50వ అధ్యాయము
నీఫైయుల దేశములను మొరోనై బలపరచును—వారు అనేక క్రొత్త పట్టణములను నిర్మించుదురు—వారి దుష్టత్వము మరియు హేయకరమైన దినములందు నీఫైయులకు యుద్ధములు, నాశనములు సంభవించును—మోరియాంటన్ మరియు అతని అసమ్మతీయులు టియాంకమ్ చేత ఓడించబడుదురు—నెఫిహా మరణించును మరియు అతని కుమారుడు పహోరన్ న్యాయపీఠమును అధిష్టించును. సుమారు క్రీ. పూ. 72–67 సం.
1 ఇప్పుడు మొరోనై యుద్ధమునకు ఏర్పాట్లు చేయుట లేదా లేమనీయులకు వ్యతిరేకముగా అతని జనులను కాపాడుట మానలేదు; ఏలయనగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరవైయవ సంవత్సరపు ప్రారంభమందు, అతని సైన్యములు నీఫైయుల ఆధీనమందున్న దేశమంతటా అన్ని పట్టణముల చుట్టూ మట్టి గట్టులను త్రవ్వుట మొదలుపెట్టునట్లు అతడు చేసెను.
2 మట్టి యొక్క ఈ గట్టుల పైభాగమున కొయ్యదుంగలు, ముఖ్యముగా ఒక మనిషంత ఎత్తుగా కొయ్యదుంగలు పట్టణముల చుట్టూ కట్టబడునట్లు అతడు చేసెను.
3 ఆ కొయ్యదుంగల పనలపైన అక్కడ కొయ్యదుంగల చుట్టూ వాడిగా చెక్కిన రాటల చట్రములు కట్టబడునట్లు అతడు చేసెను; అవి బలముగాను, ఎత్తుగాను ఉండెను.
4 అతడు ఆ రాటల పైభాగము కనబడునట్లు గోపురములు నిర్మించబడునట్లు చేసెను మరియు లేమనీయుల రాళ్ళు, బాణములు వారికి హాని చేయకుండునట్లు ఆ గోపురములపైన రక్షణ స్థలములు నిర్మించబడునట్లు అతడు చేసెను.
5 వారి ఇష్టము మరియు బలమును బట్టి దానిపై నుండి వారు రాళ్ళు వేయగలుగునట్లు, పట్టణపు గోడలను సమీపించుటకు ప్రయత్నించు వానిని సంహరించునట్లు వారు సిద్ధపడిరి.
6 ఆ విధముగా మొరోనై దేశమంతటా ప్రతి పట్టణము చుట్టూ వారి శత్రువుల రాకకు వ్యతిరేకముగా బలమైన దుర్గములను సిద్ధపరిచెను.
7 మరియు మొరోనై తన సైన్యములు తూర్పు అరణ్యములోనికి పోవునట్లు చేసెను; వారు వెళ్ళి, తూర్పుఅరణ్యములో ఉన్న లేమనీయులనందరినీ జరహేమ్ల దేశమునకు దక్షణమునున్న వారి స్వంత దేశములకు తరిమిరి.
8 నీఫై దేశము తూర్పు సముద్రము నుండి పశ్చిమమునకు ఒక తిన్నని దిశలో సాగెను.
9 వారి స్వంత ఆధీనములోనున్న దేశములకు ఉత్తరమునున్న తూర్పు అరణ్యము నుండి లేమనీయులనందరినీ మొరోనై తరిమివేసినప్పుడు, జరహేమ్ల దేశమందు మరియు చుట్టూ ఉన్న దేశమందున్న నివాసులందరు తూర్పు అరణ్యములోనికి సముద్రపు ఒడ్డున సరిహద్దుల వరకు కూడా వెళ్ళి, దేశమును స్వాధీనపరచుకొనునట్లు అతడు చేసెను.
10 దక్షిణమున వారి ఆధీనములోనున్న సరిహద్దులయందు అతడు సైన్యములను ఉంచెను మరియు వారి సైన్యములను, వారి జనులను వారి శత్రువుల చేతులలో నుండి రక్షించుకొనునట్లు వారు దుర్గములను నిర్మించునట్లు చేసెను.
