లేఖనములు
ఆల్మా 1


ఆల్మా గ్రంథము
ఆల్మా యొక్క కుమారుడు

నీఫై జనులపై మొదటి ప్రధాన న్యాయాధిపతియు సంఘము యొక్క ప్రధాన యాజకుడునైన ఆల్మా వృత్తాంతము, అతడు ఆల్మా యొక్క కుమారుడు. న్యాయాధిపతుల పరిపాలన మరియు జనుల మధ్య యుద్ధములు, వివాదములను గూర్చిన వృత్తాంతము. మొదటి ప్రధాన న్యాయాధిపతి అయిన ఆల్మా యొక్క గ్రంథము ప్రకారము నీఫైయులు, లేమనీయుల మధ్య యుద్ధమును గూర్చిన వృత్తాంతము కూడా.

1వ అధ్యాయము

నీహోర్‌ అబద్ధ సిద్ధాంతములను బోధించుచూ, ఒక సంఘమును స్థాపించి యాజకవంచనలను ప్రవేశపెట్టి గిడియన్‌ను సంహరించును—అతని నేరముల నిమిత్తము నీహోర్‌ శిక్షించబడును—జనుల మధ్య యాజకవంచనలు, హింసలు వ్యాపించును. యాజకులు తమనుతాము పోషించుకొందురు, జనులు బీదలపట్ల శ్రద్ధ వహించెదరు మరియు సంఘము వర్ధిల్లును. సుమారు క్రీ. పూ. 91–88 సం.

1 ఇప్పుడు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క మొదటి సంవత్సరమందు, రాజైన మోషైయ మంచి పోరాటమును పోరాడి, దేవుని యెదుట యథార్థముగా నడుచుకొని అతని స్థానములో పరిపాలించుటకు ఎవ్వరిని విడువక మరణించెను; అయినప్పటికీ అతడు చట్టములను చేసెను మరియు అవి జనుల ద్వారా అంగీకరించబడెను; కావున ఈ సమయము నుండి మొదలుకొని, అతడు చేసిన చట్టములను అనుసరించుటకు వారు బద్ధులైయుండిరి.

2 న్యాయపీఠమందు ఆల్మా పరిపాలన యొక్క మొదటి సంవత్సరమందు, అతని అధిక శక్తిని బట్టి ప్రఖ్యాతి చెందిన భారీకాయుడొకడు తీర్పు తీర్చబడుటకు అతని యెదుటికి తేబడెను.

3 సంఘమును వ్యతిరేకిస్తూ, దేవుని వాక్యమని అతడు చెప్పిన దానిని జనుల మధ్య బోధించుచూ, ప్రతి యాజకుడు, బోధకుడు ప్రఖ్యాతిగాంచవలెనని, తమ స్వహస్తములతో వారు పని చేయరాదని, జనుల చేత పోషింపబడవలెనని జనులకు ప్రకటించుచూ అతడు వారి మధ్య సంచరించుచుండెను.

4 సమస్త మానవజాతి అంత్యదినమున రక్షింపబడునని, వారు భయపడి వణకనవసరము లేదని, వారు తమ తలలు పైకెత్తుకొని ఆనందించవలెనని, ఏలయనగా ప్రభువు మనుష్యులందరినీ సృష్టించెనని, మనుష్యులందరినీ విమోచించెనని, అంతమందు మనుష్యులందరు నిత్యజీవమును పొందుదురని అతడు జనులకు సాక్ష్యమిచ్చెను.

5 అనేకులు అతని మాటలపై విశ్వసించి, అతడిని పోషించి, అతనికి ధనమిచ్చుట మొదలుపెట్టునంతగా అతడు ఈ విషయములను బోధించెను.

6 అతడు తన హృదయ గర్వమందు ఎత్తబడి మిక్కిలి వెలగల వస్త్రములు ధరించుట మొదలుపెట్టి, అతని బోధననుసరించి ఒక సంఘమును కూడా స్థాపించనారంభించెను.

7 అతని వాక్యముపై విశ్వసించిన వారికి బోధించుటకు అతడు వెళ్ళుచుండగా, దేవుని సంఘమునకు చెందిన ఒక మనుష్యుని, అనగా వారి బోధకులలో ఒకరిని అతడు కలుసుకొనెను; అతడు సంఘ జనులను త్రోవతప్పించునట్లు తీక్షణముగా అతనితో వాదించుట మొదలుపెట్టెను; కానీ ఆ మనుష్యుడు దేవుని వాక్యములతో గద్దించుచూ అతడిని ఎదుర్కొనెను.

8 ఆ మనుష్యుని పేరు గిడియన్‌; లింహై జనులను దాస్యములో నుండి విడిపించుటలో దేవుని హస్తములలో సాధనముగా ఉన్నది అతడే.

9 ఇప్పుడు గిడియన్‌ దేవుని వాక్యములతో అతడిని ఎదుర్కొనినందున అతడు గిడియన్‌తో కోపముగానుండి, తన ఖడ్గము దూసి అతడిని కొట్టనారంభించెను; గిడియన్‌ మిక్కిలి వృద్ధుడైనందున అతని దెబ్బలను తాళలేక ఖడ్గము చేత కూలెను.

