11వ అధ్యాయము
నీఫైయుల ద్రవ్య చలామణి విధానము వివరించబడును—అమ్యులెక్, జీజ్రొమ్‌తో వాదించును—జనులను తమ పాపములయందు క్రీస్తు రక్షించడు—పరలోకరాజ్యమును స్వతంత్రించుకొను వారు మాత్రమే రక్షింపబడుదురు—మనుష్యులందరు అమర్త్యులుగా లేచెదరు—పునరుత్థానము తర్వాత ఇక మరణము లేదు. సుమారు క్రీ. పూ. 82 సం.
1 ఇప్పుడు చట్టమందు న్యాయాధిపతిగా ఉన్న ప్రతి మనుష్యుడు లేదా న్యాయాధిపతులుగా నియమించబడిన వారు తీర్పు తీర్చబడుటకు తమ యెదుటకు తేబడిన వారికి తీర్పుతీర్చుటకు పనిచేసిన సమయమును బట్టి జీతము తీసుకొనవలెనని మోషైయ యొక్క చట్టమందు ఉండెను.
2 ఒక మనుష్యుడు మరియొకనికి రుణపడియుండి, తాను రుణపడియున్న దానిని చెల్లించకున్న యెడల అతనికి వ్యతిరేకముగా న్యాయాధిపతికి ఫిర్యాదు చేయబడెను; న్యాయాధిపతి తన అధికారమును ఉపయోగించి ఆ మనుష్యుని తన యెదుటకు తెచ్చుటకు అధికారులను పంపును; అతడు చట్టప్రకారము మరియు అతనికి వ్యతిరేకముగా తేబడిన సాక్ష్యములను బట్టి ఆ మనుష్యునికి తీర్పుతీర్చును. ఆవిధముగా ఆ మనుష్యుడు తాను రుణపడియున్న దానిని చెల్లించుటకు లేదా తాను కలిగియున్నవాటిని వదులుకొనుటకు లేదా ఒక దొంగగా, దోపిడీదారునిగా జనుల మధ్య నుండి బయటకు త్రోసివేయబడుటకు బలవంతము చేయబడెను.
3 మరియు న్యాయాధిపతి తన సమయమును బట్టి తన జీతముగా—ఒక దినము కొరకు ఒక బంగారపు సెనైన్ లేదా బంగారపు సెనైన్‌తో సమానమైన ఒక వెండి సెనమ్‌ను పొందెను. ఇది వారికివ్వబడిన చట్టమును బట్టియైయుండెను.
4 ఇప్పుడు ఇవి వాటి విలువను బట్టి వారి బంగారము యొక్కయు వెండి యొక్కయు వేర్వేరు నాణెముల పేర్లయ్యుండెను. ఆ పేర్లు నీఫైయుల చేత ఇవ్వబడెను, ఏలయనగా వారు యెరూషలేము వద్దనున్న యూదుల పద్ధతిని బట్టి లెక్కించలేదు లేదా యూదుల పద్ధతిని బట్టి వారు కొలవలేదు; కానీ రాజైన మోషైయ ద్వారా నియమించబడిన న్యాయాధిపతుల పరిపాలన వరకు ప్రతి తరములోనున్న జనుల మనస్సులు మరియు పరిస్థితులను బట్టి వారి లెక్కలను, కొలతలను వారు మార్చిరి.
5 ఇప్పుడు ఆ లెక్క ఇట్లుండెను—బంగారము యొక్క ఒక సెనైన్, బంగారము యొక్క ఒక సియోన్, బంగారము యొక్క ఒక షుమ్ మరియు బంగారము యొక్క ఒక లిమ్నా.
6 వెండి యొక్క ఒక సెనమ్, వెండి యొక్క ఒక అమ్నోర్, వెండి యొక్క ఒక ఎజ్రొమ్ మరియు వెండి యొక్క ఒక ఓంటై.
7 వెండి యొక్క ఒక సెనమ్, బంగారము యొక్క ఒక సెనైన్‌నకు, బార్లీ యొక్క ఒక కొలతకు మరియు ప్రతి విధమైన ధాన్యము యొక్క ఒక కొలతకు సమానము.
