లేఖనములు
ఆల్మా 43


43వ అధ్యాయము

ఆల్మా మరియు అతని కుమారులు వాక్యమును బోధించెదరు—జోరమీయులు మరియు నీఫైయుల నుండి అసమ్మతితో విడిపోయిన ఇతరులు లేమనీయులగుదురు—లేమనీయులు నీఫైయులకు వ్యతిరేకముగా యుద్ధమునకు వచ్చెదరు—మొరోనై, నీఫైయులకు సంరక్షక కవచములను ధరింపజేయును—లేమనీయుల యొక్క యుద్ధ తంత్రమును ప్రభువు ఆల్మాకు తెలియజేయును—నీఫైయులు తమ ఇండ్లను, స్వేచ్ఛను, కుటుంబములను మరియు మతమును సంరక్షించుకొందురు—మొరోనై మరియు లీహై సైన్యములు లేమనీయులను చుట్టుముట్టును. సుమారు క్రీ. పూ. 74 సం.

1 ఇప్పుడు ఆల్మా యొక్క కుమారులు జనుల మధ్య వాక్యమును ప్రకటించుటకు వెళ్ళిరి. ఆల్మా విశ్రాంతి తీసుకొనలేకపోయెను మరియు అతడు కూడా జనుల మధ్యకు వెళ్ళెను.

2 ప్రవచనము మరియు బయల్పాటు యొక్క ఆత్మను బట్టి వారు వాక్యమును, సత్యమును బోధించిరని తప్ప, మనము వారి బోధను గూర్చి మరేమియు చెప్పరాదు; మరియు వారు పిలువబడిన దేవుని పరిశుద్ధ క్రమము చొప్పున వారు బోధించిరి.

3 ఇప్పుడు నేను న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదునెనిమిదవ సంవత్సరమందు నీఫైయులు, లేమనీయుల మధ్య యుద్ధముల యొక్క వృత్తాంతమునకు తిరిగి వెళ్ళెదను.

4 ఏలయనగా జోరమీయులు లేమనీయులైరి; అందువలన పదునెనిమిదవ సంవత్సరము యొక్క ప్రారంభములో, లేమనీయులు వారిపై దాడి చేయుటకు వచ్చుచున్నారని నీఫైయులు చూచిరి; కావున వారు యుద్ధమునకు సన్నాహములు చేసిరి; ప్రత్యేకించి వారు జెర్షోన్‌ దేశమందు వారి సైన్యములను సమకూర్చిరి.

5 లేమనీయులు వేలమంది సైన్యముతో వచ్చిరి; వారు జోరమీయుల దేశమైన ఆంట్యోనమ్ దేశములోనికి వచ్చిరి; జరహేమ్న అను పేరుగలవాడు వారి నాయకుడైయుండెను.

6 అమలేకీయులు స్వతహాగా లేమనీయుల కంటే అధిక దుర్మార్గులు మరియు హత్యా స్వభావము కలిగిన వారైయున్నందున, జరహేమ్న లేమనీయులపై ప్రధాన అధికారులను నియమించెను; వారందరు అమలేకీయులు మరియు జోరమీయులు.

7 ఇప్పుడు అతని ప్రణాళికలను సాధించుటకు అతడు వారిని లోబరుచుకొనగలుగునట్లు, నీఫైయుల యెడల వారి ద్వేషము నిలుపునట్లు అతడు దీనిని చేసెను.

8 ఏలయనగా అతని ప్రణాళికలు లేమనీయులను, నీఫైయులకు వ్యతిరేకముగా కోపమునకు పురిగొల్పుటకైయుండెను; అతడు అన్యాయముగా వారిపై గొప్ప అధికారమును సంపాదించునట్లు మరియు నీఫైయులను దాస్యములోనికి తెచ్చుట ద్వారా అతడు నీఫైయులపై కూడా అధికారము సంపాదించునట్లు దీనిని చేసెను.

9 ఇప్పుడు నీఫైయుల ప్రణాళికలు వారి భూములను, గృహములను, భార్యాపిల్లలను వారి శత్రువుల చేతులలో నుండి కాపాడుకొనునట్లు, వారి ఇష్ట ప్రకారము వారు దేవుని ఆరాధించగలుగునట్లు వారి హక్కులను, విశేషాధికారములను మరియు స్వేచ్ఛను కూడా కాపాడుకొనుటకైయుండెను.

