లేఖనములు
ఆల్మా 52


52వ అధ్యాయము

అమలిక్యా తరువాత అమ్మోరోన్‌ లేమనీయుల రాజగును—మొరోనై, టియాంకమ్ మరియు లీహైలు లేమనీయులకు వ్యతిరేకముగా ఒక విజయవంతమైన యుద్ధమందు నీఫైయులను నడిపించుదురు—ములెక్ పట్టణము తిరిగి తీసుకొనబడును మరియు జోరమీయుడైన జేకబ్ సంహరింపబడును. సుమారు క్రీ. పూ. 66–64 సం.

1 నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది ఆరవ సంవత్సరమందు మొదటి నెల యొక్క మొదటి ఉదయమున లేమనీయులు మేల్కొనినప్పుడు, అమలిక్యా అతని గుడారమందు మరణించియుండుటను వారు కనుగొనిరి మరియు ఆ దినమున వారితో యుద్ధము చేయుటకు టియాంకమ్ సిద్ధముగా ఉన్నాడని కూడా వారు చూచిరి.

2 లేమనీయులు దీనిని చూచినప్పుడు వారు భయపడిరి; వారు ఉత్తరమువైపు దేశములోనికి వెళ్ళవలెనను ఆలోచనను విరమించుకొని, వారి సైన్యమంతటిని ములెక్ పట్టణమునకు తీసుకొనివెళ్ళి వారి దుర్గములందు రక్షణ పొందుటకు ప్రయత్నించిరి.

3 మరియు అమలిక్యా యొక్క సహోదరుడు జనులపైన రాజుగా నియమింపబడెను; అతని పేరు అమ్మోరోన్‌; ఆ విధముగా రాజైన అమలిక్యా సహోదరుడైన అమ్మోరోన్‌ రాజు అతని స్థానములో పరిపాలించుటకు నియమించబడెను.

4 మరియు వారు రక్తపాతము ద్వారా జయించిన ఆ పట్టణములను అతని జనులు నిలబెట్టుకొనవలెనని అతడు ఆజ్ఞాపించెను; ఏలయనగా వారు అధిక రక్తపాతము జరుగకుండా ఏ పట్టణములను జయించలేదు.

5 ఇప్పుడు వారు జయించిన ఆ పట్టణములను మరియు వారు స్వాధీనము చేసుకొనిన దేశము యొక్క ఆ భాగములను నిలుపుకొనుటకు లేమనీయులు నిర్ణయించుకొనిరని టియాంకమ్ చూచెను; మరియు వారు బహు సంఖ్యాకులైయుండుట చూచి, వారి దుర్గములందు వారిపై దాడి చేయుటకు ప్రయత్నించుట ప్రయోజనకరము కాదని టియాంకమ్ తలంచెను.

6 కానీ యుద్ధమునకు సన్నాహములు చేయుచున్నట్లుగా అతడు తన మనుష్యులను చుట్టూ ఉంచెను; మరియు చుట్టూ గోడలు కట్టుచూ ఆశ్రయస్థలములను సిద్ధము చేయుట ద్వారా వారినుండి తనను రక్షించుకొనుటకు అతడు నిజముగా సిద్ధపడుచుండెను.

7 అతని సైన్యమును బలపరచుటకు మొరోనై పెద్ద సంఖ్యలో మనుష్యులను పంపువరకు అతడు ఆ విధముగా యుద్ధమునకు సిద్ధపడుచుండెను.

8 మరియు అతనికి పట్టుబడిన బందీలందరినీ అతడు నిలుపుకొనవలెనని మొరోనై అతడికి ఉత్తర్వులు జారీచేసెను; ఏలయనగా లేమనీయులు అనేకమందిని బందీలుగా తీసుకొనియున్నందున వారందరికి బదులుగా లేమనీయుల బందీలందరినీ అతడు నిలుపుకొనవలెను.

9 మరియు లేమనీయులు ఆ స్థలమును సంపాదించి, వారిని అన్నివైపుల నుండి వేధించుటకు శక్తి కలిగియుండకుండా అతడు సమృద్ధిదేశమును బలపరచవలెనని మరియు ఉత్తరము వైపు దేశములోనికి నడిపించు ఇరుకు దారిని కాపాడవలెనని కూడా అతనికి ఉత్తర్వులు జారీచేసెను.

