30వ అధ్యాయము
క్రీస్తు విరోధి అయిన కొరిహోర్, క్రీస్తును ప్రాయశ్చిత్తమును ప్రవచనాత్మను వెక్కిరించును—దేవుడు లేడని, మనుష్యుని పతనము లేదని, పాపమునకు శిక్ష లేదని మరియు క్రీస్తు లేడని అతడు బోధించును—క్రీస్తు వచ్చునని మరియు ఒక దేవుడున్నాడని సమస్త వస్తువులు సూచించునని ఆల్మా సాక్ష్యమిచ్చును—కొరిహోర్ ఒక సూచనను కోరును మరియు మూగవానిగా మొత్తబడును—అపవాది కొరిహోర్‌కు ఒక దేవదూత వలే కనిపించి, ఏమి పలుకవలెనో అతనికి బోధించెను—కొరిహోర్ త్రొక్కివేయబడి మరణించును. సుమారు క్రీ. పూ. 76–74 సం.
1 ఇప్పుడు, అమ్మోన్ యొక్క జనులు జెర్షోన్ దేశమందు స్థిరపడిన తరువాత, మరియు లేమనీయులు దేశము నుండి బయటకు తరిమివేయబడి, వారి మృతులు దేశ జనుల చేత పాతిపెట్టబడిన తరువాత—
2 వారి సంఖ్యల గొప్పతనమును బట్టి వారి మృతులు లెక్కింపబడలేదు; నీఫైయుల మృతులు కూడా లెక్కింపబడలేదు—కానీ వారు, వారి మృతులను పాతిపెట్టిన తరువాత, ఉపవాసము, దుఃఖము మరియు ప్రార్థనాదినముల తరువాత (అది నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదహారవ సంవత్సరమునందైయుండెను) దేశమంతటా నిరంతరమైన సమాధానముండుట మొదలాయెను.
3 జనులు ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించిరి మరియు వారు మోషే ధర్మశాస్త్రమును బట్టి దేవుని విధులను ఆచరించుటయందు ఖచ్చితముగా ఉండిరి; ఏలయనగా అది నెరవేరు వరకు మోషే ధర్మశాస్త్రమును పాటించవలెనని వారు బోధింపబడిరి.
4 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదహారవ సంవత్సరమంతయు జనులు మధ్య అలజడులు లేకుండెను.
5 న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదిహేడవ సంవత్సరపు ప్రారంభమందు నిరంతర సమాధానముండెను.
6 కానీ, పదిహేడవ సంవత్సరము యొక్క అంతమందు జరహేమ్ల దేశమందు ఒక మనుష్యుడు వచ్చెను మరియు అతడు క్రీస్తు విరోధియైయుండెను, ఏలయనగా అతడు క్రీస్తు యొక్క రాకను గూర్చి ప్రవక్తల చేత పలుకబడిన ప్రవచనములకు వ్యతిరేకముగా జనులకు బోధించుట ప్రారంభించెను.
7 ఇప్పుడు మనుష్యుని విశ్వాసమునకు వ్యతిరేకముగా అక్కడ ఏ చట్టము లేదు; ఏలయనగా మనుష్యుల మధ్య అసమానతలను తెచ్చు చట్టముండుట దేవుని ఆజ్ఞలకు ఖచ్చితముగా వ్యతిరేకమైనది.
8 ఏలయనగా లేఖనము ఈ విధముగా చెప్పుచున్నది: ఈ దినమున మీరు ఎవరిని సేవించెదరో కోరుకొనుడి.
9 ఇప్పుడు మనుష్యుడు దేవుని సేవించుటకు కోరుకొనిన యెడల అది అతని హక్కు అయ్యున్నది లేదా అతడు దేవుని యందు విశ్వసించిన యెడల ఆయనను సేవించుట అతని హక్కు అయ్యున్నది; కానీ అతడు ఆయనయందు విశ్వసించని యెడల అతడిని శిక్షించుటకు ఏ చట్టము లేకుండెను.