10 ఏలయనగా వారు లేమనీయుల చేతులలో పడిన యెడల, సత్యమైన జీవముగల దేవుడిని ఆత్మయందు, సత్యమందు ఆరాధించు వారినెవరినైనను లేమనీయులు నాశనము చేయుదురని వారెరిగిరి.

11 మరియు అమ్మోన్ యొక్క జనులని పిలువబడిన ఆంటై-నీఫై-లీహై యొక్క జనులైయుండిన వారి సహోదరుల యెడల లేమనీయుల యొక్క తీవ్రమైన ద్వేషమును కూడా వారు ఎరిగియుండిరి—వారు ఆయుధములను పైకెత్తరు, ఏలయనగా వారు ఒక నిబంధనలోనికి ప్రవేశించిరి మరియు వారు దానిని మీరరు—కావున వారు లేమనీయుల చేతులలో పడిన యెడల వారు నాశనము చేయబడుదురు.

12 వారు నాశనము చేయబడుటను నీఫైయులు అనుమతించరు; కావున వారి స్వాస్థ్యము నిమిత్తము వారు దేశములనిచ్చిరి.

13 మరియు అమ్మోన్ యొక్క జనులు, నీఫైయుల సైన్యములకు సహాయపడుటకు తమ వస్తువుల నుండి అధిక భాగమునిచ్చిరి; ఆ విధముగా లేమన్‌, లెముయెల్ మరియు ఇష్మాయెల్ యొక్క కుమారుల మిశ్రమమైన లేమనీయులు, అమలేకీయులు, జోరమీయులు, నోవాహ్ యాజకుల యొక్క వంశస్థులు, నీఫైయుల నుండి అసమ్మతితో విడిపోయిన వారందరికి వ్యతిరేకముగా ఒంటరిగా నిలబడుటకు నీఫైయులు బలవంతము చేయబడిరి.

14 ఆ వారసులు సుమారుగా నీఫైయులంత అధిక సంఖ్యాకులైయుండిరి మరియు ఆ విధముగా నీఫైయులు తమ సహోదరుల రక్తము చిందించునంతగా పోరాడుటకు బలవంతము చేయబడిరి.

15 ఇప్పుడు లేమనీయుల సైన్యములు ఆంట్యోనమ్ దేశమందు సమకూడియుండగా, నీఫైయుల సైన్యములు జెర్షోన్‌ దేశమందు వారిని ఎదుర్కొనుటకు సిద్ధపడెను.

16 నీఫైయుల నాయకుడు లేదా నీఫైయులపై ప్రధాన అధికారిగా నియమింపబడినవాని పేరు మొరోనై, అతడు నీఫైయుల యొక్క సమస్త సైన్యములపై బాధ్యత స్వీకరించెను;

17 మరియు మొరోనై సమస్త అధికారమును, వారి యుద్ధ నిర్వహణను కూడా స్వీకరించెను. నీఫైయుల సైన్యములపై ప్రధాన అధికారిగా అతడు నియమింపబడినప్పుడు అతడు కేవలము ఇరువది అయిదు సంవత్సరముల వయస్సు గలవాడు.

18 అతడు జెర్షోన్‌ సరిహద్దుల యందు లేమనీయులను ఎదుర్కొనెను, అతని జనులు ఖడ్గములు, వంపు కత్తులు మరియు సకల విధములైన యుద్ధ ఆయుధములను ధరించియుండిరి.

19 మొరోనై లేదా నీఫై యొక్క జనులు వక్షస్థల కవచములతో, చేతి డాలులతో మరియు వారి తలలను కాపాడుటకు కవచములతో తమ జనులను సిద్ధపరచియున్నారని, వారు మందమైన వస్త్రములను ధరించియున్నారని లేమనీయుల సైన్యములు చూచినప్పుడు—

20 ఇప్పుడు జరహేమ్న సైన్యము అటువంటి వాటితో సిద్ధపడియుండలేదు; వారు ఖడ్గములు, వంపు కత్తులు, విల్లులు, బాణములు, రాళ్ళు మరియు వడిసెలను మాత్రమే కలిగియుండిరి; వారి నడుముల చుట్టూ చుట్టబడియున్న చర్మము తప్ప, వారు దిగంబరులుగా ఉండిరి; జోరమీయులు మరియు అమలేకీయులు తప్ప, అందరు దిగంబరులుగా ఉండిరి;

21 కానీ వారు వక్షస్థల కవచములను, డాలులను ధరించియుండలేదు—కావున వారి సంఖ్య నీఫైయుల కంటే చాలా గొప్పదైనప్పటికీ వారి కవచములను బట్టి వారు నీఫైయుల సైన్యములను గూర్చి మిక్కిలిగా భయపడిరి.

