లేమనీయులకు అహరోను, ములొకి మరియు వారి సహోదరుల బోధన యొక్క వృత్తాంతము.
21 నుండి 25 అధ్యాయములు కలిగియున్నవి.
21వ అధ్యాయము
అహరోను క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమును గూర్చి అమలేకీయులకు బోధించును—అహరోను మరియు అతని సహోదరులు మిద్దొనై యందు చెరసాలలో వేయబడుదురు—వారి విడుదల తరువాత, వారు సమాజమందిరములలో బోధించుచూ అనేకులు పరివర్తన చెందునట్లు చేయుదురు—ఇష్మాయెల్ దేశమందున్న జనులకు లమోనై మత స్వాతంత్ర్యమును అనుగ్రహించును. సుమారు క్రీ. పూ. 90–77 సం.
1 ఇప్పుడు అమ్మోన్ మరియు అతని సహోదరులు లేమనీయుల దేశ సరిహద్దుల యందు తమను వేరుపరచుకొనినప్పుడు, వారి పితరుల జన్మస్థలమును బట్టి లేమనీయుల చేత యెరూషలేమని పిలువబడిన దేశము వైపు అహరోను ప్రయాణించెను; అది మోర్మన్ యొక్క సరిహద్దులను కలుపుచూ దూరముగా ఉండెను.
2 లేమనీయులు, అమలేకీయులు మరియు అమ్యులోన్ యొక్క జనులు యెరూషలేము అని పిలువబడిన ఒక గొప్ప పట్టణమును నిర్మించిరి.
3 లేమనీయులు తగినంత కఠినాత్ములు, కానీ అమలేకీయులు మరియు అమ్యులోనీయులు ఇంకా కఠినమైన వారు; కావున వారు, లేమనీయులు తమ దుష్టత్వమందు, హేయక్రియలయందు బలముగా వృద్ధిచెందునట్లు, తమ హృదయములను కఠినపరచుకొనునట్లు చేసిరి.
4 ఇప్పుడు అహరోను యెరూషలేము పట్టణమునకు వచ్చి, మొదట అమలేకీయులకు బోధించసాగెను. అతడు వారి సమాజమందిరములలో వారికి బోధించనారంభించెను. ఏలయనగా వారు నీహోర్‌ల క్రమము చొప్పున సమాజమందిరములను నిర్మించిరి; అమలేకీయులు మరియు అమ్యులోనీయులలో అనేకులు నీహోర్‌ల క్రమమునకు చెందినవారు.
5 కావున, జనులకు బోధించుటకు అహరోను వారి సమాజమందిరములలో ఒకదాని లోనికి ప్రవేశించి వారితో మాట్లాడుచుండగా, అక్కడ ఒక అమలేకీయుడు లేచి అతనితో వాదించుట మొదలుపెట్టి ఇట్లనెను: నీవు సాక్ష్యమిచ్చినదేమిటి? నీవు ఒక దేవదూతను చూచితివా? దేవదూతలు మాకెందుకు ప్రత్యక్షము కారు? ఇదిగో ఈ జనులు నీ జనులంత మంచివారు కారా?
6 మేము పశ్చాత్తాపపడని యెడల మేము నశించెదమని కూడా నీవు చెప్పుచున్నావు. మా హృదయ తలంపులను, ఉద్దేశ్యములను నీవెట్లు ఎరుగుదువు? మేము పశ్చాత్తాపపడవలసిన అవసరమున్నదని నీవెట్లు ఎరుగుదువు? మేము నీతిమంతులము కాదని నీవెట్లు ఎరుగుదువు? ఇదిగో, మేము పరిశుద్ధాలయములను కట్టియున్నాము మరియు దేవుని ఆరాధించుటకు మమ్ములను మేము సమావేశపరచుకొనుచున్నాము. మనుష్యులందరినీ దేవుడు రక్షించునని మేము కూడా నమ్ముచున్నాము.
7 ఇప్పుడు అహరోను అతనితో—మానవజాతిని వారి పాపముల నుండి విమోచించుటకు దేవుని కుమారుడు వచ్చునని నీవు నమ్ముచున్నావా? అనెను.
8 ఆ మనుష్యుడు అతనితో ఇట్లనెను: అట్టి సంగతేదీ నీవు ఎరుగుదువని మేము నమ్ముటలేదు. ఈ మూర్ఖపు సంప్రదాయములందు మేము విశ్వసించము. రాబోవు విషయములను నీవు ఎరుగుదువని మేము నమ్ముటలేదు లేదా రాబోవు దానిని గూర్చి వారు చెప్పిన విషయములను నీ పితరులు మరియు మా పితరులు కూడా ఎరుగుదురని మేము నమ్ముటలేదు.
9 ఇప్పుడు క్రీస్తు యొక్క రాకడను గూర్చి, మృతుల పునరుత్థానమును గూర్చి చెప్పుచూ క్రీస్తు యొక్క మరణము, శ్రమలు, ఆయన రక్తము యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా తప్ప మానవజాతికి ఎట్టి విమోచన ఉండబోదని అహరోను వారికి లేఖనములు చూపనారంభించెను.