10 కానీ అతడు హత్య చేసిన యెడల, అతనికి మరణశిక్ష విధించబడెను; అతడు దోచుకొనిన యెడల అతడు శిక్షించబడెను; అతడు దొంగిలించిన యెడల అతడు శిక్షించబడెను; మరియు అతడు వ్యభిచరించిన యెడల అతడు శిక్షించబడెను; ఈ సమస్త దుష్టత్వము నిమిత్తము వారు శిక్షించబడిరి.
11 ఏలయనగా వారి నేరములను బట్టి మనుష్యులు తీర్పు తీర్చబడవలెనని ఒక చట్టముండెను. అయినప్పటికీ, ఒక మనుష్యుని విశ్వాసమునకు వ్యతిరేకముగా ఏ చట్టము లేకుండెను; కావున అతడు చేసిన నేరముల నిమిత్తమే ఒక మనుష్యుడు శిక్షించబడెను; అందువలన మనుష్యులందరు సమానులైయుండిరి.
12 ఇప్పుడు కొరిహోర్ అను పేరుగల ఈ క్రీస్తు విరోధి, ఏ క్రీస్తు ఉండబోడని జనులకు బోధించుట ప్రారంభించెను (మరియు చట్టము అతడిని నియత్రించలేకపోయెను). అతడు ఈ విధముగా చెప్పుచూ బోధించెను:
13 ఓ, మూర్ఖమైన మరియు వ్యర్థమైన నిరీక్షణ క్రింద నిర్భంధించబడిన మీరు, అట్టి మూర్ఖమైన సంగతులతో మిమ్ములను ఎందుకు నిర్భంధించుకొనుచున్నారు? మీరెందుకు ఒక క్రీస్తు కొరకు ఎదురు చూచుచున్నారు? రాబోవు క్రియలను గూర్చి ఏ మనుష్యుడు ఎరుగలేడు.
14 ఇదిగో ప్రవచనములు అని మీరు పిలుచుచున్నవి, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా అందించబడినవని మీరు చెప్పుచున్న ఈ విషయములు మీ పితరుల మూర్ఖపు సంప్రదాయములైయున్నవి.
15 వాటి యథార్థతను మీరెట్లు ఎరుగుదురు? మీరు చూడని సంగతులను గూర్చి మీరెరుగలేరు. కావున, క్రీస్తు ఉండునని మీరెరుగలేరు.
16 మీరు ఎదురు చూచుచున్నారు మరియు మీ పాపముల క్షమాపణను చూచుచున్నారని మీరు చెప్పుచున్నారు. కానీ ఇదిగో, ఇది ఉద్రేకమైన మనస్సు యొక్క ఫలితమైయున్నది; ఈ ఉన్మాదము మీ తండ్రుల సంప్రదాయములను బట్టి వచ్చును, అది మిమ్ములను అవాస్తవమైన సంగతులు విశ్వసించునట్లు చేయును.
17 మనుష్యుల పాపముల కొరకు చేయబడిన ఏ ప్రాయశ్చిత్తము ఉండదని, ప్రతి మనుష్యుడు వ్యక్తిగత నిర్వహణను బట్టి ఈ జీవితమందు సాధించునని చెప్పుచూ అటువంటి అనేక సంగతులను అతడు వారితో చెప్పెను; కావున ప్రతి మనుష్యుడు తన మేధస్సును బట్టి వర్థిల్లెనని, ప్రతి మనుష్యుడు తన బలమును బట్టి జయించెనని మరియు మనుష్యుడు ఏమి చేసినను నేరముకాదని చెప్పెను.
18 ఆ విధముగా అనేకుల హృదయములను నడిపించివేయుచూ, దుష్టత్వమందు వారు గర్వించునట్లు చేయుచూ ఒక మనుష్యుడు మరణించినప్పుడు అదియే వాని అంతమని చెప్పుచూ అనేకమంది స్త్రీ పురుషులను జారత్వములు చేయుటకు నడిపించి వేయునట్లు అతడు వారికి బోధించెను.
