమ పితరుల ప్రథమ స్వాస్థ్యమైన స్థలమందు వ్యాపించియుండిరి; ఆ విధముగా సముద్రపు ఒడ్డు ప్రక్కనే సరిహద్దు వలె ఉండిరి.

29 నీఫైయులు వారిని తరిమివేసిన స్థలములో సముద్రపు ఒడ్డు ప్రక్కన తూర్పు వైపున కూడా అనేకమంది లేమనీయులుండిరి; ఆవిధముగా నీఫైయులు దాదాపుగా లేమనీయుల చేత చుట్టబడియుండిరి; అయినప్పటికీ, నీఫైయులు సీదోను నది యొక్క శిరస్సు వద్ద తూర్పు నుండి పశ్చిమమునకు, అరణ్యమువైపు చుట్టూ, వారు సమృద్ధియని పిలిచిన దేశమునకు వచ్చువరకు అరణ్యముపై సరిహద్దుగా ఉన్న దేశము యొక్క ఉత్తరపు భాగములన్నిటిని స్వాధీనము చేసుకొనియుండిరి.

30 అది, వారు నిర్జనమని పిలిచిన దేశము యొక్క సరిహద్దున ఉండెను, అది ఎంతో దూరమున ఉత్తరము వైపు ఉన్నందున జనులు నివసించి, నాశనము చేయబడిన దేశములోనికి వచ్చినట్లుండెను, వారి ఎముకలను గూర్చి మేము మాట్లాడియున్నాము, వారు మొదట అడుగుపెట్టిన స్థలమైయుండి, జరహేమ్ల యొక్క జనుల చేత అది కనుగొనబడినది.

31 వారు అక్కడ నుండి దక్షిణపు అరణ్యములోనికి వచ్చిరి. ఆ విధముగా ఉత్తరము వైపునున్న దేశము నిర్జనమని పిలువబడెను మరియు దక్షిణము వైపునున్న దేశము సమృద్ధియని పిలువబడెను, అది అన్ని రకముల అడవి జంతువులతో నిండిన అరణ్యమైయుండెను, అందులో ఒక భాగము ఉత్తరము వైపు దేశము నుండి ఆహారము కొరకు వచ్చియుండెను.

32 ఇప్పుడు సమృద్ధి మరియు నిర్జన దేశము మధ్య సరిహద్దు వెంబడి తూర్పు నుండి పడమటి సముద్రమునకు ఒక నీఫైయునికి రోజున్నర ప్రయాణమైయుండెను; ఆ విధముగా నీఫై దేశము మరియు జరహేమ్ల దేశము దాదాపుగా నీటితో చుట్టబడియుండెను, ఉత్తరము వైపు దేశము మరియు దక్షిణము వైపు దేశము మధ్యన ఉన్న భూమి చిన్న కంఠమువలేనుండెను.

33 నీఫైయులు తూర్పు నుండి పడమటి సముద్రము వరకు సమృద్ధిదేశమందు నివసించిరి, ఆవిధముగా నీఫైయులు తమ వివేకమందు, లేమనీయులు ఉత్తరము వైపును ఇక స్వాధీన పరచుకొనకుండునట్లు, ఉత్తరము వైపు దేశమును దాటి రాకుండునట్లు తమ భటులు మరియు తమ సైన్యములతో దక్షిణమున వారిని నిలువరించిరి.

34 కావున లేమనీయులు, నీఫై యొక్క దేశము మరియు దాని చుట్టూ ఉన్న అరణ్యమందు తప్ప ఏ మాత్రము స్వాధీనములు లేకుండిరి. లేమనీయులు వారికి శత్రువులైనందున, నీఫైయులు ప్రతి వైపున తమ శ్రమలను అనుమతించకుండిరి; తమ కోరికలను బట్టి వారు పారిపోవుటకు ఒక దేశమును కలిగియుండిరి—ఇప్పుడిది నీఫైయుల వివేకమును బట్టియైయున్నది.

35 దీనిని చెప్పిన తరువాత, ఇప్పుడు నేను తిరిగి అమ్మోన్‌, అహరోను, ఓమ్నెర్‌, హింనై మరియు వారి సహోదరుల వృత్తాంతమునకు తిరిగి వెళ్ళెదను.