22 ఇప్పుడు జెర్షోన్‌ సరిహద్దులయందు నీఫైయులకు వ్యతిరేకముగా వచ్చుటకు వారు ధైర్యము చేయలేదు; కావున వారు ఆంట్యోనమ్ దేశము నుండి బయటకు అరణ్యములోనికి వెడలిపోయిరి మరియు వారు మాంటై దేశములోనికి వచ్చి ఆ దేశమును స్వాధీనపరచుకొనునట్లు సీదోను నది యొక్క మూలము నుండి దూరముగా అరణ్యములోనికి చుట్టూ తిరిగి ప్రయాణించిరి; ఏలయనగా వారు వెళ్ళిన ప్రదేశమును మొరోనై యొక్క సైన్యములు తెలుసుకొనలేవని వారు తలంచిరి.

23 కానీ వారు అరణ్యములోనికి వెడలిపోయిన వెంటనే, వారి దండును కనిపెట్టుటకు మొరోనై అరణ్యములోనికి వేగులను పంపెను; ఆల్మా యొక్క ప్రవచనములను ఎరిగియున్న మొరోనై, లేమనీయులకు వ్యతిరేకముగా తమను కాపాడుకొనుటకు నీఫైయుల సైన్యములు ఎటు వెళ్ళవలెనని ప్రభువు యొద్ద అతడు విచారించవలెనని కోరుచూ కొంతమందిని అతని యొద్దకు పంపెను.

24 ప్రభువు వాక్కు ఆల్మాకు వచ్చెను; లేమనీయుల సైన్యములు మాంటై దేశములోనికి వచ్చి, జనుల యొక్క బలహీన ప్రాంతముపై దాడిని ప్రారంభించునట్లు అరణ్యమందు చుట్టూ తిరిగి నడుచుచున్నవని ఆల్మా, మొరోనై యొక్క వార్తాహరులకు తెలియజేసెను మరియు ఆ వార్తాహరులు వెళ్ళి, ఆ సందేశమును మొరోనైకి తెలియజేసిరి.

25 ఇప్పుడు లేమనీయుల సైన్యములో కొంత భాగము జెర్షోన్ దేశములోనికి వచ్చి పట్టణమును స్వాధీనము చేసుకొనకుండా మొరోనై తన సైన్యములో కొంత భాగమును ఆ దేశమందు వదిలి, మిగిలిన భాగమును తీసుకొని మాంటై దేశములోనికి నడిచెను.

26 వారి భూములు, వారి దేశము, వారి హక్కులు మరియు స్వేచ్ఛను రక్షించుకొనుటకు లేమనీయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు దేశము యొక్క ఆ స్థావరమందలి జనులందరు సమకూడునట్లు అతడు చేసెను; కావున లేమనీయులను ఎదుర్కొనుటకు వారు సిద్ధపడియుండిరి.

27 మరియు అరణ్యమందు సీదోను నదికి పశ్చిమమున సీదోను నది ఒడ్డుకు దగ్గరగానున్న లోయలో తన సైన్యము దాగుకొనునట్లు మొరోనై చేసెను.

28 లేమనీయుల దండు ఎప్పుడు వచ్చునో అతడు ఎరుగునట్లు మొరోనై అన్నివైపులా వేగులనుంచెను.

29 వారి సహోదరులను నాశనము చేయుట లేదా దేశమంతటిపై తమ కొరకు రాజ్యమును స్థాపించగలుగునట్లు వారిని లోబరచుకొని దాస్యములోనికి తెచ్చుట లేమనీయుల ఉద్దేశ్యమని మొరోనై ఎరిగియుండెను;

30 వారి భూములను, స్వేచ్ఛను మరియు వారి సంఘమును కాపాడుకొనుటయే నీఫైయుల ఏకైక కోరికయని కూడా అతడు ఎరిగియుండెను, కావున వారిని యుక్తి ద్వారా కాపాడుట తప్పు కాదని అతడు తలంచెను; అందువలన లేమనీయులు వెళ్ళబోవుచున్న మార్గమును అతడు తన వేగుల ద్వారా కనుగొనెను.