11 ఆ విధముగా తూర్పు అరణ్యమందు మరియు పశ్చిమమున కూడా లేమనీయుల యొక్క బలమైన దుర్గములన్నిటినీ అతడు కొట్టివేసెను, నీఫైయులు మరియు లేమనీయుల మధ్య, జరహేమ్ల దేశము మరియు నీఫై దేశము మధ్య పశ్చిమ సముద్రము నుండి సీదోను నది యొక్క శిరస్సు ప్రక్కగా సాగుచున్న సరిహద్దును బలపరిచెను—నీఫైయులు ఉత్తర దేశమంతటినీ, అంతేకాక సమృద్ధిదేశమునకు ఉత్తరమునున్న దేశమంతటినీ వారి ఇష్టానుసారము స్వాధీనపరచుకొనిరి.
12 ఆ విధముగా మొరోనై కార్యములు వారికిచ్చిన రక్షణ యొక్క హామీని బట్టి ప్రతి దినము పెరుగుచున్న అతని సైన్యములతో తమ స్వాధీనములోనున్న దేశములపై వారు ఎట్టి అధికారము లేకయుండవలెనని ఆ దేశములనుండి లేమనీయుల బలమును, అధికారమును కొట్టివేయుటకు అతడు ప్రయత్నించెను.
13 మరియు నీఫైయులు ఒక పట్టణ పునాదిని ప్రారంభించిరి, వారు ఆ పట్టణమును మొరోనై అని పిలిచిరి; అది తూర్పు సముద్రము ప్రక్కన ఉండెను; అది లేమనీయుల స్వాధీన రేఖకు దక్షిణమున ఉండెను.
14 వారు అహరోను మరియు మొరోనై యొక్క సరిహద్దుల ప్రక్కన, మొరోనై పట్టణము మరియు అహరోను పట్టణము మధ్య, ఒక పట్టణము కొరకు పునాదిని ప్రారంభించిరి; వారు ఆ పట్టణమును లేదా దేశమును నెఫిహా అని పిలిచిరి.
15 అదే సంవత్సరమందు ఉత్తరమున అనేక పట్టణములను కూడా వారు నిర్మించుట మొదలుపెట్టిరి, ప్రత్యేకించి ఒక దానిని వారు లీహైయని పిలిచిరి, అది సముద్రపు సరిహద్దులకు ఉత్తరమున ఉండెను.
16 ఆ విధముగా ఇరవైయవ సంవత్సరము ముగిసెను.
17 నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది ఒకటవ సంవత్సరపు ప్రారంభమందు, నీఫై జనులు ఆవిధంగా వర్ధిల్లుచున్న పరిస్థితులందుండిరి.
18 వారు మిక్కిలిగా వర్థిల్లిరి మరియు మిక్కిలి ధనవంతులైరి; వారు వృద్ధిపొంది, దేశమందు బలముగా ఎదిగిరి.
19 ఆ విధముగా నరుల సంతానమునకు ఆయన సమస్త వాక్యములను నెరవేర్చుటలో ప్రభువు యొక్క వ్యవహారములన్నీ ఎంత కనికరముగలవో మరియు న్యాయమైనవో మనము చూచుచున్నాము; మరియు ఇట్లు చెప్పుచూ ఆయన లీహైతో పలికిన మాటలు ఈ సమయమున కూడా రుజువైనవని మనము చూడగలము:
20 నీవు, నీ పిల్లలు ధన్యులు; వారు ఆశీర్వదింపబడుదురు, వారు నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము వారు దేశమందు వర్ధిల్లుదురు. కానీ, వారు నా ఆజ్ఞలను పాటించకుండా ఉన్నంత కాలము వారు ప్రభువు యొక్క సన్నిధినుండి కొట్టివేయబడుదురని జ్ఞాపకముంచుకొనుడి.
21 ఈ వాగ్దానములు నీఫై యొక్క జనులకు రుజువు చేయబడినవని మనము చూచుచున్నాము; ఏలయనగా వారి మధ్యనున్న వారి కలహములు, వివాదములు, హత్యలు, దోపిడీలు, విగ్రహారాధన, జారత్వములు మరియు హేయక్రియలు వారిపైకి యుద్ధములను, నాశనములను తెచ్చెను.
