లేఖనములు
ఆల్మా 35


35వ అధ్యాయము

వాక్యము యొక్క బోధ, జోరమీయుల పన్నాగమును నాశనము చేయును—పరివర్తన పొందిన వారిని వారు బహిష్కరింతురు, అప్పుడు వారు జెర్షోన్‌లో అమ్మోన్‌ యొక్క జనులతో చేరుదురు—జనుల దుష్టత్వమును బట్టి ఆల్మా దుఃఖించును. సుమారు క్రీ. పూ. 74 సం.

1 ఇప్పుడు అమ్యులెక్ ఈ మాటలు చెప్పుట ముగించిన తరువాత, వారు సమూహము నుండి తమను ఉపసంహరించుకొని జెర్షోన్‌ దేశములోనికి వచ్చిరి.

2 సహోదరులలో మిగిలినవారు కూడా జోరమీయులకు వాక్యమును బోధించిన తరువాత జెర్షోన్‌ దేశములోనికి వచ్చిరి.

3 వారికి బోధించబడిన మాటలను గూర్చి జోరమీయుల యొక్క అధిక జనాదరణగల భాగము సమాలోచన చేసిన తరువాత, వాక్యమును బట్టి వారు కోపముతో నుండిరి, ఏలయనగా అది వారి పన్నాగమును నాశనము చేసెను; కావున వారు, వారి మాటలను ఆలకించలేదు.

4 వారు కబురు పంపి, దేశమంతటా ఉన్న జనులందరినీ సమకూర్చి, చెప్పబడిన మాటలను గూర్చి వారితో సమాలోచన చేసిరి.

5 ఇప్పుడు వారి అధికారులు, యాజకులు మరియు వారి ఉపదేశకులు తమ కోరికలను జనులకు తెలియనివ్వలేదు; కావున వారు జనులందరి మనస్సులను రహస్యముగా తెలుసుకొనిరి.

6 వారు జనులందరి మనస్సులను తెలుసుకొన్న తరువాత, ఆల్మా మరియు అతని సహోదరుల చేత చెప్పబడిన మాటల పక్షమునున్న వారిని దేశము నుండి బయటకు గెంటివేసిరి; వారు అనేకులుండిరి; వారు కూడా జెర్షోన్‌ దేశమునకు వచ్చిరి.

7 ఆల్మా మరియు అతని సహోదరులు వారికి పరిచర్య చేసిరి.

8 ఇప్పుడు జోరమీయుల యొక్క జనులు జెర్షోన్‌ దేశములో ఉన్నట్టి అమ్మోన్‌ యొక్క జనులతో కోపముగానుండిరి మరియు జోరమీయుల యొక్క ప్రధాన అధిపతి మిక్కిలి దుర్మార్గుడైయుండి, తమ వద్ద నుండి వారి దేశములోనికి వచ్చిన వారినందరినీ వారు దేశము నుండి బయటకు గెంటివేయవలెనని కోరుచూ అమ్మోన్‌ యొక్క జనులకు కబురు పంపెను.

9 అతడు వారికి వ్యతిరేకముగా అనేక బెదరింపులు చేసెను. కానీ అమ్మోన్‌ యొక్క జనులు వారి మాటలకు భయపడలేదు; కావున వారు, వారిని బయటకు గెంటివేయలేదు, కానీ వారి దగ్గరకు వచ్చిన జోరమీయుల యొక్క బీదవారందరిని వారు చేర్చుకొనిరి; వారిని పోషించి, వారికి వస్త్రము ధరింపజేసి, వారి స్వాస్థ్యములుగా వారికి భూములనిచ్చిరి మరియు వారి అక్కరలను బట్టి వారికి పరిచర్య చేసిరి.

10 ఇది జోరమీయులను అమ్మోన్‌ యొక్క జనులకు వ్యతిరేకముగా పురిగొల్పెను మరియు వారికి వ్యతిరేకముగా వారిని కూడా కోపమునకు పురిగొల్పునట్లు వారు లేమనీయులతో కలిసిపోవనారంభించిరి.

11 ఆ విధముగా జోరమీయులు మరియు లేమనీయులు అమ్మోన్‌ యొక్క జనులకు మరియు నీఫైయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు సన్నాహములు చేయుట మొదలుపెట్టిరి.

12 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదిహేడవ సంవత్సరము ముగిసెను.

13 ఇప్పుడు అమ్మోన్‌ యొక్క జనులు జెర్షోన్‌ దేశము నుండి బయటకు వెడలిపోయి మీలెక్ దేశములోనికి వచ్చిరి మరియు లేమనీయుల సైన్యములతోను, జోరమీయుల సైన్యములతోను పోరాడునట్లు నీఫైయుల సైన్యములకు జెర్షోన్‌ దేశమందు చోటిచ్చిరి; ఆ విధముగా లేమనీయులు మరియు నీఫైయుల మధ్య న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదునెనిమిదవ సంవత్సరమందు ఒక యుద్ధము మొదలాయెను; ఇక మీదట వారి యుద్ధముల యొక్క వృత్తాంతము ఇవ్వబడును.

14 ఇప్పుడు జోరమీయులలో అనేకులు పశ్చాత్తాపపడునట్లు చేయుటకు దేవుని చేతులలో సాధనములుగా ఉన్న తరువాత ఆల్మా, అమ్మోన్‌, అతని సహోదరులు మరియు ఆల్మా యొక్క ఇద్దరు కుమారులు కూడా జరహేమ్ల దేశమునకు తిరిగి వెళ్ళిరి; మరియు పశ్చాత్తాపమునకు తేబడిన వారందరు వారి దేశము నుండి బయటకు తరిమివేయబడిరి; కానీ జెర్షోన్‌ దేశమందు వారి స్వాస్థ్యమునకు వారు భూములు కలిగియుండిరి మరియు వారు తమను, తమ భార్యలను, పిల్లలను, తమ భూములను కాపాడుకొనుటకు ఆయుధములను తీసుకొనిరి.

15 ఇప్పుడు జనుల యొక్క దుర్నీతి నిమిత్తము, ముఖ్యముగా వారి మధ్యనున్న యుద్ధములు, రక్తపాతములు మరియు వివాదముల నిమిత్తము నొచ్చుకొనిన వాడై, ప్రతి పట్టణమందు సమస్త జనుల మధ్య వాక్యమును ప్రకటించుటకు వెళ్ళియున్న లేదా పంపబడిన వాడైన ఆల్మా, జనుల హృదయములు కఠినమగుచున్నవని, వాక్యము యొక్క ఖచ్చితత్వమును బట్టి వారు నొచ్చుకొనుట మొదలుపెట్టిరని చూచి తన హృదయమందు మిక్కిలి దుఃఖించెను.

16 కావున నీతికి సంబంధించిన సంగతులను గూర్చి వారిలో ప్రతి ఒక్కనికి తన కర్తవ్యమును వేరు వేరుగా ఇచ్చునట్లు అతడు తన కుమారులను సమావేశపరిచెను. అతని స్వంత గ్రంథమును బట్టి, అతడు వారికిచ్చిన అతని ఆజ్ఞల యొక్క వృత్తాంతమును మనము కలిగియున్నాము.

ముద్రించు