10 అతడు ఈ విషయములను వారికి వివరించుట మొదలుపెట్టగా వారతనిపట్ల కోపముగానుండి, అతడిని ఎగతాళి చేయసాగిరి; అతడు మాట్లాడిన మాటలను వారు వినకుండిరి.
11 కావున వారు తన మాటలను ఆలకించరని అతడు చూచినపుడు, వారి సమాజమందిరము నుండి బయటకు వెడలిపోయి అతడు అని-అంతి అని పిలువబడిన ఒక గ్రామమునకు వచ్చెను; అక్కడ అతడు ములొకి, ఆమ్మా మరియు అతని సహోదరులు వారికి వాక్యమును బోధించుటను కనుగొనెను; మరియు వారు అనేకులతో వాక్యమును గూర్చి వాదించిరి.
12 జనులు తమ హృదయములను కఠినపరచుకొందురని చూచి, వారు అక్కడనుండి వెడలిపోయి మిద్దొనై దేశమునకు వచ్చిరి. వారు అనేకులకు వాక్యమును బోధించిరి మరియు వారు బోధించిన మాటలను కొద్దిమంది విశ్వసించిరి.
13 అయినప్పటికీ అహరోను మరియు అతని సహోదరులలో కొందరు పట్టుకొనబడి చెరసాలలో వేయబడిరి, మిగిలిన వారు మిద్దొనై దేశము నుండి బయటకు చుట్టూ ఉన్న ప్రాంతములకు పారిపోయిరి.
14 చెరసాలలో వేయబడిన వారు అనేక బాధలను అనుభవించిరి, వారు లమోనై మరియు అమ్మోన్ చేత విడిపించబడి, ఆహారమివ్వబడి, వస్త్రము ధరింపజేయబడిరి.
15 వారు మరలా వాక్యమును ప్రకటించుటకు వెళ్ళిరి, ఆ విధముగా మొదటిసారి చెరసాల నుండి వారు విడిపించబడిరి; ఆలాగున వారు శ్రమపడిరి.
16 వారు అమలేకీయుల యొక్క ప్రతి సమాజమందిరములో, లేదా వారు ప్రవేశించుటకు అనుమతించబడిన లేమనీయుల యొక్క ప్రతి కూడికలో దేవుని వాక్యము బోధించుచూ ప్రభువు యొక్క ఆత్మ చేత వారెక్కడికి నడిపించబడిరో అక్కడకు వెళ్ళిరి.
17 వారు అనేకులకు సత్యమును గూర్చి తెలియజేయగలుగునట్లు ప్రభువు వారిని ఆశీర్వదించసాగెను; ముఖ్యముగా వారు, వారి పాపములను గూర్చి మరియు వారి పితరుల దురాచారములను గూర్చి అనేకులను ఒప్పించిరి.
18 ఇప్పుడు అమ్మోన్ మరియు లమోనై మిద్దొనై దేశము నుండి వారి స్వాస్థ్యమెన ఇష్మాయెల్ దేశమునకు తిరిగి వచ్చిరి.
19 అమ్మోన్ తనకు సేవచేయుటకు లేదా తన సేవకునిగా ఉండుటకు రాజైన లమోనై ఒప్పుకొనలేదు.
20 కానీ ఇష్మాయెల్ దేశమందు సమాజమందిరములు కట్టబడునట్లు చేసి, అతడు తన జనులు లేదా తన పరిపాలన క్రింద ఉన్న జనులు తమను సమావేశపరచుకొనునట్లు చేసెను.
21 అతడు వారిని గూర్చి ఆనందించి, వారికి అనేక విషయములను బోధించెను. వారు అతని క్రింద ఉన్న జనులని, వారు ఒక స్వతంత్ర జనులని, రాజైన తన తండ్రి యొక్క నిరంకుశపాలన నుండి వారు స్వతంత్రులని అతడు వారికి ప్రకటించెను; ఏలయనగా ఇష్మాయెల్ దేశమందు, చుట్టూ ఉన్న దేశమంతటి యందు ఉన్న జనులపై అతడు పరిపాలించునట్లు అతని తండ్రి అనుగ్రహించెను.
22 అది రాజైన లమోనై యొక్క పరిపాలనలో ఉన్న దేశమందైన యెడల, వారే స్థలములో ఉన్నను వారి కోరికలను బట్టి వారి దేవుడైన ప్రభువును ఆరాధించుటకు వారు స్వతంత్రులని అతడు వారికి ప్రకటించెను.
23 మరియు అమ్మోన్, రాజైన లమోనై యొక్క జనులకు బోధించెను; నీతికి సంబంధించిన అన్ని విషయములను గూర్చి అతడు వారికి బోధించెను. ప్రతిదినము సమస్త శ్రద్ధతో అతడు వారికి ఉద్భోధించెను; వారు అతని వాక్యమును లక్ష్యపెట్టిరి మరియు దేవుని ఆజ్ఞలను పాటించుటలో ఆసక్తి కలిగియుండిరి.