10 అతడిని సంహరించిన మనుష్యుడు సంఘ జనుల ద్వారా పట్టుకొనబడి, అతడు చేసిన నేరములను బట్టి తీర్పు తీర్చబడుటకు ఆల్మా యెదుటికి తేబడెను.

11 అతడు ఆల్మా యెదుట నిలబడి, అధిక ధైర్యముతో తన పక్షమున వాదించుకొనెను.

12 కానీ ఆల్మా అతనితో ఇట్లనెను: ఈ జనుల మధ్య యాజకవంచనలు ప్రవేశపెట్టబడుట ఇది మొదటి పర్యాయము. నీవు యాజకవంచనలను బట్టి మాత్రమే దోషివి కావు, కానీ దానిని ఖడ్గము చేత బలవంతముగా విధించుటకు ప్రయత్నించియున్నావు; యాజకవంచనలు ఈ జనుల మధ్య బలవంతముగా విధించబడిన యెడల, అవి వారిని సంపూర్ణముగా నాశనము చేయును.

13 ఈ జనుల మధ్య అధిక మేలు చేసిన ఒక నీతిమంతుని రక్తమును నీవు చిందించియున్నావు; మేము నిన్ను విడిచిపెట్టిన యెడల, అతని రక్తము మాపై ప్రతీకారము తీర్చుకొనును.

14 కావున మా చివరి రాజైన మోషైయ ద్వారా మాకివ్వబడిన చట్టము ప్రకారము, నీకు మరణ శిక్ష విధించబడవలెను; అది ఈ జనుల చేత అంగీకరించబడినందున ఈ జనులు చట్టమునకు లోబడవలెను.

15 మరియు అతని పేరు నీహోర్‌; వారు అతడిని బంధించి మాంటై కొండ పైకి తీసుకుపోయిరి; తాను జనులకు బోధించినది దేవుని వాక్యమునకు వ్యతిరేకమని ఆకాశమునకు భూమికి మధ్య ఒప్పుకొని, అతడక్కడ అవమానకరమైన మరణమును అనుభవించెను.

16 అయినప్పటికీ ఇది యాజకవంచనలు దేశమంతటా వ్యాపించుటను అంతము చేయలేదు; ఏలయనగా లోకము యొక్క వ్యర్థమైన వస్తువులను ప్రేమించు వారనేకులు అక్కడ ఉండిరి మరియు వారు అబద్ధ బోధలను బోధించుచుండిరి; దీనిని వారు ఐశ్వర్యము కొరకు, ఘనత కొరకు చేసిరి.

17 అయినను వారు చట్టమునకు భయపడి, బహిరంగముగా అబద్ధమాడుటకు ధైర్యము చేయలేదు, ఏలయనగా అబద్ధికులు శిక్షింపబడిరి; కావున, వారు తమ నమ్మకమును బట్టి బోధించుచున్నట్లు నటించిరి; ఇప్పుడు వారి నమ్మకమును బట్టి ఎవరినీ శిక్షించుటకు చట్టమునకు అధికారము లేకుండెను.

18 వారు చట్టమునకు భయపడి దొంగిలించుటకు ధైర్యము చేయలేదు, ఏలయనగా అట్టి వారు శిక్షింపబడిరి; వారు దోచుకొనుటకు లేదా నరహత్య చేయుటకు సాహసించలేదు, ఏలయనగా నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధించబడెను.

19 కానీ దేవుని సంఘమునకు చెందియుండి, క్రీస్తు నామమును తమపై తీసుకొనిన వారిని దేవుని సంఘమునకు చెందని వారు హింసించుట ప్రారంభించిరి.

20 వారు తమ నేత్రముల యందు గర్వించక ఒకరికొకరు దేవుని వాక్యమును ధనము లేకయే, వెల లేకయే పంచుకొనినందున వారి వినయమును బట్టి వారిని హింసించి, అన్నివిధములైన మాటలతో వారు బాధించిరి.

21 ఇప్పుడు సంఘమునకు చెందిన ఏ మనుష్యుడూ సంఘమునకు చెందని వారిని హింసించుట మొదలుపెట్టరాదని, వారి మధ్య ఎట్టి హింస ఉండరాదని సంఘ జనుల మధ్య ఖచ్చితమైన న్యాయముండెను.

22 అయినప్పటికీ గర్విష్ఠులగుచున్న వారనేకులు వారి మధ్య ఉండిరి. వారు తమ విరోధులతో దెబ్బలాడు వరకు, అనగా ఒకరినొకరు తమ పిడికిళ్ళతో కొట్టుకొను వరకు కోపముగా వాదించుట మొదలుపెట్టిరి.

23 ఆల్మా పరిపాలన యొక్క రెండవ సంవత్సరములో ఈ విధముగానుండి, సంఘమునందు అధిక దుఃఖమునకు, అధిక శోధనకు ఇది కారణమాయెను.