10 దేశము యొక్క ఆ భాగమును కాపాడుటయందు అతడు విశ్వాసముగా ఉండవలెనని, అతని శక్తి మేరకు ఆ భాగమందు లేమనీయులను హింసించుటకు ఏ అవకాశమును వదలరాదని, యుక్తి చేత లేదా మరేయితర మార్గము ద్వారానైనా బహుశా అతడు వారి స్వాధీనములోనున్న ఆ పట్టణములను తిరిగి తీసుకొనగలడేమో ప్రయత్నించమని మరియు లేమనీయుల స్వాధీనములో లేని పట్టణములను కోటలు కట్టి బలపరచవలెనని కోరుచూ మొరోనై అతని వద్దకు సమాచారము పంపెను.

11 మరియు నేను నీ యొద్దకు వచ్చియుందును, కానీ లేమనీయులు పడమటి సముద్రము వద్ద దేశ సరిహద్దులందు మాతో యుద్ధమునకు సిద్ధముగా ఉన్నారు; నేను వారిపై దాడిచేయుటకు వెళ్ళుచున్నందున నీ యొద్దకు రాలేనని కూడా అతడు చెప్పెను.

12 ఇప్పుడు రాజు (అమ్మోరోన్‌) జరహేమ్ల దేశము నుండి బయటకు వెడలిపోయి అతని సహోదరుని మరణమును గూర్చి రాణికి తెలియజేసెను మరియు గొప్ప సంఖ్యలో మనుష్యులను సమకూర్చి పడమటి సముద్రము ప్రక్కనున్న సరిహద్దుల వద్ద నీఫైయులకు వ్యతిరేకముగా ముందుకు వెళ్ళెను.

13 ఆ విధముగా నీఫైయులను వేధించుటకు మరియు వారి సైన్యములలో ఒక భాగమును పడమటి సముద్రపు సరిహద్దులకు నడిపించి వేయుటకు అతడు ప్రయత్నించుచుండెను, అదే సమయములో వారి సైన్యముల సామర్థ్యమును బట్టి, వారి శక్తి మేరకు వారు తూర్పు సముద్రము ప్రక్కనున్న సరిహద్దుల వద్ద నీఫైయులను వేధించవలెనని మరియు వారి దేశములను స్వాధీనపరచుకొనవలెనని, అతడు స్వాధీనపరచుకొనిన పట్టణములను నిలుపుకొనుటకు అతడు నియమించిన సైన్యమును ఆజ్ఞాపించెను.

14 మరియు ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది ఆరవ సంవత్సరాంతమందు, నీఫైయులు అటువంటి అపాయకరమైన పరిస్థితులలో ఉండిరి.

15 కానీ న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది ఏడవ సంవత్సరమందు, దేశము యొక్క దక్షిణ మరియు పడమటి సరిహద్దులను రక్షించుటకు సైన్యములను ఏర్పరచి, వారు పోగొట్టుకొనిన పట్టణములను తిరిగి తీసుకొనుటలో తన మనుష్యులతో టియాంకమ్‌కు సహాయపడగలుగునట్లు సమృద్ధిదేశము వైపు అతని నడకను ప్రారంభించిన మొరోనై యొక్క ఆజ్ఞ చేత టియాంకమ్

16 ములెక్ పట్టణముపైన దాడి చేయుటకు మరియు సాధ్యమైన యెడల దానిని తిరిగి తీసుకొనుటకు ఉత్తర్వులు పొందెను.

17 ములెక్ పట్టణముపై దాడి చేయుటకు మరియు లేమనీయులకు వ్యతిరేకముగా తన సైన్యముతో ముందుకు వెళ్ళుటకు టియాంకమ్ ఏర్పాట్లు చేసెను; కానీ, వారు వారి దుర్గములలో ఉండగా అతడు వారిని ఓడించుట అసాధ్యమని చూచెను; కావున అతడు తన ప్రణాళికలను విరమించుకొని, సమృద్ధి పట్టణమునకు తిరిగి వచ్చి తన సైన్యమునకు బలము చేకూరునట్లు మొరోనై రాకకొరకు ఎదురు చూచుచుండెను.

18 మరియు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది ఏడవ సంవత్సరము యొక్క అంతమందు మొరోనై తన సైన్యముతో సమృద్ధిదేశమునకు చేరుకొనెను.