8 ఇప్పుడు బంగారము యొక్క ఒక సియోన్, ఒక సెనైన్ విలువకు రెట్టింపైయుండెను.
9 బంగారము యొక్క ఒక షుమ్, ఒక సియోన్ విలువకు రెట్టింపైయుండెను.
10 బంగారము యొక్క ఒక లిమ్నా, వాటన్నిటి విలువ అయ్యుండెను.
11 వెండి యొక్క ఒక అమ్నోర్, రెండు సెనమ్‌లంత గొప్పది.
12 వెండి యొక్క ఒక ఎజ్రొమ్, నాలుగు సెనమ్‌లంత గొప్పది.
13 ఒక ఓంటై వాటన్నిటియంత గొప్పది.
14 ఇప్పుడు వారి లెక్క యొక్క తక్కువ అంకెల విలువ ఇది—
15 ఒక షిబ్లోన్ ఒక సెనమ్‌లో సగము; కావున ఒక షిబ్లోన్ బార్లీ యొక్క ఒక కొలతలో సగమునకు సమానము.
16 ఒక షిబ్లమ్ ఒక షిబ్లోన్‌లో సగమైయుండెను.
17 ఒక లియా ఒక షిబ్లమ్‌లో సగమైయుండెను.
18 ఇప్పుడు వారి లెక్క ప్రకారము ఇది వారి యొక్క అంకె.
19 బంగారము యొక్క ఒక ఆంటియోన్ మూడు షిబ్లోన్‌లకు సమానము.
20 ఇప్పుడిది లాభము సంపాదించు ఏకైక ఉద్దేశ్యము నిమిత్తమైయుండెను, ఏలయనగా వారి పనిని బట్టి వారు తమ జీతములను తీసుకొనిరి, కావున వారు ఎక్కువ పని కలిగియుండునట్లు, తమ యెదుటకు తేబడిన వ్యాజ్యములను బట్టి ధనము సంపాదించునట్లు వారు జనులను అల్లర్లకు, అన్నివిధములైన అలజడులకు, దుష్టత్వమునకు పురిగొల్పిరి; అందువలన, వారు జనులను ఆల్మా, అమ్యులెక్‌లకు వ్యతిరేకముగా పురిగొల్పిరి.
21 మరియు ఈ జీజ్రొమ్, అమ్యులెక్‌ను ఈ విధంగా ప్రశ్నించనారంభించెను: నేను నిన్ను అడుగబోవు కొన్ని ప్రశ్నలకు నీవు సమాధానమిచ్చెదవా? ఇప్పుడు మంచిదైన దానిని నాశనము చేయునట్లు జీజ్రొమ్ అపవాది యొక్క కుయుక్తులన్నిటి యందు నిపుణుడైయుండెను; కావున అతడు అమ్యులెక్‌తో ఇట్లనెను: నేను నిన్ను అడుగు ప్రశ్నలకు నీవు సమాధానమిచ్చెదవా?
22 అప్పుడు అమ్యులెక్ అతనితో ఇట్లనెను: నాలోఉన్న ప్రభువు యొక్క ఆత్మను బట్టియైన యెడల చెప్పెదను; ఏలయనగా ప్రభువు యొక్క ఆత్మకు వ్యతిరేకమైనదేది నేను చెప్పను. అప్పుడు జీజ్రొమ్ అతనితో—ఇదిగో, ఇక్కడ వెండి యొక్క ఆరు ఓంటైలు ఉన్నవి, నీవు సర్వోన్నతుడైన దేవుని ఉనికిని తిరస్కరించిన యెడల వీటన్నిటినీ నేను నీకు ఇచ్చెదననెను.
23 అంతట అమ్యులెక్ ఇట్లనెను: ఓ నరకపు సంతానమా, నీవు నన్నెందుకు శోధించెదవు? అట్టి శోధనలలో వేటికి నీతిమంతులు లొంగరని నీవెరుగవా?
24 దేవుడు లేడని నీవు నమ్ముచున్నావా? లేదు, అని నేను నీతో చెప్పుచున్నాను, దేవుడున్నాడని నీవు ఎరుగుదువు, కాని ఆయన కంటే ధనమును నీవు ఎక్కువగా ప్రేమించుచున్నావు.