31 కావున అతడు తన సైన్యమును విభజించి, ఒక భాగమును లోయలోనికి తెచ్చి, రిప్లా కొండకు తూర్పువైపున, దక్షిణమువైపున వారిని దాచెను;

32 మిగిలినవారిని అతడు సీదోను నదికి పశ్చిమమున పడమటిలోయ యందు, అట్లే మాంటై దేశ సరిహద్దులలో దాచెను.

33 ఆ విధముగా తన కోరిక ప్రకారము తన సైన్యమును దాచి, వారిని ఎదుర్కొనుటకు అతడు సిద్ధపడియుండెను.

34 మరియు లేమనీయులు కొండకు ఉత్తరమువైపు ఎక్కివచ్చిరి, అక్కడ మొరోనై సైన్యములో కొంత భాగము దాచబడియుండెను.

35 లేమనీయులు రిప్లా కొండను దాటి లోయలోనికి వచ్చి సీదోను నదిని దాటుట ప్రారంభించినప్పుడు, లీహై అను పేరుగలవాని చేత నడిపించబడి, కొండకు దక్షిణము వైపున దాచబడియున్న సైన్యము అతనిచేత ముందుకు నడిపించబడి తూర్పు దిక్కుగా వెనుక వైపునుండి లేమనీయులను చుట్టుముట్టెను.

36 వెనుకనుండి నీఫైయులు వారిపై దాడిచేయుటను చూచినపుడు, లేమనీయులు వెనుకకు తిరిగి లీహై సైన్యముతో పోరాడుట ప్రారంభించిరి.

37 రెండు వైపులా మారణకాండ మొదలాయెను, కానీ అది లేమనీయులవైపు అధిక భయంకరమైనదైయుండెను, ఏలయనగా వారి దిగంబరత్వము నీఫైయుల ఖడ్గములు మరియు వంపు కత్తుల భారమైన దెబ్బలకు బయలు చేయబడినందున దాదాపు ప్రతిదెబ్బకు మరణము సంభవించెను.

38 మరొక ప్రక్క నీఫైయులలో అప్పుడప్పుడు ఒకడు వారి ఖడ్గముల చేత మరియు రక్తము కోల్పోవుట చేత కూలెను, ఏలయనగా అధిక ప్రాముఖ్యమైన వారి శరీరభాగములు కప్పబడియుండెను లేదా వారి వక్షస్థల కవచములు, వారి చేతి కవచములు మరియు వారి శిరస్త్రాణముల ద్వారా అధిక ప్రాముఖ్యమైన శరీరభాగములు లేమనీయుల దెబ్బల నుండి రక్షించబడినవి; ఆ విధముగా నీఫైయులు, లేమనీయుల మధ్య మారణకాండ కొనసాగించిరి.

39 వారి మధ్య జరిగిన గొప్ప నాశనమును బట్టి, వారు సీదోను నదివైపు పారిపోవుట మొదలుపెట్టునంతగా లేమనీయులు భయపడిరి.

40 వారు లీహై మరియు అతని మనుష్యుల చేత వెంబడించబడిరి; వారు లీహై చేత సీదోను యొక్క జలములలోనికి తరుమబడి, ఆ జలములను దాటిరి. మరియు వారు దాటరాదని లీహై తన సైన్యములను సీదోను నది ఒడ్డుపై నిలిపియుంచెను.

41 మొరోనై మరియు అతని సైన్యము సీదోను నదికి ఆవలనున్న లోయలో లేమనీయులను కలిసి, వారిపై పడి సంహరించుట మొదలుపెట్టిరి.

42 లేమనీయులు తిరిగి వారి యెదుట నుండి మాంటై దేశము వైపు పారిపోయిరి; వారు మరలా మొరోనై సైన్యముల చేత కలుసుకొనబడిరి.

43 ఈ సందర్భములో లేమనీయులు అధికముగా పోరాడిరి; ప్రారంభము నుండి కూడా లేమనీయులు అంత అధిక బలముతో, ధైర్యముతో పోరాడుట ఎన్నడూ తెలియబడలేదు.