19 ఇరువది ఎనిమిదవ సంవత్సరము యొక్క ప్రారంభమందు మొరోనై, టియాంకమ్ మరియు ప్రధాన అధికారులలో అనేకులు ఒక యుద్ధ సమావేశమును జరిపిరి—వారితో యుద్ధము చేయుటకు లేమనీయులు బయటకు వచ్చునట్లు వారేమి చేయవలెను లేదా వారిపై ఆధిపత్యము పొంది, ములెక్ పట్టణమును తిరిగి తీసుకొనునట్లు ఏ విధముగా వారి దుర్గములనుండి బయటకు వచ్చుటకు వారిని ప్రలోభపెట్టవచ్చునని చర్చించిరి.

20 మరియు రెండు పట్టణముల మధ్యనున్న మైదానమందు వారిని కలియుటకు అతని సైన్యములతో అతడు బయటకు రావలెనని కోరుచూ ములెక్ పట్టణమును రక్షించుచున్న లేమనీయుల సైన్యమునకు నాయకుడైన జేకబ్ అను వాని వద్దకు వారు రాయబారులను పంపిరి. కానీ జోరమీయుడైన జేకబ్, వారిని మైదానమందు కలుసుకొనుటకు అతని సైన్యముతో రాకుండెను.

21 ఇప్పుడు న్యాయముగా యుద్ధభూమిలో వారిని కలుసుకొనుటకు ఎట్టి ఆశలు లేకున్నందున వారి బలమైన దుర్గముల నుండి బయటకు లేమనీయులను మోసముతో ఆకర్షించునట్లు మొరోనై ఒక ప్రణాళికను రూపొందించెను.

22 కావున టియాంకమ్ ఒక చిన్న సంఖ్యలో మనుష్యులను తీసుకొని, సముద్రపు ఒడ్డు దగ్గరకు నడిచి వెళ్ళునట్లు అతడు చేసెను; మొరోనై మరియు అతని సైన్యము రాత్రి వేళ ములెక్ పట్టణమునకు పశ్చిమమునున్న అరణ్యములోనికి నడిచిరి; ఆ విధముగా ఉదయమున లేమనీయుల భటులు టియాంకమ్‌ను కనుగొనినప్పుడు, వారు పరుగెత్తి వారి నాయకుడైన జేకబ్‌కు దానిని తెలిపిరి.

23 మరియు అతని సైన్యము చిన్నదగుటను బట్టి, టియాంకమ్‌ను వారి సైన్యము చేత ఓడించగలరని తలంచుచు టియాంకమ్ కు వ్యతిరేకముగా లేమనీయుల సైన్యములు ముందుకు నడిచెను; లేమనీయుల సైన్యములు అతనికి వ్యతిరేకముగా బయటకు వచ్చుటను టియాంకమ్ చూచినప్పుడు, అతడు సముద్రపు ఒడ్డు ప్రక్కగా ఉతరము వైపు వెనుకకు వెళ్ళుట మొదలుపెట్టెను.

24 అతడు పారిపోవుట మొదలుపెట్టెనని లేమనీయులు చూచినప్పుడు వారు ధైర్యము తెచ్చుకొని, వారిని శక్తితో తరిమిరి. మరియు వారిని వ్యర్థముగా తరుముచున్న లేమనీయులను టియాంకమ్ ఆ విధముగా దూరముగా నడిపించి వేయుచుండగా, మొరోనై అతనితోనున్న అతని సైన్యము యొక్క ఒక భాగము పట్టణములోనికి ముందుకు వెళ్ళవలెనని మరియు దానిని స్వాధీనము చేసుకోవలెనని ఆజ్ఞాపించెను.

25 వారు ఆ విధముగా చేసి పట్టణమును రక్షించుటకు విడువబడిన వారందరినీ, ముఖ్యముగా వారి యుద్ధ ఆయుధములను అప్పగించివేయని వారందరినీ సంహరించిరి.

26 ఆ విధముగా మొరోనై అతని సైన్యము యొక్క ఒక భాగముతో ములెక్ పట్టణమును స్వాధీనపరచుకొనెను, అదే సమయములో టియాంకమ్‌ను తరుముట నుండి వారు తిరిగి వచ్చునపుడు లేమనీయులను కలుసుకొనుటకు అతడు మిగిలిన వారితో ముందుకు వెళ్ళెను.

27 మరియు వారు సమృద్ధి పట్టణము దగ్గరకు వచ్చువరకు లేమనీయులు టియాంకమ్‌ను తరిమిరి, అప్పుడు వారు సమృద్ధి పట్టణమును రక్షించుటకు విడువబడిన లీహై మరియు ఒక చిన్న సైన్యమును కలుసుకొనిరి.