19 ఇప్పుడు ఈ మనుష్యుడు, ఒకప్పుడు లేమనీయులైన అమ్మోన్ యొక్క జనుల మధ్య ఈ సంగతులను బోధించుటకు జెర్షోన్ దేశమునకు కూడా వెళ్ళెను.
20 కానీ, వారు అనేకమంది నీఫైయుల కంటే ఎక్కువ తెలివైనవారు; ఏలయనగా వారు అతడిని పట్టుకొని, బంధించి ఆ జనులపై ఒక ప్రధాన యాజకునిగా ఉన్న అమ్మోన్ యెదుటకు అతడిని తీసుకొనిపోయిరి.
21 అతడు దేశము నుండి బయటకు తీసుకుపోబడునట్లు అతడు చేసెను. అతడు గిడియన్ దేశములోనికి వచ్చి, వారికి కూడా బోధించుట ప్రారంభించెను; ఇక్కడ అతడు అధిక విజయమును పొందలేక పోయెను, ఏలయనగా అతడు పట్టుకొనబడి, బంధించబడి ప్రధాన యాజకుడు మరియు దేశముపై ప్రధాన న్యాయాధిపతి యెదుటకు తీసుకొనిపోబడెను.
22 అంతట ప్రధాన యాజకుడు అతనితో ఇట్లనెను: నీవెందుకు దేవుని మార్గములను వక్రీకరించుచున్నావు? వారి ఆనందమును ఆటంకపరచుచూ ఏ క్రీస్తు ఉండడని నీవెందుకు ఈ జనులకు బోధించుచున్నావు? పరిశుద్ధ ప్రవక్తల యొక్క ప్రవచనములన్నిటికి వ్యతిరేకముగా నీవెందుకు మాటలాడుచున్నావు?
23 ఆ ప్రధాన యాజకుని పేరు గిద్దొనా. మరియు కొరిహోర్ అతనితో ఇట్లనెను: ఎందుకనగా నేను మీ పితరుల మూర్ఖపు సంప్రదాయములను బోధించను, వారు తమ తలలెత్తుకొనక మీ మాటల ప్రకారము లోబడునట్లు, వారిపై శక్తిని అధికారమును కలిగియుండుటకు, వారిని అజ్ఞానములో ఉంచుటకు ప్రాచీన యాజకులచేత ఏర్పరచబడిన మూర్ఖపు విధులు, ఆచరణలను బట్టి తమను బంధించుకొమ్మని ఈ జనులకు నేను బోధించను.
24 ఈ జనులు స్వతంత్రులని మీరు చెప్పుచున్నారు, కానీ వారు దాస్యమందు ఉన్నారని నేను చెప్పుచున్నాను. ఆ ప్రాచీన ప్రవచనములు సత్యమని మీరు చెప్పుచున్నారు, కానీ అవి సత్యమని మీరెరుగరని నేను చెప్పుచున్నాను.
25 ఒక తండ్రి యొక్క అతిక్రమమును బట్టి ఈ జనులు దోషులు మరియు పతనమైన జనులైయున్నారని మీరు చెప్పుచున్నారు. కానీ తన తల్లిదండ్రులను బట్టి ఒక బిడ్డ దోషి కాడని నేను చెప్పుచున్నాను.
26 క్రీస్తు వచ్చునని కూడా మీరు చెప్పుచున్నారు. కానీ, క్రీస్తు ఉండునని మీరెరుగరని నేను చెప్పుచున్నాను. అతడు లోక పాపముల నిమిత్తము సంహరింపబడునని కూడా మీరు చెప్పుచున్నారు—
27 ఆ విధముగా మీరు, మీ స్వంత కోరికలను బట్టి ఈ జనులను మీ పితరుల మూర్ఖపు సంప్రదాయముల వెంట నడిపించివేసితిరి; వారి చేతుల శ్రమలతో మిమ్ములను మీరు మితిమీరి నింపుకొనునట్లు, వారు ధైర్యముతో పైకి చూచుటకు తెగించకుండునట్లు, వారు తమ హక్కులను విశేషాధికారములను అనుభవించుటకు తెగించకుండునట్లు వారిని దాస్యమందు ఉంచునట్లు మీరు వారిని అణగద్రొక్కుచున్నారు.
