లేఖనములు
ఆల్మా 55


55వ అధ్యాయము

బందీలను మార్పిడి చేయుటకు మొరోనై తిరస్కరించును—లేమనీయ భటులు త్రాగి మత్తులగుటకు ప్రలోభపెట్టబడుదురు మరియు బందీలైన నీఫైయులు విడిపించబడుదురు—గిడ్‌ పట్టణము రక్తపాతము లేకనే తీసుకొనబడును. సుమారు క్రీ. పూ. 63–62 సం.

1 ఇప్పుడు మొరోనై ఈ లేఖను అందుకొనినప్పుడు అతడు తీవ్ర ఆగ్రహముతోనుండెను, ఏలయనగా అమ్మోరోన్‌ తన మోసమును గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును కలిగియుండెనని అతడు ఎరిగెను; నీఫై జనులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు న్యాయమైన కారణము లేదని అమ్మోరోన్‌కు తెలియునని అతడు ఎరిగెను.

2 మరియు అతడు ఇట్లనెను: ఇదిగో నేను నా లేఖయందు చెప్పినట్లుగా అతడు తన ఉద్దేశ్యమును విరమించుకుంటే తప్ప, నేను అమ్మోరోన్‌తో బందీలను మార్పిడి చేయను; ఏలయనగా ఇప్పుడున్న దాని కంటే అతడు ఎక్కువ అధికారము కలిగియుండుటకు నేనతనిని అనుమతించను.

3 వారు బందీలుగా తీసుకొన్న నా జనులను లేమనీయులు కావలి కాయుచున్న ఆ స్థలమును నేను ఎరుగుదును; నా లేఖతో అమ్మోరోన్‌ సమ్మతించనందున, నేను అతని పట్ల నా మాటల ప్రకారము చేసెదను; అనగా వారు సమాధానము కొరకు బ్రతిమాలుకొను వరకు నేను వారి మధ్య మారణకాండ జరిగించెదను.

4 ఇప్పుడు మొరోనై ఈ మాటలను చెప్పినప్పుడు, బహుశా వారి మధ్య లేమన్‌ వంశస్థులెవరినైనా అతడు కనుగొనగలడేమోనని తన మనుష్యుల మధ్య అన్వేషణ జరిగించెను.

5 మరియు వారు ఒకనిని కనుగొనిరి, అతని పేరు లేమన్‌; అతడు అమలిక్యా చేత హత్యచేయబడిన రాజు యొక్క సేవకులలో ఒకడు.

6 ఇప్పుడు నీఫైయులను కాపలాకాయుచున్న భటుల యొద్దకు లేమన్‌ మరియు తన మనుష్యులలో కొద్దిమంది వెళ్ళునట్లు మొరోనై చేసెను.

7 నీఫైయులు గిడ్‌ పట్టణమందు కాపలా కాయబడిరి; కావున మొరోనై, లేమన్‌ను నియమించెను మరియు కొద్దిమంది అతనితో వెళ్ళునట్లు చేసెను.

8 సాయంత్రమైనప్పుడు నీఫైయులను కాపలాకాయుచున్న భటుల యొద్దకు లేమన్‌ వెళ్ళెను; అతని రాకను చూచి వారతనిని బిగ్గరగా పిలువగా, అతడు వారితో—భయపడకుడి, నేను లేమనీయుడను. ఇదిగో, మేము నీఫైయుల నుండి తప్పించుకొని, వారు నిద్రలో ఉండగా వారి మద్యమును మాతో తెచ్చియున్నామని చెప్పెను.

9 లేమనీయులు ఈ మాటలను విన్నప్పుడు వారతనిని సంతోషముతో చేర్చుకొని, అతనితో ఇట్లనిరి: మేము త్రాగుటకు నీ మద్యమును మాకిమ్ము; నీవు మద్యమును తెచ్చినందుకు మేము సంతోషించుచున్నాము, ఏలయనగా మేము అలసియున్నాము.