25 ఇప్పుడు నీవు, దేవుని యెదుట నాతో అబద్ధమాడియున్నావు. ఇదిగో, గొప్ప విలువ కలిగిన ఈ ఆరు ఓంటైలను నేను నీకు ఇచ్చెదనని నీవు నాతో చెప్పియున్నావు—కానీ వాటిని నాకివ్వకుండా ఉంచుకొనవలెనని నీ మనస్సులో ఉన్నది; కేవలము నన్ను నాశనము చేయుటకు నీవు హేతువు కలిగి ఉండునట్లు, నేను నిజమైన మరియు సజీవుడైన దేవుడిని తిరస్కరించవలెను అనునది నీ కోరిక అయ్యున్నది. ఇప్పుడు, ఈ గొప్ప చెడు నిమిత్తము నీవు నీ ప్రతిఫలమును పొందెదవు.
26 మరియు జీజ్రొమ్ అతనితో—నిజమైన మరియు సజీవుడైన దేవుడున్నాడని నీవు చెప్పుచున్నావా? అనెను.
27 అవును, నిజమైన మరియు సజీవుడైన ఒక దేవుడున్నాడు అని అమ్యులెక్ చెప్పెను.
28 ఇప్పుడు జీజ్రొమ్—ఒకరి కంటే ఎక్కువమంది దేవుళ్ళు ఉన్నారా? అనెను.
29 లేదు, అని అతడు సమాధానమిచ్చెను.
30 జీజ్రొమ్ తిరిగి అతనితో—ఈ విషయములను నీవెట్లు ఎరుగుదువు? అనెను.
31 ఒక దేవదూత వాటిని నాకు తెలియజేసెనని అతడు చెప్పెను.
32 మరలా జీజ్రొమ్—రాబోయేదెవరు? దేవుని కుమారుడా? అనెను.
33 అవునని అతడు, అతనితో చెప్పెను.
34 ఆయన తన జనులను వారి పాపములలో రక్షించునా? అని జీజ్రొమ్ అడిగెను. అమ్యులెక్ సమాధానమిస్తూ అతనితో ఇట్లనెను: ఆయన రక్షించడని నేను నీతో చెప్పుచున్నాను, ఏలయనగా ఆయన వాక్యమును తిరస్కరించుట ఆయనకు అసాధ్యము.
35 ఇప్పుడు జీజ్రొమ్ జనులతో ఇట్లు చెప్పెను: ఈ విషయములను మీరు జ్ఞాపకముంచుకొనునట్లు చూచుకొనుడి; ఏలయనగా ఒక్కడే దేవుడున్నాడని అతడు చెప్పెను; అయినను దేవుని కుమారుడు వచ్చునని, కానీ—ఇతనికేదో దేవుడిని ఆజ్ఞాపించుటకు అధికారమున్నట్లు—ఆయన తన జనులను రక్షించడని చెప్పుచున్నాడు.
36 ఇప్పుడు అమ్యులెక్ తిరిగి అతనితో ఇట్లనెను: ఇదిగో, నీవు అబద్ధమాడియున్నావు, ఏలయనగా ఆయన తన జనులను వారి పాపములలో రక్షించడని నేను చెప్పినందున దేవుడిని ఆజ్ఞాపించుటకు అధికారము కలిగియున్నట్లుగా నేను మాట్లాడితినని నీవు చెప్పుచున్నావు.
37 నేను మరలా నీతో చెప్పుచున్నాను, ఆయన వారి పాపములలో వారిని రక్షించలేడు; ఏలయనగా ఆయన వాక్యమును నేను తిరస్కరించలేను, అపవిత్రమైనదేదియు పరలోకరాజ్యమును స్వతంత్రించుకొనలేదని ఆయన చెప్పియున్నాడు; కావున, మీరు పరలోకరాజ్యమును స్వంతంత్రించుకొనని యెడల మీరెట్లు రక్షింపబడగలరు? అందువలన మీరు మీ పాపములలో రక్షింపబడలేరు.
38 ఇప్పుడు జీజ్రొమ్ తిరిగి అతనితో—దేవుని కుమారుడు నిత్యుడైన తండ్రియేనా? అనడిగెను.
