లేఖనములు
ఆల్మా 4


4వ అధ్యాయము

పరివర్తన పొందిన వేల మందికి ఆల్మా బాప్తిస్మమిచ్చును—సంఘమందు దుర్నీతి ప్రవేశించి, సంఘాభివృద్ధిని ఆటంకపరచును—నెఫిహా ప్రధాన న్యాయాధిపతిగా నియమించబడును—ప్రధాన యాజకునిగా ఆల్మా తన పూర్తి సమయమును పరిచర్యకు కేటాయించును. సుమారు క్రీ. పూ. 86–83 సం.

1 నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఆరవ సంవత్సరమందు, జరహేమ్ల దేశమందు ఏ వివాదములు, యుద్ధములు లేకుండెను;

2 కానీ జనులు బాధింపబడిరి, వారి సహోదరులను కోల్పోవుట వలన, వారి మందలు, గుంపులను కోల్పోవుట వలన మరియు లేమనీయుల పాదముల క్రింద త్రొక్కివేయబడి, నాశనము చేయబడిన వారి పంట పొలముల నష్టమును బట్టి అధికముగా బాధింపబడిరి.

3 ప్రతి ఆత్మ శోకించుటకు కారణము కలిగియుండునంతగా వారు శ్రమపడిరి; వారి దుర్నీతి, హేయక్రియల నిమిత్తము ఇవి వారిపై వచ్చిన దేవుని తీర్పులని వారు విశ్వసించిరి; కావున, వారు తమ కర్తవ్యమును జ్ఞాపకము చేసుకొనుటకు మేల్కొల్పబడిరి.

4 వారు మరింత సంపూర్ణముగా సంఘమును స్థాపించుట మొదలుపెట్టిరి; అనేకులు సీదోను జలములలో బాప్తిస్మము పొంది, దేవుని సంఘమందు చేర్చబడిరి; అతని తండ్రియైన ఆల్మా ద్వారా సంఘ జనులపై ప్రధాన యాజకునిగా ప్రతిష్ఠించబడిన ఆల్మా చేత వారు బాప్తిస్మము పొందిరి.

5 న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఏడవ సంవత్సరమందు, దేవుని సంఘముతో తమను ఐక్యపరచుకొని, బాప్తిస్మము పొందిన మూడు వేల ఐదు వందల ఆత్మలు అక్కడ ఉండెను. ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఏడవ సంవత్సరము ముగిసెను; ఆ సమయమంతా అక్కడ నిరంతర సమాధానముండెను.

6 న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనిమిదవ సంవత్సరమందు, వారి పరిశ్రమ ద్వారా వారు సంపాదించిన అపారమైన సంపదలు, శ్రేష్ఠమైన వారి పట్టు వస్త్రములు, పేనిన సన్నని నారను బట్టి, వారి మందలు, గుంపులనేకమును బట్టి, వారి బంగారము, వెండి, సకల విధములైన ప్రశస్థ వస్తువులను బట్టి సంఘ జనులు గర్వమందు హెచ్చింపబడుట ప్రారంభమాయెను; వీటన్నిటిలో వారు తమ నేత్రముల యొక్క గర్వమందు హెచ్చింపబడిరి, ఏలయనగా వారు మిక్కిలి వెలగల వస్త్రములు ధరించుట మొదలుపెట్టిరి.

7 ఇప్పుడిది ఆల్మాకు, సంఘముపై బోధకులు, యాజకులు, పెద్దలుగా ఆల్మా ప్రతిష్ఠించిన జనులలో అనేకులకు అధిక బాధ కలిగించెను; తమ జనుల మధ్య మొదలైన దుష్టత్వమును చూచి వారిలో అనేకులు తీవ్రముగా దుఃఖించిరి.

8 ఏలయనగా సంఘ జనులు తమ నేత్రముల యొక్క గర్వమందు హెచ్చింపబడి, తమ హృదయములను సంపదలపై, లోకము యొక్క వ్యర్థమైన వస్తువులపై ఉంచనారంభించిరని, వారు ఒకరి యెడల మరొకరు ద్వేషముతో నుండి తమ సంతోషము, ఇచ్ఛానుసారము విశ్వసించని వారిని హింసించుట మొదలుపెట్టిరని గొప్ప విచారముతో వారు చూచిరి.

9 ఆ విధముగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనిమిదవ సంవత్సరమందు సంఘ జనుల మధ్య గొప్ప వివాదములు మొదలాయెను; ముఖ్యముగా అసూయలు, కలహము, మత్సరము, హింసలు మరియు దేవుని సంఘమునకు చెందని వారి గర్వమును మించిన గర్వముండెను.

10 ఆ విధముగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనిమిదవ సంవత్సరము ముగిసెను; సంఘము యొక్క దుష్టత్వము, సంఘమునకు చెందని వారికి అడ్డుగోడగా నిలిచెను; ఆ విధముగా సంఘము దాని వృద్ధినందు విఫలమవసాగెను.