28 తమ కోరికలను బట్టి వారిని కాడికట్టిన వారి యాజకులను వారు నొప్పించుదురేమోయని వారి స్వంతమైన దానిని ఉపయోగించుటకు వారు తెగించరు. వారు తమ మాటల ప్రకారము చేయని యెడల తాము దేవుడని చెప్పుచున్న ఒక తెలియని వ్యక్తిని-ఎన్నడూ చూసియుండని లేదా ఎరిగియుండని మరియు ఎన్నడూ ఉండియుండని లేదా ఎన్నడూ ఉండబోని ఒక వ్యక్తిని వారు నొప్పించుదరని తమ సంప్రదాయములు, కలలు, పిచ్చి ఊహలు, దర్శనములు మరియు కపటపు మర్మములచేత ఆ యాజకులు వారిని నమ్మించిరి.
29 ఇప్పుడు ప్రధాన యాజకుడు మరియు ప్రధాన న్యాయాధిపతి అతని హృదయకాఠిన్యమును మరియు అతడు దేవునికి వ్యతిరేకముగా దూషించుటను చూచినపుడు, వారు అతని మాటలకు ఏమీ బదులు చెప్పక అతడు బంధించబడునట్లు చేసి, అతడిని అధికారుల చేతులకు అప్పగించిరి; దేశమంతటిపై పరిపాలకుడైన ప్రధాన న్యాయాధిపతి మరియు ఆల్మా యెదుటకు అతడు తేబడునట్లు అతడిని జరహేమ్ల దేశమునకు పంపిరి.
30 అతడు ఆల్మా మరియు ప్రధాన న్యాయాధిపతి యెదుటకు తేబడినప్పుడు, గిడియన్ దేశమందు చేసిన ప్రకారము అతడు కొనసాగించెను, అనగా అతడు దైవదూషణ చేయుటను కొనసాగించెను.
31 అతడు ఆల్మా యెదుట తీక్షణముగా మాట్లాడుచూ జనుల శ్రమను దోచుకొనుటకు వారి పితరుల యొక్క అవివేకపు సంప్రదాయముల వెంట వారిని నడిపించి వేయుచున్నారని ఆరోపించుచూ యాజకులు మరియు ఉపదేశకులకు వ్యతిరేకముగా దూషించెను.
32 ఇప్పుడు ఆల్మా అతనితో ఇట్లు చెప్పెను: ఈ జనుల శ్రమను దోచుకొని మమ్ములను మేము మితిమీరి నింపుకొనమని నీవెరుగుదువు; ఏలయనగా, నా జనులకు దేవుని వాక్యమును ప్రకటించుటకు దేశము చుట్టూ నేను అనేక ప్రయాణములు చేసినను న్యాయాధిపతుల పరిపాలన ఆరంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా జీవనాధారము కొరకు నా స్వహస్తములతో నేను పని చేసియున్నాను.
33 మరియు సంఘమందు నేను అనేక పనులు చేసినప్పటికీ నా శ్రమకు ఒక్క సెనైన్ కూడా నేను ఎన్నడూ పొందలేదు; న్యాయపీఠమందు ఉన్నవారు తప్ప, నా సహోదరులలో ఎవరూ ఎన్నడూ పొందియుండలేదు; అప్పుడు కూడా మేము వెచ్చించిన సమయమును బట్టి చట్ట ప్రకారము మాత్రమే మేము పొందితిమి.