22 దుష్టులైన వారి సహోదరులలో వేలమంది దాస్యమునకు అప్పగించబడి, ఖడ్గము చేత నశించి లేదా విశ్వాసమందు క్షీణించి లేమనీయులతో కలిసిపోయి ఉండగా, ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుటయందు విశ్వాసముగానున్న వారు అన్ని సమయములందు విడిపించబడిరి.
23 కానీ నీఫై యొక్క దినముల నుండి, న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది ఒకటవ సంవత్సరమందు మొరోనై దినములందు ఈ సమయము కంటే సంతోషకరమైన సమయము నీఫై జనుల మధ్య ఎన్నడూ లేకుండెను.
24 న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది రెండవ సంవత్సరము సమాధానమందు ముగిసెను; మరియు ఇరువది మూడవ సంవత్సరము కూడా.
25 న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది నాలుగవ సంవత్సరపు ప్రారంభమందు, లీహై యొక్క సరిహద్దులకు ప్రక్కగానున్న మోరియాంటన్ దేశము మరియు లీహై దేశమును గూర్చి వారి మధ్య వచ్చిన ఒక వివాదము కారణముగా తప్ప, అక్కడ నీఫైయుల మధ్య సమాధానముండి యుండవలెను. ఆ దేశములు రెండును సముద్రపు ఒడ్డున సరిహద్దులోనుండెను.
26 ఏలయనగా మోరియాంటన్ దేశమును స్వాధీనపరచుకొనిన జనులు, లీహై దేశము యొక్క ఒక భాగమును తమదనిరి; కావున అక్కడ వారి మధ్య తీవ్రమైన వివాదము మొదలాయెను, ఎంతగాననగా మోరియాంటన్ యొక్క జనులు వారి సహోదరులకు వ్యతిరేకముగా ఆయుధములను తీసుకొని, ఖడ్గము చేత వారిని సంహరించుటకు నిర్ణయించుకొనిరి.
27 కానీ, లీహై దేశమును స్వాధీనపరచుకొనిన జనులు మొరోనై శిబిరము వద్దకు పారిపోయి సహాయము కొరకు అతడిని అర్థించిరి; ఏలయనగా వారియందు తప్పు లేదు.
28 మరియు లీహై యొక్క జనులు మొరోనై శిబిరము వద్దకు పారిపోయిరని మోరియాంటన్ అను పేరుగల మనుష్యుని చేత నడిపించబడిన మోరియాంటన్ యొక్క జనులు కనుగొనినప్పుడు, మొరోనై సైన్యము వారిపై దాడిచేసి వారిని నాశనము చేయునేమోనని మిక్కిలి భయపడిరి.
29 కావున విశాలజలములతో నిండియుండి ఉత్తరము వైపునున్న దేశమునకు వారు పారిపోవలెనని మరియు ఉత్తరమువైపున ఉన్న దేశమును స్వాధీనము చేసుకొనవలెనని మోరియాంటన్ వారి హృదయములలో కోరిక కలుగజేసెను.
30 మరియు వారు ఈ ప్రణాళికను నెరవేర్చియుండేవారు, (అది విలపించుటకు కారణమైయుండేది) కానీ మోరియాంటన్ అధిక ఉద్రేకము గల మనుష్యుడై యుండి, అతని ఆడ పనివారిలో ఒకరి పట్ల కోపముగానుండి ఆమెపై దాడిచేసి, తీవ్రముగా కొట్టెను.
31 ఆమె పారిపోయి మొరోనై శిబిరము వద్దకు వచ్చి, ఆ విషయమును గూర్చి మరియు ఉత్తరమువైపు దేశములోనికి పారిపోవుటకు వారి ఉద్దేశ్యములను గూర్చి కూడా అన్ని సంగతులను మొరోనైకి చెప్పెను.
32 ఇప్పుడు వారు మోరియాంటన్ మాటలను ఆలకించుదురని మరియు అతని జనులతో కలసిపోవుదురని, ఆ విధముగా అతడు దేశము యొక్క ఆ భాగములను స్వాధీనము చేసుకొనునని, అది నీఫై జనుల మధ్య ఒక గంభీరమైన ఫలితమునకు పునాది వేయునని, ఆ ఫలితము వారి స్వాతంత్ర్యమును త్రోసివేయుటకు నడిపించునని సమృద్ధిదేశమందున్న జనులు లేదా మొరోనై భయపడెను.