28 లీహై తన సైన్యముతో వారికి వ్యతిరేకముగా వచ్చుచున్నాడని లేమనీయుల ప్రధాన అధికారులు చూచినప్పుడు, లీహై వారిని పట్టుకొనుటకు ముందు వారు ములెక్ పట్టణమును బహుశా చేరలేరేమోనని భయపడుచూ అధికముగా కలవరపడి పారిపోయిరి; ఏలయనగా వారి నడకను బట్టి వారు అలసిపోయిరి మరియు లీహై మనుష్యులు అలసట లేకయుండిరి.

29 ఇప్పుడు మొరోనై తన సైన్యముతో వారి వెనుక ఉండెనని లేమనీయులు ఎరిగియుండలేదు; వారు కేవలము లీహై మరియు అతడి మనుష్యులను చూచి భయపడిరి.

30 వారు మొరోనై మరియు అతని సైన్యమును కలుసుకొనేవరకు వారిని పట్టుకొనవలెనని లీహై కోరలేదు.

31 లేమనీయులు అధిక దూరము వెనుకకు వెళ్ళకముందే వారు నీఫైయుల చేత, మొరోనై మనుష్యుల చేత ఒక ప్రక్క మరియు లీహై మనుష్యులచేత మరొక ప్రక్క చుట్టుముట్టబడిరి, వారందరు అలసటలేక శక్తితో నిండియుంటిరి; కానీ లేమనీయులు వారి దీర్ఘనడకను బట్టి అలసియుండిరి.

32 మరియు వారి యుద్ధ ఆయుధములను వారు ఇచ్చివేయు వరకు వారిపై దాడిచేయవలెనని మొరోనై తన మనుష్యులను ఆజ్ఞాపించెను.

33 అయితే వారి నాయకుడైన జేకబ్ ఒక జోరమీయుడైయుండి, జయింపబడని ఆత్మను కలిగియుండి మొరోనైకి వ్యతిరేకముగా మిక్కిలి క్రోధముతో యుద్ధము చేయుటకు లేమనీయులను ముందుకు నడిపించెను.

34 వారి మార్గమును మొరోనై ఆక్రమించినందున జేకబ్ వారిని సంహరించి, ఆ దారిగుండా ములెక్ పట్టణమునకు సాగిపోవుటకు నిర్ణయించుకొనెను. కానీ మొరోనై మరియు అతని మనుష్యులు అధిక శక్తి కలిగియున్నందున వారు లేమనీయులకు దారివ్వలేదు.

35 ఇరువైపులా వారు మిక్కిలి క్రోధముతో పోరాడిరి; ఇరువైపులా అక్కడ అనేకులు సంహరింపబడిరి; మొరోనై గాయపడగా, జేకబ్ సంహరించబడెను.

36 లీహై అతని బలమైన మనుష్యులతో క్రోధముతో వారి వెనుక వైపు దాడి చేయగా, వెనుకనున్న లేమనీయులు వారి యుద్ధ ఆయుధములను అప్పగించివేసిరి; మరియు వారిలో మిగిలిన వారు అధికముగా విభ్రాంతి చెంది, దాడిచేయవలెనో లేదా ఎక్కడకు పోవలెనో తెలియకయుండిరి.

37 వారి విభ్రాంతిని చూచి మొరోనై వారితో ఇట్లనెను: మీరు మీ యుద్ధ ఆయుధములను తెచ్చి అప్పగించిన యెడల, మేము మీ రక్తము చిందించుటను ఆపెదము.

38 ఇప్పుడు లేమనీయులు ఈ మాటలు వినినప్పుడు, వారి ప్రధాన అధికారులలో సంహరింపబడని వారందరు ముందుకు వచ్చి వారి యుద్ధ ఆయుధములను మొరోనై పాదముల యొద్ద పడవేసిరి మరియు వారు కూడా అట్లే చేయవలెనని వారి మనుష్యులను ఆజ్ఞాపించిరి.

39 కానీ అట్లు చేయని వారు అనేకులుండిరి; మరియు వారి ఖడ్గములను అప్పగించని వారు పట్టుకొనబడి బంధింపబడిరి, వారి యుద్ధ ఆయుధములు వారి నుండి తీసుకొనబడి, వారి సహోదరులతో పాటు సమృద్ధిదేశములోనికి వెళ్ళుటకు వారు బలవంతము చేయబడిరి.

40 మరియు పట్టుకొనబడిన బందీల సంఖ్య సంహరింపబడిన వారి సంఖ్యను, అనగా ఇరువైపులా సంహరింపబడిన వారి సంఖ్యను మించియుండెను.