24 ఏలయనగా అనేకుల హృదయములు కఠినమాయెను, వారు దేవుని జనుల మధ్య ఇక జ్ఞాపకము చేసుకొనబడకుండా వారి పేర్లు తొలగించబడెను మరియు అనేకులు వారి మధ్య నుండి తమకుతాముగా తప్పుకొనిరి.

25 ఇప్పుడు విశ్వాసమందు నిలకడగా ఉన్న వారికి ఇది గొప్ప శోధనాయెను; అయినప్పటికీ వారు దేవుని ఆజ్ఞలను పాటించుటలో స్థిరముగా కదలకయుండి, వారిపై మోపబడిన హింసను సహనముతో భరించిరి.

26 జనులకు దేవుని వాక్యమును బోధించుటకు యాజకులు తమ పనిని వదిలివచ్చినప్పుడు, జనులు కూడా దేవుని వాక్యమును వినుటకు తమ పనులను విడిచివెళ్ళిరి. యాజకుడు దేవుని వాక్యమును వారికి బోధించిన తర్వాత, వారందరూ శ్రద్ధగా తమ పనులకు తిరిగివెళ్ళిరి; యాజకుడు తననుతాను వినువారి కంటే హెచ్చుగా భావించలేదు, ఏలయనగా ప్రకటించువాడు వినువాని కంటే గొప్పవాడు కాడు లేదా నేర్చుకొను వానికంటే బోధకుడు గొప్పవాడు కాడు; ఆ విధముగా వారందరూ సమానముగా ఉండి, ప్రతి ఒక్కరు తమ శక్తిని బట్టి పని చేసిరి.

27 ప్రతి మనుష్యుడు తాను కలిగియున్న దానిని బట్టి బీదవారికి, అవసరతలో ఉన్నవారికి, రోగులకు మరియు బాధితులకు తమ వస్తువుల నుండి ఇచ్చిరి; వారు వెలగల వస్త్రములను ధరించనప్పటికీ వారు శుభ్రముగా, ఆకర్షణీయముగానుండిరి.

28 ఆ విధముగా వారు సంఘ వ్యవహారములను నిర్వహించిరి మరియు హింసలు కలిగియున్నప్పటికీ మరలా నిరంతరమైన సమాధానము కలిగియుండుట మొదలుపెట్టిరి.

29 ఇప్పుడు వారు నిలకడగా ఉండుటను బట్టి సంఘ సభ్యులు అధికముగా ధనవంతులగుట మొదలుపెట్టి, వారికి అవసరమైన వస్తువులన్నిటిని సమృద్ధిగా కలిగియుండిరి—అన్నిరకముల మందలు, గుంపులు, క్రొవ్విన దూడలు మరియు ధాన్యము, బంగారము, వెండి, ప్రశస్థమైన వస్తువులు, పట్టు, పేనిన సన్నని నార, సకల విధముల మేలైన వస్త్రములను సమృద్ధిగా కలిగియుండిరి.

30 ఆ విధముగా తాము వర్థిల్లుచున్న స్థితిలో వారు దిగంబరముగానున్న వారిని, ఆకలిదప్పులతోనున్న వారిని, రోగులను లేదా పోషింపబడని వారిని వెళ్ళగొట్టలేదు; వారు తమ హృదయములను సంపదలపై నిలుపలేదు; కావున వారు వృద్ధులు యౌవనులు, దాసులు స్వతంత్రులు, పురుషులు స్త్రీలు అందరి యెడల సంఘము వెలుపలనేమి, సంఘమందేమి అవసరతలోనున్న వ్యక్తుల విషయములో పక్షపాతము లేకుండా ఉదారముగానుండిరి.

31 ఆ విధముగా తమ సంఘమునకు చెందని వారి కంటే వారు మిక్కిలి ధనవంతులై వర్థిల్లిరి.

32 ఏలయనగా వారి సంఘమునకు చెందని వారు మంత్రజాలములందు విగ్రహారాధనయందు సోమరితనమందు వ్యర్థ ప్రేలాపనల యందు అసూయలు జగడములయందు యధేచ్చగానుండి, విలువైన వస్త్రములు ధరించి తమ నేత్రముల యొక్క గర్వమందు హెచ్చించుకొని, హింసించుచు అబద్ధమాడుచు దొంగిలించుచు దోచుకొనుచూ జారత్వములు, నరహత్యలు మరియు సకల విధముల దుష్టత్వమును జరిగించిరి; అయినప్పటికీ సాధ్యమైనంత వరకు చట్టమును అతిక్రమించిన వారందరిపై చట్టము అమలు చేయబడెను.

33 ఆ విధముగా వారిపై చట్టము అమలు చేయబడుట ద్వారా ప్రతి మనుష్యుడు తాను చేసిన దానిని బట్టి శిక్షననుభవించినందున, వారు నిశ్చలముగానుండి బహిరంగముగా దుష్టక్రియలు చేయుటకు ధైర్యము చేయలేదు; కావున న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఐదవ సంవత్సరము వరకు నీఫై జనుల మధ్య అధిక సమాధానముండెను.