10 కానీ లేమన్‌ వారితో—నీఫైయులకు వ్యతిరేకముగా మనము యుద్ధమునకు వెళ్ళు వరకు ఈ మద్యమును దాచిపెట్టెదము అనెను. కానీ ఈ మాట మద్యము త్రాగవలెనను వారి కోరికను అధికము చేసెను;

11 ఏలయనగా వారు ఇట్లనిరి: మేము అలసియున్నాము, కావున మమ్ములను మద్యము తీసుకొననిమ్ము, త్వరలోనే మేము మా బత్తెము నిమిత్తము మద్యమును అందుకొనెదము, అది మమ్ములను నీఫైయులకు వ్యతిరేకముగా వెళ్ళుటకు బలపరచును.

12 అప్పుడు లేమన్‌ వారితో–మీ కోరికల ప్రకారము మీరు చేయవచ్చుననెను.

13 అంతట వారు ఎక్కువగా మద్యమును తీసుకొనిరి; అది వారి రుచికి మనోహరముగా ఉన్నందున వారు ఎక్కువగా తీసుకొనిరి; మరియు అది సారము తీయబడకుండా తయారు చేయబడి ఘాటుగా ఉండెను.

14 వారు త్రాగి, ఆనందభరితులైరి; కొంతసేపటికి వారందరు మత్తులైరి.

15 వారందరు మత్తులైయుండి, గాఢ నిద్రలో ఉన్నారని లేమన్‌ మరియు అతని మనుష్యులు చూచినప్పడు, వారు మొరోనై యొద్దకు తిరిగి వచ్చి జరిగిన సంగతులన్నిటిని అతనికి చెప్పిరి.

16 ఇప్పుడిది మొరోనై యొక్క ప్రణాళికను బట్టియైయుండెను. మొరోనై తన మనుష్యులను యుద్ధ ఆయుధములతో సిద్ధము చేసెను; మరియు లేమనీయులు మత్తులై గాఢనిద్రలో ఉండగా అతడు గిడ్‌ పట్టణమునకు వెళ్ళి, బందీలందరు ఆయుధములను ధరించునంత వరకు యుద్ధ ఆయుధములను లోనికి విసిరెను;

17 మొరోనై ఆ బందీలందరికి ఆయుధములను ధరింపజేసినప్పుడు, వారి స్త్రీలు మరియు వారి పిల్లలలో యుద్ధ ఆయుధములను ఉపయోగించగలిగినంత మందికి కూడా ధరింపజేసినప్పుడు ఆ క్రియలన్నియు పూర్తి నిశ్శబ్దమందు చేయబడెను.

18 ఒకవేళ వారు లేమనీయులను మేల్కొల్పిన యెడల, వారు మత్తులైయున్నందున నీఫైయులు వారిని సంహరించియుండేవారు.

19 కానీ ఇది మొరోనై కోరిక కాదు; హత్య లేదా రక్తపాతమందు అతడు ఆనందించలేదు, కానీ తన జనులను నాశనము నుండి రక్షించుటయందు అతడు ఆనందించెను; తన మీద దోషము లేకుండునట్లు ఈ హేతువు నిమిత్తము లేమనీయులు మత్తులో ఉన్నప్పుడు అతడు వారిపై దాడిచేసి వారిని నాశనము చేయకుండెను.

20 కానీ అతడు తన కోరికలను సాధించెను; ఏలయనగా పట్టణ ప్రాకారము లోపల బందీలుగా ఉన్న నీఫైయులకు అతడు ఆయుధములు ధరింపజేసి, ప్రాకారము లోపలనున్న ఆ భాగములను స్వాధీనపరచుకొనుటకు వారికి శక్తినిచ్చెను.

21 తరువాత అతనితోనున్న మనుష్యులు వారి నుండి కొంత దూరము వెనుకకు వెళ్ళునట్లు మరియు లేమనీయుల సైన్యములను చుట్టుముట్టునట్లు అతడు చేసెను.

22 ఇప్పుడు ఇదంతయు రాత్రి సమయమున చేయబడెను, అందును బట్టి ఉదయమందు లేమనీయులు మేల్కొనినప్పుడు, వారు బయట నీఫైయుల చేత చుట్టబడియున్నారని మరియు లోపల వారి బందీలు ఆయుధములు కలిగియున్నారని వారు చూచిరి.