39 మరియు అమ్యులెక్ అతనితో ఇట్లనెను—ఆయన భూమ్యాకాశముల యొక్క, వాటియందున్న సమస్త వస్తువుల యొక్క నిత్య తండ్రి; ఆయనే ఆదియు అంతము, మొదటివాడును కడపటివాడును.
40 తన జనులను విమోచించుటకు ఆయన లోకములోనికి వచ్చును; ఆయన నామమందు విశ్వసించు వారి అతిక్రమములను తనపై తీసుకొనును; నిత్యజీవము కలిగియుండు వారు వీరే మరియు రక్షణ మరెవరికీ రాదు.
41 కావున దుష్టుల నుండి మరణ బంధకములు తొలగించబడుట తప్ప, వారు ఎట్టి విమోచన చేయబడనట్లే నిలిచియుందురు; ఏలయనగా, అందరు మృతులలో నుండి లేచి దేవుని యెదుట నిలిచి తమ క్రియలను బట్టి తీర్పుతీర్చబడు దినము వచ్చును.
42 ఇప్పుడు భౌతిక మరణమని పిలువబడిన ఒక మరణమున్నది; ఈ భౌతిక మరణము నుండి అందరు లేపబడునట్లు క్రీస్తు యొక్క మరణము ఈ భౌతిక మరణము యొక్క బంధకములను తొలగించును.
43 ఆత్మ మరియు శరీరము దాని పరిపూర్ణ రూపమందు తిరిగి ఐక్యమగును; అవయవము మరియు కీళ్ళు రెండును మనము ఈ సమయమున ఉన్నట్లుగానే దాని సరియైన ఆకారమునకు పునఃస్థాపించబడును; మనము ఇప్పుడు ఎరిగియున్నట్లే మన సమస్త దోషము యొక్క స్పష్టమైన జ్ఞాపకము కలిగియుండి దేవుని యెదుట నిలుచుటకు తేబడుదుము.
44 ఇప్పుడు ఈ పునఃస్థాపన వృద్ధులు యౌవనులు, దాసులు స్వతంత్రులు, స్త్రీ పురుషులు, దుష్టులు నీతిమంతులు అందరికి వచ్చును; వారి తల వెంట్రుకలలో ఒకటియైనను నశించదు; ప్రతీది ఇప్పుడున్నట్లుగా లేదా శరీరమందున్నట్లుగా దాని పరిపూర్ణ ఆకారమునకు పునఃస్థాపించబడును, మరియు అవి మంచివేగాని చెడ్డవేగాని వారి క్రియలను బట్టి తీర్పుతీర్చబడుటకు కుమారుడైన క్రీస్తు, తండ్రియైన దేవుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క న్యాయస్థానము యెదుటకు అనగా ఏకైక నిత్యదేవుని యెదుట నిందారోపణ చేయబడుటకు వారు తేబడుదురు.
45 ఇప్పుడు నేను మర్త్య శరీరము యొక్క మరణమును గూర్చి, మర్త్య శరీరము యొక్క పునరుత్థానమును గూర్చి మీతో చెప్పియున్నాను. ఇక వారేమాత్రము మరణించకుండునట్లు ఈ మర్త్య శరీరము అమర్త్యత్వమునకు, అనగా మరణము నుండి—మొదటి మరణము నుండి కూడా జీవమునకు లేపబడునని నేను మీతో చెప్పుచున్నాను; వారి ఆత్మలు మరెన్నడూ విభజించబడనట్లు వారి శరీరములతో ఏకమగును; ఆ విధముగా వారిక క్షయతను చూడకుండునట్లు మొత్తము ఆత్మీయముగా మరియు అమర్త్యముగా అగును.
46 ఇప్పుడు అమ్యులెక్ ఈ మాటలను ముగించినప్పుడు జనులు తిరిగి ఆశ్చర్యపడసాగిరి మరియు జీజ్రొమ్ కూడా వణకనారంభించెను. ఆ విధముగా అమ్యులెక్ మాటలు ముగిసెను లేదా నేను వ్రాసియున్నదంతయు ఇదియే.