33 కావున మోరియాంటన్ యొక్క జనులను ఎదుర్కొనుటకు, ఉత్తర దేశములోనికి వారి పలాయనమును ఆపుటకు మొరోనై ఒక సైన్యమును వారి దండుతోపాటు పంపెను.
34 మరియు నిర్జన దేశము యొక్క సరిహద్దులకు వచ్చువరకు వారు వారిని ఎదుర్కొనలేదు; ఉత్తరమువైపు దేశములోనికి సముద్రము ప్రక్కగా నడిపించు సన్నని దారి గుండా, సముద్రము ప్రక్కగా పశ్చిమమున మరియు తూర్పున వారు వారిని ఎదుర్కొనిరి.
35 టియాంకమ్ అను పేరుగల మనుష్యునిచేత నడిపించబడి, మొరోనై చేత పంపబడిన సైన్యము మోరియాంటన్ యొక్క జనులను కలుసుకొనెను; (అతని దుర్మార్గము మరియు అతని ఇచ్ఛకపు మాటల చేత ప్రేరేపించబడి) మోరియాంటన్ యొక్క జనులు ఎంత మొండివారైరనగా, వారి మధ్య ఒక యుద్ధము మొదలాయెను, దాని యందు టియాంకమ్ మోరియాంటన్‌ను సంహరించి, అతని సైన్యమును ఓడించెను మరియు వారిని బందీలుగా తీసుకొని మొరోనై శిబిరమునకు తిరిగి వచ్చెను. ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది నాలుగవ సంవత్సరము ముగిసెను.
36 మరియు ఆ విధముగా మోరియాంటన్ యొక్క జనులు వెనుకకు తేబడిరి. సమాధానమును నిలుపుటకు వారు నిబంధన చేసిన తరువాత, వారు మోరియాంటన్ యొక్క దేశమునకు పునఃస్థాపించబడిరి, వారికి మరియు లీహై యొక్క జనులకు మధ్య ఒక ఐక్య ఒప్పందము జరిగిన తర్వాత వారు కూడా వారి దేశములకు పునఃస్థాపించబడిరి.
37 నీఫై యొక్క జనులకు సమాధానము పునఃస్థాపించబడిన సంవత్సరమందే, రెండవ ప్రధాన న్యాయాధిపతియైన నెఫిహా దేవుని యెదుట పరిపూర్ణ న్యాయప్రవర్తనతో న్యాయపీఠమును నింపియుండి మరణించెను.
38 అయినప్పటికీ ఆల్మా మరియు అతని పితరులు అతి పవిత్రమైనవని భావించిన ఆ వస్తువులను మరియు గ్రంథములను స్వాధీనము చేసుకోమన్న ఆల్మాను అతడు తిరస్కరించెను; కావున ఆల్మా వాటిని తన కుమారుడైన హీలమన్‌కు అప్పగించెను.
39 ఇప్పుడు అతని తండ్రి స్థానములో న్యాయపీఠమును అధిష్టించుటకు నెఫిహా యొక్క కుమారుడు నియమించబడెను; ముఖ్యముగా నీతితో తీర్పుతీర్చుటకు, జనుల యొక్క సమాధానము మరియు స్వేచ్ఛను నిలుపుటకు, ప్రభువైన వారి దేవుడిని ఆరాధించుటకు వారి పరిశుద్ధ విశేషాధికారములను వారికి అనుగ్రహించుటకు, అతని కాలమంతయు దేవుని ఉద్దేశ్యమునకు సహాయపడుటకు మరియు నిలుపుటకు, వారి నేరములను బట్టి దుర్మార్గులను శిక్షించుటకు ఒక ప్రమాణము మరియు పరిశుద్ధవిధితో అతడు జనులపై ప్రధాన న్యాయాధిపతిగా, పరిపాలకునిగా నియమించబడెను.
40 అతని పేరు పహోరన్. పహోరన్ అతని తండ్రి స్థానమును అధిరోహించెను; మరియు నీఫై జనులపై ఇరువది నాలుగవ సంవత్సరపు అంతమందు తన పరిపాలనను ప్రారంభించెను.