34 ఇప్పుడు సంఘమందు మా శ్రమల కొరకు మేము ఏమియు పొందని యెడల మా సహోదరుల సంతోషమందు మేము హర్షము కలిగియుండునట్లు సత్యమును ప్రకటించుటకు తప్ప, సంఘమందు పనిచేయుట మాకేమి లాభము కలుగజేయును?
35 మేము ఏ లాభము పొందమని నీకైనీవు ఎరిగినప్పుడు, లాభము పొందుటకు మేము ఈ జనులకు బోధించుచున్నామని నీవెందుకు చెప్పుచున్నావు? వారి హృదయములలో అట్టి సంతోషమును కలుగజేయునట్లు మేము ఈ జనులను మోసగించుచున్నామని నీవు నమ్ముచున్నావా?
36 అవునని కొరిహోర్ అతనికి సమాధానమిచ్చెను.
37 అప్పుడు ఆల్మా అతనితో—ఒక దేవుడున్నాడని నీవు నమ్ముచున్నావా? అనెను.
38 లేదని అతడు సమాధానమిచ్చెను.
39 ఇప్పుడు ఆల్మా అతనితో ఇట్లు చెప్పెను: ఒక దేవుడున్నాడని నీవు మరలా నిరాకరించెదవా మరియు క్రీస్తును కూడా నిరాకరించెదవా? ఇదిగో నేను నీతో చెప్పుచున్నాను, ఒక దేవుడున్నాడని మరియు క్రీస్తు వచ్చునని కూడా నేను ఎరుగుదును.
40 ఏ దేవుడు లేడని లేదా క్రీస్తు రాడని అనుటకు నీవేమి సాక్ష్యము కలిగియున్నావు? నీ మాట తప్ప నీవేమియు కలిగిలేవని నేను నీతో చెప్పుచున్నాను.
41 కానీ ఈ సంగతులు సత్యమనుటకు సాక్ష్యముగా నేను అన్నిసంగతులను కలిగియున్నాను; అవి సత్యమని నీకు ఒక సాక్ష్యముగా నీవు కూడా అన్ని సంగతులను కలిగియున్నావు; నీవు వాటిని తిరస్కరించెదవా? ఈ సంగతులు సత్యమని నీవు నమ్ముచున్నావా?
42 ఇదిగో నీవు నమ్ముచున్నావని నేను ఎరుగుదును. కానీ, నీవు అబద్ధపు ఆత్మతో పట్టబడియున్నావు మరియు దేవుని ఆత్మకు నీయందు ఎట్టి స్థానము లేకుండునట్లు నీవు దానిని విడిచిపెట్టియున్నావు; అపవాది నీపై శక్తి కలిగియున్నాడు, దేవుని పిల్లలను నాశనము చేయుటకు యుక్తులు పన్నుచూ అతడు నిన్ను కొనిపోవుచున్నాడు.
43 ఇప్పుడు కొరిహోర్, ఆల్మాతో ఇట్లనెను: ఒక దేవుడున్నాడని నేను ఒప్పించబడునట్లు నీవు నాకు ఒక సూచనను చూపిన యెడల, అంతేకాక అతడు శక్తి కలిగియున్నాడని నాకు చూపిన యెడల, అప్పుడు నేను నీ మాటల యొక్క సత్యమును గూర్చి ఒప్పించబడుదును.
44 కానీ ఆల్మా అతనితో ఇట్లనెను: నీవు తగినన్ని సూచనలు కలిగియున్నావు; నీవు నీ దేవుడిని శోధించెదవా? ఈ నీ సహోదరులు మరియు పరిశుద్ధ ప్రవక్తలు అందరి సాక్ష్యమును కలిగియుండి కూడా నాకు ఒక సూచనను చూపమని నీవు చెప్పెదవా? లేఖనములు నీ యెదుట ఉంచబడియున్నవి మరియు సమస్తమును ఒక దేవుడున్నాడని సూచించుచున్నవి; భూమి మరియు దాని ముఖముపై ఉన్న సమస్తము, దాని గమనము మరియు తమ క్రమమైన రీతిలో కదులు సమస్త గ్రహములు కూడా సర్వోన్నతుడైన సృష్టికర్త ఉన్నాడని సాక్ష్యమిచ్చుచున్నవి.
