16వ అధ్యాయము
లేమనీయులు అమ్మోనైహా యొక్క జనులను నాశనము చేయుదురు—జోరమ్, నీఫైయులను లేమనీయులపై విజయమునకు నడిపించును—ఆల్మా, అమ్యులెక్ మరియు ఇతరులనేకులు వాక్యమును బోధించుదురు—ఆయన పునరుత్థానము తరువాత క్రీస్తు నీఫైయులకు కనిపించునని వారు బోధించుదురు. సుమారు క్రీ. పూ. 81–77 సం.
1 నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదకొండవ సంవత్సరమందు, రెండవ నెల యొక్క అయిదవ దినమున—కొన్ని సంవత్సరముల వరకు అనగా పదకొండవ సంవత్సరము నందు రెండవ నెల అయిదవ దినము వరకు కూడా అక్కడ ఎట్టి యుద్ధములు, వివాదములు లేకుండా జరహేమ్ల దేశమందు అధిక సమాధానమున్న తరువాత, దేశమందంతటా ఒక యుద్ధఘోష వినబడెను.
2 ఏలయనగా లేమనీయుల సైన్యములు అరణ్యము వైపు నుండి దేశ సరిహద్దులలోనికి అమ్మోనైహా పట్టణములోనికి వచ్చి, జనులను సంహరించుచు పట్టణమును నాశనము చేయుట మొదలుపెట్టెను.
3 ఇప్పుడు నీఫైయులు దేశము నుండి వారిని బయటకు తరిమివేయుటకు తగినంత సైన్యమును సమకూర్చక ముందే వారు అమ్మోనైహా పట్టణమందున్న జనులను మరియు నోవహు సరిహద్దుల చుట్టూ కొందరిని నాశనము చేసి, ఇతరులను అరణ్యములోనికి బందీలుగా తీసుకొనిపోయిరి.
4 అయితే అరణ్యములోనికి బందీలుగా తీసుకొనిపోబడిన వారిని తిరిగి పొందవలెనని నీఫైయులు కోరిరి.
5 కావున నీఫైయుల సైన్యములపై ప్రధాన అధికారిగా నియమింపబడిన వాడు, (అతని పేరు జోరమ్ మరియు అతనికి లీహై, ఆహా అను ఇద్దరు కుమారులుండిరి)—ఇప్పుడు జోరమ్ మరియు అతని ఇద్దరు కుమారులు, ఆల్మా సంఘముపై ప్రధాన యాజకుడైయున్నాడని ఎరిగి, అతడు ప్రవచనాత్మను కలిగియున్నాడని వినియున్నందున వారు అతని యొద్దకు వెళ్ళి, లేమనీయుల చేత బందీలుగా కొనిపోబడిన తమ సహోదరులను అన్వేషించుటలో తాము అరణ్యములో ఎటు వెళ్ళవలెనని ప్రభువు కోరుచున్నాడో తెలుసుకొనుటకు అతడిని విచారించిరి.
6 ఆ విషయమును గూర్చి ఆల్మా ప్రభువు యొద్ద విచారించి, తిరిగివచ్చి వారితో ఇట్లనెను: ఇదిగో, దక్షిణ అరణ్యమందు మాంటై దేశ సరిహద్దులకు అవతల దూరముగా లేమనీయులు సీదోను నదిని దాటుదురు. సీదోను నదికి తూర్పున మీరు వారిని కలుసుకొందురు, అక్కడ లేమనీయుల చేత బందీలుగా కొనిపోబడిన మీ సహోదరులను ప్రభువు మీకు అప్పగించును.
7 అప్పుడు జోరమ్ మరియు అతని కుమారులు తమ సైన్యములతో సీదోను నదిని దాటి, సీదోను నదికి తూర్పు వైపున ఉన్న దక్షిణ అరణ్యములోనికి మాంటై యొక్క సరిహద్దుల అవతలకు దూరముగా నడిచివెళ్ళిరి.
8 వారు లేమనీయుల సైన్యముల పైకి రాగా, లేమనీయులు చెదరగొట్టబడి అరణ్యములోనికి తరుమబడిరి; లేమనీయుల చేత బందీలుగా కొనిపోబడిన తమ సహోదరులను వారు తీసుకొనిరి, అయితే బందీలుగా కొనిపోబడిన వారిలో ఏ ఒక్క ఆత్మయు నశించియుండలేదు. మరియు వారు తమ స్వంత దేశములను స్వాధీనపరచుకొనుటకు తమ సహోదరుల ద్వారా తీసుకొనిరాబడిరి.
9 ఆ విధముగా న్యాయాధిపతుల యొక్క పదకొండవ సంవత్సరము ముగిసెను, లేమనీయులు దేశము నుండి బయటకు తరిమివేయబడిరి మరియు అమ్మోనైహా జనులు నాశనము చేయబడిరి; అంతేకాకుండా, అమ్మోనిహయుల యొక్క జీవముగల ప్రతి ఆత్మ మరియు దాని గొప్పతనమును బట్టి దేవుడు నాశనము చేయలేడని వారు చెప్పిన వారి గొప్ప పట్టణము కూడా నాశనము చేయబడెను.