44 వారు తమ ప్రధాన అధికారులు, నాయకులైన జోరమీయులు మరియు అమలేకీయుల చేత, వారి ప్రధాన అధికారి లేదా వారి ముఖ్యనాయకుడు, సైన్యాధికారియైన జరహేమ్న చేత ప్రేరేపించబడిరి; వారు ఘటసర్పముల వలే పోరాడిరి మరియు వారి చేత నీఫైయులలో అనేకులు సంహరింపబడిరి, ఏలయనగా వారు వారి శిరస్త్రాణములనేకమును రెండుగా చీల్చిరి, వారి వక్షస్థల కవచములనేకమును చీల్చిరి మరియు వారి ఆయుధములనేకమును కొట్టివేసిరి; ఆ విధముగా లేమనీయులు వారి భయంకరమైన కోపమందు సంహరించిరి.

45 అయినప్పటికీ నీఫైయులు ఒక శ్రేష్ఠమైన హేతువు చేత ప్రేరణ పొందిరి, ఏలయనగా వారు రాజరికము లేదా అధికారము నిమిత్తము పోరాడుట లేదు, కానీ వారి గృహములు, స్వేచ్ఛ, వారి భార్యాపిల్లలు, వారు కలిగియున్న సమస్తము కొరకు, ముఖ్యముగా వారి ఆరాధన హక్కులు మరియు వారి సంఘము కొరకు పోరాడుచున్నారు.

46 తమ దేవునికి రుణపడియున్న కర్తవ్యమని వారు భావించినట్టి దానిని వారు చేయుచుండిరి; ఏలయనగా ప్రభువు వారితో మరియు వారి పితరులతో కూడా ఇట్లు చెప్పియుండెను: మీరు మొదటి లేదా రెండవ నేరము విషయములో దోషులు కాని యెడల, మీ శత్రువుల చేత సంహరింపబడుటకు మిమ్ములను మీరు అనుమతించరాదు.

47 మరలా ప్రభువు ఇట్లు చెప్పెను: రక్తము చిందించియైనను మీరు మీ కుటుంబములను కాపాడవలెను. కావున ఈ కారణము నిమిత్తము తమను, తమ కుటుంబములను, భూములను, దేశమును, తమ హక్కులను మరియు మతమును కాపాడుకొనుటకు నీఫైయులు లేమనీయులతో పోరాడుచుండిరి.

48 మొరోనై మనుష్యులు లేమనీయుల యొక్క భీకరత్వమును, కోపమును చూచినపుడు వారు కృంగి, వారి యొద్ద నుండి పారిపోబోయిరి. మొరోనై వారి ఉద్దేశ్యమును చూచి, తన మాటను పంపి వారి హృదయములను ఈ తలంపులతో—ముఖ్యముగా వారి భూములు, వారి స్వేచ్ఛ, అనగా దాస్యము నుండి వారి విడుదల యొక్క తలంపులతో ప్రేరేపించెను.

49 వారు లేమనీయులపై తిరుగబడి, వారి స్వేచ్ఛ మరియు దాస్యము నుండి వారి విడుదల కొరకు ప్రభువైన వారి దేవునికి ఏక స్వరముతో మొరపెట్టిరి.

50 మరియు వారు శక్తితో లేమనీయులను ఎదుర్కొనుట ప్రారంభించిరి; వారి విడుదల కొరకు వారు ప్రభువుకు మొరపెట్టిన అదే సమయములో లేమనీయులు వారి యెదుట నుండి పారిపోవుట మొదలుపెట్టిరి మరియు వారు సీదోను జలముల వద్దకు పారిపోయిరి.

51 ఇప్పుడు లేమనీయులు అధిక సంఖ్యాకులు, అంతేకాక నీఫైయుల సంఖ్యకు రెండింతల కంటే ఎక్కువమంది ఉన్నారు; అయినప్పటికీ వారు సీదోను నది ఒడ్డున ఉన్న లోయయందు ఒక్కటిగా సమకూర్చబడునంతగా తరుమబడిరి.

52 కావున మొరోనై సైన్యములు నదికి రెండు వైపుల నుండి వారిని చుట్టుముట్టెను, ఏలయనగా తూర్పున లీహై మనుష్యులుండిరి.

53 అందువలన సీదోను నదికి తూర్పున లీహై మనుష్యులను మరియు సీదోను నదికి పశ్చిమమున మొరోనై సైన్యములను చూచి, వారు నీఫైయుల చేత చుట్టబడియున్నట్లు జరహేమ్న చూచినపుడు వారు భయభ్రాంతులైరి.

54 ఇప్పుడు మొరోనై వారి భయమును చూచినపుడు, వారి రక్తమును చిందించుట ఆపవలెనని తన మనుష్యులను ఆజ్ఞాపించెను.

ముద్రించు