11 తొమ్మిదవ సంవత్సరము ప్రారంభములో ఆల్మా సంఘము యొక్క దుష్టత్వమును మరియు సంఘము యొక్క మాదిరి, అవిశ్వాసులను ఒక దానినుండి మరియొక దుష్టక్రియకు నడిపించుట మొదలుపెట్టి జనులను నాశనము చేయుటను చూచెను.

12 జనుల మధ్య గొప్ప అసమానత్వమును అతడు చూచెను, కొంతమంది గర్వమందు తమను హెచ్చించుకొనుచూ ఇతరులను ద్వేషించుచూ అవసరతలోనున్న వారికి, దిగంబరులకు, ఆకలిదప్పులు గలవారికి, రోగులకు మరియు బాధింపబడియున్న వారికి తమ సహాయమును ఉపసంహరించుచుండిరి.

13 ఇప్పుడిది జనుల మధ్య గొప్ప విలాపమునకు కారణమాయెను, అయితే ఇతరులు ప్రవచనాత్మను బట్టి రావలసిన క్రీస్తు నిమిత్తము తమనుతాము తగ్గించుకొని, తమ సహాయము అవసరమున్న వారికి సహాయపడుచూ పేదలకు, అవసరతలోనున్న వారికి తాము కలిగియున్న దాని నుండి పంచి ఇచ్చుచూ ఆకలిగొన్న వారికి ఆహారమిచ్చుచూ సమస్త విధములైన బాధలను అనుభవించుచుండిరి.

14 ఆ దినము కొరకు ఎదురుచూచుచూ, ఆ విధముగా తమ పాప క్షమాపణను నిలుపుకొనుచూ, యేసు క్రీస్తు యొక్క చిత్తము శక్తులను బట్టి, మరణ బంధకముల నుండి ఆయన విడుదలను బట్టి మృతుల పునరుత్థానము మూలముగా గొప్ప సంతోషముతో నింపబడిరి.

15 ఇప్పుడు ఆల్మా, దేవుని యొక్క వినయముగల అనుచరుల బాధలను, వారిపై అతని జనులలో మిగిలిన వారి చేత క్రుమ్మరించబడిన హింసలను, వారి అసమానత్వమునంతటిని చూచి మిక్కిలి దుఃఖాక్రాంతుడాయెను; అయినప్పటికీ, ప్రభువు యొక్క ఆత్మ అతనికి సహాయపడుట మానలేదు.

16 అతడు సంఘ పెద్దలలో ఒక వివేకవంతుడిని ఎన్నుకొని జనుల సహకారమును బట్టి అతనికి శక్తినిచ్చెను, తద్వారా ఇవ్వబడిన చట్టములను బట్టి న్యాయము జరిగించుటకు, జనుల దుష్టత్వము నేరములను బట్టి శిక్ష విధించుటకు అతడు శక్తి కలిగియుండును.

17 ఇప్పుడు, ఆ మనుష్యుని పేరు నెఫిహా మరియు అతడు ప్రధాన న్యాయాధిపతిగా నియమింపబడెను; జనులకు తీర్పు తీర్చుటకు, పరిపాలించుటకు అతడు న్యాయపీఠమందు కూర్చుండెను.

18 అయితే, సంఘమందు ప్రధాన యాజక స్థానమును ఆల్మా అతనికి అనుగ్రహించలేదు, అతడు ప్రధాన యాజక స్థానమును తన కొరకు నిలుపుకొనెను; కానీ, న్యాయపీఠమును నెఫిహాకు అప్పగించెను.

19 దేవుని వాక్యమును వారికి బోధించగలుగునట్లు, వారి కర్తవ్యమును జ్ఞాపకము చేసుకొనుటకు వారిని పురిగొల్పునట్లు అతడు తన జనులు లేదా నీఫై జనుల మధ్య వెళ్ళెను మరియు వారికి వ్యతిరేకముగా శుద్ధమైన సాక్ష్యమునిచ్చుట తప్ప వారిని తిరిగి పొందు మార్గమేదియు లేదని చూచి, అతడు దేవుని వాక్యము ద్వారా తన జనుల మధ్యనున్న సమస్త గర్వము, కుటిలత, వివాదములన్నిటిని తీసివేయగలుగునట్లు అతడు దీనిని చేసెను.

20 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క తొమ్మిదవ సంవత్సరము ప్రారంభమందు ఆల్మా న్యాయపీఠమును నెఫిహాకు అప్పగించి, దేవుని పరిశుద్ధ క్రమముననుసరించి తనను పూర్తిగా ప్రధాన యాజకత్వమునకు, బయల్పాటు మరియు ప్రవచనము యొక్క ఆత్మను బట్టి వాక్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సమర్పించుకొనెను.