10 కానీ ఇదిగో, అది ఒక్క దినమందే నిర్మానుష్యముగా విడువబడెను; అక్కడ శవములు కుక్కలచేత, అరణ్యమందలి అడవి మృగముల చేత ఆరగించబడెను.
11 అయినప్పటికీ అనేక దినముల తరువాత వారి మృతదేహములు భూముఖముపై కుప్పగా పోయబడి, ఒక పలుచని ఆచ్ఛాదనముచేత కప్పబడెను. అనేక సంవత్సరముల పాటు అమ్మోనైహా దేశమును స్వాధీనపరచుకొనుటకు జనులు దాని లోనికి వెళ్ళలేనంతగా అక్కడ దుర్వాసన వ్యాపించెను. అది నీహోర్‌ల నిర్జనమని పిలువబడెను; ఏలయనగా సంహరింపబడిన వారు నీహోర్ యొక్క విశ్వాసమునకు చెందినవారు; మరియు వారి దేశములు నిర్మానుష్యముగా మిగిలెను.
12 నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదునాలుగవ సంవత్సరము వరకు లేమనీయులు, నీఫైయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు తిరిగి రాలేదు. ఆ విధముగా మూడు సంవత్సరముల పాటు నీఫై జనులు దేశమంతటా నిరంతర సమాధానమును కలిగియుండిరి.
13 ఆల్మా, అమ్యులెక్‌లు యూదుల పద్ధతిని బట్టి కట్టబడిన వారి దేవాలయములందు, వారి పరిశుద్ధాలయములందు, వారి సమాజమందిరములందు జనులకు పశ్చాత్తాపమును బోధించుచూ ముందుకు సాగిరి.
14 వ్యక్తులపట్ల ఎట్టి పక్షపాతము లేకుండా, వారి మాటలను ఆలకించిన వారందరికీ వారు నిరంతరము దేవుని వాక్యమును బోధించిరి.
15 ఆ విధముగా దేశమంతటా వాక్యమును బోధించుటకు ఆల్మా, అమ్యులెక్‌లు మరియు ఆ పనికి ఎన్నుకొనబడిన వారనేకులు ముందుకు సాగిరి. సంఘ స్థాపన దేశమందంతటా, చుట్టూనున్న సమస్త ప్రాంతములలో, నీఫైయుల యొక్క సమస్త జనుల మధ్య బహుగా విస్తరించెను.
16 వారి మధ్య ఎట్టి అసమానత్వము లేకుండెను; ఆయన రాకడ సమయమున వారి మధ్య బోధింపబడవలసిన వాక్యమును అంగీకరించుటకు నరుల సంతానము యొక్క మనస్సులను లేదా వారి హృదయములను సిద్ధపరచుటకు—
17 వారు వాక్యమునకు వ్యతిరేకముగా కఠినపరచబడరాదని, వారు అవిశ్వాసులుగా ఉండి నాశనము కారాదని, బదులుగా నిజమైన ద్రాక్షావల్లికి కొమ్మ అంటు కట్టబడినట్లు వాక్యమును వారు సంతోషముతో అంగీకరించవలెనని, వారి దేవుడైన ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి వారు ప్రవేశించవలెనని దేశమంతటిపై ప్రభువు తన ఆత్మను క్రుమ్మరించెను.
18 ఇప్పుడు జనుల మధ్యకు వెళ్ళిన ఆ యాజకులు సమస్త అబద్ధములు, మోసములు, అసూయలు, జగడములు, ద్వేషములు, దూషణలు, దొంగతనము, దోపిడీ, కొల్లగొట్టుట, నరహత్య, వ్యభిచారము జరిగించుట మరియు సమస్త విధములైన కామాతురతకు వ్యతిరేకముగా బోధించి, ఈ క్రియలు ఇట్లుండరాదని చెప్పుచూ—
19 త్వరలో రాబోవు సంగతులను, అనగా దేవుని కుమారుని రాకడ, ఆయన శ్రమలు, మరణము మరియు మృతుల పునరుత్థానమును ప్రకటించిరి.
20 జనులలో అనేకులు, దేవుని కుమారుడు రాబోవు స్థలమును గూర్చి ప్రశ్నించిరి; ఆయన తన పునరుత్థానము తరువాత వారికి కనిపించునని వారు బోధింపబడిరి; దీనిని జనులు గొప్ప సంతోషముతో, ఆనందముతో ఆలకించిరి.
21 ఇప్పుడు దేశమందంతటా సంఘము స్థాపించబడిన తరువాత—అపవాదిపై విజయము పొంది, దేవుని వాక్యము దాని పవిత్రతలో దేశమంతటా బోధింపబడియుండి, జనులపై ప్రభువు తన ఆశీర్వాదములు క్రుమ్మరించుచుండగా—నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదునాలుగవ సంవత్సరము ముగిసెను.