45 ఇంకను నీవు ఏ దేవుడు లేడని సాక్ష్యమిచ్చుచూ, ఈ జనుల హృదయములను నడిపించివేయుచూ ముందుకు సాగెదవా? ఇంకను ఈ సాక్ష్యులందరికి వ్యతిరేకముగా నీవు నిరాకరించెదవా? మరియు అతడు—అవును, మీరు నాకు ఒక సూచనను చూపితే తప్ప నేను నిరాకరించెదనని చెప్పెను.
46 ఇప్పుడు ఆల్మా అతనితో ఇట్లనెను: ఇదిగో, నీ హృదయకాఠిన్యమును బట్టి నేను నొచ్చుకొనుచున్నాను, ముఖ్యముగా నీ ఆత్మ నాశనము చేయబడునట్లు సత్యము యొక్క ఆత్మను నీవింకను ఎదిరించుచున్నావు.
47 కానీ ఇదిగో, నీ ముఖస్తుతి మాటలచేతను నీ అబద్ధములచేతను అనేక ఆత్మలను నాశనమునకు నడిపించుటకు నీవు ఒక సాధనముగా ఉండుట కంటే నీ ఆత్మ నాశనమగుట మేలు; కావున నీవు తిరిగి నిరాకరించిన యెడల నీవు మూగవాడివగునట్లు, ఇకపై నీ నోరు ఎన్నడూ తెరువకుండునట్లు, ఈ జనులను ఇకపై నీవు మోసగించకుండునట్లు దేవుడు నిన్ను మొత్తును.
48 ఇప్పుడు కొరిహోర్ అతనితో ఇట్లనెను: దేవుని ఉనికిని నేను తిరస్కరించను, కానీ ఒక దేవుడున్నాడని నేను విశ్వసించను; మరియు ఒక దేవుడున్నాడని మీరు ఎరుగరని కూడా నేను చెప్పుచున్నాను; మీరు నాకు ఒక సూచనను చూపితే తప్ప నేను విశ్వసించను.
49 ఇప్పుడు ఆల్మా అతనితో ఇట్లు చెప్పెను: దీనిని నేను నీకొక సూచనగా ఇచ్చెదను, నా మాటలను బట్టి నీవు మూగవానిగా మొత్తబడెదవు; నీవికమీదట పలుకలేకుండునట్లు మూగవానిగా మొత్తబడెదవని దేవుని నామమందు నేను చెప్పుచున్నాను.
50 ఇప్పుడు ఆల్మా ఈ మాటలను చెప్పినప్పుడు, ఆల్మా యొక్క మాటల ప్రకారము అతడు పలుక లేకుండునట్లు కొరిహోర్ మూగవానిగా మొత్తబడెను.
51 ప్రధాన న్యాయాధిపతి దీనిని చూచినప్పుడు, అతడు తన చేతిని ముందుకు చాపి ఇట్లు చెప్పుచూ కొరిహోర్‌కు వ్రాసెను: ఎవరియందైతే ఆల్మా తన సూచనను చూపవలెనని నీవు కోరియున్నావో ఆ దేవుని శక్తిని గూర్చి నీవు ఒప్పించబడితివా? నీకు ఒక సూచనను చూపుటకు అతడు ఇతరులను బాధించవలెనని నీవు కోరితివా? ఇదిగో, అతడు నీకు ఒక సూచనను చూపియున్నాడు; ఇంకను నీవు వాదించెదవా?
52 అప్పుడు కొరిహోర్ తన చేతిని ముందుకు చాపి ఇట్లు చెప్పుచూ వ్రాసెను: నేను మూగవాడినని నేనెరుగుదును, ఏలయనగా నేను మాట్లాడలేను; దేవుని శక్తి తప్ప మరేదియు దీనిని నాపై తీసుకొనిరాలేదని నేనెరుగుదును; ఒక దేవుడుండెనని నేను ఎల్లప్పుడు ఎరిగితిని.