23 ఆ విధముగా నీఫైయులు వారిపై శక్తి కలిగియున్నారని వారు చూచిరి; మరియు ఈ పరిస్థితులలో వారు నీఫైయులతో యుద్ధము చేయుట సరికాదని తలంచి, వారి ప్రధాన అధికారులు వారి యుద్ధ ఆయుధములను ఇచ్చివేయమని ఆజ్ఞాపించి, కనికరము చూపమని బ్రతిమాలుచూ వాటిని నీఫైయుల పాదముల వద్ద పడవేసిరి.

24 ఇదియే మొరోనై యొక్క కోరికైయుండెను. అతడు వారిని యుద్ధ బందీలుగా తీసుకొని పట్టణమును స్వాధీనపరచుకొని, బందీలైన నీఫైయులందరు విడుదలగునట్లు చేసెను; మరియు వారు మొరోనై సైన్యముతో చేరి, అతని సైన్యమునకు గొప్ప బలము చేకూర్చిరి.

25 అతడు బందీలుగా తీసుకొనిన లేమనీయులు గిడ్‌ పట్టణము చుట్టూ కోటలను బలపరిచే పనిని ప్రారంభించునట్లు అతడు చేసెను.

26 అతని కోరికలను బట్టి అతడు గిడ్‌ పట్టణమందు కోటలు కట్టించిన తరువాత, తన బందీలు సమృద్ధి పట్టణమునకు తీసుకొనిపోబడునట్లు అతడు చేసెను. ఆ పట్టణమును అత్యంత బలమైన సైన్యముతో అతడు కావలికాసెను.

27 ఇప్పుడు లేమనీయులు ఎన్ని కుట్రలు పన్నినను తాము బందీలుగా తెచ్చిన వారందరిని నీఫైయులు తమ ఆధీనములో ఉంచి, కాపాడిరి మరియు వారికి ప్రయోజనము చేకూర్చిన భూమియంతటిని తిరిగి తీసుకొని, నిలుపుకొనిరి.

28 మరలా నీఫైయులు విజయము సాధించి వారి హక్కులను, విశేషాధికారములను తిరిగి పొందనారంభించిరి.

29 పలుమార్లు లేమనీయులు రాత్రియందు వారిని ముట్టడించుటకు ప్రయత్నించిరి, కానీ ఈ ప్రయత్నములందు వారు అనేకమంది బందీలను కోల్పోయిరి.

30 పలుమార్లు వారిని విషముతోను లేదా మత్తుతోను నాశనము చేయునట్లు నీఫైయులకు వారి మద్యమును ఇచ్చుటకు వారు ప్రయత్నించిరి.

31 కానీ వారి శ్రమ యొక్క ఈ సమయమందు ప్రభువైన వారి దేవుడిని జ్ఞాపకము చేసుకొనుటకు నీఫైయులు వెనుకాడలేదు. వారి వలల్లో వారు చిక్కుకొనలేదు; మొదట వారు లేమనీయ బందీలకు ఇవ్వకుండా వారి మద్యమును త్రాగకుండిరి.

32 ఆ విధముగా వారి మధ్య ఏ విషము ఇవ్వబడకుండా వారు జాగ్రత్తపడిరి; ఏలయనగా వారి మద్యము ఒక లేమనీయుని విషపూరితము చేసిన యెడల, అది ఒక నీఫైయుని కూడా విషపూరితము చేయును; ఆ విధముగా వారు తమ మత్తు పానీయములన్నిటినీ పరీక్షించిరి.

33 ఇప్పుడు మోరియాంటన్‌ పట్టణముపై దాడి చేయుటకు ఏర్పాట్లు చేయుట మొరోనైకి అవసరమైయుండెను; ఏలయనగా లేమనీయులు వారి శ్రమల ద్వారా మోరియాంటన్‌ పట్టణము మిక్కిలి బలమైన దుర్గమగునంత వరకు కోటలు కట్టియుండిరి.

34 మరియు వారు నిరంతరము క్రొత్త సైన్యములను, ఆహారసామాగ్రిని పట్టణములోనికి తెచ్చుచుండిరి.

35 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది తొమ్మిదవ సంవత్సరము ముగిసెను.

ముద్రించు