53 కానీ అపవాది నన్ను మోసగించెను; ఏలయనగా అతడు నాకొక దేవదూత రూపములో కనబడి, నాతో ఇట్లు చెప్పెను: వెళ్ళి ఈ ప్రజలను సరిదిద్దుము, ఏలయనగా వారందరు తెలియని దేవుని వెనుక త్రోవ తప్పియున్నారు. మరియు అతడు నాతో—ఏ దేవుడు లేడని చెప్పెను; నేను చెప్పవలసిన దానిని అతడు నాకు బోధించగా నేను అతని మాటలను బోధించితిని; అవి నా శరీర సంబంధమైన మనస్సుకు ప్రీతికరముగా ఉన్నందున నేను వాటిని బోధించితిని; అవి సత్యమని నేను కూడా నిజముగా విశ్వసించునంత అధిక విజయము పొందువరకు నేను వాటిని బోధించితిని; ఈ కారణము చేత ఈ గొప్ప శాపమును నాపైకి తెచ్చుకొను వరకు కూడా నేను సత్యమును ఎదిరించితిని.
54 అతడు దీనిని చెప్పినప్పుడు, అతని నుండి శాపము తీసివేయబడునట్లు ఆల్మా దేవునికి ప్రార్థన చేయవలెనని అతడు బ్రతిమాలెను.
55 కానీ ఆల్మా అతనితో ఇట్లనెను: ఈ శాపము నీ నుండి తీసివేయబడిన యెడల నీవు ఈ జనుల హృదయములను తిరిగి నడిపించివేయుదువు; కావున, దేవుని చిత్తప్రకారము నీకు జరుగును.
56 మరియు కొరిహోర్ నుండి శాపము తీసివేయబడలేదు; కానీ అతడు బయటకు త్రోసివేయబడి, తన ఆహారము కొరకు భిక్షమెత్తుకొనుచు ఇంటింటికి వెళ్ళెను.
57 ఇప్పుడు కొరిహోర్‌కు జరిగిన సంగతి వెంటనే దేశమంతటా ప్రచారము చేయబడెను; వారు వేగముగా పశ్చాత్తాపపడవలెనని, లేని యెడల అవే తీర్పులు వారికి వచ్చునని కొరిహోర్ యొక్క మాటలయందు విశ్వసించిన వారికి ప్రకటించుచూ దేశములోని జనులందరికి ప్రధాన న్యాయాధిపతి చేత ప్రకటన పంపబడెను.
58 వారందరు కొరిహోర్ యొక్క దుష్టత్వము విషయమై ఒప్పించబడిరి; కావున వారందరు తిరిగి ప్రభువుకు పరివర్తన చెందిరి; ఇది కొరిహోర్ సాధన చేసినటువంటి దుర్నీతికి ముగింపు పలికెను. మరియు అతని ఆధారము కొరకు ఆహారము భిక్షమెత్తుకొనుచు కొరిహోర్ ఇంటింటికి వెళ్ళెను.
59 అతడు జనుల మధ్యకు వెళ్ళగా—ముఖ్యముగా నీఫైయుల నుండి తమను వేరుపరచుకొని, జోరమ్ అని పేరున్న ఒక మనుష్యుని చేత నడిపించబడి తమను జోరమీయులని పిలుచుకొన్న జనుల మధ్య వెళ్ళుచుండగా, అతడు మరణించు వరకు జనుల పాదముల క్రింద అతడు త్రొక్కివేయబడెను.
60 ఆ విధముగా ప్రభువు యొక్క మార్గములను చెరుపు వాని అంతమును మనము చూచుచున్నాము; మరియు ఆ విధముగా అంత్యదినమందు అపవాది అతని సంతానమునకు సహాయపడడని, వారిని వేగముగా నరకమునకు ఈడ్చుకు పోవునని మనము చూచుచున్నాము.